పదే పదే విఫలమవుతున్న విధానాలనే కొనసాగిద్దామనుకోవడం పిడివాదమే అవుతుంది. ఈ సంగతి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆలస్యంగానైనా గ్రహించినట్టున్నారు. అందువల్లే కావొచ్చు... పొరుగునున్న క్యూబాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని నిర్ణయించినట్టు బుధవారం ప్రకటించారు. క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో కూడా ఇదే మాదిరి ప్రకటన చేశారు. అంతక్రితం వారిద్దరూ దాదాపు గంటసేపు ఫోన్‌లో సంభాషించుకున్నారు. అమెరికా-క్యూబా సంబంధాల చరిత్ర తెలిసినవారికి ఇది సంభ్రమాశ్చర్యాలు కలిగించే పరిణామం. కెనడా చొరవతో, ఆ దేశమే వేదికగా పోప్ బెనెడిక్ట్ ఆశీస్సులతో ఏడాదిన్నరగా తెరవెనక సాగుతున్న సుదీర్ఘ మంత్రాంగం ఈ పరిణామానికి దోహదపడింది.
అగ్రరాజ్యమైన అమెరికాతో పోలిస్తే క్యూబా చిట్టెలుక వంటిది. రెండింటినీ విడదీసేది చిన్న జలసంధి మాత్రమే! కానీ సంబంధాలరీత్యా చూస్తే వాటి మధ్య దూరం కొన్ని లక్షల యోజనాలుంటుంది. 1959లో అమెరికా మద్దతుతో క్యూబాలో రాజ్యమేలుతున్న నియంత బాటిస్టాను ఫైడల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారులు కూల దోయడంతో రెండింటిమధ్యా విద్వేషాలు రాజుకున్నాయి. దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించిన కాస్ట్రో తమది సోషలిస్టు విప్లవమని ప్రకటించగానే అమెరికా క్రోథంతో రగిలిపోయింది. 1961లో కాస్ట్రో వ్యతిరేకులకు సీఐఏ ద్వారా శిక్షణనిప్పించి, ఆయుధాలు అందజేసి క్యూబాలోని బే ఆఫ్ పిగ్స్ అనే చిన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది.
అది బెడిసికొట్టాక అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. క్యూబాను ఏకాకిని చేసి, బలహీనపరిచి ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ ప్రారంభించిన ఆంక్షలు ఏమాత్రం ఫలితాన్నీయలేదు. ఈ ఆంక్షల కారణంగా క్యూబా కష్టాలు పడిన మాట వాస్తవమే. అయినా వాటన్నిటినీ పంటి బిగువున భరించింది. ‘పాహిమాం’ అనేదే లేదని నిక్కచ్చిగా చెప్పింది. అన్ని రంగాల్లోనూ స్వశక్తితో చిన్నగానైనా ఎదిగింది. వైద్యరంగంలో అయితే క్యూబా అగ్రగామి. కమ్యూనిస్టు సిద్ధాంతాలపై సంపూర్ణ విశ్వాసంగల ‘నియంతృత్వ, ఏకపక్ష’ ప్రభుత్వంవల్లనే ఇదంతా సాధ్యమైం దని అమెరికా కొట్టిపారేసి ఉండొచ్చుగానీ అది అర్థ సత్యం మాత్రమే! ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అప్పటి సోవియెట్ యూనియన్ సాయపడగా...తదనంతర కాలంలో వెనిజులా ఆసరాగా నిలిచింది. దౌత్య సంబంధాల పునరుద్ధరణపై చేసిన ప్రకటనలో ఒబామా చెప్పినట్టు క్యూబాను ఏకాకిని చేద్దామనుకున్న ప్రయత్నాలు వాస్తవానికి ఫలించలేదు. ఏ దేశమూ అందుకు సహకరించలేదు. ఆంక్షల కారణంగా అమెరికాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మాత్రమే క్యూబాతో లావాదేవీలు జరపలేకపోయాయి.
అమెరికా-క్యూబా మధ్య నెలకొన్న విద్వేషాల పర్యవసానాలు ఒక క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తాయి. 1962లో క్యూబా భూభాగంపై సోవియెట్ అణు క్షిపణులు మోహరించి ఉన్నాయని అమెరికా...టర్కీలో ఉంచిన అణు క్షిపణుల మాటేమిటని సోవియెట్ ఆరోపణలు సంధించుకున్నప్పుడు పెను సంక్షోభం తలెత్తింది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే క్యూబాను దురాక్రమించబోనని అమెరికా హామీ ఇవ్వడం...ఎవరి క్షిపణులు వారు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించడంతో పరిస్థితి చక్కబడింది. తమ కంట్లో నలుసులా మారిన క్యూబా అధినేత కాస్ట్రో అడ్డు తొలగించుకోవడానికి అమెరికా తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ‘కాస్ట్రోను హతమార్చడానికి 638 మార్గాలు’ అంటూ బ్రిటన్‌కు చెందిన చానెల్4 ఒక సీరియల్‌నే ప్రసారం చేసింది. అందులో కాస్ట్రో ప్రియురాలిని సీఐఏ లోబర్చుకుని ఆమె ద్వారా కోల్డ్ క్రీమ్‌లో విషాన్ని నింపడం, కాస్ట్రో కాల్చే సిగార్‌లో బాంబు ఉంచడం, బాల్ పాయింట్ పెన్నులో విషపూరిత ద్రవం ఉన్న సిరెంజ్‌ను ఉంచడంలాంటివెన్నో ఉన్నాయి. 1976లో 73మందితో వెళ్తున్న క్యూబా విమానాన్ని పేల్చేయడం, 1997లో క్యూబా రాజధాని హవానాలో పలు హోటళ్లలో బాంబులు పేలి అనేకులు గాయపడం, ఒక ఇటలీ పౌరుడు మరణించడంవంటివన్నీ సీఐఏ పనులేనంటారు. ఈ ఘటనలపై రహస్యంగా ఫ్లోరిడాలో సమాచారం సేకరిస్తున్న అయిదుగురు క్యూబా పౌరులను గూఢచర్యం సాగిస్తున్నారంటూ అమెరికా అరెస్టుచేసింది.
క్యూబాతో వైరం పెంచుకోవడంలోని నిరర్థకతను గుర్తించడానికి అమెరికాకు ఇన్నేళ్లు పట్టడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాను బాంబులతో వల్లకాడు చేసిన వియత్నాంతో సాధారణ సంబంధాలను పునరుద్ధరించుకుంది. సోవియెట్ యూని యన్ ముక్కచెక్కలయ్యాక ఏర్పడిన దేశాలతో చెలిమిచేసింది. ఆదినుంచీ తాను తెగనాడిన చైనాతో సైతం దౌత్య సంబంధాలు ఏర్పర్చుకుంది. జనాన్ని ఉక్కు పాదం తో అణిచేసే నియంతలతో సాన్నిహిత్యం నెరపింది. కానీ, పొరుగునున్న చిన్న దేశం తో కరచాలనం చేయడానికి మాత్రం చేతులు రాలేదు.
ప్రచ్ఛన్నయుద్ధం ముగిసి పాతికేళ్లయ్యాకగానీ అమెరికాకు జ్ఞానోదయం కలగలేదు. ఇప్పటికీ ఒబామా తీసు కున్న నిర్ణయంపై రిపబ్లికన్లు కారాలు మిరియాలూ నూరుతున్నారు. వచ్చే నెలనుంచి తమ ఆధిపత్యంలోకి రానున్న అమెరికన్ కాంగ్రెస్‌లో దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఒబామా నిర్ణయం ఇప్పటికిప్పుడు ఇరు దేశాలమధ్యా పూర్తి స్థాయి దౌత్య సంబంధాలకు దారితీసే అవకాశంలేదు. ఆర్థిక ఆంక్షలూ యథా తథంగా కొనసాగుతాయి. కాకపోతే రెండు దేశాలూ దౌత్య కార్యాలయాలు ప్రారం భించుకోవడం... వ్యాపార, పర్యాటకరంగాల్లో ఉన్న ఆంక్షలను సడలించడం... క్యూబాలో డె బిట్, క్రెడిట్ కార్డులు చెల్లుబాటయ్యేలా చూడటంవంటి స్వల్ప చర్యలకు వీలుకలుగుతుంది. సాకులు చెప్పి, కుట్రలు పన్ని ఏ దేశాన్నయినా ఏకాకిని చేయా లని, లొంగదీసుకోవాలని చూస్తే ఏమవుతుందో అమెరికా క్యూబాలో అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. ఇది మెరుగైన దౌత్య నీతికి దోహదపడగలిగితే మంచిదే.
క్యూబాతో కరచాలనం!
Published Sat, Dec 20 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement
Advertisement