సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు.. వైఎస్ జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌తో సహా వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి.. కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదోక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారు. కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలి. చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలి’’ అని విజయసాయి డిమాండ్ చేశారు.
‘‘అందరినీ క్రిమినల్ అంటాడు.. కానీ, చంద్రబాబే ఒక క్రిమినల్. కేవీరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. కేవీరావుకు అన్యాయం జరిగిఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించొచ్చు. కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. కేవీరావుకు ఫోన్ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా?. బ్రోకర్ పనులు చేసే కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా?. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి?. కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా’’ అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment