ఒంటి నిండా నగలు ధరించిన ఒక మహిళ ప్రధానమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిసిన అనంతరం వీరజవాన్ల సంక్షేమ నిధికి ఏదైనా ఇద్దామని పర్సు వంక చూశారు. పర్సులో పెద్దమొత్తం నగదు ఉన్నా.. వారి త్యాగాలకు ఇవి సరిపోవనిపించింది. వెంటనే తన ఒంటిమీద నగలన్నింటిని వలిచి ఇచ్చేసి, ఇంటికి వచ్చేశారు. ఆమే మహానటి సావిత్రి.. నటనలో మేటిగా మహోన్నత శిఖరం అధిరోహించగా.. దాతృత్వంలోనూ తన సాటి ఎవరూరారని నిరూపించారు సావిత్రి. మహానటిగా దేశవ్యాప్తంగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
రేపల్లె: మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఎడమచేతివాటం.. క్రికెట్, చదరంగం ఆటలంటే మహాప్రీతి.. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించటంలోనే దిట్ట.. ఇన్ని ఉన్నా దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం. ఆమె మరెవరో కాదు వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్ తిలగమ్ మహానటి సావిత్రి.
తీరంతో సావిత్రమ్మకున్న అనుబంధం...
అమ్మ సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మలది గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని వడ్డివారిపాలెం గ్రామమే. దీంతో గ్రామంపై మమకారం పెంచుకున్న సావిత్రి తన పెద్దమ్మ దుర్గమ్మ కోరికతో పాఠశాల స్థాపించటం, గ్రామాన్ని పలుమార్లు పర్యటించడం ఆ గ్రామంపై ఆమెకున్న మమకారాన్ని తెలుపుతోంది. సావిత్రిని సావిత్రమ్మగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటే ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయేదని ఇక్కడి ప్రజలు అంటుంటారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహం
గ్రామంలో పాఠశాల ఏర్పాటు
కుగ్రామమైన వడ్డివారిపాలెంలో మహానటి సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని వారి అభ్యున్నతికై సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. పాఠశాల స్థాపించిన సమయంలో గ్రామస్తులే కాకుండా పాఠశాల ప్రారంభోత్సవానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఆ రోజుల్లోనే వేల సంఖ్యలో రావటం విశేషం. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం.
వడ్డివారిపాలెంలోమహానటి సావిత్రి కట్టించిన పాఠశాల
సావిత్రమ్మకు తోడుగా... పాఠశాలకు అండగా...
పాఠశాల స్థాపన నాటి నుంచి సావిత్రమ్మ సంకల్పానికి గ్రామప్రజలు తోడుగా నిలిచారు. సావిత్రి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలను నిర్మాణం చేసి ఆలనా పాలనా చూసేవారు. కొంత మంది గ్రామస్తులు వడ్డి మాధవరావు, వడ్డి పెద్ద వెంకటేశ్వరరావు, వడ్డి నరసింహారావు, వడ్డి సుబ్బారావు, కొల్లాల బసవయ్య, కోట నాగేశ్వరరావు, కొట్టి దేవేంద్రరావు, వడ్డి చినవెంకటేశ్వరరావులతో పాటు మరికొందరు పాఠశాల ఆలనా పాలనకై తమ పొలాన్ని పాఠశాలకు అందజేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పాఠశాలకు అవసరమైన వ్యయాలను భరించేవారు. దీంతో పాఠశాలకు కొంత వరకు వ్యయభారాలకు తగ్గాయి.
తరు వాత ప్రభుత్వం పా ఠశాలను గుర్తించింది. అయితే ఒక సందర్భంగా ప్రభుత్వ గ్రాంటు రాకపోవటంతో ఆరు నెలలపాటు ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సావిత్రి రూ.1,04,000లు అందజేసి పాఠశాలకు అండగా నిలిచారు. ఈ మొత్తం ప్రస్తుత విలువ ప్రకారం కోటి రూపాయల పైమాటే. సావిత్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కించిన మహానటి చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్‌లు సైతం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందజేశారు.
‘నాడు–నేడు’తో మరింత అభివృద్ధి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా వడ్డీవారిపాలెం సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నపాఠశాల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. నాడు–నేడులో భాగంగా రూ.42లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశారు. నిధులతో తరగతి గదుల మరమ్మతులు, విద్యుద్ధీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు తదితర పనులు నిర్వహించగా వీటిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment