సాక్షి, అమరావతి: ప్రజల మద్దతు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నిత్యం వివాదాలను సృష్టించి, వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికగా రోజూ ప్రభుత్వంపై విషం కక్కే కథనాలను అల్లుతోంది. దానిపై టీడీపీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు పెట్టడం, చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు చేయడం, తాజాగా భీమవరంలో జరిగిన ప్రధానమంత్రి మోదీ పర్యటనను సైతం రచ్చ చేయాలని చూసి అభాసుపాలైంది. మన్యం వీరుడి విగ్రహావిష్కరణ సభకు గౌరవంగా పిలిస్తే.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా దానినీ వివాదం చేయడానికి ప్రయత్నించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం ఆయన విగ్రహావిష్కరణ, మోదీ సభ జరిగాయి. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిని కూడా ఆహ్వానించారు. ఆ పార్టీ తరఫున అచ్చెన్నాయుడును పంపించారు. ఆహ్వానం మేరకు అల్లూరి విగ్రహావిష్కరణ ప్రాంతం, సభా ప్రాంగణానికి వెళ్లాల్సిన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు అక్కడికి కాకుండా మోదీ హెలికాప్టర్ దిగే ప్రాంతానికి వెళ్లారు. కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడి పేరు లేకపోవడంతో అధికారులు ఆయన్ని హెలిప్యాడ్ వద్దకు అనుమతించలేదు.
చదవండి: (Raghu Rama Krishna Raju: కానిస్టేబుల్‌పై రఘురామ కుటుంబం దాడి)
తనను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి పిలిచారని, ఎందుకు పంపరంటూ అచ్చెన్నాయుడు కొద్దిసేపు హడావుడి చేశారు. తనకు అవమానం జరిగిపోయిందంటూ ఎల్లో మీడియా ప్రతినిధులకు ఫోన్‌లో చెప్పారు. ఏదో ఘోరం జరిగిపోయినట్లు ఆ మీడియా ప్రచారం చేసింది. ఆ తర్వాత కూడా అచ్చెన్నాయుడు సభా ప్రాంగణానికి వెళ్లకుండా సీతారామరాజు విగ్రహం వద్దకు వెళ్లి అటు నుంచి నిష్క్రమించారు. ఇలా అసలు కార్యక్రమానికి వెళ్లకుండా మిగతా చోట్లకు వెళ్లి, తనకేదో అవమానం జరిగిపోయిందంటూ డ్రామా ఆడారు. ఇలా ఒకరికి గౌరవం ఇవ్వకుండా, ఎవరైనా గౌరవిస్తే నిలబెట్టుకోకుండా వ్యవహరిస్తోంది టీడీపీ.
దూషణలు, అబద్ధాలు..
దీనికి రెండురోజుల ముందు నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు అదేపనిగా ప్రచారం మొదలెట్టారు. సీఎం జగన్, ప్రభుత్వంపై రాయలేని భాషలో యూట్యూబ్‌లో రకరకాల ప్రసారాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. టీడీపీ ప్రోత్సాహంతోనే వారు బరితెగించి వీడియోలు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని ప్రశ్నించినందుకు రాష్ట్రం తగలబడిపోతోందనే రీతిలో చంద్రబాబు వ్యవహరించడం చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు.
వారం క్రితం టీడీపీ నాయకుడు సీహెచ్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన సభలో సీఎం జగన్‌ను ఇష్టానుసారం సభ్య సమాజం తలదించుకొనేలా దూషించారు. అదే వేదికపై ఉన్న చంద్రబాబు చిరు నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు తప్ప వారించలేదు. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో విక్రయిస్తున్న మద్యంలో విష పదార్ధాలు ఉన్నాయంటూ ఎక్కడో ల్యాబ్‌లో పరీక్షలు చేయించామని ఒక నివేదిక విడుదల చేయడం, దాన్ని ఎల్లో మీడియాలో హైప్ చేయడం ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. రోజుకో అంశంతో రాద్ధాంతం చేయడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. ప్రజల్లో తిరగకుండా కేవలం అబద్ధాలు, అభూత కల్పనలతో వారిని మాయ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment