చెంచుల కోసం క్షీరసాగరం | Tribal Activist Krishna Rao 94th Birthday | Sakshi
Sakshi News home page

చెంచుల కోసం క్షీరసాగరం

Published Wed, Jul 3 2019 8:14 AM | Last Updated on Wed, Jul 3 2019 8:14 AM

Tribal Activist Krishna Rao 94th Birthday - Sakshi

కృష్ణారావు (నాడు, నేడు)

‘నెల నెలా వెన్నెల’ పేరుతో ఔత్సాహిక కవుల వెన్ను తట్టి శెభాస్‌ అంటూ ప్రోత్సహించి ముందుకు నడిపించిన కవి.. గిరిజన బిడ్డల కడుపు నింపడమే ఉద్యోగధర్మంగా నిరంతరం వారి పూరిళ్లలో నివసిస్తూ గిరిజన సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన ఉద్యోగి.. నేడు 94వ ఏట అడుగు పెడుతున్న నిబద్ధతా స్వరూపం.. శ్రీ సి.వి.కృష్ణారావు. గుంటూరు, బ్రాడీపేటలో సత్తెనపల్లి వెళ్లే రైలు పట్టాల పక్క ఖాళీ స్థలంలో నలుగురు చేరి కవిత్వాన్ని వినిపించడంతో ప్రారంభమైన కవితా గోష్ఠి కృష్ణారావు నేతృత్వంలో ‘నెల నెలా వెన్నెల’గా రూపుదిద్దుకొని ఇంచుమించు అరవై సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఒక సంపన్న జమీందారీ కుటుంబంలో 1926 జూలై 3న జన్మించిన కృష్ణారావు మఖమల్‌ పరుపుల మీద పారాడే అదృష్టం వెనుక పుట్టినప్పుడే తల్లిని, తరువాత కొద్దికాలానికి మాతామహులను పోగొట్టుకోవడమనే దురదృష్టమూ వెన్నంటి ఉంది. గుంటూరులో కళాశాల విద్యనభ్యసించే కాలంలో నయాగరా కవుల (కుందుర్తి, ఏల్చూరి మొ) పరిచయం లభించింది. కవిత్వాన్ని ఆస్వాదించడం, విస్తృతంగా పుస్తక పఠనం, రచనలు చేయడం ప్రారంభమైంది.

‘వైతరణి’ మొదటి కవితా సంపుటి. ‘మాదీ మీ వూరే మహారాజ కుమారా’, ‘అవిశ్రాంతం’ మొదలైనవి ముద్రితాలు! లాతూరు భూకంపం సందర్భంగా కంపన కేంద్ర గ్రామమైన ‘కిల్లారి’లో స్వామీ రామానంద తీర్థ సంస్థ పనుపున సేవలు అందించిన సందర్భంగా ఆ బీభత్సానికి అచ్చుగుద్దిన ‘కిల్లారి’ అనే కావ్యం కృష్ణారావు కలం నుండి వెలువడి Fiery and Fierce పేరుతో తర్జుమా అయింది. రామారావు దానిని ఆంగ్లంలోనికి అనువదించారు. చిన్నతనంలో అలవడిన, నరనరాన జీర్ణించుకొన్న కమ్యూనిస్టు భావపరంపరను నిజ జీవితంలో అమలు పరిచే అదృష్టాన్ని ఆయన ఎంచుకున్న ఉద్యోగం అందించింది. గిరిజన ఆదివాసీ జనుల జీవనగతులను మార్చగలిగే అవకాశాన్నివ్వగల ఉద్యోగంలో కృష్ణారావు కుదురుకోవడం అంటే ఒక సిద్ధాంతాన్ని నిబద్ధతగా అమలు పరచే వ్యక్తిత్వం ఉండాలే గాని సిద్ధాంతం ఎప్పుడూ పేలవమైనదీ, నిరర్ధకమైనదీ కాదని నిరూపించడమే! వందలాది చెంచుల జీవన విధానాన్ని మెరుగు పరచిన ‘క్షీరసాగరం’ ప్రాజెక్టు సృష్టికర్త ఆయనే. అసిఫాబాద్‌ అడవులలో గాని, రంపచోడవరం మన్యంలో గాని తాను చూచిన సంఘటనలే ఆయన కవితా వస్తువులు! ప్రతి కవితలోను ఆ జీవుల రక్తాశువ్రులు దర్శనమిస్తాయి!
– సి.బి.వి.ఆర్‌.కె.శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement