మాదాపూర్: అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని, ఆయన చరిత్రను భావితరాలకు తెలియజెప్పాలని కేంద్ర సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని సీసీఆర్టీలో శుక్రవారం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా సన్నాహక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, క్షత్రియ సేవా సమితితో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత సంవత్సరం నుంచి అల్లూరిసీతారామరాజు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సమితి సభ్యులను అభినందించారు. ఢిల్లీలోనూ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనుందన్నారు. నటుడు కృష్ణ అల్లూరి సీతారామ రాజు సినిమాను తీయకపోతే తనలాంటి వారికి ఆయన గొప్పతనం తెలిసేది కాదన్నారు. తన జీవితంలో ఎక్కువ సార్లు అల్లూరి సీతారామరాజు సినిమా చూసినట్లు తెలిపారు. ఆ పేరులోనే త్యాగం, స్ఫూర్తి, సాహసం ఉన్నాయన్నారు. భావితరాలకు కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలన్నారు.
గిరిజనులను సంఘటితం చేసిన అల్లూరికి దక్కుతుందని, ఆయన పోరాట వీరుడే కాక ఆధ్యాత్మిక వేత్తగా పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో అనేక మార్పులను తీసుకువచ్చారన్నారు. మంచి, చెడు వివరించి వారిని సంఘటితం చేశారన్నారు. పోరాటాల్లోనూ నైతిక విలువలు పాటించారని, చెప్పి మరీ దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్లే వారన్నారు. అల్లూరి సీతారామరాజు పై కార్టూన్ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి దేశప్రధాని మోదీ, ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ము హాజరుకానుండటం సంతోషకరమన్నారు.
ఏ గిరిజనుల కోసం ఆయన పోరాటం చేశాడో అదే గిరిజన మహిళ నేడు దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని, ఆయన జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ రావడం గర్వకారణమన్నారు. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సినీనటుడు మురళీమోహన్‌లతో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment