వాషింగ్టన్: క్యూబాతో దశాబ్దాల వైరానికి ముగింపు పలికే దిశగా అమెరికా పలు నిర్ణయాలు తీసుకుంది. క్యూబా రాజధాని హవానాలో అమెరికా రాయబార కార్యాలయ ఏర్పాటు, ఆ దేశంపై విధించిన వాణిజ్య, పర్యాటక ఆంక్షల సడలింపు, క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని గతంలో చేసిన ప్రకటనపై పునఃపరిశీలన.. మొదలైన కీలక దౌత్య పరమైన నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్నారు. కాలం చెల్లిన వైఖరిని పక్కనబెట్టి.. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా క్యూబాతో సంబంధాలను రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో క్యూబా పౌరుల హక్కులకు అమెరికా మద్దతుంటుందని స్పష్టం చేశారు. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కూడా తాను మాట్లాడానన్నారు. కాగా, అమెరికా నిర్ణయంపై భారత్ సహా పలు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.