అడవి బిడ్డల్లో మార్పుకోసం పోలీస్‌శాఖ కృషి
యువతకు క్రీడా కిట్లు, ప్రోత్సాహకాలు
నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం
మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు
మహబూబాబాద్ జిల్లాలో అధికంగా ఆదివాసీ, గిరిజన తండాలు ఉన్నాయి. ఇక్కడ యువతలో చాలామంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. కాగా, ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యాలు కల్పించినా..కొందరు యువతీ, యువకులు చెడుమార్గం పట్టడం పరిపాటిగా మారింది. గంజాయి మత్తుకు బానిసకావడం, రవాణా, గుడుంబా తయారీ, బెల్లం విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం, తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి కొందరిది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపి వ్యవసాయం చేయడం, పొలం లేనివాళ్లు కూలీలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో యువతలో మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో మానుకోట జిల్లా పోలీస్‌లు వినూత్న రీతిలో ఆలోచించారు. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు అక్కడి రుగ్మతలకు చికిత్స మొదలు పెట్టారు.
చెడు వ్యసనాలకు దూరం..
జిల్లాకు మాయని మచ్చగా ఉన్న గంజాయి, గుడుంబాకు యువత బానిసకాకుండా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ వినూత్నంగా ఆలోచన చేశారు. ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన, ఆదివాసీ గూడేల్లో గుడుంబా తయారీని నిర్మూలించాలని, అందుకు అందరి సహకారం కావాలని తండాలు, గూడేల పెద్దలను కోరారు. దీంతో పోలీసుల తనిఖీలు, స్థానికుల సహకారంతో ఇప్పటివరకు జిల్లాలోని సుమారు రూ.10కోట్ల విలువ చేసే నల్లబెల్లం, పానకం, పటిక, గంజాయి, మద్యంతోపాటు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు.
బెల్లం, గంజాయి రవాణా చేస్తున్న వారిని శిక్షించే విషయంలో ప్రజాప్రతినిధుల అడ్డు రావద్దని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను కోరినట్లు సమాచారం. అదేవిధంగా పోలీస్, ఎక్సైజ్‌శాఖలోని కొందరు ఉద్యోగులు ముందస్తు సమాచారం ఇస్తున్న విషయంపై కూడా పోలీస్ బాస్ సీరియస్‌గా ఉన్నట్లు ఆశాఖలో చర్చ జరుగుతోంది.
మానసిక పరివర్తన
జిల్లాలోని సమస్యాత్మక ప్రాతాలను గుర్తించి అక్కడ యువతతో పోలీసులు మమేకమయ్యారు. వారి అవసరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో 43 ప్రైవేట్ కంపెనీలను పిలిపించి విద్యార్హతకు తగిన ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు జిల్లా నలుమూలల నుంచి 3వేలకు పైగా యువతీ, యువకులు హాజరయ్యారు. అర్హులకు ఉద్యోగాలు ఇప్పించారు. మరికొందరికి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు.
యువతకు క్రికెట్, ఇతర క్రీడా పరికరాలు అందజేసి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని, ఉద్యోగాల్లో స్థిరపడాలని హితబోధ చేశారు. అదేవిధంగా స్కూల్ పిల్లలతో కలసి భోజనం చేయడం, వారికి బ్యాగులు, పుస్తకాలు అందజేసి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్ గురించి వివరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కావొద్దని కోరారు. సరఫరా చేస్తున్న వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని హెచ్చరించారు. గుడుంబా రహిత గ్రామాలుగా తయారు చేసేందుకు కృషి చేస్తామని పలు గ్రామాల ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
మార్పు దిశగా యువత
గంజాయి రవాణా, గుడుంబా తయారీ జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నాయి. వీటి నుంచి యువతను దూరం చేయాలన్నదే పోలీస్‌శాఖ లక్ష్యం. అందుకోసమే ఈ ప్రయత్నాలు. మూడు నెలలుగా ఏజెన్సీ, గిరిజన తండాల్లోని యువతలో కొంత మార్పు కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనం జాబ్‌మేళాకు మూడువేలకుపైగా యువతీ, యువకులు హాజరుకావడమే.
– సుదీర్‌రాంనాథ్ కేకన్, ఎస్పీ, మహబూబాబాద్
Comments
Please login to add a commentAdd a comment