హవానా: క్యూబా అమెరికా దేశాల మధ్య నిలిచిపోయిన విమాన రాకపోకలు క్యూబా విప్లవ యోధుడు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణానంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. మంగళవారం తొలి వాణిజ్య విమానం అమెరికా నుంచి బయలుదేరి క్యూబా రాజధాని హవానాలో దిగింది. దీంతో 50 ఏళ్ల అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా విమానం క్యూబాలో అడుగిడినట్లైంది.
క్యాస్ట్రో మరణంతో ఆ దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభలకు హాజరయ్యే ప్రయాణికుల దృష్ట్యా అమెరికా నుంచి క్యూబాకు విమాన రాకపోకల్ని పునరుద్ధరించాలని అమెరికన్ ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. ఈ తాజా నిర్ణయం పట్ల క్యూబా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభమైన సందర్భంగా హవానాలోని జోస్‌మార్టి అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే పొడవునా విమానంపై ఫైర్‌ట్రక్కులనుంచి నీటిని వెదజల్లుతూ క్యూబా ప్రజలు స్వాగతం పలికారు.
‘ఈ హవానా దీవిని సందర్శించడం నాకిది మూడోసారి. ఈ రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం కావడం పట్ల నేనెంతో ఉద్వేగానికి గురయ్యా’నని మియామీలో జన్మించిన క్యూబన్ అమెరికన్ జొనాథన్ గొంజాలెజ్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం క్యూబా అధ్యక్షుడు రావుల్ క్యాస్ట్రో, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భేటీ సందర్భంగా ఈ రెండు దేశాల మధ్య విమాన రాకపోకల పునరుద్ధరణకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది.
క్యూబాకు అమెరికా విమాన రాకపోకలు
Published Wed, Nov 30 2016 5:15 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement