
సమతా విప్లవ దార్శనికుడు
కొత్త కోణం
దేశ వనరులపై సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికే హక్కులుండాలన్న అంబేడ్కర్‌కు పెట్టుబడిదారీ విధానంపై సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం ఉమ్మడి శత్రువులనీ, రెండూ అసమానతలను పెంచి, పరిర క్షించేవేనని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారీ విధానాన్ని కుల వ్యవస్థ మరింత క్రూరంగా అమలు చేస్తుందన్నారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగలిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం.
‘‘ప్రజాస్వామ్యం ఒక మనిషి-ఒక విలువ అన్న సూత్రానికి అనుగుణంగా నిలవాలంటే ఆర్థిక రంగాన్ని కూడా అలాగే నిర్వచించుకోవాలి. అనువైన వ్యవస్థను నిర్మించుకోవాలి. ప్రజాస్వామ్యం నిజమవ్వాలంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని రాజ్యాంగంలో చేర్చుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడం, నియంతృత్వాన్ని తిరస్కరించడం, సామ్యవాదాన్ని స్థాపిం చడం దీనికి పరిష్కారం’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ఆర్థిక విధా నాన్ని ప్రకటించారు. రాజకీయ ప్రజాస్వామ్యంతోనే సమానత్వం సాధ్యం కాదని, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తొలగించాలని అంబేడ్కర్ చాలా సార్లు వివరించారు.
అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే ‘రాష్ట్రాలు-మైనారిటీలు’ (స్టేట్స్ అండ్ మైనారిటీస్) అనే డాక్యుమెంట్‌లో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే ఇందులో ఉన్న చాలా అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి వీలుకానివి. అటువంటి అంశాల్లో ముఖ్యమైనవి స్టేట్ సోషలిజం. పరిశ్ర మలు, సేవారంగం, ఆర్థిక సంస్కరణలు. భూమితో పాటూ ఇతర వనరుల న్నిటినీ ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి, అదే వాటిని నిర్వహించాలనీ అప్పుడే ప్రజల మధ్య అంతరాల తొలగింపు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ‘అంబేడ్కర్ స్టేట్ సోషలిజం’గా పిలుస్తారు.
అంబేడ్కర్ స్టేట్ సోషలిజం
ఈ డాక్యుమెంటులోని నాలుగవ భాగంలో ఆర్థిక దోపిడీ నుంచి రక్షణలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. అవి: 1. ప్రధాన పరిశ్రమలను నిర్వచించి, వాటినన్నిటినీ ప్రభుత్వ యాజమాన్యంలోనే నడపాలి. 2. మౌలిక పరిశ్రమలను ప్రభుత్వాలు లేదా అవి ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లు మాత్రమే నిర్వహించాలి. 3. బీమారంగాన్ని ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంచి, వయోజనులంతా వారి సంపాదనకు సరిపోయేంతటి బీమా చేసేలా చట్టా లను రూపొందించాలి. 4. వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చాలి. అది ప్రభుత్వ హయాంలోనే కొనసాగాలి. అందుకుగాను భూమిని జాతీయం చేయాలి. ఇంతవరకు యజమానులుగా, కౌలుదార్లుగా, తన భూమిపైన హక్కులు అనుభవిస్తున్న ప్రైవేటు వ్యక్తులకు డిబెంచర్ల రూపంలో వారి హక్కులకు సరిపడా నష్టపరిహారం చెల్లించాలి.
సమాజంలోని వనరులపైన సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభు త్వాలే హక్కులను కలిగి ఉండాలని అంబేడ్కర్ ప్రతిపాదించారు. వీటిని రాజ్యాంగంలో చేర్చడానికి నాటి రాజ్యాంగ సభ నాయకత్వం అంగీకరించ లేదు. అంబేడ్కర్ చెప్పినట్టుగా పరిశ్రమలు, బ్యాంకులు, బీమా సంస్థలను కొంతకాలం ప్రభుత్వాలు నడిపాయి. కాలక్రమేణా అవి కూడా ప్రైవేటుపరం అవుతున్నాయి. భూమికి సంబంధించిన ఆయన ఆలోచనలు ఏ ప్రభుత్వా లకూ పట్టలేదు. భూసంస్కరణల కోసం దున్నేవానికే భూమి నినాదాన్ని ఇచ్చిన కమ్యూనిస్టులు భూమి జాతీయీకరణను పట్టించుకోలేదు. పైగా దున్నేవానికే భూమి విధానం వల్ల అప్పటి వరకు జాగీర్దారులు, జమీందా రులు, భూస్వాముల చేతుల్లో ఉన్న భూమి కౌలుదారులుగా, వ్యవసాయదా రులుగా ఉన్న ఆధిపత్య కులాల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
అది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. అంబేడ్కర్ కోరినట్లు భూమిని జాతీయం చేసి సమష్టి వ్యవసాయ విధానాన్ని కొనసాగించి ఉంటే... ప్రజల మధ్య అంతరాలు ఇంతగా పెరిగి ఉండేవి కాదనేది వాస్తవం. జాగీర్దారీ, జమీందారీ భూములపై యాజమాన్యం సాధించిన పై కులాలకు నీటి పారు దల సౌకర్యాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, బ్యాంకు రుణాలు అందుబాటులోకి రావడంతో సస్యవిప్లవం ద్వారా వారు సంపన్నులయ్యారు. ఆ సంపన్నులే క్రమంగా వ్యాపారాలు, సినిమాలు, కాంట్రాక్టులు తదితర రంగాల్లోకి విస్తరించి, రాజకీయ రంగాన్ని స్వాధీనం చేసుకొన్నారు. సామా జిక వ్యవస్థలో ఆధిపత్యంలో ఉన్న కులాలే ఆర్థిక రంగాన్ని సైతం ఆక్రమించి, రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లోని ఆధిపత్య కులాలే అధికారాన్ని చలాయిస్తున్నాయి.
జాతీయీకరణే ఆర్థిక ప్రజాస్వామ్యానికి మార్గం
ఈ పరిణామాలను ఊహించే అంబేడ్కర్ మౌలిక పరిశ్రమలు, కీలక ఆర్థిక సంస్థలతో పాటు భూమిని జాతీయం చేయాలన్నారు. దానికి అనుగుణంగానే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ - 38ని ఆదేశిక సూత్రాలలో చేర్చడాన్ని ఆర్థిక ప్రజాస్వామ్య సాధనా కృషిలో భాగంగానే చూడాలి. 38వ ఆర్టికల్ క్లాజు-2లో పేర్కొన్నట్టు, ప్రజల ఆదా యాలలో ఉన్న అసమానతలను తొలగించానికీ, హోదాలు, సౌకర్యాలు, అవకాశాలలో ఉన్న అంతరాలను నిర్మూలించడానికీ రాజ్యం కృషి చేయా లనేది అంబేడ్కర్ లక్ష్యం. ‘‘మన లక్ష్యమైన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిగా కలిగిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చాలా విలువైనవని నా అభిప్రా యం. ఎందుకంటే, కేవలం పార్లమెంటరీ తరహా పాలన వల్ల మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. ఆర్థిక రంగంలో సమానత్వం కోసమే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచాం’’ అన్న మాటలు అంబేడ్కర్ ఆర్థిక విధానానికి అద్దం పడతాయి.
‘‘స్టేట్ సోషలిజం భారత దేశపు సత్వర పారిశ్రామిక అభివృద్ధికి అత్య వసరం. ప్రైవేట్ వ్యాపార వర్గానికి అంతటి సామర్థ్యం లేదు. ఒకవేళ ప్రైవేట్ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చినా దానివల్ల సంపదలో అసమానతలు పెరిగిపో తాయి. యూరప్‌లో ప్రైవేట్ పెట్టుబడులు సృష్టించిన అసమానతలు భారతీ యులకు గుణపాఠం కావాలి’’ అంటూ ఆనాడే అంబేడ్కర్ హెచ్చరించారు. ప్రైవేట్ రంగం ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను, భూములను తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఆనాడే సోదాహరణంగా వివరించారు. అవి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి.
’’ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆరాటం, సరిపడని జీతం, పరిమితిలేని పని గంటలు, కార్మిక సంఘాల్లో చేరే హక్కు మీద ఆంక్షలూ, కార్మిక కూలీ వర్గం భావప్రకటనా స్వేచ్ఛ, సంఘాన్ని ఏర్పర్చుకునే హక్కు, మత స్వేచ్ఛ వంటి వాటిపై దాడులూ జరుగుతుంటే మనుషులు ఏమైపోతారు’’ అన్న మాటలు నేటి ఉదారవాద ఆర్థిక విధానాలకు సరిగ్గా సరిపోతాయి. ప్రైవేటైజేషన్‌పై నాటి అంబేడ్కర్ అభిప్రాయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నేడు దేశంలో అమలులో ఉన్న పారిశ్రామిక విధానం, ప్రత్యేకించి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు తర్వాత కార్మికవర్గంలో అభద్రత నెలకొంది. స్టేట్ సోషలిజం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేది కాదని, నిజానికి అది వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుందనీ, ఇతరుల చేతుల్లో దోపిడీకి గురికావడం నుంచి కాపాడుతుందనీ ఆయన పేర్కొన్నారు.
పెట్టుబడిదారీ దోపిడీని బలోపేతం చేసే కులం
పెట్టుబడిదారీ విధానంపై అంబేడ్కర్‌కు సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. భారత ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం రెండూ ఉమ్మడి శత్రువులనీ, రెండింటిలో ఉన్న సామ్యం అసమానతలను పెంచి, పరిర క్షించడమని ఆయన స్పష్టం చేశారు. కుల వ్యవస్థ పెట్టుబడిదారీ విధానాన్ని మరింత క్రూరంగా, అవమానంగా అమలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగ లిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం. ఇటీవల కొందరు దళిత పెట్టుబడి దారులనే వాదనను ముందుకు తెస్తూ, దాన్ని అంబేడ్కర్ సిద్ధాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దళితుల ఆర్థిక సాధికారత అంటే గుప్పెడు మంది పురోగతి కాదు. ఇక ప్రపంచీకరణ వల్ల దళితులు అభివృద్ధి చెందు తారనే మాయావాదం పూర్తి సైద్ధాంతిక దౌర్భాగ్యం. ఒకరో, ఇద్దరో దళితులు పారిశ్రామికవేత్తలు కావచ్చునేమో... అంతమాత్రాన దానినే సార్వత్రిక సత్యంగా ప్రచారం చేయడం అంబేడ్కర్ పేరును తమ స్వార్థానికి వాడు కోవడం మాత్రమే.
దేశంలోని కొన్ని కులాలు మాత్రమే పెట్టుబడిదారీ రంగం లోకి, పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థలలోకి ప్రవేశిస్తున్నాయి. అసమానతకు పునాదిగా ఉన్న కుల వ్యవస్థకు పరిష్కారంగా అంబేడ్కర్ స్వేచ్ఛ, సమా నత్వం, సోదరత్వం లక్ష్యాలను ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం లాంటి విషయాలపట్ల అంతర్జాతీయంగా ఒకే రకమైన భావన ఉంటుంది. అయితే మన దేశంలో సోదరత్వంతో పాటూ ఈ రెండూ ప్రత్యేక స్వభావంగలవే. అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, సోదరత్వానికి మరోపేరు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే కేవలం ఒక పరిపాలనా విధానం, రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం ప్రజల జీవితంలో భాగంగా ఉండాలి. అంతా సమానులేననే భావన అందరికీ ఉండాలి. అందుకే అంబేడ్కర్ సోదరత్వ సాధనకు కుల నిర్మూలనను ప్రతిపాదించారు. సోషలిజాన్ని, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సవివరంగా విశ్లేషించి, సకల రంగాల్లో ప్రజాస్వామ్యం నెలకొనాలని ఆశించిన అంబేడ్కర్‌ని సంఘసంస్కర్తగానో, పెట్టీ బూర్జువా గానో భావించడంలో అర్థం లేదు. ఆయన సమసమాజాన్ని స్వప్నించిన నిజమైన విప్లవకారుడు.
నేడు బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి
మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213