Tribal activist
-
జన్ జాతీయ గౌరవ్ దివస్.. విస్మృత పోరాట యోధుడి జయంతి
గత రెండేళ్ల క్రితం నుంచి నవంబర్ 15 నాడు బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా పాటిస్తున్నాం. ఇన్నేళ్లకైనా విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకం. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నాటి బెంగాల్ ప్రావిన్స్‌లోని బిహార్ (నేటి జార్ఖండ్)లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమరశంఖం పూరించాడు. ఆయన తన ఆదివాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం–మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చాడు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపుకు నడిపించింది.ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వల్ల ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే స్కూల్ నుంచి బయటికి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించాడు. ఆదివాసీలందరినీ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించాడు. తాను తన జాతీయులను ఉద్ధరించడానికి అవతరించినట్లు ప్రకటించాడు. ఆయన బోధనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ముండా ప్రజలు ఆయన్ని దేవునిగా భావించి ‘భగవాన్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే బిర్సా ముండాను అనుసరించనివారు ఊచకోతకు గురవుతారనే గాలివార్త ప్రచారంలోకి రావడంతో ఆయన్ని బ్రిటిష్‌వాళ్లు ఛోటానాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టులో అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు. దీంతో ఆయన విడుదల కోరుతూ జాతీయోద్యమకారులు పెద్దఎత్తున బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఎట్టకేలకు 1897 నవంబర్‌లో బిర్సాని విడుదల చేసింది.ఆ రోజుల్లో బ్రిటిష్‌వాళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములపై పన్నులు విధిస్తూ... వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా... వన జీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్‌వాళ్లకు కప్పాలు కట్టవద్దనీ, వాళ్లను తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్లో భారీ ‘ఉల్’ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు.చదవండి: ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. కేసు విచారణలో ఉన్న కాలంలో జూన్ 9న జైల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. చివరికి 1908లో బిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ‘ది ఛోటానాగపూర్ టెనెన్సీ యాక్ట్’ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ (2024, నవంబర్ 15న బిర్సాముండా 150వ జయంతి ప్రారంభం) -
Birsa Munda Jayanti: చిన్న వయసులో ఆదివాసీ యోధునిగా ఎదిగి..
నాడు బ్రిటీషర్ల అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతి నేడు. తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన బిర్సా ముండా చిన్నవయసులోనే కన్నుమూసినా, పది కాలాల పాటు అందరూ గుర్తు పెట్టుకునేలా బ్రిటీషర్లతో పోరాటం సాగించాడు. ఆనాటి బ్రిటీష్ దాష్టీకాల్ని ఎండగట్టాడు. ఆదివాసీలను సమీకరించి, వారిని చైతన్యవంతులను చేశాడు. ఆదివాసీల సమూహాన్ని ఏర్పాటు చేసి, అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా బిర్సా ముండా పేరొందాడు.అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూముల హక్కులను పరిరక్షించే చట్టాలను ప్రవేశ పెట్టాలంటూ బిర్సా ముండా పోరాటం సాగించాడు. కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ ఆదివాసీ యోధుడు గిరిజన నాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా గుర్తింపు పొందాడు. బీహార్, జార్ఖండ్ చుట్టు పక్కల నివసించిన ఈయన జాతీయ ఉద్యమంపై ఎనలేని ప్రభావం చూపాడు. బిర్సా ముండా పుట్టిన రోజున 2000లో ఆయనకు తగిన గౌరవాన్ని అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.1875, నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ బిర్సాముండా 1886 నుండి 1890 వరకూ మిషనరీకి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. గిరిజనులకు తగిన శిక్షణ ఇచ్చి, వారిని బ్రిటీషర్లపై పోరాడే యోధులుగా తీర్చిదిద్దాడు. 1900, మార్చి 3న బిర్సా ముండా జామ్ కోపాయ్ అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిని అరెస్ట్ చేశారు. బిర్సాముండాను జైలులో పెట్టిన కొద్ది రోజులకే కన్నుమూశాడు. ఇది కూడా చదవండి: మొసళ్ళతో మాట్లాడేవాడు.. -
మత్తు వదలరా.. మంచివైపు సాగరా!
మహబూబాబాద్ జిల్లాలో అధికంగా ఆదివాసీ, గిరిజన తండాలు ఉన్నాయి. ఇక్కడ యువతలో చాలామంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. కాగా, ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యాలు కల్పించినా..కొందరు యువతీ, యువకులు చెడుమార్గం పట్టడం పరిపాటిగా మారింది. గంజాయి మత్తుకు బానిసకావడం, రవాణా, గుడుంబా తయారీ, బెల్లం విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం, తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి కొందరిది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపి వ్యవసాయం చేయడం, పొలం లేనివాళ్లు కూలీలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో యువతలో మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో మానుకోట జిల్లా పోలీస్‌లు వినూత్న రీతిలో ఆలోచించారు. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు అక్కడి రుగ్మతలకు చికిత్స మొదలు పెట్టారు. చెడు వ్యసనాలకు దూరం..జిల్లాకు మాయని మచ్చగా ఉన్న గంజాయి, గుడుంబాకు యువత బానిసకాకుండా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ వినూత్నంగా ఆలోచన చేశారు. ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన, ఆదివాసీ గూడేల్లో గుడుంబా తయారీని నిర్మూలించాలని, అందుకు అందరి సహకారం కావాలని తండాలు, గూడేల పెద్దలను కోరారు. దీంతో పోలీసుల తనిఖీలు, స్థానికుల సహకారంతో ఇప్పటివరకు జిల్లాలోని సుమారు రూ.10కోట్ల విలువ చేసే నల్లబెల్లం, పానకం, పటిక, గంజాయి, మద్యంతోపాటు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు. బెల్లం, గంజాయి రవాణా చేస్తున్న వారిని శిక్షించే విషయంలో ప్రజాప్రతినిధుల అడ్డు రావద్దని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను కోరినట్లు సమాచారం. అదేవిధంగా పోలీస్, ఎక్సైజ్‌శాఖలోని కొందరు ఉద్యోగులు ముందస్తు సమాచారం ఇస్తున్న విషయంపై కూడా పోలీస్ బాస్ సీరియస్‌గా ఉన్నట్లు ఆశాఖలో చర్చ జరుగుతోంది. మానసిక పరివర్తనజిల్లాలోని సమస్యాత్మక ప్రాతాలను గుర్తించి అక్కడ యువతతో పోలీసులు మమేకమయ్యారు. వారి అవసరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో 43 ప్రైవేట్ కంపెనీలను పిలిపించి విద్యార్హతకు తగిన ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు జిల్లా నలుమూలల నుంచి 3వేలకు పైగా యువతీ, యువకులు హాజరయ్యారు. అర్హులకు ఉద్యోగాలు ఇప్పించారు. మరికొందరికి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. యువతకు క్రికెట్, ఇతర క్రీడా పరికరాలు అందజేసి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని, ఉద్యోగాల్లో స్థిరపడాలని హితబోధ చేశారు. అదేవిధంగా స్కూల్ పిల్లలతో కలసి భోజనం చేయడం, వారికి బ్యాగులు, పుస్తకాలు అందజేసి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్ గురించి వివరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కావొద్దని కోరారు. సరఫరా చేస్తున్న వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని హెచ్చరించారు. గుడుంబా రహిత గ్రామాలుగా తయారు చేసేందుకు కృషి చేస్తామని పలు గ్రామాల ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మార్పు దిశగా యువత గంజాయి రవాణా, గుడుంబా తయారీ జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నాయి. వీటి నుంచి యువతను దూరం చేయాలన్నదే పోలీస్‌శాఖ లక్ష్యం. అందుకోసమే ఈ ప్రయత్నాలు. మూడు నెలలుగా ఏజెన్సీ, గిరిజన తండాల్లోని యువతలో కొంత మార్పు కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనం జాబ్‌మేళాకు మూడువేలకుపైగా యువతీ, యువకులు హాజరుకావడమే. – సుదీర్రాంనాథ్ కేకన్, ఎస్పీ, మహబూబాబాద్ -
చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు..
భువనేశ్వర్: పెళ్లికాని యువతి శరీర మాంసం తింటే అతీత శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో చితిలో సగం కాలిన శవాన్ని బయటకు లాగి తింటూ పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు. అంత్యక్రియలు నిర్వహించిన మృతురాలి బంధువులు చూస్తుండగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో అక్కడే వారిద్దరినీ కట్టేసి దేహశుద్ధి చేశారు. ఒడిశా గిరిజన ప్రాంతమైన మయూర్ భంజ్ జిల్లాలో అనాగరిక సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువతి అంత్యక్రియలను పూర్తి చేసే క్రమంలో ఆమె చితికి నిప్పు పెట్టి చితి కాలుతుండగా వారు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు.. అంతలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు చితిలో కాలుతున్న శవాన్ని బయటకు లాగారు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా వారేమీ సమాధానమివ్వకుండా సగం కాలిన శవాన్ని మూడు ముక్కలు చేసి రెండు ముక్కలను తిరిగి చితిలో వేశారు. మూడో భాగాన్ని మాత్రం వారిద్దరూ పీక్కుని తింటూ మద్యం మత్తులో డాన్సులు చేశారు. అది చూసి కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. స్థానికుల సాయంతో ఇద్దరు నరమాంసాన్ని భక్షకులను స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. విషయం తెలుసుకుని బందసాహి పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సుందర్ మోహన్ సింగ్(53), నరేంద్ర సింగ్(25) ఇద్దరూ దగ్గర్లోని దంతుని గ్రామానికి చెందిన వారని, వీరిలో సుందర్ చేతబడులు చేస్తుంటాడని అదే మూఢ నమ్మకంతో పెళ్లికాని యువతి మాంసం తింటే అతీత శక్తులు వస్తాయని మత్తు ప్రభావంలో సగం కాలిన శవాన్ని తినే పనికి పాల్పడ్డాడరని తెలిపారు. ఇది కూడా చదవండి: లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి.. -
కరుణ లేని కాఠిన్యం
ఒక మనిషి తన ప్రాణం కోసం కాకుండా, తనకు ప్రాణానికి ప్రాణమైన మనుషుల కోసం తపిం చడం పాపమా? ప్రాణం పోతోందని తెలిసినా, అదేదో తన వాళ్ళ మధ్య ప్రాణాలు వదిలితే బాగుం టుందని కోరుకోవడం నేరమా? నిరూపితం కాని నేరాన్ని సాకుగా చూపి, ఉగ్రవాదం ముసుగు వేసి, నిందితుల ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచడం ఏ చట్టం కిందైనా న్యాయమా? ఆఖరు శ్వాస విడిచేవరకు గిరిజనుల హక్కులైన ‘జల్, జంగిల్, జమీన్’ కోసమే పోరాడి, అన్యాయంగా కన్ను మూసిన క్రైస్తవ సన్యాసి 84 ఏళ్ళ ఫాదర్ స్టాన్ స్వామి గురించి విన్నా, చదివినా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. కరోనా కేసులు ఎక్కువున్న కిక్కిరిసిన తలోజా జైలు నుంచి మార్చమనీ, అనారోగ్య రీత్యా మధ్యంతర బెయిలు ఇవ్వమనీ కోర్టులో పదే పదే ప్రార్థించినా, ప్రాథేయ పడ్డా ఆయనది అరణ్య రోదన కావడం ఓ విషాదం. చెవులు వినిపించని, శారీరకంగా బలహీనుడైన ఓ మానవతావాది దేశంలో అశాంతి సృష్టించి, ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర చేస్తున్నారని ఎన్ఐఎ కోర్టు భావన. కానీ, అలా తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని ఐరాస ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. స్టాన్ స్వామిది మామూలు మరణం కాదు... ‘వ్యవస్థ చేసిన హత్య’ అని అనేకులు అంటున్నది అందుకే! దళితులు, అడవిబిడ్డల కోసం ఆఖరిదాకా తపించిన మనిషి సోమవారం మధ్యాహ్నం సంకెళ్ళు లేని లోకానికి, ఏ బెయిలూ అవసరం లేకుండానే శాశ్వతంగా వెళ్ళిపోయారు. అనారోగ్యంతో ఉన్నా కూడా ఈ సేవామూర్తి అయినవాళ్ళనుకున్న గిరిజనుల మధ్య ఆఖరు క్షణాలు గడిపేందుకు కాస్తంత కనికరం చూపమనే కోరడం గమనార్హం. జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కూడా అధికారులు 10 రోజులు ఆలస్యం చేసిన స్టాన్ స్వామి ఉదంతం కన్నీరు తెప్పిస్తుంది. ఇరవై ఆరేళ్ళ క్రితం సంచలనమైన వివాదాస్పద వ్యాపారవేత్త, ‘బిస్కెట్ కింగ్’ రాజన్ పిళ్ళై కస్టడీ మరణం కేసు అనివార్యంగా గుర్తొస్తుంది. అరెస్టయి, అనారోగ్యంతో బాధపడుతూ, సమయానికి తగిన వైద్యం అందక తీహార్ జైలులో తుదిశ్వాస విడిచిన పిళ్ళై కేసు అనేక పాఠాలు నేర్పింది. జైలు యంత్రాంగం నిర్లక్ష్యానికీ, న్యాయవ్యవస్థ కాఠిన్యానికీ పిళ్ళై మరణం మచ్చుతునక. ఇప్పుడు ‘ఎల్గార్ పరిషత్ కేస్థు’ నిందితులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వాదిస్తున్న ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ), జైలు అధికారుల లోపభూయిష్ఠ వ్యవహారం అందుకేమీ తీసిపోవడం లేదు. ఇదే ఇప్పుడు పలువురి ఆవేదన. స్టాన్ స్వామితో సహా పలువురు విద్యావేత్తలు, న్యాయవాదులు, సాంస్కృతిక కార్యకర్తలపై ఇంతటి కర్కశత్వం అవసరం లేదనేదే వారి వాదన. ‘ఎల్గార్ పరిషత్’ సమావేశం, ‘భీమా – కోరేగావ్’ హింస కేసులో ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ – ఉపా) కింద ఇప్పటికీ మరో 15 మంది జైలు గోడల మధ్య మగ్గుతున్నారు. వారిలో మన విప్లవ కవి వరవరరావు సహా సుధా భరద్వాజ్ లాంటి ప్రజాక్షేత్రంలోని ప్రసిద్ధులు పలువురు ఉన్నారు. వారందరిలోకే కాదు... ‘ఉపా’ చట్టం కింద దేశంలో ఇప్పటి దాకా అరెస్టయినవారిలోనే బహుశా అత్యంత వృద్ధుడు ఫాదర్ స్టాన్ స్వామే! పార్కిన్సన్స్ వ్యాధితో వణుకుతున్న చేతులతో అన్నం తినడానికీ, నీళ్ళు తాగడానికీ వీల్లేక, కనీసం స్ట్రా, సిప్పర్ కావాలని ప్రాథేయపడితే, ఎన్ఐఏ అందుకు 4 వారాల గడువు తీసుకుందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. న్యాయపోరాటంలో అలసిపోయిన స్టాన్ స్వామి కథ చివరకు అత్యంత విషాదంగా ముగిసింది. ఇప్పుడిక మిగతా ఖైదీల విషయంలోనైనా సమయం మించిపోక ముందే సరైన నిర్ణయం తీసు కోవడం అవసరం. ఆ కేసు నిందితుల్లో అత్యధికుల శారీరక అశక్తత, ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలు గుర్తించాలి. ఒకపక్క దర్యాప్తు, విచారణ కొనసాగిస్తూనే, మానవతా దృక్పథంతోనైనా వారికి మధ్యం తర జామీనివ్వడం న్యాయపరంగా తప్పేమీ కాదు. కఠిన చట్టాల ఉక్కుపాదం మోపి, రుజువు కాని దేశద్రోహం కింద వారిని ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెట్టడం మానవీయతా కాదు. ‘అర్బన్ నక్సల్’ అనే కొత్తముద్ర తయారుచేసి, కర్కశత్వానికి కొత్త చిరునామాగా మారిందనే అపఖ్యాతి పాలకులకూ శోభనివ్వదు. ఇప్పటికే ఒకసారి కరోనా బారినపడి, ఆఖరు నిమిషంలో అదృష్టవశాత్తూ బయటపడ్డ వరవరరావు లాంటి వారిని చివరి రోజులైనా ప్రశాంతంగా బతకనివ్వడమే న్యాయం, సమంజసం. రాజన్ పిళ్ళై మరణించిన దశాబ్దిన్నర తరువాత ‘ఆ మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే’ అంటూ న్యాయస్థానమే తప్పుబట్టింది. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. అమితమైన ఆలస్యమూ అయిపోయింది. ఆలస్యమైన న్యాయం... అక్షరాలా అన్యాయమే! పోయిన ప్రాణానికి బాధ్యత వహించాల్సిన విషతుల్యమే! అందుకే, అతి వృద్ధుడైనా... కనీసం సర్కారు వారి టీకాకు కూడా నోచుకోక, అన్యాయంగా కరోనా కోరలకు చిక్కి కన్నుమూసిన స్టాన్ స్వామి ఆఖరి వీడియో సందేశం ఇక ఎప్పుడు చూసినా గుండె బరువెక్కుతూనే ఉంటుంది. వ్యవస్థలో జరిగిన అన్యాయాన్నీ, కరుణించని న్యాయదేవత కాఠిన్యాన్నీ, సమాజ వైఫల్యాన్నీ గుర్తుచేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులకూ, మానవతావాదులకూ ఇది పాలకులు మిగిల్చిన ఓ శాశ్వతమైన గుండెకోత. స్టాన్ స్వామి వెళ్ళిపోయారు... ఆయన చూపిన బాట, చేసిన పని మాత్రం మిగిలిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఫాదర్ స్టాన్ స్వామీ! మూడు దశాబ్దాల పైగా మీరు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల మధ్యే తుదిశ్వాస విడవాలన్న మీ ఆఖరి కోరికను తీర్చలేకపోయాం. మన్నించండి! ఇప్పటికైనా వ్యవస్థలో వివేకం మేలుకోవాలని దీవించండి!! -
రాజకీయ హత్య..!
సాక్షి, సాలూరు: ప్రశాంతమైన సాలూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని సమయాల్లోనూ సోదర భావంతో గడిపిన పల్లెల్లో రాజకీయ హత్యలకు పాల్పడడం కలకలం రేగుతోంది. పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త గండిపల్లి తవుడు (49) ఆదివారం రాత్రి హత్యకు గురైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తవుడు వైఎస్సార్ సీపీ తరఫున చురుగ్గా పాల్గొనడం, టీడీపీ ఓటమి పాలవ్వడంతో గ్రామానికి చెంది న టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి, గ్రామస్తుడు, స్థానిక వైఎస్సార్ సీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరి అయిన తవుడు ఆదివారం సాయంత్రం ఆవులను కట్టిన తరువాత గ్రామంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. నిమజ్జనం తర్వాత తవుడు ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం స్థానిక శివాలయం సమీపంలో విగత జీవిగా దర్శనమిచ్చాడు. మృతుడి కుడిచేయి విరిగి ఉండడం, మెడ నులిపేయడంతో వాపురావడంతో హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలి సులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఎస్ఐ గంగరాజు, సీఐ సింహాద్రినాయుడులు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని తెలిపి శవపంచనామాకు సహకరించాలని కోరారు. నిందితులును పట్టుకునేంత వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించమని మృతుడి కుటుంబీకులు, స్థానిక నాయకులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు విజ యనగరం నుంచి క్లూస్ టీం, శ్రీకాకుళం నుంచి డాగ్‌స్క్వాడ్‌లు తెప్పించారు. ఓఎస్డీ రామ్మోహనరావు, ఏఎస్పీ సుమిత్‌గర్గ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నట్టు సమాచారం. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ .. సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోలబాబ్జి, పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మధుసూదనరావు, నాయకులు పెద్దిబాబు తదితరులు చేరుకున్నారు. బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ఇది రాజకీయ హత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవాలి... ఈ ఘటనపై ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఫోన్లైన్లో మాట్లాడుతూ ఇది రాజకీయ హత్యగానే అనుమానిస్తున్నామని, ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టాలని ఫోన్లో కలెక్టర్, ఎస్పీలను కోరారు. మృతుడి కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
చెంచుల కోసం క్షీరసాగరం
‘నెల నెలా వెన్నెల’ పేరుతో ఔత్సాహిక కవుల వెన్ను తట్టి శెభాస్ అంటూ ప్రోత్సహించి ముందుకు నడిపించిన కవి.. గిరిజన బిడ్డల కడుపు నింపడమే ఉద్యోగధర్మంగా నిరంతరం వారి పూరిళ్లలో నివసిస్తూ గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన ఉద్యోగి.. నేడు 94వ ఏట అడుగు పెడుతున్న నిబద్ధతా స్వరూపం.. శ్రీ సి.వి.కృష్ణారావు. గుంటూరు, బ్రాడీపేటలో సత్తెనపల్లి వెళ్లే రైలు పట్టాల పక్క ఖాళీ స్థలంలో నలుగురు చేరి కవిత్వాన్ని వినిపించడంతో ప్రారంభమైన కవితా గోష్ఠి కృష్ణారావు నేతృత్వంలో ‘నెల నెలా వెన్నెల’గా రూపుదిద్దుకొని ఇంచుమించు అరవై సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఒక సంపన్న జమీందారీ కుటుంబంలో 1926 జూలై 3న జన్మించిన కృష్ణారావు మఖమల్ పరుపుల మీద పారాడే అదృష్టం వెనుక పుట్టినప్పుడే తల్లిని, తరువాత కొద్దికాలానికి మాతామహులను పోగొట్టుకోవడమనే దురదృష్టమూ వెన్నంటి ఉంది. గుంటూరులో కళాశాల విద్యనభ్యసించే కాలంలో నయాగరా కవుల (కుందుర్తి, ఏల్చూరి మొ) పరిచయం లభించింది. కవిత్వాన్ని ఆస్వాదించడం, విస్తృతంగా పుస్తక పఠనం, రచనలు చేయడం ప్రారంభమైంది. ‘వైతరణి’ మొదటి కవితా సంపుటి. ‘మాదీ మీ వూరే మహారాజ కుమారా’, ‘అవిశ్రాంతం’ మొదలైనవి ముద్రితాలు! లాతూరు భూకంపం సందర్భంగా కంపన కేంద్ర గ్రామమైన ‘కిల్లారి’లో స్వామీ రామానంద తీర్థ సంస్థ పనుపున సేవలు అందించిన సందర్భంగా ఆ బీభత్సానికి అచ్చుగుద్దిన ‘కిల్లారి’ అనే కావ్యం కృష్ణారావు కలం నుండి వెలువడి Fiery and Fierce పేరుతో తర్జుమా అయింది. రామారావు దానిని ఆంగ్లంలోనికి అనువదించారు. చిన్నతనంలో అలవడిన, నరనరాన జీర్ణించుకొన్న కమ్యూనిస్టు భావపరంపరను నిజ జీవితంలో అమలు పరిచే అదృష్టాన్ని ఆయన ఎంచుకున్న ఉద్యోగం అందించింది. గిరిజన ఆదివాసీ జనుల జీవనగతులను మార్చగలిగే అవకాశాన్నివ్వగల ఉద్యోగంలో కృష్ణారావు కుదురుకోవడం అంటే ఒక సిద్ధాంతాన్ని నిబద్ధతగా అమలు పరచే వ్యక్తిత్వం ఉండాలే గాని సిద్ధాంతం ఎప్పుడూ పేలవమైనదీ, నిరర్ధకమైనదీ కాదని నిరూపించడమే! వందలాది చెంచుల జీవన విధానాన్ని మెరుగు పరచిన ‘క్షీరసాగరం’ ప్రాజెక్టు సృష్టికర్త ఆయనే. అసిఫాబాద్ అడవులలో గాని, రంపచోడవరం మన్యంలో గాని తాను చూచిన సంఘటనలే ఆయన కవితా వస్తువులు! ప్రతి కవితలోను ఆ జీవుల రక్తాశువ్రులు దర్శనమిస్తాయి! – సి.బి.వి.ఆర్.కె.శర్మ -
రవీంద్రభారతిలో ‘ట్రైబల్ ఆర్ట్ ఫెస్టివల్’
-
ఆదివాసీలే అందరికన్నా నాగరికులు
సరస్వతి రమ తెల్లగా.. పొడుగ్గా.. ‘బీర్ బిర్సా ముండా’ అన్న అక్షరాలున్న టీషర్ట్ ధరించిన ఈ వ్యక్తి బ్రిటిషర్, అంతకన్నా కూడా డార్విన్ ముని మనవడు! పేరు.. ఫెలిక్స్ పెడెల్. ఒరియా గిరిజన వీరుడైన బిర్సా ముండా పేరును టీషర్ట్మీద ఎందుకు ముద్రించుకున్నారు అని ఆయన్ని అడిగితే.. ‘‘మా బ్రిటిషర్స్ చేసిన పాపాల్లో బిర్సా ముండాను చంపడం ఒకటి. ప్రాయశ్చిత్తంగా, ఆ వీరుడి గుర్తుగా ఈ టీ షర్ట్’’ అని సమాధానమిస్తాడు. అయితే అది కేవలం ఆయన వేషధారణకే పరిమితం కాలేదు. ముప్పై ఏళ్లుగా ఒరిస్సాలోని ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూ ఆచరణలోనూ చూపిస్తున్నాడు. ప్రొఫెసర్ ఫెలిక్స్ ఉద్యమకారుడు. సొంత దేశాన్ని వదిలి ఇక్కడే స్థిరపడ్డాడు. ఇక్కడి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పలుప్రాంతాలు తిరుగుతాడు. అలా తిరుగుతూ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఫెలిక్స్‌తో జరిపిన సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. ఇక్కడి పారిశ్రామికవేత్తలకు డబ్బు తప్ప ఏమీ తెలియదు. ఈ దేశంలో దొరికే ఉక్కు, అల్యూమినియం, బాక్సైట్, బొగ్గులాంటి ఖనిజాల కోసం ఆదివాసీల ఆవాసాలను పెకిలిస్తున్న ఈ కంపెనీలకు ఇంకో విషయం కూడా తెలియదు... ప్రకృతి సంపదను రానున్న తరాలకు అందించడానికి ఆదివాసీలు ఎంతగా శ్రమపడుతున్నారో! ఆ మాటకొస్తే అసలు ఆదివాసీల పట్లే ఆ కంపెనీలకు అవగాహనలేదు. ఆదివాసీలు ప్రకృతిని దైవంగా పూజిస్తారు. సహజవనరులను పరిరక్షించడం తమ సంస్కృతిగా భావిస్తారు. ప్రకృతిధర్మం గురించి తెలిసిన ఆదీవాసీలనేమో అనాగరికులు అంటున్నాం.. తెలియనివాళ్లను మేధావులుగా, విద్యావేత్తలుగా, నాగరికులుగా కీర్తిస్తున్నాం. ఎంత దురదృష్టం! దీనికి కారణం మన దగ్గరున్న విద్యావిధానం; ఇంజనీ రింగ్, మెడిసిన్ తప్ప దేనికీ ప్రాధాన్యమివ్వక పోవడం. అసలు మన జీవనవిధానమే ఎకోఫ్రెండ్లీ సిస్టమ్‌గా లేకపోవడం! అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు... అసలు ఈ భావననే నేనొప్పుకోను. ఈ దేశం ఎందులో ఐరోపా కన్నా తీసిపోయింది? అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు అనే భావనంతా అగ్రదేశాలది. అమెరికాను ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. అది తన దేశంలో మైనింగ్ నిలిపేసింది. ఎందుకూ... అభివృద్ధి చెందుతున్న (అమెరికా అంటున్నదాని ప్రకారం) దేశాలైన ఇండియా, బ్రెజిల్లో పుష్కలమైన ఖనిజాలున్నాయి. అవి మనకోసం స్టీల్ వంటి వాటిని ఉత్పత్తిచేసేలా చేద్దాం.. దీనివల్ల మన పర్యావరణానికి హాని ఉండదు అని ఓ పాలసీని తయారు చేసుకుంది. ఇలాంటి ఒప్పందాలన్నిటికీ వేదిక నా సొంతూరైన లండన్. ఈ విషయాలన్నిటినీ ప్రస్తుతం నేను రాస్తున్న ‘వార్ అండ్ టై’ అనే పుస్తకంలో చర్చిస్తున్నాను. పొంతన లేదు! ప్రపంచానికి అద్భుతమైన జీవనవిధానాన్ని, గొప్ప విలువలను అందించిన దేశం ఇది. యోగా, ధ్యానంలాంటి వాటితో పొందే మానసిక వికాసం, తద్వారా జరిగే ప్రగతిని మించిన అభివృద్ధి ఉంటుందా? ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే.. స్త్రీల పట్ల గౌరవంగా ఉండడం. ఏ సమాజంలో స్త్రీని అర్థంచేసుకుంటారో.. ఏ సమాజమైతే స్త్రీకి సముచితస్థానం ఇస్తుందో ఆ సమాజం ప్రగతిపథంలో పయనిస్తున్నట్టు లెక్క.. అయితే ఈ దేశంలో మహిళలకు సంబంధించి చెప్తున్న సూక్తులకు, వాళ్లకు జరుగుతున్న అవమానాలకు పొంతనే లేదు. ఈ పరిణామం శోచనీయం. మతమనేది కూడా ఓ ప్రధాన అంశంగా మారడం కూడా విచారకరం. నిజానికి ప్రకృతి ధర్మాన్ని పాటించడాన్ని మించిన మతం లేదు. 1940ల్లోని ఒరియాకు చెందిన గొప్ప రైటర్ గోపీనాథ్ మహంతి ఒకసారి ఓ ఆదివాసీ నాయకుడిని అడిగాడట.. మీరు కొలిచే దైవం ఏంటి అని. దానికి ఆ నేత ‘పర్వతం’ అని జవాబు చెప్పాడట. మనిషి జీవనానికి కావల్సిన అన్ని మినరల్స్ పర్వతం ఇస్తుందని వివరించాడట ఆ నేత. మంచి మార్పుకోసం.. నేడు సామాజిక ఉద్యమాల అవసరం ఎంతో ఉంది. నాకు తెలిసి ఇలాంటి ఉద్యమాలు ఇంకా కొనసాగుతున్న దేశం ఇండియానే. అయినా ఆదివాసీ హక్కులకు సంబంధించి ఇంకా చైతన్యం రావాలి. నిజమైన అభివృద్ధి... ఆకాశహర్మ్యాలు నిర్మించడంలో లేదు. ఆదివాసీల హక్కులను కాపాడడంలో ఉంది. వాళ్ల ఉపాధి వాళ్లకు మిగల్చడంలో ఉంది. దేశ ఉత్పత్తిలో వాళ్లకు భాగస్వామ్యాన్ని కల్పించడంలో ఉంది. ఆదివాసీల గురించి ఆలోచించడమంటే ప్రకృతిని పరిరక్షించుకోవడమే!