చిగురించిన అమెరికా, క్యూబా స్నేహం
వాషింగ్టన్: దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో సోమవారం దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు అధికారికంగా నిర్ణయించాయి. గతేడాది డిసెంబర్ 17న అమెరికా అధ్యక్షుడు ఒబామా.. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చర్చలు జరిపారు.
1961 తర్వాత వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంపై క్యూబా జెండా ఎగిరింది. దౌత్య బంధాలు మరింత మెరుగుపర్చుకునే క్రమంలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ క్యూబా విదేశాంగమంత్రి బ్రూనో రోడ్రిగుజ్‌తో చర్చలు జరపనున్నారు. అనంతరం ఇరువురు సంయుక్త సమావేశంలో మాట్లాడతారు.
జనవరి 1, 1959: క్యూబా నియంత బాటిస్టా పారిపోవడంతో తిరుగుబాటు నేత ఫిడెల్ క్యాస్ట్రో అధికార పగ్గాలు చేపట్టారు. బాటిస్టా మద్దతుదారులపై మరణశిక్షలను అమెరికన్లు విమర్శించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. 1960: అమెరికాకు చెందిన ఆయిల్ రిఫైనరీలు, వాణిజ్యాలను క్యూబా జాతీయీకరణం చేసింది. జనవరి 1961: క్యూబా సోషలిస్టు దేశంగా క్యాస్ట్రో ప్రకటన. మరునాడే క్యాస్ట్రోను కూలదోసేందుకు అమెరికా ‘బే ఆఫ్ పిగ్స్’ కుట్ర. 1998: ఐదుగురు క్యూబా గూఢచారులను అరెస్టు చేసిన అమెరికా.
2006: అనారోగ్యానికి గురైన ఫిడెల్ క్యాస్ట్రో. అధికార పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో. డిసెంబరు 17, 2014: దౌత్య సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా, రౌల్ క్యాస్ట్రోల ప్రకటన. 2014: ఉగ్రవాద జాబితా నుంచి క్యూబాను తొలగిం చిన ఒబామా సర్కారు. జూలై 20, 2015: రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఒప్పందం.