జనం చూపు వికేంద్రీకరణ వైపు | Uttarandhra developed with Visakhapatnam as administrative capital | Sakshi
Sakshi News home page

జనం చూపు వికేంద్రీకరణ వైపు

Published Mon, Oct 10 2022 4:25 AM | Last Updated on Mon, Oct 10 2022 8:24 AM

Uttarandhra developed with Visakhapatnam as administrative capital - Sakshi

పాడేరులో వికేంద్రీకరణకు జై కొడుతున్న అల్లూరి జిల్లాలోని ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నేతలు

సాక్షి, పాడేరు/నిడదవోలు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అఖిలపక్ష నేతలు, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాడేరులోని ప్రభుత్వ కాఫీ అతిథి గృహం సమావేశ మందిరంలో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో, నిడదవోలులోని రోటరీ ఆడిటోరియంలో విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు వికేంద్రీకరణకే జై కొట్టారు.

పాడేరులో గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, గ్రూప్‌–1 రిటైర్డ్‌ అధికారి ఓండ్రు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా అల్లూరి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు పోరాటానికి ముందుకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలో జిల్లాలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేసి, వికేంద్రీకరణకు మద్దతుగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. 

వికేంద్రీకరణతోనే అభివృద్ధి 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యం. దేశంలో అనేక ప్రాంతాల ప్రజలు తమ రాష్ట్రాల్లో వికేంద్రీకరణను కోరుకుంటున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తున్నాను. 
– గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ

జార్ఖండ్‌లో నాలుగు రాజధానులు.. 
ఏపీలో వికేంద్రీకరణకు సీఎం జగన్‌ కట్టుబడి ఉండడంతో అభినందిస్తూ జార్ఖండ్‌ సీఎం కూడా ఆ రాష్ట్రంలో వికేంద్రీకరణకు సిద్ధమవుతున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పట్టణాలను గుర్తించి నాలుగు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మూడు రాజధానుల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలంతా మూడు రాజధానులను కోరుకుంటున్నారు. 
– కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే


నిడదవోలులో వికేంద్రీకరణకు మద్దతు తెలియజేస్తున్న నాయకులు, మేధావులు 

విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి 
విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. అమరావతిలో కొంత మంది రైతులు చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం వెనుక అనేక కుట్రలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్‌ను ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో  వెనుకబడి పోయాయి. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. 
– చెట్టి పాల్గుణ, అరకులోయ ఎమ్మెల్యే

వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడం తగదు 
రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఓర్వలేక చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ముంపు గ్రామాలను పట్టించుకోని చంద్రబాబు అమరావతిలోని రైతుల కోసం మాత్రమే మాట్లాడడం దారుణం. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును గిరిజనులంతా స్వాగతిస్తున్నారు. 
– నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే

ఒక్క రాజధానితో బాబుకే లాభం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితమైతే మిగిలిన ప్రాంతాలు నష్టపోతాయి. అమరావతి వల్ల చంద్రబాబు, ఆయన అనుచర గణానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది. 5 వేల ఎకరాలు రాజధాని కోసం సరిపోతుంది. అయితే చంద్రబాబు 35–40 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. రైతులు నష్టపోకూడదని సీఎం జగన్‌ అక్కడి రైతులందరికీ కౌలు ఇస్తున్నారు. 
– జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే 

వికేంద్రీకరణతోనే సుపరిపాలన
వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు తన బినామీల సౌలభ్యం కోసం అమరావతి పాదయాత్ర చేయిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే టీడీపీ నాయకులు, వారి వర్గీయులు భూములు కొన్నారు. ఇప్పుడు వారు నష్టపోకూడదనే దొంగ యాత్రలకు శ్రీకారం చుట్టారు.  
– భూపతి ఆదినారాయణ, మున్సిపల్‌ చైర్మన్, నిడదవోలు

చంద్రబాబు నాటకాలు ప్రజలకు తెలుసు
అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. నాడు అమరావతికి భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకత చూపారు. వారిని చంద్రబాబు మోసం చేశారు. ఒకే రాజధాని ఏర్పాటు చేయడం కన్నా మూడు రాజధానులు ఏర్పాటు చూస్తే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి.  
– బూరుగుపల్లి సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా రైతు సలహా మండలి చైర్మన్‌

టీడీపీ దొంగ నాటకాలు ఆపాలి
రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్టంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందడానికి ఇదే సరైన మార్గమని అందురూ మద్దతు తెలుపుతున్నారు. కొందరు టీడీపీ నాయకులు, నకిలీ రైతులు స్వార్థ కోసమే అమరావతి పోరాటం చేస్తున్నారు.  ఇకనైనా టీడీపీ నాయకులు దొంగ నాటకాలను ఆపాలి.
– ఎస్‌కే వజీరుద్దీన్, మైనారిటీ నాయకుడు, నిడదవోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement