మంగళవారం హైదరాబాద్‌లో అల్లూరి జయంతి వేడుకల్లో విల్లు ఎక్కుపెట్టిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు.
– సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, ఆయన దేశభక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. పీడిత ప్రజల పక్షాన పోరాడి అతి చిన్న వయస్సులోనే అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం అని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే మనమంతా ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
రాష్ట్రపతి తొలుత అల్లూరి ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి అర్పించారు. మన్యంలోని గిరిజనులకు ఇళ్లు కట్టించిన పద్మశ్రీ ఏవీఎస్ రాజు, అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని ఇచ్చిన దాత అల్లూరి సీతారామరాజులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. భీమవరంలోని అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన త్రీడీ చిత్రాన్ని ప్రదర్శించారు. కాగా తెలుగులో ‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అల్లూరి దేశభక్తిని యువతకు తెలియజేయాలి
‘దేశ ప్రజలందరి తరఫున అల్లూరి సీతారామ రాజుకు నివాళులర్పించడం గౌరవంగా భావిస్తున్నా. అల్లూరి గొప్ప దేశభక్తిని యువతకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సర్దార్ భగత్‌సింగ్ ఏవిధంగా ఆత్మగౌరవానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచారో..అదే రీతిలో దేశ ప్రజలకు అల్లూరి సైతం ఎప్పటికీ గుర్తుంటారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా అల్లూరి చేసిన పోరాటాలు భవిష్యత్ తరాలకు సైతం స్ఫూర్తిగా నిలిచేలా ఉన్నాయి.
పర్వతాల్లో, అడవుల్లో ఉండే గిరిజనుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగల్చడంతోపాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై తెలుగులో రూపొందించిన ఓ సినిమా కోసం ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా..’ గీతం తెలుగు ప్రాంతంలోని చిన్నారులకు సైతం సుపరిచితం. బ్రిటిష్ సైన్యాన్ని పలుమార్లు ఓటమిపాలు చేయడంతోపాటు స్థానికులపై బ్రిటిష్ అధికారుల అరాచకాలపై అల్లూరి యుద్ధభేరి మోగించారు.
సామాజిక అసమానతలపై అల్లూరి చేసిన పోరాటం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం. ప్రజల కష్టనష్టాలను తన కష్టాలుగా భావించిన గొప్ప నాయకుడు అల్లూరి. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఆయన వీరమరణం పొందారు. బ్రిటిష్ అధికారులు ఎంత హింసించినా మన్యం ప్రజలెవరూ ఆయన జాడ చెప్పలేదు. అంతలా ఆయన జననాయకుడయ్యారు. అలాంటి గొప్ప నాయకుడిని ఎప్పటికీ గుర్తుంచుకోవడం దేశ ప్రజలందరి బాధ్యత..’ అని రాష్ట్రపతి చెప్పారు. ‘జై అల్లూరి సీతారామరాజు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు: సీఎం కేసీఆర్
‘అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్మాగాంధీ సైతం.. ‘అల్లూరి సీతారామరాజును నేను ప్రశంసించకుండా ఉండలేను’ అని చెప్పినట్టు పలు రికార్డుల్లో ఉంది. ఎక్కడైతే పీడన, దోపిడీ జరుగుతుందో అక్కడ దైవాంశ సంభూతులైన మహానుభావులు జన్మిస్తారన్న భగవద్గీత సందేశాన్ని నిరూపించేలా అల్లూరి సీతారామరాజు జీవితం ఉంటుంది. బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు.
26 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు జాతి వీరుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు. చివరకు చనిపోతూ కూడా ఒక్క అల్లూరి మరణిస్తే..వేలాది మంది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారంటూ స్ఫూర్తిని చాటారు.
హీరో కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా..మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా..’ అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కారులో ప్రయాణించేటప్పుడు ఎక్కువసార్లు ఈ పాట వినేవాడిని. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి కిషన్‌రెడ్డికి తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలుగు వీరుడి గురించి చెప్పేందుకు తెలుగులో ప్రసంగం: గవర్నర్
తెలుగు వీరుడు అల్లూరి కీర్తిని చెప్పేందుకు తాను పూర్తిగా తెలుగులోనే ప్రసంగిస్తున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. ‘అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి. ఆయన చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి.
సీతారామరాజు వంటి గొప్పవారి చరిత్రలు చెప్పుకున్నప్పుడు ప్రజాస్వామ్యం విలువ మరింత తెలుస్తుంది. స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో మన్యం ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగల్చడంతో పాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దిన నాయకుడు అల్లూరి. గిరిజనుల అభివృద్ధికి వివిధ పథకాలు అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాలను అభినందిస్తున్నా..’ అని తమిళిసై పేర్కొన్నారు.
సూర్య, చంద్రులు ఉన్నంత కాలం ఉండే వీరుడు: కిషన్‌రెడ్డి
‘చరిత్రను ఆవిష్కరించే మహనీయుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు విస్మరించలేని తెలుగు వీరుడు. యావత్ ప్రపంచానికి తెలుగు కీర్తిని చాటిన శూరుడు. గత ప్రభుత్వాలు విస్మరించినా..అల్లూరి సీతారామరాజును దేశం గుర్తు చేసుకునేలా ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా ఏడాదిపాటు నిర్వహించేలా చర్యలు తీసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
అల్లూరి 125వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, కార్యదర్శి నానిరాజు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రపతికి విల్లు, బాణాన్ని బహూకరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతికి హకీంపేటలో గవర్నర్ డా.తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment