ఏజెన్సీ ప్రాంతాలలో వ్యవసాయం చేసే గిరిజన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఈ చిన్న, సన్న కారు రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకి వస్తుం టారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఈ వడ్డీ వ్యాపారుల నుండి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్)గా పొందడమే గాక, వాటికి వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం.
తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు... ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోని కొన్ని ఆదివాసీ ప్రాంత రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వక పోవ డంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిర్చింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రివేళ ఇళ్ళు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ ‘గిరిగిరి’ వ్యాపారం వర్ణించ లేనిది.
గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం–1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా రుణాలు ఇవ్వరాదు. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న సాచివేత ధోరణి వల్ల ఏజెన్సీ రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి.
ప్రస్తుతం ఏపీలో ‘వైఎస్సార్ రైతు భరోసా’, తెలంగాణలో ‘రైతుబంధు’ పథకాల ద్వారా అందే సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది. రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి. ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈ రైతులకు మేలు జరుగుతుంది. (క్లిక్ చేయండి: యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం)
– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి
(డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment