రాజకీయ హత్య..! | YSRCP Tribal Activist Dies In Salur | Sakshi
Sakshi News home page

రాజకీయ హత్య..!

Published Tue, Sep 17 2019 10:44 AM | Last Updated on Tue, Sep 17 2019 10:48 AM

YSRCP Tribal Activist Dies In Salur - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ గంగరాజు

సాక్షి, సాలూరు: ప్రశాంతమైన సాలూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని సమయాల్లోనూ సోదర భావంతో గడిపిన పల్లెల్లో రాజకీయ హత్యలకు పాల్పడడం కలకలం రేగుతోంది. పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త  గండిపల్లి తవుడు (49) ఆదివారం రాత్రి హత్యకు గురైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తవుడు వైఎస్సార్‌ సీపీ తరఫున చురుగ్గా పాల్గొనడం, టీడీపీ ఓటమి పాలవ్వడంతో గ్రామానికి చెంది న టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి, గ్రామస్తుడు, స్థానిక వైఎస్సార్‌ సీసీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకుడు గండిపల్లి రాము ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

పశువుల కాపరి అయిన  తవుడు ఆదివారం సాయంత్రం ఆవులను కట్టిన తరువాత  గ్రామంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. నిమజ్జనం తర్వాత తవుడు ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం స్థానిక శివాలయం సమీపంలో విగత జీవిగా దర్శనమిచ్చాడు. మృతుడి కుడిచేయి విరిగి ఉండడం, మెడ నులిపేయడంతో వాపురావడంతో హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానించారు.  పోలి సులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఎస్‌ఐ గంగరాజు, సీఐ సింహాద్రినాయుడులు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని తెలిపి శవపంచనామాకు సహకరించాలని కోరారు. నిందితులును పట్టుకునేంత వరకు  మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించమని మృతుడి కుటుంబీకులు, స్థానిక నాయకులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు విజ యనగరం నుంచి క్లూస్‌ టీం, శ్రీకాకుళం నుంచి డాగ్‌స్క్వాడ్‌లు తెప్పించారు. ఓఎస్‌డీ రామ్మోహనరావు, ఏఎస్పీ  సుమిత్‌గర్గ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నట్టు సమాచారం.

 వైఎస్సార్‌ సీపీ నాయకుల పరామర్శ ..
సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోలబాబ్జి, పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ నాయకుడు సలాది అప్పలనాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ మధుసూదనరావు, నాయకులు పెద్దిబాబు తదితరులు చేరుకున్నారు. బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ఇది రాజకీయ హత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకుడు గండిపల్లి రాము డిమాండ్‌ చేశారు.

 నిందితులను పట్టుకోవాలి... 
ఈ ఘటనపై ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఫోన్‌లైన్లో మాట్లాడుతూ ఇది రాజకీయ హత్యగానే అనుమానిస్తున్నామని, ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టాలని ఫోన్‌లో కలెక్టర్, ఎస్పీలను కోరారు. మృతుడి కుటుంబానికి పార్టీ పరంగా  అండగా ఉంటామని స్పష్టం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement