ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమ రం సాగించిన రాజకీయ సవ్యసాచి, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్. జాతి జనులను విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలవారిగా చేయాలన్నదే తన లక్ష్యం. జగ్జీవన్ బీహార్‌లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న సంతోషోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవించాడు. అదే పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు.
అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు. ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరి జన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్ రామ్ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృ తివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.
లాహోర్‌లో 1929 డిసెంబర్ 1న జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొంటూనే జగ్జీవన్ మరోవైపు దళిత జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. మన దేశంలో జగ్జీవన్‌ను వరించినంతగా మంత్రి పదవులు మరెవరినీ వరించలేదు. ఆయన రాజకీయ జీవితంలో విశిష్టమైన ఘటనలు కొన్ని. 1967–70లో ఆహార, వ్యవసాయ శాఖా మంత్రిగా హరిత మండలాలను అభివృద్ధి చేసి మొదటిసారి భారతదేశం ఆహార స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా చేసి, దేశాన్ని కరువు బారినుండి కాపాడారు. 1970–74లో రక్షణశాఖా మంత్రిగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసి, పాకిస్తాన్ సేనలు బేషరతుగా లొంగిపోయేలా చేశారు. జగ్జీ్జవన్ రామ్ విజయవాడ వచ్చినప్పుడల్లా తన ప్రియ మిత్రుడు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులు అయిన మా తండ్రిగారు అప్పికట్ల జోసెఫ్ గారి ఇంటిలోనే ఆతిథ్యం స్వీకరించేవారు.
దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరపురానిది. దళిత ప్రజలందరూ ఐకమత్యంతో కలిసి విద్యనూ ఆయుధంగా మలచుకొని అర్థిక స్వావలంబన సాధిం చడం, ఆత్మగౌరవంతో బతకటానికి కృషిచేయడమే ఆయనకు జాతి సమర్పించే నిజమైన నివాళి. (రేపు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి)
అప్పికట్ల వి. పటేల్, చైర్మన్, మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ‘ 99494 18222
Comments
Please login to add a commentAdd a comment