ములుగు జిల్లా మేడారంలో ‘సమ్మక్క–సార లమ్మ’ జాతర ప్రారంభమైంది. ఈ గిరిజన జాతర నేడు కుల, మత, ప్రాంత భేదం లేని సకలజనుల జాతరగా మారింది. రెండేళ్లకొకసారి జరిగే జాత రను ప్రభుత్వం ఆదాయవనరుగా భావిస్తున్నదే తప్ప... గిరిజనులకు లాభం చేకూర్చే సంగతి పట్టించుకోవడంలేదు.
ఆదివాసీలకు మతాచారాలు లేవు. విగ్రహారాధన అసలే లేదు. పండుగలు, పూజల్లో వేద మంత్రాలు ఉండవు. కానీ హిందూ పండుగలను కూడా చేసుకుంటారు. ఇటువంటి ఆదివాసీల దేవతలను హైందవీకరణ చేసే ప్రక్రియ ఇప్పుడు మంచి ఊపు మీదుంది. ఆదిమ సంస్కృతికి విరుద్ధమైన పరాయీకరణ మొదలైంది. ఆదివాసీ సాంస్కృతిక జీవనంలో రాజకీయ నాయకుల, గిరిజనేతరుల, అధికారుల జోక్యం పెరిగింది. దేవాదాయ, ధర్మాదాయశాఖ గద్దెల ప్రాంగణంలో పసుపు, కుంకుమ, అడవి పూల అలంకరణకు బదులుగా పెయింట్, ప్లాస్టిక్ పూలు, కాకతీయ తోరణాలు, హిందూత్వ చిహ్నాలు వాడుతున్నారు. పారేటాకుకు బదులు అరిటాకు భోజనం, ప్రసాదంగా బెల్లం (బంగారం) కాక లడ్డూలు దర్శనమిస్తున్నాయి. రూపమే లేని సమ్మక్క, సారలమ్మలకు కిరీటం, శంకు, కత్తి, డాలు అంటగట్టి వారు జింక, పులిపై ఊరేగుతున్నట్లు చిత్రించడం బ్రాహ్మణీకరణ కాక ఏమవుతుంది? ఇది ఏమాత్రం ఆదివాసీ సంస్కృతి కాదు. (చదవండి: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!)
రాజకీయ నాయకులు, వీఐపీలు, అధికారులు చిలుకలగుట్ట, ఆలయంలోకి దర్శనం కోసం గిరిజన వడ్డె (పూజారి)ల అభ్యంతరాలను పట్టించు కోకుండా పాదరక్షలతో ప్రవేశించిన గతానుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవతల ఆగమన సమయంలో తూతకొమ్ము శబ్దం కాకుండా తుపాకీ శబ్దం చేయడం ఆదివాసుల జాతరపై ప్రభుత్వ అధికారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆదివాసీల మౌఖిక సాహి త్యానికి విరుద్ధంగా దేవతల భిన్న కథనాలు, పాటలు, పుస్తకాలు, వీడియో ఆల్బమ్స్ వ్యాపారం జరుగుతోంది. ఆదివాసీలు క్రమంగా తమ సంస్కృతి పరమైన హక్కులను కోల్పోతున్న సంఘ టనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. జాతర నిర్వహణలో భాగంగా గిరిజన సంస్కృతి, పరిరక్షణ కోసం ఏర్పాటైన ‘ట్రస్టుబోర్డ్’ కమిటీలో ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లు మినహా మిగిలిన వారంతా గిరిజనే తరులే ఉండటం ఆక్షేపణీయం.
జాతర ఆదాయవనరు కావడంతో గిరిజనేతరుల వలసలు పెరిగి స్థానిక నాయకుల ప్రమేయంతో 1/70 చట్టానికి విరుద్ధంగా భూములు కొనుగోలు చేసి, భవనాలు నిర్మించారు. జాతర జరిగే ఏడాదికి ఆదివాసులు నష్టపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. జాతర నిర్వహణ, పర్యవేక్షణకు ఆదివాసీ అధికారులకు బాధ్యత అప్పగించాలి. వనదేవతల స్వస్థలాలైన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బయ్యక్కపేట, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్ల గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికి పనులు చేపట్టాలి.
జాతర ఆదాయంలో 14 మంది పూజారులకు ఇచ్చే 1/3 వంతు వాటాధనాన్ని పెంచాలి. మిగిలిన జాతర ఆదాయాన్ని ఆదివాసీల సంప్రదాయిక వారసత్వాలను గౌరవించి స్థానిక ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన జాతరకు ఒకరోజు సెలవు (కాంపెన్సేటరీ హాలిడే)గా కాకుండా కనీసం రెండు రోజులైనా సాధారణ సెలవు ప్రకటించాలి. (చదవండి: ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!)
- గుమ్మడి లక్ష్మీనారాయణ
వ్యాసకర్త ఆదివాసీ రచయితల వేదిక సభ్యుడు
----------------------------------------------------------------
ఆదివాసీ అస్తిత్వం అంతమవుతోంది!
మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. కానీ నేడది పూర్తిగా బ్రాహ్మణ ఫ్యూడల్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. జాతర బ్రాహ్మణీకరణకూ, హైందవీకరణకూ గురవుతోంది. దీనిమూలంగా జాతరలో ఆదివాసీ అస్తిత్వం అంతం అవుతోంది. ప్రభుత్వ చొరబాటు కూడా ఎక్కువైంది. సమ్మక్క సారక్క గద్దెల వద్ద గిరిజనేతరులను నియమించి ఆదివాసీ సంప్రదాయాలను అవమానిస్తున్నారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో గిరిజనేతరులను నియమించి జాతరను కబ్జా చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా గిరిజనేతర పార్టీల్లో చేరి జాతరను నిర్లక్ష్యం చేస్తున్నారు.
జాతర సంపదను దోచుకోవడానికి బడాబాబులు, మద్యం డాన్లు, బెల్లం డాన్లు మేడారం ట్రస్ట్ బోర్డులో చేరుతున్నారు. జాతరకు జాతీయ హెూదా కల్పించాలని పాలకులు పథకాలు పన్నుతున్నారు. ఈ హెూదా వస్తే జాతర ఆదివాసీల నుండి మరింత చేజారి పోతుంది. టూరిజం పేరుతో పెద్ద భవనాలు, హోటళ్లు కట్టి ఆదివాసీల భూములు బలవంతంగా లాక్కుంటారు. జాతరను కమర్షియల్ చేస్తారు. బ్రాహ్మాణీయ సంప్రదాయాలకు పునాదిగా లడ్డు ప్రసాదం జాతరలో ప్రవేశపెడుతున్నారు. భవిష్యత్తులో నిరాడంబర మూర్తులైన సమ్మక్క–సారలమ్మకు పెద్ద భవనాలను బంగారంతో నిర్మించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు.
– వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment