medikonduru mandal
-
అమ్మగా ఎదిగాను!
‘అమ్మా!’ అనే పిలుపును ఆస్వాదించని మహిళ ఉండదు. ఆ పిలుపును ఎన్ని గొంతులతో వింటే అంత సంతోషం. అందుకే అమ్మలేని పిల్లలకు అమ్మ అయ్యారామె. వాళ్లకు అన్న... అక్క... అమ్మమ్మ... నానమ్మలనూ ఇచ్చారు. అనాథలకు ఆశ్రయంతోపాటు అనుబంధాలనూ ఇస్తున్నారు. ఆరోగ్యరాణి సొంతూరు గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, వరగాణి. ఆమె సేవకు కేంద్రం వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల. గుంటూరు నుంచి కడపకు సాగిన సేవాప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ‘‘మా నాన్న ఆడపిల్లల చదువు కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. అదే నేను ఈ రోజు బాలికల కోసం హోమ్ నడపడానికి మూలకారణం. ఆయన కొంతకాలం టీచర్‌గా ఉద్యోగం చేసి ఊరికి దూరంగా ఉండడం ఇష్టం లేక హైదరాబాద్ నుంచి వరగాణికి వచ్చేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. బంధువులు, ఊరి వాళ్లు ‘ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఇంకా ఎంతకాలం చదువుకు పంపిస్తావ్’ అని ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఆయన అవన్నీ పట్టించుకోకుండా నన్ను, మా మేనమామ కూతురిని కూడా బీఈడీ వరకు చదివించారు. పోరుమామిళ్లకు పిలుపు! టెన్త్ క్లాస్ వరకు నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను. నేను బీఈడీ పూర్తి చేసిన టైమ్‌లో మా స్కూల్ హెడ్మిస్ట్రెస్ పోరుమామిళ్లలో ఉన్నారు. తెలిసిన వాళ్ల ద్వారా నా గురించి వాకబు చేశారట. మాథ్స్ టీచర్ అవసరం ఉందని పిలిపించారు. అలా 1994లో పోరుమామిళ్లలోని ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ స్కూల్లో మాథ్స్ అసిస్టెంట్‌గా చేరాను, ఇప్పుడు అదే స్కూల్ హెడ్మాస్ట్రిస్ని . ఆ తర్వాత ఏడాది నాకు పెళ్లయింది. మా అత్తగారు కూడా ఇదే స్కూల్లో టీచర్‌గా చేశారట. ఆ సంగతి మా పెళ్లయిన తరవాత తెలిసింది. నాకు ఈ ఊరితో ఈ స్కూల్‌తో అనుబంధం నాకు తెలియక ముందు ఏనాడో ముడిపడి ఉందనిపిస్తుంది. ఇక హోమ్ స్థాపనకు దారి తీసిన పరిస్థితులు కూడా అలాంటివే. ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు, అప్రయత్నంగా బాధ్యత తీసుకున్నాను. బాధ్యత ఇంటికి వచ్చింది! మా బంధువుల్లో ఒక పెద్దాయన కలసపా డులో తన ఇంట్లోనే పద్దెనిమిది మంది అబ్బాయిలకు ఆశ్రయం ఇచ్చేవారు. ఆయనకు వయసు మీద పడిన తరవాత ఓ రోజు మా వారి దగ్గరకు వచ్చి ‘‘వీళ్లంతా బాగా చదువుకుంటున్నారు. నాకు శక్తి తగ్గిపోయింది. ఈ పిల్లలను వాళ్ల ఊళ్లకు పంపించేస్తే చదువు ఆగిపోతుంది. వీళ్ల జీవితాలు మీ చేతిలో పెడుతున్నాను. చేయగలిగింది చేయండి’’ అన్నారు. అలా మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ అమ్మనయ్యాను. అందరికీ వండి, నేను బాక్సు పెట్టుకుని స్కూల్‌కి వెళ్లేదాన్ని. వాళ్లలో కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా హోమ్‌కి వచ్చి ఆ రోజు భోజనం స్పాన్సర్ చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే మా మామగారి పేరు మీద 2002 నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం, ఆ తరవాత మదర్ థెరెస్సా ఫౌండేషన్ పెట్టి వరదలు, సునామీ వంటి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేస్తుండేవాళ్లం. నాకు ఎక్కడికెళ్లినా చదువు లేకుండా చిన్న వయసులోనే పెళ్లితో ఇంటి బాధ్యతలు మోస్తున్న టీనేజ్ బాలికల మీద దృష్టి ఆగిపోయేది. అలాగే అమ్మానాన్నలు లేకపోవడంతో బంధువుల ఇళ్లలో ఇంటి పనులతో రోజులు వెళ్లదీస్తున్న బాలికలు కూడా. అప్పుడు మా నాన్న ఆడపిల్ల చదువు గురించి ఎంత గట్టిగా నిలబడ్డారో కళ్ల ముందు మెదిలేది. చాలామంది ఆడపిల్లలకు తమకోసం ఆలోచించేందుకు అమ్మానాన్నలు కూడా లేరు. ఒకవేళ తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఇంటి ఆడపిల్ల పరిస్థితి దయనీయంగానే ఉంటుంది. అలాంటి బాలికల కోసం పనిచేయాలని గట్టిగా సంకల్పం చెప్పుకున్నాను. ఆడపిల్లల విషయంలో ఆశ్రయం, చదువుతోపాటు భద్రత కూడా చాలా ముఖ్యం. సరిగ్గా నిర్వహించగలనా అనే సందేహం పీడించింది. అప్పుడు మా వారు ‘‘భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలి. అలా చేయకపోతే దేవుడికి ఏమని లెక్క చెప్పాలి? ధైర్యంగా మొదలు పెట్టు’’ అన్నారు. అలా 2012లో 30 మంది మా హోమ్‌కి వచ్చారు. ఈ పదేళ్లలో ఆ నంబరు 250కి దగ్గరైంది. కరోనా తరవాత కొత్త అడ్మిషన్లు తీసుకోలేదు. ఇప్పుడు 52 మంది ఉన్నారు. అనుబంధాల నిలయం! మా పిల్లల్లో ఇద్దరు ఎంబీయే చేశారు, బీటెక్ చేసి లండన్ వెళ్లారు, చాలామంది బీటెక్ చేస్తున్నారు. కొంతమంది టీచర్ ట్రైనింగ్‌లో ఉన్నారు. మా బాధ్యతగా సమాజానికి బాధ్యతగల ΄పౌరులను ఇస్తున్నాం. నేను కన్న పిల్లల్లో అబ్బాయి ఎంబీయే. మా చారిటీ హాస్పిటల్ చూసుకుంటున్నాడు. అమ్మాయి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. హోమ్‌లో పిల్లలకు నేను అమ్మని, మా అబ్బాయి అన్న, అమ్మాయి అక్క. ఇక మా అమ్మని అమ్మమ్మ, అత్తమ్మని నానమ్మ అని పిలుస్తారు. హోమ్ అంటే ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టడమే కాదు, బంధాలతో అనుబంధాలను అల్లుకోవాలి. మరొకరి ఆశ్రయంలో ఉన్నామనే భావన కలగకూడదు. అందుకే అందరం ఇదే హోమ్‌లో ఉంటాం’’ అని చెప్పారు ఆరోగ్యరాణి. - చిత్తా ఆరోగ్యరాణి, ఫౌండర్, మదర్ థెరెస్సా ఫౌండేషన్, పోరుమామిళ్ల, కడప జిల్లా – వాకా మంజులారెడ్డి ఫొటోలు: పాలకొలను వెంకటరామిరెడ్డి, సాక్షి, బద్వేల్, కడపజిల్లా -
పోరుబాటలో ఆయనది ఉక్కు సంకల్పం
స్వాతంత్య్రోద్యమంలో గర్జించిన గుంటూరు పోరాట కీర్తి.. పొట్టిశ్రీరాములు కంటే ముందే ఆంధ్రరాష్ట్రం కోసం గళమెత్తిన అమృతమూర్తి.. విశాఖ ఉక్కు కోసం పిడికిలెత్తిన ఉద్యమస్ఫూర్తి.. మహోజ్వలిత తేజం తమనంపల్లి అమృతరావు. ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శనీయం. అక్టోబర్ 21న మహనీయుని జయంత్యుత్సవం సందర్భంగా ఆయన సేవా ప్రస్థానం స్మరణీయం.. గుంటూరు: అమృతరావు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో 1920 అక్టోబర్ 21న పేద దళిత కుటుంబంలో జన్మించారు. పేదరికం వల్ల విద్యను మధ్యలోనే ఆపేశారు. సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. మహాత్మా గాంధీ పిలుపుతో 1940 దశకంలో స్వాతంత్య్రసమరంలోకి అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. గుంటూరులోని కొండా వెంకటప్పయ్య పంతులు ఇంటికి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అమృతరావును ప్రత్యేకంగా పిలిపించుకుని గంటకుపైగా మాట్లాడారట. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారట. అమృతరావు కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, నడింపల్లి తదితరులతో కలిసి బ్రిటిష్ సేనలపై వీరోచితంగా పోరాడారు. ఆంధ్రరాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది పొట్టి శ్రీరాములుకంటే ముందే అమృతరావు ఆంధ్రరాష్ట్ర సాధనకు నడుంకట్టారు. 1952 ఆగస్ట్ 2న మద్రాసు సెక్రటేరియెట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో స్పందించిన ప్రకాశం పంతులు ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద ఉద్యమం వద్దని హితవు పలికి దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత 1952 అక్టోబర్‌లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించి ప్రాణత్యాగం చేశారు. అనంతరం మహాత్ముని సిద్ధాంతాల ప్రచారానికి అమృతరావు 1959లో గాంధీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. విశాఖ ఉద్యమంలో కీలకంగా.. 1964లో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందు ప్రకటించి ఆ తర్వాత వెనక్కుతగ్గింది. దీంతో అమృతరావు విశాఖపట్నం కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ పేరుతో 21 రోజులపాటు దీక్షను నడపడం విశేషం. ఇది మహోద్యమంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారపత్రం అందజేశారు. ► అనంతరం 1978–83 వరకు తాడికొండ నియోజకవర్గం నుంచి అమృతరావు శాసన సభ్యుడిగా పనిచేశారు. ► అప్పట్లో జిల్లా కలెక్టర్ అమృతరావుకు ఇచ్చిన సుమారు 15 ఎకరాల భూమిని ఆయన పేదలకు పంచి పెట్టారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నగర్ ప్రాంతం అదే. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నూ తిరస్కరించిన నిజమైన దేశభక్తుడు అమృతరావు. ఆఖరుకు పేదరికంతోనే 1989 ఏప్రిల్ 27న ఆయన నెల్లూరులో కన్నుమూశారు. విశాఖలో విగ్రహం ఏర్పాటుచేసిన వైఎస్సార్ అమృతరావు సేవలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుత గుర్తింపునిచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.78 లక్షలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో అమృతరావు కాంస్య విగ్రహంతోపాటు ఆయన పేరుతో పార్క్‌నూ ఏర్పాటు చేశారు. 2008లో గుంటూరులోనూ అమృతరావు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది తాతగారి ఉద్యమాలను, గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తూ స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తిస్తున్నారు. గుంటూరులోని సోషల్ వెల్ఫేర్ భవనానికి అమృతరావు పేరును పెట్టాలని కోరుతున్నాం. – తమనంపల్లి మోహన్ గాంధీ గాంధీ మిషన్ అధ్యక్షులు (అమృతరావు మనవడు) గొప్ప నేతతో నా సాంగత్యం అమృతరావుతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన నిస్వార్థ ప్రజా సేవ ఎనలేనిది. ఆయన జ్ఞాపకార్థం 2008లో స్థానిక అమరావతి రోడ్డులో అమృతరావు విగ్రహాన్ని వైఎస్సార్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమృతరావును స్మరించుకోవడం సంతోషంగా ఉంది. – వింజమూరి రాజగోపాలాచారి (బాబు), సీనియర్ న్యాయవాది -
మేడికొండూరులో పోలీస్ పికెట్
మేడికొండూరు: మేడికొండూరు మండలంపై పోలీసుల ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మేడికొండూరులో ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచిత రాతలు రాసిన విషయం విదితమే. ఈ మేరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనను పోలీసులు సవాలుగా స్వీకరించి అనుచిత రాతలు రాసిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తును ప్రారంభించారు. వివాదస్పద, అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో ఉన్న పలువురు పోలీసు అధికారులు మేడికొండూరులో తిష్టవేశారు. ఈద్గా వద్ద పోలీసులకు దొరికిన కీలకమైన ఆధారంగా కేసును దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారని గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ జె.భాస్కరరావు తెలిపారు. కేసులు బనాయిస్తున్నారంటూ ఆందోళన మండల కేంద్రమైన మేడికొండూరు ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచితరాతలు రాసిన ఘటనపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేరేచర్ల ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులను, సిరిపురంకు చెందిన ముగ్గురిని, మందపాడు గ్రామానికి చెందిన ఇద్దరిని అనూమానంతో స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో తమ పిల్లలు ఏ నేరం చేశారని పోలీసు స్టేషన్ వద్ద వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విచారణ నిమిత్తంగా తీసుకొచ్చామని విచారణ పూర్తయిన అనంతరం పంపుతామని వారితో సీఐ రమేష్‌బాబు చెప్పారు.