Alluri Sitarama Raju 125th Birth Anniversary
-
గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మాటామంతి.. పక్కపక్కనే కూర్చొని!
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య పలు అంశాలపై అంతరం నెలకొన్నప్పటికీ మంగళవారం వారిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడం సర్వత్రా ఆసక్తి రేపింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలో తమిళిసై, సీఎం కేసీఆర్ మాట్లాడుకుంటూ కనిపించారు. రాష్ట్రపతి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానం రాక కోసం ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న సమయంలో తమిళిసై, కేసీఆర్ ఏదో అంశాన్ని చర్చిస్తున్నట్లు కనిపించింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి సీఎం కంటే ముందే గవర్నర్ విమనాశ్రయానికి రావడం, ఆమె కూర్చున్న పక్కనే ఉన్న సోఫాలో సీఎం కూడా కూర్చొని మాట్లాడుకోవడం గమనార్హం. కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తెలుగులో ‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి President Droupadi Murmu arrived at Hakimpet Air Force Station in Hyderabad, warmly welcomed by @TelanganaCMO KCR, Governor @DrTamilisaiGuv, Union minister @kishanreddybjp and others.#Hyderabad #DroupadiMurmu #KCR pic.twitter.com/V7VRFeIU1Y — Surya Reddy (@jsuryareddy) July 4, 2023 -
అల్లూరి పోరాటం దేశానికి స్ఫూర్తిదాయకం
బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, ఆయన దేశభక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. పీడిత ప్రజల పక్షాన పోరాడి అతి చిన్న వయస్సులోనే అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం అని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే మనమంతా ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి తొలుత అల్లూరి ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి అర్పించారు. మన్యంలోని గిరిజనులకు ఇళ్లు కట్టించిన పద్మశ్రీ ఏవీఎస్ రాజు, అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని ఇచ్చిన దాత అల్లూరి సీతారామరాజులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. భీమవరంలోని అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన త్రీడీ చిత్రాన్ని ప్రదర్శించారు. కాగా తెలుగులో ‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి దేశభక్తిని యువతకు తెలియజేయాలి ‘దేశ ప్రజలందరి తరఫున అల్లూరి సీతారామ రాజుకు నివాళులర్పించడం గౌరవంగా భావిస్తున్నా. అల్లూరి గొప్ప దేశభక్తిని యువతకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సర్దార్ భగత్‌సింగ్ ఏవిధంగా ఆత్మగౌరవానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచారో..అదే రీతిలో దేశ ప్రజలకు అల్లూరి సైతం ఎప్పటికీ గుర్తుంటారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా అల్లూరి చేసిన పోరాటాలు భవిష్యత్ తరాలకు సైతం స్ఫూర్తిగా నిలిచేలా ఉన్నాయి. పర్వతాల్లో, అడవుల్లో ఉండే గిరిజనుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగల్చడంతోపాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై తెలుగులో రూపొందించిన ఓ సినిమా కోసం ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా..’ గీతం తెలుగు ప్రాంతంలోని చిన్నారులకు సైతం సుపరిచితం. బ్రిటిష్ సైన్యాన్ని పలుమార్లు ఓటమిపాలు చేయడంతోపాటు స్థానికులపై బ్రిటిష్ అధికారుల అరాచకాలపై అల్లూరి యుద్ధభేరి మోగించారు. సామాజిక అసమానతలపై అల్లూరి చేసిన పోరాటం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం. ప్రజల కష్టనష్టాలను తన కష్టాలుగా భావించిన గొప్ప నాయకుడు అల్లూరి. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఆయన వీరమరణం పొందారు. బ్రిటిష్ అధికారులు ఎంత హింసించినా మన్యం ప్రజలెవరూ ఆయన జాడ చెప్పలేదు. అంతలా ఆయన జననాయకుడయ్యారు. అలాంటి గొప్ప నాయకుడిని ఎప్పటికీ గుర్తుంచుకోవడం దేశ ప్రజలందరి బాధ్యత..’ అని రాష్ట్రపతి చెప్పారు. ‘జై అల్లూరి సీతారామరాజు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు: సీఎం కేసీఆర్ ‘అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్మాగాంధీ సైతం.. ‘అల్లూరి సీతారామరాజును నేను ప్రశంసించకుండా ఉండలేను’ అని చెప్పినట్టు పలు రికార్డుల్లో ఉంది. ఎక్కడైతే పీడన, దోపిడీ జరుగుతుందో అక్కడ దైవాంశ సంభూతులైన మహానుభావులు జన్మిస్తారన్న భగవద్గీత సందేశాన్ని నిరూపించేలా అల్లూరి సీతారామరాజు జీవితం ఉంటుంది. బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు. 26 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు జాతి వీరుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు. చివరకు చనిపోతూ కూడా ఒక్క అల్లూరి మరణిస్తే..వేలాది మంది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారంటూ స్ఫూర్తిని చాటారు. హీరో కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా..మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా..’ అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కారులో ప్రయాణించేటప్పుడు ఎక్కువసార్లు ఈ పాట వినేవాడిని. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి కిషన్‌రెడ్డికి తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలుగు వీరుడి గురించి చెప్పేందుకు తెలుగులో ప్రసంగం: గవర్నర్ తెలుగు వీరుడు అల్లూరి కీర్తిని చెప్పేందుకు తాను పూర్తిగా తెలుగులోనే ప్రసంగిస్తున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. ‘అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి. ఆయన చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. సీతారామరాజు వంటి గొప్పవారి చరిత్రలు చెప్పుకున్నప్పుడు ప్రజాస్వామ్యం విలువ మరింత తెలుస్తుంది. స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో మన్యం ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగల్చడంతో పాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దిన నాయకుడు అల్లూరి. గిరిజనుల అభివృద్ధికి వివిధ పథకాలు అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాలను అభినందిస్తున్నా..’ అని తమిళిసై పేర్కొన్నారు. సూర్య, చంద్రులు ఉన్నంత కాలం ఉండే వీరుడు: కిషన్‌రెడ్డి ‘చరిత్రను ఆవిష్కరించే మహనీయుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు విస్మరించలేని తెలుగు వీరుడు. యావత్ ప్రపంచానికి తెలుగు కీర్తిని చాటిన శూరుడు. గత ప్రభుత్వాలు విస్మరించినా..అల్లూరి సీతారామరాజును దేశం గుర్తు చేసుకునేలా ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా ఏడాదిపాటు నిర్వహించేలా చర్యలు తీసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అల్లూరి 125వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, కార్యదర్శి నానిరాజు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రపతికి విల్లు, బాణాన్ని బహూకరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతికి హకీంపేటలో గవర్నర్ డా.తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. -
నేడు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు
అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం పరిధిలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్‌నాయక్ సోమవారం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వరకు, విప్రో సర్కిల్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, గచ్చిబౌలి కూడలి నుంచి స్టేడియం వరకు ఉన్న రోడ్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఇందుకోసం వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగించాలని ఆయన సూచించారు. పోలీసులకు వాహనదారులంతా సహకరించాలని ఆయన కోరారు. –గచ్చిబౌలి -
‘అల్లూరి’ చరిత్రను భావితరాలకు చెప్పాలి
మాదాపూర్: అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని, ఆయన చరిత్రను భావితరాలకు తెలియజెప్పాలని కేంద్ర సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని సీసీఆర్టీలో శుక్రవారం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా సన్నాహక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, క్షత్రియ సేవా సమితితో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం నుంచి అల్లూరిసీతారామరాజు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సమితి సభ్యులను అభినందించారు. ఢిల్లీలోనూ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనుందన్నారు. నటుడు కృష్ణ అల్లూరి సీతారామ రాజు సినిమాను తీయకపోతే తనలాంటి వారికి ఆయన గొప్పతనం తెలిసేది కాదన్నారు. తన జీవితంలో ఎక్కువ సార్లు అల్లూరి సీతారామరాజు సినిమా చూసినట్లు తెలిపారు. ఆ పేరులోనే త్యాగం, స్ఫూర్తి, సాహసం ఉన్నాయన్నారు. భావితరాలకు కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. గిరిజనులను సంఘటితం చేసిన అల్లూరికి దక్కుతుందని, ఆయన పోరాట వీరుడే కాక ఆధ్యాత్మిక వేత్తగా పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో అనేక మార్పులను తీసుకువచ్చారన్నారు. మంచి, చెడు వివరించి వారిని సంఘటితం చేశారన్నారు. పోరాటాల్లోనూ నైతిక విలువలు పాటించారని, చెప్పి మరీ దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్లే వారన్నారు. అల్లూరి సీతారామరాజు పై కార్టూన్ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి దేశప్రధాని మోదీ, ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ము హాజరుకానుండటం సంతోషకరమన్నారు. ఏ గిరిజనుల కోసం ఆయన పోరాటం చేశాడో అదే గిరిజన మహిళ నేడు దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని, ఆయన జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ రావడం గర్వకారణమన్నారు. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సినీనటుడు మురళీమోహన్‌లతో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అల్లూరి విగ్రహావిష్కరణ: రచ్చ చేయబోయి.. చతికిలపడ్డ టీడీపీ
సాక్షి, అమరావతి: ప్రజల మద్దతు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నిత్యం వివాదాలను సృష్టించి, వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికగా రోజూ ప్రభుత్వంపై విషం కక్కే కథనాలను అల్లుతోంది. దానిపై టీడీపీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు పెట్టడం, చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు చేయడం, తాజాగా భీమవరంలో జరిగిన ప్రధానమంత్రి మోదీ పర్యటనను సైతం రచ్చ చేయాలని చూసి అభాసుపాలైంది. మన్యం వీరుడి విగ్రహావిష్కరణ సభకు గౌరవంగా పిలిస్తే.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా దానినీ వివాదం చేయడానికి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం ఆయన విగ్రహావిష్కరణ, మోదీ సభ జరిగాయి. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిని కూడా ఆహ్వానించారు. ఆ పార్టీ తరఫున అచ్చెన్నాయుడును పంపించారు. ఆహ్వానం మేరకు అల్లూరి విగ్రహావిష్కరణ ప్రాంతం, సభా ప్రాంగణానికి వెళ్లాల్సిన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు అక్కడికి కాకుండా మోదీ హెలికాప్టర్ దిగే ప్రాంతానికి వెళ్లారు. కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడి పేరు లేకపోవడంతో అధికారులు ఆయన్ని హెలిప్యాడ్ వద్దకు అనుమతించలేదు. చదవండి: (Raghu Rama Krishna Raju: కానిస్టేబుల్‌పై రఘురామ కుటుంబం దాడి) తనను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి పిలిచారని, ఎందుకు పంపరంటూ అచ్చెన్నాయుడు కొద్దిసేపు హడావుడి చేశారు. తనకు అవమానం జరిగిపోయిందంటూ ఎల్లో మీడియా ప్రతినిధులకు ఫోన్లో చెప్పారు. ఏదో ఘోరం జరిగిపోయినట్లు ఆ మీడియా ప్రచారం చేసింది. ఆ తర్వాత కూడా అచ్చెన్నాయుడు సభా ప్రాంగణానికి వెళ్లకుండా సీతారామరాజు విగ్రహం వద్దకు వెళ్లి అటు నుంచి నిష్క్రమించారు. ఇలా అసలు కార్యక్రమానికి వెళ్లకుండా మిగతా చోట్లకు వెళ్లి, తనకేదో అవమానం జరిగిపోయిందంటూ డ్రామా ఆడారు. ఇలా ఒకరికి గౌరవం ఇవ్వకుండా, ఎవరైనా గౌరవిస్తే నిలబెట్టుకోకుండా వ్యవహరిస్తోంది టీడీపీ. దూషణలు, అబద్ధాలు.. దీనికి రెండురోజుల ముందు నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు అదేపనిగా ప్రచారం మొదలెట్టారు. సీఎం జగన్, ప్రభుత్వంపై రాయలేని భాషలో యూట్యూబ్‌లో రకరకాల ప్రసారాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. టీడీపీ ప్రోత్సాహంతోనే వారు బరితెగించి వీడియోలు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని ప్రశ్నించినందుకు రాష్ట్రం తగలబడిపోతోందనే రీతిలో చంద్రబాబు వ్యవహరించడం చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. వారం క్రితం టీడీపీ నాయకుడు సీహెచ్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన సభలో సీఎం జగన్‌ను ఇష్టానుసారం సభ్య సమాజం తలదించుకొనేలా దూషించారు. అదే వేదికపై ఉన్న చంద్రబాబు చిరు నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు తప్ప వారించలేదు. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో విక్రయిస్తున్న మద్యంలో విష పదార్ధాలు ఉన్నాయంటూ ఎక్కడో ల్యాబ్‌లో పరీక్షలు చేయించామని ఒక నివేదిక విడుదల చేయడం, దాన్ని ఎల్లో మీడియాలో హైప్ చేయడం ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. రోజుకో అంశంతో రాద్ధాంతం చేయడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. ప్రజల్లో తిరగకుండా కేవలం అబద్ధాలు, అభూత కల్పనలతో వారిని మాయ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
Chiranjeevi: అల్లూరి ఖ్యాతి ప్రపంచమంతా వ్యాప్తి
సాక్షి, భీమవరం: మన్యం వీరుడు, త్యాగధనుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించడంతో అల్లూరి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరణ సభలో చిరంజీవి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనుండటం అద్భుతం, అమోఘమని కొనియాడారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు అల్లూరి అని కొనియాడారు. ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సేవాసమితి ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ఆయన పేరుతో జిల్లా ఏర్పాటుచేయడం తెలుగువారికి గర్వకారణమన్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. చిరంజీవికి సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం భీమవరంలో సభా వేదికపై చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాగా సభా వేదికపై చిరంజీవిని సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో వారిద్దరి ఆత్మీయ కలయికను చూసి జనం ఉప్పొంగిపోయారు. ముందుగా చిరంజీవి వేదికపైకి చేరుకోవడంతో సభా ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మారుమోగింది. అనంతరం వేదికపైకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడటం చూసి సభికులు మరింత ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. తిరుగులేని ప్రజానాయకుడిగా వెలుగొందుతున్న సీఎం వైఎస్ జగన్, సినిమాల్లో తిరుగులేని హీరో చిరంజీవిని ఒకే వేదికపై చూసి ప్రజలు కరతాళధ్వనులతో తమ ఆనందం వ్యక్తం చేశారు. -
CM YS Jagan: తరతరాలకు స్ఫూర్తిదాత
అగ్నికణం.. అల్లూరి లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతదేశం. అలాంటి త్యాగమూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి అనేక అగ్ని కణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఆ త్యాగధనులు, పోరాట యోధుల్లో ఓ మహా అగ్నికణమే అల్లూరి సీతారామరాజు. – సీఎం జగన్ (భీమవరం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి): తన జీవితాన్ని, తన మరణాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా విప్లవాగ్నిని రగిల్చి చిన్న వయసులోనే ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజును తెలుగుజాతి ఎన్నటికీ మరువదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశానికి స్ఫూర్తి ప్రదాత, అడవిలో కూడా అగ్గి పుట్టించిన యోధుడు, సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన సంస్కర్త, ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడిని స్మరించుకునేందుకు భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో నిర్వహించిన అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి సీఎం జగన్ సోమవారం పాల్గొన్నారు. అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఎప్పటికీ చరితార్ధుడే విప్లవజ్యోతి అల్లూరి ఘనతకు నివాళిగా ఆ మహానుభావుడు నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు. ‘దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఆయన ఎప్పటికీ చరితార్ధుడే. ఆ త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలుస్తుంది..’ అని పేర్కొన్నారు. భీమవరంలో మాదిరిగానే ఇదే రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోందని చెప్పారు. దోపిడీ లేని సమాజం కోసం.. ఒక దేశాన్ని మరో దేశం.. ఒక జాతిని ఇంకో జాతి.. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని కలలు కన్న మన స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకొంటున్నామన్నారు. మన పూర్వీకులు, సమరయోధులు వారి జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి సాధించిన స్వాతంత్య్రం అమృతంతో సమానమన్నారు. మహాయోధుడి విగ్రహ ఆవిష్కరణ కోసం భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. యాత్ర స్థలాలుగా తీర్చిదిద్దుతాం: కిషన్‌రెడ్డి తెలుగు పౌరుషానికి అల్లూరి ప్రతీకని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అల్లూరి నడయాడిన ప్రాంతాలను తీర్థయాత్ర కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అల్లూరి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులతో పాటు ఆనాడు ఆయన సైన్యంలో పనిచేసిన విప్లవ వీరుల కుటుంబాలను ప్రభుత్వం తరుఫున కలుస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా, బీజేపీ నాయకులు సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, నిర్వాహక కమిటీ ప్రతినిధులు నానిరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, భీమవరం ఏఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. అల్లూరి జయంతి ముగింపు ఉత్సవాలకు త్వరలో ఎన్నిక కానున్న కొత్త రాష్ట్రపతిని పిలుస్తామన్నారు. త్వరలో హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, ఢిల్లీ, ఒడిశాలలో అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. -
భారత్‌ను ఆపేదెవరు!
అల్లూరి సీతారామరాజు భారతదేశ సంస్కృతి, పరాక్రమం, ఆదర్శాలు, విలువలకు ప్రతీక. ఆదివాసీల హక్కులు, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం చిరుప్రాయంలోనే తన జీవితాన్ని దేశమాతకు అర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా ముందుకెళ్లడంలో అల్లూరి జీవితాన్ని యువత ప్రేరణగా తీసుకోవాలి. – ప్రధాని నరేంద్ర మోదీ లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి స్వతంత్ర భారతదేశం. అలాంటి త్యాగమూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఆ త్యాగధనులు, పోరాట యోధుల్లో ఓ మహా అగ్నికణమే అల్లూరి సీతారామరాజు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అలనాడు అల్లూరి చూపిన సాహసం స్ఫూర్తితో 130 కోట్ల మంది ప్రజలంతా కలసికట్టుగా ‘దమ్ముంటే మా భారత్‌ను ఆపండి’ అనే నినాదంతో సవాళ్లను ఎదుర్కొంటూ పురోగమిస్తే మన దేశాన్ని ఎవరూ నిలువరించలేరని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆనాటి పోరాటాలకు దేశ యువత నాయకత్వం వహించిన మాదిరిగానే ఆధునిక భారత్‌లోనూ యువత సరికొత్త అవకాశాలు, ఆలోచనలు, మార్గాలను అన్వేషిస్తూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. స్వాత్రంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సమరయోధులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా అల్లూరి 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు సోమవారం భీమవరం వచ్చిన ప్రధాని స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. అల్లూరి జయంతి వేడుకలు, రంప తిరుగుబాటు ఉద్యమం 100 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. అల్లూరి జన్మస్థలమైన పాండ్రంగి జీర్ణోద్ధరణ, చింతపల్లి పోలీస్ స్టేషన్ పునర్ నిర్మాణం, మోగల్లులో అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని రిమోట్ విధానంలో ఆవిష్కరించారు. పెద అమిరం వద్ద నిర్వహించిన బహిరంగసభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘మనదే రాజ్యం’... వందేమాతరం స్వాతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాతగా నిలిచి తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా.. అంటూ పౌరుషాన్ని రేకెత్తించిన తెలుగు జాతి యుగపురుషుడు, మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేలపై కలుసుకోవడం అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘మనదే రాజ్యం..’ అంటూ అల్లూరి ఇచ్చిన నినాదం వందేమాతరం నినాదంతో సరితూగుతుందన్నారు. మన్యం వీరుడు అల్లూరి బ్రిటీషు వారికి ఎదురొడ్డి ‘మీకు చేతనైతే నన్ను నిలువరించండి..’ అంటూ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారన్నారు. యాధృచ్ఛికమే అయినా.. ప్రస్తుతం దేశం ముందున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడంలో అలనాడు అల్లూరి చూపిన సాహసం స్ఫూర్తితో సాగితే ఎవరూ నిలువరించలేరని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమన్న మన సంస్కృతికి అల్లూరి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, రంప తిరుగుబాటుకు వందేళ్లు పూర్తి అవుతుండడం, అదే సమయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు యాధృచ్ఛికంగా కలసి వచ్చాయన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడి కుటుంబ సభ్యులను కలుసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన్యం వీరుడు అల్లూరికి ప్రధాని నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్.. దేశభక్తుల గడ్డ ఆంధ్రప్రదేశ్ దేశ భక్తుల గడ్డ, వీరుల నిలయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యతోపాటు కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు, వీరులు పుట్టిన నేల అని కొనియాడారు. ఇక్కడ పుట్టిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంగ్లేయులపై పోరాడిన గొప్ప యోధుడని గుర్తు చేస్తూ వారి కలలను నెరవేర్చడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. వారు కలలుగన్నట్టుగా పేదలు, రైతులు, శ్రామికులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు.. అందరికీ సమాన అవకాశాలు లభించేలా మన ఆధునిక భారతదేశం ఉండాలన్నారు. ఎనిమిదేళ్లుగా తమ ప్రభుత్వం ఆ దిశగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. సీఎం జగన్‌తో ముచ్చటిస్తున్న ప్రధానమంత్రి ఎన్నో త్యాగాల ఫలం.. స్వాతంత్య్ర పోరాటం అనేది కొద్ది సంవత్సరాలో, కొన్ని ప్రాంతాలో లేక కొద్ది మంది వ్యక్తుల చరిత్ర మాత్రమే కాదని.. దేశ నలుమూలలా అనేక మంది త్యాగాలు, ధృడ సంకల్పం, సాహసాల ఫలితమని ప్రధాని అభివర్ణించారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర భిన్నత్వంలో ఏకత్వాన్ని పోలి ఉంటుందన్నారు. మహనీయుల త్యాగ ఫలాలను ఈ తరానికి గుర్తు చేసేందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లంబసింగిలో స్మారక మ్యూజియం దేశంలోనే తొలిసారిగా ఆదివాసీల గౌరవాన్ని, వారసత్వాన్ని కళ్లకు కట్టేలా అరకు సమీపంలోని లంబసింగిలో అల్లూరి సీతారామరాజు స్మారక ఆదివాసీ స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం నిర్మించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆజాదీ కా ఆమృత్ మహోత్సవ్ స్ఫూర్తికి అవి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. బిర్సా ముండా పుట్టిన రోజైన నవంబర్ 15వ తేదీని ‘రాష్ట్రీయ జన్ జాతీయ గౌరవ్ దివస్’గా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. సినీ నటుడు చిరంజీవితో ప్రధాని కరచాలనం వన ఉత్పత్తులపై ఆదివాసీలకే హక్కులు.. ఆదివాసీల కళలు, నైపుణ్యాలకు గుర్తింపు కల్పించేలా ‘స్కిల్ ఇండియా మిషన్’ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దశాబ్దాల నాటి పాత చట్టాలను సవరించి వన ఉత్పత్తులపై ఆదీవాసీలకే హక్కులు కల్పించామని చెప్పారు. కనీస మద్దతు ధరకు సేకరించే అటవీ ఉత్పత్తులను తమ ప్రభుత్వం 12 నుంచి 90కి పెంచిందన్నారు. ఆదివాసీల ఉత్పత్తులు, కళాకృతులతో 3,000 వన గణ వికాస్ కేంద్రాలు, 50,000కిపైగా వన గణ స్వయం సహాయ çసంఘాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదువుకునేలా ప్రోత్సహిస్తూ 750కిపైగా ఏకలవ్య పాఠశాలలను నెలకొల్పామన్నారు. కొత్త జాతీయ విద్య విధానం ద్వారా మాతృభాషలో విద్యా బోధనను ప్రోత్సహించడం ఆదివాసీలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. అల్లూరికి 125 మంది ‘మన్యం వీరుల’ నివాళి పెద్దాపురంలో అల్లూరి వేషధారణలో ర్యాలీ నిర్వహిస్తున్న చిన్నారులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పెద్దాపురంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. పెద్దా, చిన్నా కలిసి 125 మంది అల్లూరి వేషధారణలో భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రజానాట్య మండలి, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్, మన పెద్దాపురం ఫేస్బుక్ టీం, ఎస్ఎంఎస్, పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు. – పెద్దాపురం -
వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే: కేటీఆర్
కవాడిగూడ: వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని, అందుకే అల్లూరి సీతారామరాజు జయంతిని తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీతారామరాజు 125వ జయంతిని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సోమవారం ట్యాంక్‌బండ్‌పై అధికారికంగా నిర్వహించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, నవీన్‌లు ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జల్ జమీన్ జంగల్ కోసం కొము రం భీమ్ పోరాడారని, అల్లూరి కూడా బ్రిటిష్ పాలకులతో పోరాడి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. క్షత్రియుల కోసం కేసీఆర్ మూడు ఎకరాల భూమిని కేటాయించారని, త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసుకోవాలని, దానికి అల్లూరి పే రు పెట్టడమే సముచితమని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ సీఎం అయిన తరువాతే వైతాళికులను గౌరవించుకోవ డం మొదలైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు వర్మ, శ్యామలరాజు, మైనర్ రాజు, రామరాజు, వరదరాజులు, ఆఫ్గన్ రామరాజు, జోనల్ కమిషనర్ శ్రీనివా స్‌రెడ్డి, ముషీరాబాద్ సర్కిల్ 15 ఏఎంహెచ్‌వో మైత్రేయి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నాయకులు బీఎన్ రెడ్డి, తలసాని సాయికిరణ్, ముఠా జైసింహతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి అభిమానులు పాల్గొన్నారు. -
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం (ఫొటోలు)
-
ఎర్ర మిరపకాయల గుత్తి.. బ్రిటిషర్ల హడల్..
రంపచోడవరం: ఆంగ్లేయుల అకృత్యాలపై విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలో గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్స్టేషన్లపై వరస దాడులు చేశారు. దాడులు చేయడంలో అల్లూరి తెగింపే వేరు. ముందుగానే దాడులు చేస్తున్నట్లు బ్రిటిష్ సైన్యానికి హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఎర్ర మిరపకాయల గుత్తితో పోలీస్‌స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ సైనికులు హడలెత్తిపోయేవారు. పైడిపుట్ట వద్ద నివాసం బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవాగ్నిని రగిలించిన సీతారామరాజు.. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద కొంతకాలం నివాసం ఉన్నారు. 1922లో ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కృష్ణదేవీపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను కొల్లగొట్టి దాడి చేసినట్లు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి తర్వాత కొంత సమయం తీసుకోవడంతో తమకు సీతారామరాజు భయపడ్డాడని బ్రిటిష్ అధికారులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. అడ్డతీగల స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగిలోని తెల్లమద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యుహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్లు లేఖ ఉంచారు. ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకునే సమయంలో అనేక గ్రామాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రంపచోడవరానికి సమీపంలోని రంప గ్రామాన్ని ఆయన సందర్శించారు. అక్కడ గిరిజనులతో సమావేశమయ్యారు. 1880లో జరిగిన రంప పితూరి గురించి మాట్లాడారు. గిరిజనులతో సమావేశం అనంతరం రంప జలపాతంలో స్నానం చేసి.. రంపలోని కొండపై, కొండ దిగువన శివాలయాల్లో పూజలు చేసి వెళ్లిపోయారు. (క్లిక్: అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు) -
స్వాతంత్ర్య సమరయోధుడి కుమార్తెకు పాదాభివందనం చేసిన మోదీ!
సాక్షి పశ్చిమగోదావరి జిల్లా: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ సమరయోధుడి కుమార్తె 90 ఏళ్ల పసల కృష్ణ భారతిని కలవడమే కాకుండా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు ఆమె సోదరి, మేనకోడలు వద్ద నుంచి కూడా మోదీని ఆశీర్వదాలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించిన పసల కృష్ణమూర్తి 1921లో తన సతీమణితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాది అయిన ఆయన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన 1978లో కన్నుమూశారు. ఈ మేరకు మోదీ ఏపీలో పర్యటించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. (చదవండి: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ) -
అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భీమవరం అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. చదవండి: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని మోదీ సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... మహా యోధుడి విగ్రహావిష్కరణ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి భీమవరం వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గారికి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవి గారికి, ఇతర పెద్దలకు మిత్రులందరికీ సభాధ్యక్షుడి హోదాలో సాదర స్వాగతం పలుకుతున్నాను. అందరికీ హృదయ పూర్వక స్వాగతం... నా అన్నదమ్ములకు, అవ్వాతాతలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని మనమంతా ఇవాళ ఏకమయ్యాం. ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్య్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం. మన స్వాతంత్య్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దానర్ధం మనల్ని మనం పాలించుకోవడం ప్రారంభమై ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. మన గడ్డమీద మన పూర్వీకులు మన స్వాతంత్య్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్య్రం అమృతంతో సమానం. ఇది ఈ అజాదీ కా అమృత్ అనే పదానికి అర్ధం. 75 ఏళ్ల క్రితం వరకు జరిగన మన దేశ స్వాతంత్య్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు.. అంటే దాదాపు 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే.. పరాయి దేశాల, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే... అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది ప్రాణత్యాగాల ఫలితం.. లక్షల మంది తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన భారతదేశం. అటువంటి మహా త్యాగ మూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. మహా అగ్నికణం అల్లూరి అటువంటి త్యాగధనుల్లో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని... ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తున్నాను. అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు, సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన సంస్కర్త. భావాల పరంగా ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడు. ఈ 125 వ జయంతి సందర్భంగా.. ఆ అల్లూరిని స్మరించుకునేందుకు మన ప్రధామంత్రి సమక్షంలో మనమంతా ఈరోజు సమావేశమయ్యాం. తెలుగుజాతికి, భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత... తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే... ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం. తన జీవితం, మరణం కూడా సందేశమే.. ఇక్కడ (భీమవరంలో)ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్ధుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిల్చిపోతుంది. అమర్ రహే అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు జైహింద్ అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ దేశభక్తుడి జయంత్యుత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని సంకల్పించడం తెలుగు ప్రజల ఆకాం క్షను గౌరవించడమే! మన్నెం వీరుని పోరుగడ్డను అల్లూరి సీతా రామరాజు జిల్లాగా ప్రకటించి ఆ మహనీయుడికి నివాళులర్పించి, మన్నెం వాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఈ విప్లవ జ్యోతి పురిటిగడ్డలో 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ముదావహం. బ్రిటిష్ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన సీతా రామరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం. చిన్నప్పటి నుంచీ ఆయనకు దైవభక్తీ, దేశభక్తీ మెండుగా ఉండేవి. విశాఖ, గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశాడు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేయటం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధవ్యూహాలు... బ్రిటీష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించే వాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే రోజు, అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్ సైన్యాన్ని సమర్థంగా ఎదిరించి పోరాడా లంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చు కోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిగా మన్యంలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌ను ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహోజ్వల ఘట్టం చోటు చేసుకున్నది. కత్తులు, బల్లేలు, సాంప్రదాయ విల్లంబులు ధరించిన దాదాపు 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీసు స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండి పోయారు. ఆయుధ సంపత్తినంతటినీ స్వాధీనం చేసుకొని వాటి వివరాలన్నింటినీ స్టేషన్ డైరీలో నమోదు చేసి అల్లూరి స్వయంగా సంతకం చేశారు. తరువాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌పైనా దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవటం బ్రిటిష్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తిచెంది దేశ భక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది. 1922 నుంచి యుద్ధసన్నాహాలలో పూర్తిగా నిమగ్నమై గంటందొర, మల్లుదొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ రూథర్‌ఫర్డ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టసాగారు. 1922 సెప్టెంబర్ 3వ తేదీన నర్సీపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంజేరి కొండవాలుల్లో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బ్రిటిష్ పోలీసులపై దాడిచేసి తరిమి వేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్ కవర్ట్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. కవర్ట్లాంటి వారు ఈ యుద్ధంలో మరణించారు. అల్లూరిని నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్ సైన్యం తెరతీసింది. విప్లవ కారులను, వారికి సహాయపడే వారిని అణ చివేసేందుకు, సహాయ నిరాకరణ చేసే వారిని శిక్షించేందుకు విశాఖలో ప్రత్యేక ట్రిబ్యు నల్ ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారనే మిషతో ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో అమాయక గిరిజనులను తీసుకెళ్లి... ట్రిబ్యునల్‌లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడటానికి ఇష్టపడని రాజు చివరికి లొంగిపోవాలనుకున్నాడు. ఈ దశలో మే 6వ తేదీన మంప గ్రామంలో జమేదారు కుంచుమీనన్ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్‌వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు శౌర్యపరాక్రమాలు, త్యాగనిరతి భారతజాతికి ఆదర్శనీయం. (చదవండి: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...) - పెన్మెత్స శ్రీహరిరాజు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి) -
అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
-
Alluri Sitarama Raju: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...
సన్యసించి విప్లవకారులుగా మారిన ఇద్దరే ఇద్దరు యోధులు భారతీయ స్వాతంత్య్ర సమరంలో కనిపిస్తారు. అందులో ఒకరు అరవింద్ ఘోష్ అయితే, మరొకరు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అమాయకులైన ఆదివాసీలపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు చేస్తున్న దోపిడీ రాజును కదిలించింది. ఇల్లు వదలి సన్యాసిలా దేశాటన చేసి వచ్చిన సీతారామరాజు చివరికి మన్యంలో విప్లవ శంఖాన్ని పూరించిన వైనం అపూర్వం. అటువంటి వీరుని 125 జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నారు. ఇదే సందర్భంలో భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని స్వహస్తాలతో ఆవిష్కరించి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్‌ల కోవకు చెందిన మహావీరుడు. అమాయకులు, విద్యా విహీనులైన కొండ జాతి ప్రజ లను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్ ఘోష్, అల్లూరి సీతారామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు. నేడు సీతా రామరాజు 125వ జయంతి. ఈ సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి నేడు ఆవిష్కరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామ వాస్తవ్యులు అల్లూరి వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ మొదటి సంతానంగా 1897 జూలై 4వ తేదీన రాజు జన్మించారు. ఈయన అసలుపేరు శ్రీరామరాజు. ఆయన తండ్రి రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్‌గా స్థిర పడ్డారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరుగుతున్న సమ యంలో 1908లో ఆయన కలరా వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి సీతారామరాజు తాసీల్దారైన పినతండ్రి రామకృష్ణంరాజు సంరక్షణలో పెరిగాడు. చదువుపై కన్నా ఆయనకు సన్యాసం, ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే పినతండ్రి మందలించాడు. దీంతో ఆయన ఇల్లు వదలి వెళ్లిపోయాడు. పలువురిని ఆశ్రయించి జ్యోతిషం, వాస్తు శాస్త్రం అభ్యసించాడు. సంస్కృత భాషపై పట్టు సాధించాడు. ఇచ్ఛాపురం నుండి కాలినడకన కలకత్తా చేరాడు. కలకత్తా వీధుల్లో వెళుతుండగా అప్పటి అగ్ర స్వాతంత్య్ర సమర యోధుల్లో ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ నిత్యార్చన చేసి, తనతో సహపంక్తి భోజనం చేసే ఒక అతిథి కొరకు ఇంటి బయటికి వచ్చి వెతుకుతుండగా ఎదురుగా రాజు కనిపించాడు. సీతారామరాజును భోజనానికి ఆహ్వానించాడు. అక్కడే 10 రోజులు బెనర్జీ కోరిక మేరకు రాజు ఉండిపోయాడు. ఆ సమయంలో బెనర్జీ ఇంటికి వచ్చిన మోతీలాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులతో రాజు దేశ పరిస్థితుల గురించి చర్చించాడు. అక్కడినుండి కాశీ, హరిద్వార్, రుషీకేశ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలు దర్శించి 1917 జూలై 24న విశాఖ జిల్లా కృష్ణదేవిపేట చేరాడు. దారకొండపై తపస్సుకు వెళ్తున్న రాజును చిటికెల భాస్కరుడు అనే గ్రామ పెద్ద చూసి, విషయం తెలుసుకుని తపస్సుకు ఆ గ్రామంలోనే అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రజలకు జ్యోతిషం, పురాణాలు, ఆయుర్వేద వైద్యంతో దగ్గరయ్యాడు. అధికారుల దోపిడీని ఎదుర్కొనమని వారిని ప్రోత్సహిం చాడు. వారిలో జాతీయతాభావం రగుల్కొలిపి, ప్రభుత్వ కోర్టులకు పోవద్దనీ, పంచాయతీ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడే తగవులు తీర్చుకోమనీ; మద్యం సేవించరాదనీ, ఖద్దరు బట్టలనే ధరించమనీ బోధించాడు. డిప్యూటీ తాసీల్దారు బాస్టియన్, ఓవర్సీరు సంతానం పిళ్ళై చేస్తున్న అరాచకాలను పై అధికారులకు మహజర్ల రూపంలో పంపేవాడు. ఈ మన్య ప్రాంతంలో గతంలో కొన్ని పితూరీలు, దోపిడీలు జరిగాయి. దానితో ప్రభుత్వానికి రాజుపై అను మానం కలిగి డివిజనల్ మేజిస్ట్రేట్ ఫజులుల్లా ఖాన్‌ను ఎంక్వయిరీ చేయమని పంపారు. రాజు పినతండ్రికి ఖాన్ సహోద్యోగి. సీతారామరాజును నర్సీపట్నం తీసుకుని వెళ్లి తాసీల్దారు ఇంటిలో పెట్టి కృష్ణదేవిపేట వెళ్లవద్దని సలహా ఇచ్చాడు. ఉద్యోగం గానీ, వ్యవసాయ భూమి గానీ తీసుకోమని ఒత్తిడి చేశాడు. సీతారామరాజు ప్రభుత్వ దృష్టిని మళ్ళించటానికి ‘పైడిపుట్ట’లో ఇచ్చిన భూమిని తీసుకున్నాడు. ప్రజల సమస్యలు తీర్చటానికి తిరుగుబాటే ఏకైక మార్గమని భావించి దానికి రహస్యంగా తగిన ఏర్పాట్లు చేయసాగాడు. ప్రభు త్వంపై తిరుగుబాటుకు ఉత్సాహం చూపించిన సుమారు 200 మంది యువకులను 1922 ఆగస్టు 15న శరభన్నపాలెంలో సమావేశపరచి వారిచే ప్రమాణం చేయించాడు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడితో ప్రారంభమైన విప్లవం 1924 మే నెల వరకు అనేక విజయాలతో, బహుకొద్ది అపజయాలతో కొనసాగింది. ప్రభుత్వం 20 మంది యూరోపియన్ ఉన్నతాధికారులను, 1,500 మంది పైగా ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీసు, మలబారు స్పెషల్ పోలీసులను నియ మించి ఉద్య మాన్ని అణచే ప్రయత్నం చేసింది. ఆనాడు జిల్లా యంత్రాంగం– మద్రాస్ ప్రభుత్వం – ఢిల్లీకి మధ్య జరిగిన రహస్య తంతివార్తలు కొన్ని గమనిస్తే విప్లవం గురించి ప్రభుత్వం చెందిన ఆందోళన తెలుస్తుంది. ఢిల్లీ హోమ్ సెక్రటరీకి మద్రాస్ చీఫ్ సెక్రటరీ రాస్తూ, ‘‘రాజు నాయకత్వాన ప్రారంభమైన విప్లవం 18 నెలలు జరిగినా... అనేక రిజర్వు దళాలను పంపి కూడా అణచలేక పోయాం. సమీపంలో అంతమవుతుందని నమ్మకం లేదు. ఉన్నత న్యాయస్థానం కూడా దీనిని బ్రిటిష్ చక్రవర్తిపై యుద్ధంగానే గుర్తిం చింది’’ అని వాపోయాడు. ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ 1922 అక్టోబర్ 24న మద్రాస్‌కు తంతి పంపుతూ, ‘‘సీతారామరాజు గూఢచర్య చర్యలు అమోఘం. మన దళం బయలుదేరిన వెంటనే ఆ సమాచారం అతనికి చేరుతోంది. మనకు అందే సమాచారమంతా మనల్ని తప్పుదోవ పట్టించడానికి రాజు పంపుతున్న వార్తలే’’ అని పేర్కొన్నాడు. మద్రాస్ స్టాఫ్ కెప్టెన్ బిషప్, ఢిల్లీ హోం సెక్రటరీకి రాస్తూ... ‘‘రెండేళ్ల నుంచి విప్లవం నిరా ఘాటంగా సాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా పదేళ్లయినా కొనసాగుతుంది. అకస్మాత్తుగా అనుకోని పరిస్థితులు విప్లవకారులకు ఎదురైతే తప్ప ఈ విప్లవం ఆగడం కలలోని మాట. అందువల్ల వెంటనే మార్షల్ లా గానీ, గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్ గానీ ప్రకటిం చాలి’’ అని చెప్పాడు. ఈ విధంగా ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సమయంలో రూథర్‌ఫర్డ్ అనే నరరూప రాక్షసుడిని ఏజెన్సీ కమిషనర్‌గా నియ మించారు. అతను రాజుకు సహాయం చేస్తున్న వారిని అనుమానించి 58 మంది గ్రామ మునసబులనూ, ముఠాదారులనూ అరెస్టు చేసి రుషికొండ జైలులో బంధించాడు. రాజు ఆచూకీ తెలపండని స్త్రీలను, పిల్లలను చిత్రహింసలు పెట్టించాడు. 1924 మే మొదటి వారంలో కృష్ణదేవి పేటలో రూథర్‌ఫర్డ్ మీటింగ్ పెట్టి పరిసర గ్రామ పెద్దలను హెచ్చరిస్తూ, వారం రోజులలో రాజు దళాన్ని పట్టి ఇవ్వకపోతే కృష్ణ దేవిపేటతోపాటు అనేక గ్రామాలను తగులబెడు తామనీ, చిటికెల భాస్కరుడితో సహా, పెద్దలను జైళ్లలో వేస్తామనీ హెచ్చరించాడు. రాజుకు కృష్ణదేవిపేట అన్నా, చిటికెల భాస్కర్ కుటుంబం అన్నా ఎన లేని అభిమానం అని రూథర్‌ఫర్డ్‌కు తెలిసే ఈ హెచ్చరిక చేశాడు. ప్రభుత్వం తనను ఎదుర్కొనలేక, ప్రజలను పెడుతున్న బాధలను చూసి రాజు బాధపడ్డాడు. అందుకే 1924 మే7వ తేదీన కుంచు మీనన్ నాయకత్వంలోని స్పెషల్ పోలీసు దళానికి ఒక బాలుని ద్వారా కబురు పంపి ‘మంప’ గ్రామంలో లొంగి పోయాడు. సీతారామరాజును బంధించి కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల్ దగ్గరకు తీసుకువెళ్లారు. రాజుతో గూడాల్ ఘర్షణపడి రాజును తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక మహోద్యమం పరిసమాప్తం అయింది. సీతారామరాజు దేశభక్తి, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ జాతిని మేల్కొలుపుతూనే ఉంటుంది. వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకామాత్యులు