‘అమ్మా!’ అనే పిలుపును ఆస్వాదించని మహిళ ఉండదు. ఆ పిలుపును ఎన్ని గొంతులతో వింటే అంత సంతోషం. అందుకే అమ్మలేని పిల్లలకు అమ్మ అయ్యారామె. వాళ్లకు అన్న... అక్క... అమ్మమ్మ... నానమ్మలనూ ఇచ్చారు. అనాథలకు ఆశ్రయంతోపాటు అనుబంధాలనూ ఇస్తున్నారు.
ఆరోగ్యరాణి సొంతూరు గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, వరగాణి. ఆమె సేవకు కేంద్రం వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల. గుంటూరు నుంచి కడపకు సాగిన సేవాప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు.
‘‘మా నాన్న ఆడపిల్లల చదువు కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. అదే నేను ఈ రోజు బాలికల కోసం హోమ్ నడపడానికి మూలకారణం. ఆయన కొంతకాలం టీచర్‌గా ఉద్యోగం చేసి ఊరికి దూరంగా ఉండడం ఇష్టం లేక హైదరాబాద్ నుంచి వరగాణికి వచ్చేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. బంధువులు, ఊరి వాళ్లు ‘ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఇంకా ఎంతకాలం చదువుకు పంపిస్తావ్’ అని ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఆయన అవన్నీ పట్టించుకోకుండా నన్ను, మా మేనమామ కూతురిని కూడా బీఈడీ వరకు చదివించారు.
పోరుమామిళ్లకు పిలుపు!
టెన్త్ క్లాస్ వరకు నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదివాను. నేను బీఈడీ పూర్తి చేసిన టైమ్‌లో మా స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ పోరుమామిళ్లలో ఉన్నారు. తెలిసిన వాళ్ల ద్వారా నా గురించి వాకబు చేశారట. మాథ్స్ టీచర్ అవసరం ఉందని పిలిపించారు. అలా 1994లో పోరుమామిళ్లలోని ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ స్కూల్‌లో మాథ్స్ అసిస్టెంట్‌గా చేరాను, ఇప్పుడు అదే స్కూల్ హెడ్‌మాస్ట్రిస్ని
. ఆ తర్వాత ఏడాది నాకు పెళ్లయింది. మా అత్తగారు కూడా ఇదే స్కూల్‌లో టీచర్‌గా చేశారట. ఆ సంగతి మా పెళ్లయిన తరవాత తెలిసింది. నాకు ఈ ఊరితో ఈ స్కూల్‌తో అనుబంధం నాకు తెలియక ముందు ఏనాడో ముడిపడి ఉందనిపిస్తుంది. ఇక హోమ్ స్థాపనకు దారి తీసిన పరిస్థితులు కూడా అలాంటివే. ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు, అప్రయత్నంగా బాధ్యత తీసుకున్నాను.
బాధ్యత ఇంటికి వచ్చింది!
మా బంధువుల్లో ఒక పెద్దాయన కలసపా డులో తన ఇంట్లోనే పద్దెనిమిది మంది అబ్బాయిలకు ఆశ్రయం ఇచ్చేవారు. ఆయనకు వయసు మీద పడిన తరవాత ఓ రోజు మా వారి దగ్గరకు వచ్చి ‘‘వీళ్లంతా బాగా చదువుకుంటున్నారు. నాకు శక్తి తగ్గిపోయింది. ఈ పిల్లలను వాళ్ల ఊళ్లకు పంపించేస్తే చదువు ఆగిపోతుంది. వీళ్ల జీవితాలు మీ చేతిలో పెడుతున్నాను. చేయగలిగింది చేయండి’’ అన్నారు. అలా మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ అమ్మనయ్యాను. అందరికీ వండి, నేను బాక్సు పెట్టుకుని స్కూల్‌కి వెళ్లేదాన్ని. వాళ్లలో కొంతమంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా హోమ్‌కి వచ్చి ఆ రోజు భోజనం స్పాన్సర్ చేస్తుంటారు.
ఇది ఇలా ఉంటే మా మామగారి పేరు మీద 2002 నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం, ఆ తరవాత మదర్ థెరెస్సా ఫౌండేషన్ పెట్టి వరదలు, సునామీ వంటి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేస్తుండేవాళ్లం. నాకు ఎక్కడికెళ్లినా చదువు లేకుండా చిన్న వయసులోనే పెళ్లితో ఇంటి బాధ్యతలు మోస్తున్న టీనేజ్ బాలికల మీద దృష్టి ఆగిపోయేది. అలాగే అమ్మానాన్నలు లేకపోవడంతో బంధువుల ఇళ్లలో ఇంటి పనులతో రోజులు వెళ్లదీస్తున్న బాలికలు కూడా. అప్పుడు మా నాన్న ఆడపిల్ల చదువు గురించి ఎంత గట్టిగా నిలబడ్డారో కళ్ల ముందు మెదిలేది. చాలామంది ఆడపిల్లలకు తమకోసం ఆలోచించేందుకు అమ్మానాన్నలు కూడా లేరు. ఒకవేళ తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఇంటి ఆడపిల్ల పరిస్థితి దయనీయంగానే ఉంటుంది. అలాంటి బాలికల కోసం పనిచేయాలని గట్టిగా సంకల్పం చెప్పుకున్నాను.
ఆడపిల్లల విషయంలో ఆశ్రయం, చదువుతోపాటు భద్రత కూడా చాలా ముఖ్యం. సరిగ్గా నిర్వహించగలనా అనే సందేహం పీడించింది. అప్పుడు మా వారు ‘‘భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలి. అలా చేయకపోతే దేవుడికి ఏమని లెక్క చెప్పాలి? ధైర్యంగా మొదలు పెట్టు’’ అన్నారు. అలా 2012లో 30 మంది మా హోమ్‌కి వచ్చారు. ఈ పదేళ్లలో ఆ నంబరు 250కి దగ్గరైంది. కరోనా తరవాత కొత్త అడ్మిషన్‌లు తీసుకోలేదు. ఇప్పుడు 52 మంది ఉన్నారు.
అనుబంధాల నిలయం!
మా పిల్లల్లో ఇద్దరు ఎంబీయే చేశారు, బీటెక్ చేసి లండన్ వెళ్లారు, చాలామంది బీటెక్ చేస్తున్నారు. కొంతమంది టీచర్ ట్రైనింగ్‌లో ఉన్నారు. మా బాధ్యతగా సమాజానికి బాధ్యతగల ΄పౌరులను ఇస్తున్నాం. నేను కన్న పిల్లల్లో అబ్బాయి ఎంబీయే. మా చారిటీ హాస్పిటల్ చూసుకుంటున్నాడు. అమ్మాయి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. హోమ్‌లో పిల్లలకు నేను అమ్మని, మా అబ్బాయి అన్న, అమ్మాయి అక్క. ఇక మా అమ్మని అమ్మమ్మ, అత్తమ్మని నానమ్మ అని పిలుస్తారు. హోమ్ అంటే ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టడమే కాదు, బంధాలతో అనుబంధాలను అల్లుకోవాలి. మరొకరి ఆశ్రయంలో ఉన్నామనే భావన కలగకూడదు. అందుకే అందరం ఇదే హోమ్‌లో ఉంటాం’’ అని చెప్పారు ఆరోగ్యరాణి. - చిత్తా ఆరోగ్యరాణి, ఫౌండర్, మదర్ థెరెస్సా ఫౌండేషన్, పోరుమామిళ్ల, కడప జిల్లా
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: పాలకొలను వెంకటరామిరెడ్డి, సాక్షి, బద్వేల్, కడపజిల్లా
Comments
Please login to add a commentAdd a comment