సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న సమైక్యతా దినోత్సవం కాకుండా అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలాదిమంది యువకులు, మహిళలు పెద్దఎత్తున నిజాంపై పోరాడితే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే.. సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హైదరాబాద్ ముక్తి దివస్ పేరిట కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు.
మంగళవారం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో కేంద హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఇందులో పాల్గొనా లని తెలంగాణతో సహా కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ స్టేట్ విమోచనకు సంబంధించి చారిత్రక పరిణామాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ ఈ సారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా పాల్గొంటారని వెల్లడించారు.
ఎంఐఎంకు కేసీఆర్ లొంగిపోయి..విమోచన దినోత్సవాన్ని కాలరాస్తున్నారు
కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలతో, మజ్లిస్‌కు వంతపాడుతూ సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవ చరిత్రను కాలరాస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అనుమతి ఉంటేనే కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎద్దేవా చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించని మొదటి ద్రోహి కాంగ్రెస్ అయితే.. రెండో ద్రోహి బీఆర్‌ఎస్ అని మండిపడ్డారు.
’’తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా జరపడం లేదు? ఎంఐఎంకు లొంగిపోయి, తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని’’ 2007లో నాటి అధికార కాంగ్రెస్‌ను ప్రశ్నించిన కేసీఆర్... మరి ఇప్పుడెందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. చరిత్రను ఈ తరానికి అందించడంలో కాంగ్రెస్ కుట్ర చేస్తే.. ఇప్పుడు ఎంఐఎంకు కేసీఆర్ లొంగిపోయి విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు.
బాబు అరెస్టుపై నో కామెంట్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పేర్కొన్నారని, ఐతే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద లేదని కిషన్‌రెడ్డి బదులిచ్చారు.
గ్రౌండ్ ఇవ్వలేదనడం మూర్ఖత్వం
తమకు గ్రౌండ్ ఇవ్వలేదని కొందరు(కాంగ్రెస్ పార్టీ నేతలనుద్దేశించి) మూర్ఖత్వంతో ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం ఆధ్వర్యంలో అక్కడ విమో చన దినోత్సవాలను నిర్వహించుకోవాలని నిర్ణయిస్తే.. దాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్, ఇతర పార్టీలు కుట్ర చేస్తున్నాయని నిందించారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. రాష్ట్రంలోని సర్పంచ్ లకు లేఖలు రాస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment