Gummadi Lakshminarayana
-
జన్ జాతీయ గౌరవ్ దివస్.. విస్మృత పోరాట యోధుడి జయంతి
గత రెండేళ్ల క్రితం నుంచి నవంబర్ 15 నాడు బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా పాటిస్తున్నాం. ఇన్నేళ్లకైనా విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకం. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నాటి బెంగాల్ ప్రావిన్స్‌లోని బిహార్ (నేటి జార్ఖండ్)లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమరశంఖం పూరించాడు. ఆయన తన ఆదివాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం–మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చాడు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపుకు నడిపించింది.ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వల్ల ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే స్కూల్ నుంచి బయటికి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించాడు. ఆదివాసీలందరినీ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించాడు. తాను తన జాతీయులను ఉద్ధరించడానికి అవతరించినట్లు ప్రకటించాడు. ఆయన బోధనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ముండా ప్రజలు ఆయన్ని దేవునిగా భావించి ‘భగవాన్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే బిర్సా ముండాను అనుసరించనివారు ఊచకోతకు గురవుతారనే గాలివార్త ప్రచారంలోకి రావడంతో ఆయన్ని బ్రిటిష్‌వాళ్లు ఛోటానాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టులో అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు. దీంతో ఆయన విడుదల కోరుతూ జాతీయోద్యమకారులు పెద్దఎత్తున బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఎట్టకేలకు 1897 నవంబర్‌లో బిర్సాని విడుదల చేసింది.ఆ రోజుల్లో బ్రిటిష్‌వాళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములపై పన్నులు విధిస్తూ... వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా... వన జీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్‌వాళ్లకు కప్పాలు కట్టవద్దనీ, వాళ్లను తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్లో భారీ ‘ఉల్’ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు.చదవండి: ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. కేసు విచారణలో ఉన్న కాలంలో జూన్ 9న జైల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. చివరికి 1908లో బిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ‘ది ఛోటానాగపూర్ టెనెన్సీ యాక్ట్’ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ (2024, నవంబర్ 15న బిర్సాముండా 150వ జయంతి ప్రారంభం) -
సున్నా వడ్డీ రుణాలు.. గిరిజన రైతులకు మేలు
ఏజెన్సీ ప్రాంతాలలో వ్యవసాయం చేసే గిరిజన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఈ చిన్న, సన్న కారు రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకి వస్తుం టారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఈ వడ్డీ వ్యాపారుల నుండి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్)గా పొందడమే గాక, వాటికి వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం. తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు... ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోని కొన్ని ఆదివాసీ ప్రాంత రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వక పోవ డంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిర్చింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రివేళ ఇళ్ళు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ ‘గిరిగిరి’ వ్యాపారం వర్ణించ లేనిది. గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం–1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా రుణాలు ఇవ్వరాదు. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న సాచివేత ధోరణి వల్ల ఏజెన్సీ రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఏపీలో ‘వైఎస్సార్ రైతు భరోసా’, తెలంగాణలో ‘రైతుబంధు’ పథకాల ద్వారా అందే సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది. రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి. ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈ రైతులకు మేలు జరుగుతుంది. (క్లిక్ చేయండి: యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం) – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం) -
పరాయీకరణ దిశలో మేడారం జాతర
ములుగు జిల్లా మేడారంలో ‘సమ్మక్క–సార లమ్మ’ జాతర ప్రారంభమైంది. ఈ గిరిజన జాతర నేడు కుల, మత, ప్రాంత భేదం లేని సకలజనుల జాతరగా మారింది. రెండేళ్లకొకసారి జరిగే జాత రను ప్రభుత్వం ఆదాయవనరుగా భావిస్తున్నదే తప్ప... గిరిజనులకు లాభం చేకూర్చే సంగతి పట్టించుకోవడంలేదు. ఆదివాసీలకు మతాచారాలు లేవు. విగ్రహారాధన అసలే లేదు. పండుగలు, పూజల్లో వేద మంత్రాలు ఉండవు. కానీ హిందూ పండుగలను కూడా చేసుకుంటారు. ఇటువంటి ఆదివాసీల దేవతలను హైందవీకరణ చేసే ప్రక్రియ ఇప్పుడు మంచి ఊపు మీదుంది. ఆదిమ సంస్కృతికి విరుద్ధమైన పరాయీకరణ మొదలైంది. ఆదివాసీ సాంస్కృతిక జీవనంలో రాజకీయ నాయకుల, గిరిజనేతరుల, అధికారుల జోక్యం పెరిగింది. దేవాదాయ, ధర్మాదాయశాఖ గద్దెల ప్రాంగణంలో పసుపు, కుంకుమ, అడవి పూల అలంకరణకు బదులుగా పెయింట్, ప్లాస్టిక్ పూలు, కాకతీయ తోరణాలు, హిందూత్వ చిహ్నాలు వాడుతున్నారు. పారేటాకుకు బదులు అరిటాకు భోజనం, ప్రసాదంగా బెల్లం (బంగారం) కాక లడ్డూలు దర్శనమిస్తున్నాయి. రూపమే లేని సమ్మక్క, సారలమ్మలకు కిరీటం, శంకు, కత్తి, డాలు అంటగట్టి వారు జింక, పులిపై ఊరేగుతున్నట్లు చిత్రించడం బ్రాహ్మణీకరణ కాక ఏమవుతుంది? ఇది ఏమాత్రం ఆదివాసీ సంస్కృతి కాదు. (చదవండి: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!) రాజకీయ నాయకులు, వీఐపీలు, అధికారులు చిలుకలగుట్ట, ఆలయంలోకి దర్శనం కోసం గిరిజన వడ్డె (పూజారి)ల అభ్యంతరాలను పట్టించు కోకుండా పాదరక్షలతో ప్రవేశించిన గతానుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవతల ఆగమన సమయంలో తూతకొమ్ము శబ్దం కాకుండా తుపాకీ శబ్దం చేయడం ఆదివాసుల జాతరపై ప్రభుత్వ అధికారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆదివాసీల మౌఖిక సాహి త్యానికి విరుద్ధంగా దేవతల భిన్న కథనాలు, పాటలు, పుస్తకాలు, వీడియో ఆల్బమ్స్ వ్యాపారం జరుగుతోంది. ఆదివాసీలు క్రమంగా తమ సంస్కృతి పరమైన హక్కులను కోల్పోతున్న సంఘ టనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. జాతర నిర్వహణలో భాగంగా గిరిజన సంస్కృతి, పరిరక్షణ కోసం ఏర్పాటైన ‘ట్రస్టుబోర్డ్’ కమిటీలో ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లు మినహా మిగిలిన వారంతా గిరిజనే తరులే ఉండటం ఆక్షేపణీయం. జాతర ఆదాయవనరు కావడంతో గిరిజనేతరుల వలసలు పెరిగి స్థానిక నాయకుల ప్రమేయంతో 1/70 చట్టానికి విరుద్ధంగా భూములు కొనుగోలు చేసి, భవనాలు నిర్మించారు. జాతర జరిగే ఏడాదికి ఆదివాసులు నష్టపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. జాతర నిర్వహణ, పర్యవేక్షణకు ఆదివాసీ అధికారులకు బాధ్యత అప్పగించాలి. వనదేవతల స్వస్థలాలైన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బయ్యక్కపేట, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్ల గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికి పనులు చేపట్టాలి. జాతర ఆదాయంలో 14 మంది పూజారులకు ఇచ్చే 1/3 వంతు వాటాధనాన్ని పెంచాలి. మిగిలిన జాతర ఆదాయాన్ని ఆదివాసీల సంప్రదాయిక వారసత్వాలను గౌరవించి స్థానిక ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన జాతరకు ఒకరోజు సెలవు (కాంపెన్సేటరీ హాలిడే)గా కాకుండా కనీసం రెండు రోజులైనా సాధారణ సెలవు ప్రకటించాలి. (చదవండి: ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!) - గుమ్మడి లక్ష్మీనారాయణ వ్యాసకర్త ఆదివాసీ రచయితల వేదిక సభ్యుడు ---------------------------------------------------------------- ఆదివాసీ అస్తిత్వం అంతమవుతోంది! మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. కానీ నేడది పూర్తిగా బ్రాహ్మణ ఫ్యూడల్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. జాతర బ్రాహ్మణీకరణకూ, హైందవీకరణకూ గురవుతోంది. దీనిమూలంగా జాతరలో ఆదివాసీ అస్తిత్వం అంతం అవుతోంది. ప్రభుత్వ చొరబాటు కూడా ఎక్కువైంది. సమ్మక్క సారక్క గద్దెల వద్ద గిరిజనేతరులను నియమించి ఆదివాసీ సంప్రదాయాలను అవమానిస్తున్నారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో గిరిజనేతరులను నియమించి జాతరను కబ్జా చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా గిరిజనేతర పార్టీల్లో చేరి జాతరను నిర్లక్ష్యం చేస్తున్నారు. జాతర సంపదను దోచుకోవడానికి బడాబాబులు, మద్యం డాన్లు, బెల్లం డాన్లు మేడారం ట్రస్ట్ బోర్డులో చేరుతున్నారు. జాతరకు జాతీయ హెూదా కల్పించాలని పాలకులు పథకాలు పన్నుతున్నారు. ఈ హెూదా వస్తే జాతర ఆదివాసీల నుండి మరింత చేజారి పోతుంది. టూరిజం పేరుతో పెద్ద భవనాలు, హోటళ్లు కట్టి ఆదివాసీల భూములు బలవంతంగా లాక్కుంటారు. జాతరను కమర్షియల్ చేస్తారు. బ్రాహ్మాణీయ సంప్రదాయాలకు పునాదిగా లడ్డు ప్రసాదం జాతరలో ప్రవేశపెడుతున్నారు. భవిష్యత్తులో నిరాడంబర మూర్తులైన సమ్మక్క–సారలమ్మకు పెద్ద భవనాలను బంగారంతో నిర్మించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్కల పోరాట వీర గాథలను, కోయల ఇలవేల్పుల కథలను డోలి సహాయంతో పొల్లు పోకుండా చెప్పడంలో నేర్పరి. సకిన రామచంద్రయ్యది కోయదొరల వంశం. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో డోలీలు ప్రధాన భూమిక పోషిస్తారు. డోలి ఉపతెగకు చెందిన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ముసలయ్య, గంగమ్మలకు 1960లో జన్మించాడు. ఈ పద్మశ్రీ గుర్తింపు ఆయన పేదరి కాన్ని ఆదుకోలేకపోయినా మరుగున పడుతున్న డోలికళకు పునరుజ్జీవం తేగలుగుతుంది. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు కోలేకపోతేనేం... ఆదివాసీల మూలాలు, సంప్రదా యాలని గడగడ చెప్పేస్తాడు. వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు. ఆదివాసుల జాతరల్లో, పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. (క్లిక్: మన తెలుగు పద్మాలు వీరే...) డోలీ అంటే – రెండు అడుగుల వెడల్పు, మరి కొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ప్రత్యేక పూజలో డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి కర్మ కాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. అంటే ఇది ఒక రకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కాని ఇది కోయ సంస్కృతికి మూలాధారం. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి వుంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, ఉయ్యాల బాలుడు, దూల రాజు, ఒర్రె మారయ్య, కొమ్ములమ్మ, గుంజేడు ముసలమ్మ వంటి కోయ తెగ వీరులు/ వివిధ గోత్రాల వారి కథలు చెబుతారు. ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. (చదవండి: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) తన ముగ్గురు కూతుళ్ళకు డోలీ కథల వారసత్వం రాకపోవడంతో ఇన్నాళ్ళు సంప్రదాయంగా కాస్తో కూస్తో జీవనోపాధి కల్పించిన ఈ కళ కనుమరుగు కాకూడదని తనయుడు బాబురావుకు నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామచంద్రయ్య. ప్రభుత్వం ఈ సంప్రదాయ డోలి కళకు ప్రాచుర్యం కల్పిస్తూ ఈ నిరుపేద గిరిజన కుటుంబాన్ని కూడా అన్నివిధాల ఆదుకోవాలని కోయగిరిజనులు కోరుతున్నారు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) – గుమ్మడి లక్ష్మినారాయణ ఆదివాసీ రచయితల వేదిక -
కుమ్రంభీమ్ స్ఫూర్తితో సాగుదాం
సందర్భం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ఎంతో సహకరించింది. భీమ్ అమరుడై నేటికి 77 ఏళ్లయిన సందర్భంలో బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా అట్టడుగు వర్గాల– చరిత్ర, జీవన విధానం, సంస్కృతులను తెరకెక్కించిన సందర్భాలు మహా అరుదుగా కనిపిస్తాయి. తెలుగు చలన చిత్రరంగంలో అలాంటి సాంప్రదాయం ఏ దశలోనూ వేళ్లూనుకోలేదనే చెప్పాలి. ఎవరైనా ఔత్సాహికులు వ్యయప్రయాసల కోర్చి అలాంటి చిత్రాల నిర్మాణానికి పూనుకుంటే, అటు చిత్ర పరిశ్రమ నుంచి, ఇటు ప్రభుత్వపరంగా ఎలాంటి ‘సహాయ సహకారాలు’లభిస్తాయో ‘కొమరంభీమ్’సినిమా ఎదుర్కొన్న అడ్డంకులు కళ్లకు కట్టినట్టు స్పష్టం చేస్తాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి పీ సుబ్రమణ్యం చొరవతో గోండు వీరుడు కుమ్రంభీమ్ పోరాట చరిత్ర సినిమాగా రూపొందింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండు తెగ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, అడవిబిడ్డల హక్కులైన ‘జల్– జంగల్–జమీన్’ కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీమ్ పోరాటగా«థను తెరకెక్కించే బాధ్యతను ఉట్నూరులోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన పీ సుబ్రమణ్యంకు 1990లో అప్పటి ప్రభుత్వం అప్పగించింది. ఐటీడీఏ సంస్థ కేటాయించిన కేవలం రూ. 20 లక్షలతోనే అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు నోచుకోకపోయినప్పటికీ 1991 ‘నంది అవార్డు’ల పురస్కారంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను అది గెలుచుకుంది. నంది అవార్డులకు ఎంపికైన ఆ చారిత్రాత్మక చిత్రం 20 సంవత్సరాలకు గానీ విడుదల కాకపోవడం విషాదంగా మిగిలింది. ఒక గిరిజన సినిమా వివక్షకు గురై, 20 ఏళ్లు అజ్ఞాతంలో మగ్గిందంటే... ఇక బ్రిటిష్, నైజాం పాలనలో ఆదివాసీలు ఎదుర్కొన్న దుర్భర జీవితాలు ఎంతటి విషాదకరమైనవో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఏదేమైనా, పోరాటయోధుడు కుమ్రంభీమ్ స్ఫూర్తిగా పట్టు వీడకుండా చేసిన కృషితో ఎట్టకేలకు 2010, జూలై 2న చిత్రం విడుదల కావడం అభినందనీయమే! అదీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. కానీ, చిత్ర ప్రదర్శనకు పంపిణీదారులెవ్వరూ ముందుకురాకపోవడం మరో దురదృష్టకర అంశం. అందుకే తెలంగాణలో చాలా తక్కువ చోట్లనే ఆ సినిమా ప్రదర్శనకు నోచుకుంది. విశాఖ జిల్లా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులను గడగడలాడించగా, ఆయన పేరుతో తీసిన సినిమా చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గోండు వీరుడు కుమ్రంభీమ్ నిజాం నవాబులను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా, ఆదివాసీల స్వయంపాలన, జల్–జంగల్– జమీన్ నినాదంతో పదేళ్లకు పైగా 1931 నుంచి 1940, అక్టోబర్ దాకా ఆయన నేతృత్వంలో సాగిన జోడేఘాట్ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచింది. తెలంగాణలో నైజామ్ నవాబులను ఎదిరించిన కుమ్రంభీమ్ ఏకైక ఆదివాసీ లెజెండ్, సినిమా విడుదల 20 ఏళ్లు వాయిదా పడినా, గోండుల జీవితాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, భాష, వ్యవహారశైలి ఏమాత్రం మారకపోవడం చూసినవారికి ఆశ్చర్యమనిపించకపోదు. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్ హైమండార్ఫ్ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గోండు, కోలం, కోయ, పర్థాన్, నాయకపోడు తెగల గిరిజనులతో మమేకమై, పరిశోధన చేసిన ఫలితంగానే వారు బాహ్య ప్రపంచానికి తెలిశారు. కాని వారి స్వయం పాలనా కాంక్ష, భూపోరాటాల ఉధృతి మాత్రం తగ్గలేదు. కారణం ఏజెన్సీ గూడేల్లో పెత్తందార్ల దోపిడీ, రజాకార్ల అకృత్యాలు మితిమీరటమే. ఈ పరిస్థితులను ‘కొమ్రంభీం’చిత్రంలో యథాతథంగా చూపించారు. చిత్రంలో కుమ్రంభీమ్ దాదాగా భూపాల్‌రెడ్డి (కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత –2014), భార్య సోంబాయిగా తమిళనటి మౌనిక నటించారు. దర్శకుడు అల్లాణి శ్రీధర్ 2016లో ప్రభుత్వ ‘కుమ్రంభీమ్ సేవా పురస్కారం’ అందుకున్నారు. కుమ్రంభీమ్ తన ఉద్యమ ఘట్టంలోనే చదువు నేర్చుకున్నాడు. భీమ్ వద్ద హవల్ధార్గా చేసిన కుమ్రంసూరు భీమ్‌కు అక్షరాలు నేర్పిస్తూ, ఉద్యమ వ్యూహాలను రచించేవాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలైన జోడేఘాట్, బాబేఝరీ, పట్నాపూర్, టోకెన్నావాడ, చల్‌బరిడి, శివగూడ, భీమన్‌గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, కోశగూడ, లైన్‌పటల్ అనే 12 గూడేలకు స్వయంపాలన కావాలని భీమ్ పట్టుపట్టాడు. తన డిమాండ్లను నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌కు విన్నవించడానికి హైదరాబాద్ వెళ్తే అధికారులు భీమ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో ఉద్యమ కేంద్రంగా ‘జోడేఘాట్ గుట్టలు’సరైనవిగా సూచించాడు కుమ్రంసూరు, ఒక సన్నివేశంలో భీమ్ భార్య మాట్లాడుతూ – నిజాం నవాబుల అరాచకాల నుంచి ఇక పారిపోదామని ప్రాధేయపడినప్పుడు– ‘‘ఉద్యమంలో గెలిస్తే మనం బతుకుతాం వచ్చేతరాలు బతుకుతాయి ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది వెన్నుచూపడం తగదు. వెనుతిరుగేదిలేదు.’’ అని భీమ్ చెప్పడం ఒక గొప్ప సందేశాన్ని భావితరాలకు గుర్తు చేసినట్టయింది. చివరకు కుర్ధుపటేల్ అనే ద్రోహి సమాచారంతో జోడేఘాట్ గుట్టల్లో రాత్రి జరిగిన కాల్పుల్లో 1940, అక్టోబర్ 8న (జీవో ఎంఎస్ నం.87/2014) కుమ్రంభీమ్ వీర మరణం పొందారు. ఏదేమైనా త్యాగానికి, సంకల్పబలానికి, సాహసానికి ఉండే శాశ్వత గౌరవాన్ని ‘భీమ్’ సినిమా చాటి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ఎంతో సహకరించింది. భీమ్ అమరుడై నేటికి 77 ఏళ్లయిన సందర్భంలో బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలి. కుమ్రంభీమ్ ఉద్యమకాలం నుంచి నేటి దాకా వాస్తవ పరిస్థితులను అనుగుణంగా సవరించి ఆ గొప్ప నినాదం– జల్–జంగల్–జమీన్ (నీరు, అడవి, భూమి) నేపథ్యంలో మరో చిత్రాన్ని నిర్మించాల్సిన అవసరముంది. (ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అక్టోబర్ 5న కుమ్రంభీమ్ 77వ వర్ధంతి) వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి, సెల్: 94913 18409 గుమ్మడి లక్ష్మీనారాయణ