![Government employee in every house in Mahabubabad District](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/jobs.jpg.webp?itok=7ARQ3thY)
ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ప్రైవేట్ రంగంలోనూ రాణిస్తున్న వైనం
స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఆ గ్రామంలో పలువురు విద్యావంతులు
ఒకప్పుడు మారుమూల తండా.. నేడు పట్టణాన్ని తలపించేలాఎదిగిన తీరు
ఆదర్శంగా నిలుస్తున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం
అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు పలు హోదాల్లో ఉద్యోగాలు
మరిపెడ రూరల్: ఒకప్పుడు మారుమూల గిరిజన తండా.. ఆపై సౌకర్యాల లేమి. అయితేనేం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇంటికొకరు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అన్ని హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉన్నారు.
చిన్న, సన్నకారు రైతులు కష్టపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్ర భుత్వ కొలువుల్లో స్థిరపడేలా చేశారు. మరికొందరు ప్రైవేట్ రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏంటి అనుకుంటున్నారా.. అదే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం.
పట్టణాన్ని తలపించేలా..
మారుమూల తండా అయిన తండధర్మారం.. నేడు పట్టణాన్ని తలపిస్తోంది. అన్నీ డాబాలు, రెండు, మూడు బహుళ అంతస్తుల భవనాలున్నాయి. తాతముత్తాతల నుంచి గ్రామంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా కుటుంబాలు జీవిస్తుండేవి. ఊరి పేరులో తండా అని ఉన్నప్పటికీ అక్కడ అన్ని వర్గాల కుటుంబాలు నివసిస్తున్నారు. గ్రామంలో 267 గృహాలు, 1,160 మంది జనాభా ఉన్నారు.
కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రభుత్వ కొలువుతో ఆ పల్లె విలసిల్లుతోంది. తామేమీ తక్కువ కాదంటూ ఒకరికంటే ఒకరు పోటీ పడి ఉన్నత చదువులు చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. పూర్వ కాలంలోనే ఈ గ్రామంలో బడి పంతుళ్లు, పోలీస్ పటేల్‌గా కొలువు దీరారు. వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన ఉద్యోగులంతా సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో కలుసుకొని గ్రామంలోని మహిళలు, యువతకు వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు.
100 మందికిపైగా ప్రభుత్వోద్యోగులు
గ్రామంలో 10, 15 ప్రభుత్వ కొలువులు ఉంటేనే గొప్ప. అలాంటిది తండధర్మారంలో 100 మందికిపైగా ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడ్డారంటే మామూలు విషయం కాదు. గ్రామానికి చెందిన గుగులోతు రవినాయక్ (ఐఏఎస్) తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.
గత సంవత్సరం మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా కొనసాగారు. అలాగే గుగులోతు వసంత్‌నాయక్ ఆర్ అండ్ బీ ఎస్సీగా విధులు నిర్వహిస్తున్నారు. గుగులోతు సుమలత ఇటీవల ఆర్టీఏ కొలువు సాధించి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీస్ ఇలా అన్ని శాఖల్లోనూ కొలువై ఉన్నారు.
స్వాతంత్య్రం రాకముందే..
స్వాతంత్య్రం రాక ముందే గ్రామంలో పదుల సంఖ్యలో విద్యావంతులున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని గుగులోతు సక్రునాయక్ మొదటి బడిపంతులుగా కొలువుదీరినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే హన్మంతునాయక్, స్వాతంత్య్ర సమరయోధుడు వెంకన్ననాయక్, గుగులోతు భగ్గునాయక్ తర్వాత బడిపంతులుగా నియమితులయ్యారు. గుగులోతు సిరినాయక్ అనే వ్యక్తి పోలీస్ పటేల్‌గా విధులు నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలోని రైతులు, కూలీలు కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.
Comments
Please login to add a commentAdd a comment