అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలు. ఏ కారణంతో రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించినా సారంలో అది అప్రజాస్వామికం. గ్రామస్థాయి నుంచి కేంద్రం దాకా అధికార వికేంద్రీకరణ రాజ్యాంగ నిర్దేశనమే (అదెంత సజావుగా అమలవుతున్నదనేది వేరే చర్చనీయాంశం). ఒకానొక తొందరపాటు, తప్పుడు నిర్ణయం కారణంగా మన తెలుగునేల విభజన జరగాల్సినంత సజావుగా, సశాస్త్రీయంగా జరగలేదు. నదీజలాల పంపిణీ, ఆస్తుల పంపిణీ వంటి అనేకాంశాలను ఇరుపక్షాలతో విస్తృత చర్చలు జరిపి వారి అంగీకారంతో విభజన కార్యక్రమం పూర్తి చేయాల్సివుండగా అలా జరగలేదు. అలా జరిగితే ఇప్పటి స్థితి రెండు రాష్ట్రాలకూ వుండేది కాదు. అందులో ఆంధ్రప్రదేశ్‌గా మిగిలిన మన రాష్ట్రానికి తొలినాటి నుండీ అన్యాయం జరిగింది. అలా జరగటానికి నాటి కేంద్రపాలకు లెంత కారణమో... విభజనను వ్యతిరేకిస్తున్నామంటూ డ్రామాలాడిన రాజకీయ పార్టీలన్నీ అంతే కారణం!
విభజన జరుగుతున్న సమయంలోనూ మన నేతలు... విభజన జరిగితే డిమాండ్ చేయాల్సిన అంశాలను గురించి ఆలోచించలేదు. ఆనాటికి రాజకీయంగా పలుకుబడి కలిగిన చంద్రబాబయితే విభజన రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావటం గురించే ఆలోచించారు తప్ప, రాష్ట్రానికి రావాల్సిన వాటిగురించి ఆలోచించలేదు. చివరికి ఆయనాశించినట్టే ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిపోయారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో వుంటూ రాజధాని నిర్మించాల్సి నది పోయి, హఠాత్తుగా హైదరాబాద్ వదిలేసి తాత్కాలిక రాజధానిని నిర్మించి... శాశ్వత రాజధానిని ప్రపంచానికే ఆదర్శంగా నిర్మిస్తానన్నాడు. చంద్రబాబు రాజకీయనేత రూపంలో వున్న కార్పొరేట్ వ్యాపారి! ఆయనకు గల ఈ లక్షణ ఫలితాలే అమరావతి రాజధాని పేరిట భారీ భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలతో బేరసారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ! రాజధాని ఎంత పెట్టుబడితో ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పూర్తవుతుందో, పూర్తయితే ఎవరికి ప్రయోజనం అనేవి ప్రజలందరిలో కలిగిన ప్రశ్నలు! వాటికి జవాబు దొరక్కే వైసీపీ ప్రభుత్వాన్ని పజలు ఎన్నుకున్నారు.
అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తనదైన పంథాలో గత ప్రభుత్వ విధానాలన్నీటినీ పునః పరిశీలన చేస్తూనే, కొత్తవాటిని ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గానీ, సచివాలయాలుగానీ, వలంటీర్ వ్యవస్ధగానీ, ఇచ్చిన ఉద్యోగాలుగానీ (లోపాలుంటే సరిదిద్దే ఉద్యమాలు చేయొచ్చు) ప్రజావ్యతిరేకం అనగలమా? గ్రామస్థాయికి పాలనా వ్యవస్థను తీసుకొచ్చిన నేపథ్యమే రాజధానిని వికేంద్రీకరించి.. పాలనా కేంద్రాలను వెనుకబడిన రాయలసీమకూ, ఉత్తరాంధ్రకూ దగ్గర చెయ్యాలనే ఆలోచనకు తెరలేపింది. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ విశాఖపట్టణం దగ్గరగా ఉంటుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి సులువుగా తమ అవసరాలను నివేదించుకోగలరు. అలాగే నిరసనగళాలు విన్పించగలరు. ఇందుకోసం సుదూర అమరావతికి పోనవసరం ఉండదు.
పాలనా కేంద్రం ఒకటి వస్తోందంటే కేవలం పాలనా భవంతులే కావుగా, అనుబంధ శాఖలు కూడా వస్తాయిగా. అప్పటిదాకా లేనటువంటి అనేకానేక కార్యాలయాలు, వాటి అనుబంధ శాఖలు, వాటితో వాణిజ్య సంబంధ రంగాలు అనేకం కొత్తగా చేరుతాయి. వెనుకబాటుకు గురికాబడిన ఉత్తరాంధ్ర ముఖచిత్రానికి రూపుదిద్దుకోబోయే నూతన సౌభాగ్యరేఖను ఇవన్నీ నిర్దేశించేవే కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం పాలనాకేంద్రం కావటమనేది ఒక వరం లాంటిది. ఏ కారణంతో అయినా దీనిని వ్యతిరే కించడం ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే. రాబోయే పాలనాకేంద్రం పనితీరును లాభదాయకం చేసుకోడానికీ, ప్రజాప్రయోజనకారి చేసుకోడానికీ నివేదనల నుంచి నిరసనలదాకా అన్నింటినీ వినియోగించే వీలు ఎలాగూ ఉత్తరాంధ్రులకు వుంటుంది. ఇంటి ముంగిటకు పాలనా కేంద్రం వస్తోన్న సమయంలో.. దీనిని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు అంగీకరించరు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటు కాదది, వారి కమిట్‌మెంట్!
ఈ సందర్భంలో అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర (అందులో నిజమైన రైతులెందరు? ఆసాములెందరు? వెనకున్న రాజకీయపార్టీ యేమిటి అన్న ప్రశ్నలు వేరే చర్చ) ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచే యాత్ర అవుతుందే తప్ప వేరు కాదు. అమరావతిలో భూములిచ్చిన రైతులు తమకు నష్టం లేకుండా (ఇచ్చిన భూములకు తగ్గ విలువ) గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేయొచ్చు తప్ప, మరే ప్రాంతానికీ రాజధానినీ, పాలనా కేంద్రాలనూ వికేంద్రీకరించకూడదని అనగూడదు. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ పాలనా కేంద్రాలకు చేరువగా వుండకూడదని అనకూడదు. ఇప్పటికే ప్రాంతాల మధ్య పాలకుల పుణ్యాన అసమానతలు ఏర్పడ్డాయి (ఇవే తెలంగాణ వేర్పాటుకూ కారణాలు). ఇంకా అదే నమూనా రాజకీయాలు నడపడం వెనుకబడిన ప్రాంతాల ఆందోళనలకు దారితీస్తాయి. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా)
అమరావతి రైతులు కోర్టులకు వెళ్లారు, మంచిదే. తాత్కాలిక రాజధాని దగ్గర నిరసనోద్యమాలు నడిపారు. తమ ఆందోళనలను లోకానికి వెల్లడించారు. అది వారి హక్కు. కానీ, ఇప్పుడు అరసవిల్లి యాత్ర ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల మీద దండయాత్ర! ఉత్తరాంధ్రులు కోరుకునే పాలనా కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర నేల మీద నినదిస్తూ యాత్ర నిర్వహించడం ఎవరి రాజకీయ క్రీడలో భాగమో కానీ... అది ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రేపడమే కాక ఎటువంటి విధ్వంసానికి దారి తీస్తుందోనని భయపడాల్సిన అవసరముంది. విఙ్ఞతతో నడవాల్సిన ఉద్యమాలు ఇతరేతర ప్రయోజనాలతో నడవడం విషాదకరం! (క్లిక్: అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!)
- అట్టాడ అప్పల్నాయుడు
ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment