అభిప్రాయం
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.
ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.
అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.
ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.
చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనా
కార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.
చదవండి: మంచి పనిని కించపరుస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!
- పిల్లా తిరుపతిరావు
తెలుగు ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment