సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం వెనుకబడిన జిల్లాగా మిగిలిపోవడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజే కారణమని ఎంపీ విజయసాయిరెడ్డి ఏకిపడేశారు. వీరిద్దరూ జిల్లాను విస్మరించారని, వెనుకబడిన వర్గాలను అణచివేశారని సోషల్ మీడియా వేదికగా దుమ్ముదులిపేశారు. ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పోస్టుల్లో అంశాలివి...
♦విజయనగరం అనగానే విద్యలనగ రం, సాంస్కృతిక కూడలి, సంగీత సెంటర్ ఇలా గత వైభవం కళ్లముందు మెదులుతుంది. సువర్ణముఖి, చంపావతి, గోస్తనీ, నాగావళి, వేగావతి, గోముఖి
లాంటి నదీనదాలు ప్రవహిస్తున్న ప్రశాంతమైన జిల్లాను – గజపతి రాజుల్లో ఒక వర్గాన్ని, మాన్సాస్ ట్రస్ట్‌ను ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో భ్రష్టుపట్టించారు. మెజార్టీ వర్గాలైన కాపు, వైశ్య, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా... వీలైనంతగా అణగదొక్కారు.
♦జిల్లా ప్రజలు చైతన్యవంతులవ్వడంతో ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించింది. విశాఖతో సమానంగా విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది.
♦విశాఖలో పరిపాలనా రాజధాని వస్తే అక్కడికి కూతవేటు దూరంలోనున్న విజయనగరం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. కానీ వైజాగ్ పాలనా రాజధాని వద్దంటూ చంద్రబాబు సంతకాల సేకరణ చేయిస్తున్నారంటే జిల్లాపై ఆయన ఎంతగా పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజధాని ఏర్పాటైతే విశాఖ – విజయనగరం మధ్య అభివృద్ధి పరుగులు పెడుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ మెట్రోరైలు వరకు అన్నీ విజయగరానికి వచ్చి... జిల్లా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది.
♦విజయనగరంలోని మహారాజా విద్యాసంస్థలు బ్రిటిష్ వారి కాలంలోనే ఒక వెలుగువెలిగాయి. కానీ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతి రాజు చేతిలోకి వెళ్లగానే దాన్ని భ్రష్టుపట్టించారు. అశోక్‌ను అడ్డం పెట్టుకుని మాన్సాస్ ట్రస్ట్‌ను చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏటీఎంలా వాడుకున్నారు.
♦విజయనగరం జనాభాలో దాదాపు 20 శాతం తూర్పుకాపులుంటే వారిని రాజకీయంగా అణగదొక్కడానికి శతవిధాలా కష్టపడ్డారు. చివరకు తన కుమార్తె అతిది పోటీచేస్తాననగానే సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను ఇంటికి పంపించేశారు.
♦పంచనదులున్నా చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క సాగునీటి, ప్రాజెక్టు కట్టిన పాపానపోలేదు. వైఎస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. మాట్లాడితే పోలవరం నేనే కడుతున్నా... హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు విజయనగరంలోని నదులపై ఒక చిన్న ఆనకట్టనైనా కట్టలేకపోయాడు. తోటపల్లి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించి 90 శాతం పూర్తిచేస్తే ఉన్న పదిశాతాన్ని సైతం పూర్తిచేయలేక చేతులెత్తేశారు.
♦జిల్లావాసులకు ఉపాధికల్పిస్తున్న జూట్, ఫెర్రోఅల్లాయీస్ ఇండస్ట్రీలు మూతపడేలా చేశారు. అశోక్ గజపతి ఇంటిపక్కనే ఉన్న ఈస్ట్ కోస్ట్, అరుణ జ్యూట్ మిల్లులు మూతపడ్డా – వందలమంది ఉద్యోగాలు పోయినా అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వాటిని తెరిపించేందుకు ప్రయత్నిస్తోంది.
♦ఒక జిల్లా నుంచి జాతీయ నేతగా ఎవరైనా ఎదిగారంటే ఆ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి. కానీ విజయనగరానికి అన్నీ తానేనని చెప్పుకునే అశోక్ విజయనగర సామ్రాజ్య ఆస్తులను ఏటీఎంలా వినియోగించుకోవడంలో చంద్రబాబుకు సహకరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చే రాజధానిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు.
♦ఆనంద గజపతిరాజు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంతవరకూ విజయనగరం ఒక వెలుగువెలిగింది. ఆ తర్వాత అశోక్ విజయనగర వైభవాన్ని మసకబార్చారు. విద్య– వైద్యం నుంచి ఉపాధి కల్పనవరకు అన్ని రంగాల్లోనూ భ్రష్టుపట్టించారు.
♦సొంత అన్న కుమార్తె సంచయిత మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు చేపడితే... ఆమెను, ఆమె చెల్లెలు ఊర్మిళ ను అశోక్ కించపరుస్తూ మాట్లాడారు. మహిళలవిషయంలో వివక్షచూపేలా చంద్రబాబు ప్రకటనలిచ్చారు.
♦వైఎస్సార్ హయాంలోనూ, జగన్ అధికారం చేపట్టాక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విజయనగరంలో రాజ్యాధికారం వచ్చినట్లయ్యింది. విజయనగరంలో అశోక్ గజపతిరాజు కుటుంబం, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, కురుపాం కిశోర్ చంద్రదేవ్, చినమేరంగి రాజు శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రాజయినా, పేదయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ – అభివృద్ధికి పాటుపడితేనే భవిష్యత్తు. లేకుంటే అడ్రస్ గల్లంతే,
Comments
Please login to add a commentAdd a comment