వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fire On CM Chandrababu TDP Govt Over Illigal Cases On YSRCP Social Media Activists: AP | Sakshi
Sakshi News home page

వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపు: వైఎస్‌ జగన్‌

Published Sun, Nov 10 2024 4:01 AM | Last Updated on Sun, Nov 10 2024 9:54 AM

YS Jagan Fire On CM Chandrababu TDP Govt Over Illigal Cases On YSRCP Social Media Activists: AP

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు 

ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే పన్నాగం 

ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలతో ప్రజల్లో అశాంతిని రేపే చర్యలు 

మీ తప్పులను నిలదీస్తున్న వారిపై చట్టవిరుద్ధంగా అక్రమ కేసులా?

మీ అడుగులకు మడుగులొత్తే పోలీసుల ద్వారా వారిపై భౌతికదాడులా? 

ఒక చేత్తో మీడియా, మరో చేత్తో వ్యవస్థలను పెట్టుకుని నేరాలు చేస్తున్నది ఎవరు? 

ఇక మీకు కొరుకుడు పడనిది సోషల్‌ మీడియా మాత్రమే.. ఇప్పుడు దానిపై కన్ను 

మీరే అబద్ధాలు సృష్టిస్తారు.. మీరే వాటికి రెక్కలు తొడిగి విష ప్రచారం చేస్తారు   

ఇవన్నీ వ్యవస్థీకృత నేరాలు కావా? అరెస్టు చేయాల్సింది మిమ్మల్ని కాదా?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరాలు)తో కూడిన పాలిటిక్స్‌ (రాజకీయాలు) సాగిస్తూ చంద్రబాబు మరింతగా బరి తెగించారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లో మీడియా మోయడం.. ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయని ఎత్తి చూపారు. సోషల్‌ మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

దొంగే ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైం కాదా?  

ఎలాగూ చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. కాస్తోకూస్తో ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బ తీశారు. కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనీయకుండా పలుమార్లు కట్‌ చేశారు. ఇక చంద్రబాబుకు కొరుకుడుపడనిది ఒకే ఒక్కటి. అదే సోషల్‌ మీడియా.  అందుకే చంద్రబాబు ఇలా బరితెగిస్తున్నారు. ఇలా ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ చూస్తూనే ఉన్నాం. మరి ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌కు పాల్పడుతున్నది ఎవరు?  

ప్రజలకు మంచిచేసి కాకుండా, మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు  సిద్ధాంతం. దీనికోసం చంద్రబాబుగారు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపచేస్తారు. దానిపైనే వారి పార్టీనాయకులచేత మాట్లాడిస్తారు. పనిలోపనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్నవారినికూడా దీనికి వాడుకుంటారు.

ఆ తర్వాత డిబేట్లు చేయిస్తారు. దీనికి మరిన్ని అవాస్తవాలు జోడించి తన కుమారుడు లోకేశ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే మీడియా ట్రయల్‌ చేసి, వాళ్లే దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు విధిస్తారు. ఒక పథకం ప్రకారం, మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతరం ప్రయతి్నస్తూనే ఉంటారు. మరి ఇది వ్యవస్థీకృత నేరం కాదా?

అయ్యా చంద్రబాబూ, మీ పార్టీ టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్లో మీరే ఫేక్‌ న్యూస్‌పెట్టి, దాన్ని మీరే ప్రొపగండా చేసిన లేటెస్ట్‌ ట్వీట్‌ను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అయితే, అప్పటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి, లేటెస్ట్‌గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు ట్వీట్‌లో పెడుతూ, నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన రీతిలో వ్యక్తిత్వ హననానికి నువ్వు దిగావు.

దీన్ని ఖండిస్తూ మా అమ్మ లేఖ రాస్తే దాన్నికూడా ఫేక్‌ లెటర్‌గా పేర్కొంటూ నువ్వు పబ్లిసైజ్‌ (ప్రచారం) చేయడం సిగ్గుమాలిన చర్య కాదా? మళ్లీ మా అమ్మ వీడియో మెసేజ్‌ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టింది. ఇంతలా ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇలాంటివి శతకోటి మీ ఏబీఎన్, మీ ఈనాడు, మీ టీవీ–5, మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? నువ్వు చేస్తే ఏదైనా మంచే! కాని నువ్వు చేసిన తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరైనా ప్రశి్నస్తే అది చెడు అవుతుందా? వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా? 

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌తోకూడిన పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డూ వ్యవహారం వరకూ జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లోమీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చర్యలు, కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయి. మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని?  జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? చంద్రబాబుకు కాదా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement