కుమ్రంభీమ్‌ స్ఫూర్తితో సాగుదాం | Gummadi Lakshmi Narayana Rao Writes on Komaram Bheem | Sakshi
Sakshi News home page

కుమ్రంభీమ్‌ స్ఫూర్తితో సాగుదాం

Published Thu, Oct 5 2017 12:27 AM | Last Updated on Thu, Oct 5 2017 12:27 AM

Gummadi Lakshmi Narayana Rao Writes on Komaram Bheem

సందర్భం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కుమ్రంభీమ్‌ పోరాట స్ఫూర్తి ఎంతో సహకరించింది. భీమ్‌ అమరుడై నేటికి 77 ఏళ్లయిన సందర్భంలో బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలి.

వాస్తవ పరిస్థితుల ఆధారంగా అట్టడుగు వర్గాల– చరిత్ర, జీవన విధానం, సంస్కృతులను తెరకెక్కించిన సందర్భాలు మహా అరుదుగా కనిపిస్తాయి. తెలుగు చలన చిత్రరంగంలో అలాంటి సాంప్రదాయం ఏ దశలోనూ వేళ్లూనుకోలేదనే చెప్పాలి. ఎవరైనా ఔత్సాహికులు వ్యయప్రయాసల కోర్చి అలాంటి చిత్రాల నిర్మాణానికి పూనుకుంటే, అటు చిత్ర పరిశ్రమ నుంచి, ఇటు ప్రభుత్వపరంగా ఎలాంటి ‘సహాయ సహకారాలు’లభిస్తాయో ‘కొమరంభీమ్‌’సినిమా ఎదుర్కొన్న అడ్డంకులు కళ్లకు కట్టినట్టు స్పష్టం చేస్తాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితోపాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్‌ అధికారి పీ సుబ్రమణ్యం చొరవతో గోండు వీరుడు కుమ్రంభీమ్‌ పోరాట చరిత్ర సినిమాగా రూపొందింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండు తెగ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, అడవిబిడ్డల హక్కులైన ‘జల్‌– జంగల్‌–జమీన్‌’ కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీమ్‌ పోరాటగా«థను తెరకెక్కించే బాధ్యతను ఉట్నూరులోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన పీ సుబ్రమణ్యంకు 1990లో అప్పటి ప్రభుత్వం అప్పగించింది. ఐటీడీఏ సంస్థ కేటాయించిన కేవలం రూ. 20 లక్షలతోనే అల్లాణి శ్రీధర్‌ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించారు.

విడుదలకు నోచుకోకపోయినప్పటికీ 1991 ‘నంది అవార్డు’ల పురస్కారంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను అది గెలుచుకుంది. నంది అవార్డులకు ఎంపికైన ఆ చారిత్రాత్మక చిత్రం 20 సంవత్సరాలకు గానీ విడుదల కాకపోవడం విషాదంగా మిగిలింది. ఒక గిరిజన సినిమా వివక్షకు గురై, 20 ఏళ్లు అజ్ఞాతంలో మగ్గిందంటే... ఇక బ్రిటిష్, నైజాం పాలనలో ఆదివాసీలు ఎదుర్కొన్న దుర్భర జీవితాలు ఎంతటి విషాదకరమైనవో తేలిగ్గానే ఊహించుకోవచ్చు.

ఏదేమైనా, పోరాటయోధుడు కుమ్రంభీమ్‌ స్ఫూర్తిగా పట్టు వీడకుండా చేసిన కృషితో ఎట్టకేలకు 2010, జూలై 2న చిత్రం విడుదల కావడం అభినందనీయమే! అదీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. కానీ, చిత్ర ప్రదర్శనకు పంపిణీదారులెవ్వరూ ముందుకురాకపోవడం మరో దురదృష్టకర అంశం. అందుకే తెలంగాణలో చాలా తక్కువ చోట్లనే ఆ సినిమా ప్రదర్శనకు నోచుకుంది.

విశాఖ జిల్లా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించగా, ఆయన పేరుతో తీసిన సినిమా చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ గోండు వీరుడు కుమ్రంభీమ్‌ నిజాం నవాబులను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా, ఆదివాసీల స్వయంపాలన, జల్‌–జంగల్‌– జమీన్‌ నినాదంతో పదేళ్లకు పైగా 1931 నుంచి 1940, అక్టోబర్‌ దాకా ఆయన నేతృత్వంలో సాగిన జోడేఘాట్‌ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచింది. తెలంగాణలో నైజామ్‌ నవాబులను ఎదిరించిన కుమ్రంభీమ్‌ ఏకైక ఆదివాసీ లెజెండ్, సినిమా విడుదల 20 ఏళ్లు వాయిదా పడినా, గోండుల జీవితాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, భాష, వ్యవహారశైలి ఏమాత్రం మారకపోవడం చూసినవారికి ఆశ్చర్యమనిపించకపోదు.

ఇంగ్లండ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్‌ హైమండార్ఫ్‌ ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గోండు, కోలం, కోయ, పర్థాన్, నాయకపోడు తెగల గిరిజనులతో మమేకమై, పరిశోధన చేసిన ఫలితంగానే వారు బాహ్య ప్రపంచానికి తెలిశారు. కాని వారి స్వయం పాలనా కాంక్ష, భూపోరాటాల ఉధృతి మాత్రం తగ్గలేదు. కారణం ఏజెన్సీ గూడేల్లో పెత్తందార్ల దోపిడీ, రజాకార్ల అకృత్యాలు మితిమీరటమే. ఈ పరిస్థితులను ‘కొమ్రంభీం’చిత్రంలో యథాతథంగా చూపించారు. చిత్రంలో కుమ్రంభీమ్‌ దాదాగా భూపాల్‌రెడ్డి (కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత –2014), భార్య సోంబాయిగా తమిళనటి మౌనిక నటించారు. దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ 2016లో ప్రభుత్వ ‘కుమ్రంభీమ్‌ సేవా పురస్కారం’ అందుకున్నారు.

కుమ్రంభీమ్‌ తన ఉద్యమ ఘట్టంలోనే చదువు నేర్చుకున్నాడు. భీమ్‌ వద్ద హవల్ధార్‌గా చేసిన కుమ్రంసూరు భీమ్‌కు అక్షరాలు నేర్పిస్తూ, ఉద్యమ వ్యూహాలను రచించేవాడు. ఆసిఫాబాద్‌ పరిసర ప్రాంతాలైన జోడేఘాట్, బాబేఝరీ, పట్నాపూర్, టోకెన్నావాడ, చల్‌బరిడి, శివగూడ, భీమన్‌గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, కోశగూడ, లైన్‌పటల్‌ అనే 12 గూడేలకు స్వయంపాలన కావాలని భీమ్‌ పట్టుపట్టాడు. తన డిమాండ్లను నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌కు విన్నవించడానికి హైదరాబాద్‌ వెళ్తే అధికారులు భీమ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో ఉద్యమ కేంద్రంగా ‘జోడేఘాట్‌ గుట్టలు’సరైనవిగా సూచించాడు కుమ్రంసూరు, ఒక సన్నివేశంలో భీమ్‌ భార్య మాట్లాడుతూ – నిజాం నవాబుల అరాచకాల నుంచి ఇక పారిపోదామని ప్రాధేయపడినప్పుడు–

‘‘ఉద్యమంలో గెలిస్తే మనం బతుకుతాం
వచ్చేతరాలు బతుకుతాయి
ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది
వెన్నుచూపడం తగదు. వెనుతిరుగేదిలేదు.’’

అని భీమ్‌ చెప్పడం ఒక గొప్ప సందేశాన్ని భావితరాలకు గుర్తు చేసినట్టయింది. చివరకు కుర్ధుపటేల్‌ అనే ద్రోహి సమాచారంతో జోడేఘాట్‌ గుట్టల్లో రాత్రి జరిగిన కాల్పుల్లో 1940, అక్టోబర్‌ 8న (జీవో ఎంఎస్‌ నం.87/2014) కుమ్రంభీమ్‌ వీర మరణం పొందారు. ఏదేమైనా త్యాగానికి, సంకల్పబలానికి, సాహసానికి ఉండే శాశ్వత గౌరవాన్ని ‘భీమ్‌’ సినిమా చాటి చెప్పింది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కుమ్రంభీమ్‌ పోరాట స్ఫూర్తి ఎంతో సహకరించింది. భీమ్‌ అమరుడై నేటికి 77 ఏళ్లయిన సందర్భంలో బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలి. కుమ్రంభీమ్‌ ఉద్యమకాలం నుంచి నేటి దాకా వాస్తవ పరిస్థితులను అనుగుణంగా సవరించి ఆ గొప్ప నినాదం– జల్‌–జంగల్‌–జమీన్‌ (నీరు, అడవి, భూమి) నేపథ్యంలో మరో చిత్రాన్ని నిర్మించాల్సిన అవసరముంది.
(ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అక్టోబర్‌ 5న కుమ్రంభీమ్‌ 77వ వర్ధంతి)

వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం
వ్యవస్థాపక కార్యదర్శి, సెల్‌: 94913 18409
గుమ్మడి లక్ష్మీనారాయణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement