
పాలకులు మతాన్ని ఆయుధంగా మార్చేశారు
ప్రభుత్వాలను ప్రశ్నిస్తే జైళ్లలో వేస్తున్నారు
భౌతికంగా కంటే సోషల్ మీడియా ద్వారానే అధిక హింస
ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు
ఎన్‌ఏపీఎం రెండో ప్లీనరీ ప్రారంభ కార్యక్రమంలో వక్తలు
4వ తేదీ వరకు కొనసాగనున్న సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై జరుగుతున్న దాడిని ప్రజలంతా ఖండించాలని నేషనల్ అల యన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ (ఎన్‌ఏపీఎం) రెండో ప్లీనరీలో వక్తలు పిలుపునిచ్చారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఎన్నో హక్కులపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని జైళ్లపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పౌరహక్కుల నేతలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. ఎన్‌ఏపీఎంను ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన రెండో ప్లీనరీ సమావేశాలు శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యాయి. 4వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో 24 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ప్రజాస్వామ్య ఉద్యమాలపై ప్రభుత్వాల అణచివేత, ఆదివాసీల హక్కులపై దాడి తదితర అంశాలపై ప్లీనరీలో చర్చించనున్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారిణి అరుణా రాయ్, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఇర్ఫాన్ ఇంజనీర్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, డీయూ సరస్వతి, టీఎం కృష్ణ పలు అంశాలపై మాట్లాడారు.
ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు: అరుణారాయ్
ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని అరుణా రాయ్ అన్నారు. భారతదేశం అంటే భిన్న సంస్కృతులు, భిన్న భాష ల కలయిక అని.. ఆ భిన్నత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పాలకులు ప్రజలను విడదీసేందుకు మతాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. అది ఎంతో ప్రమాదమని హెచ్చరించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై గ్రామ స్థాయి లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ రిలీజియన్ అన్న నినాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని ఇర్ఫాన్ ఇంజనీర్ సూచించారు. ప్రస్తు త రాజకీయాలు దేశ ప్రజలపై మతం అనే కారుమబ్బులను కప్పుతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సి న అవసరం ఉందని టీఎం కృష్ణ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హ క్కులతోపాటు సమాజంలోని మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్లు.. ఇలా అణచివేతకు గురవుతున్న ఎన్నో వర్గాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని డీయూ సరస్వతి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని, దేశ సహజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందని సమావేశంలో పాల్గొన్న పలువురు ఆదివాసీ ఉద్యమ నేతలు ఆరోపించారు. అరుణా రాయ్ రచించిన ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’పుస్తకాన్ని ప్రశాంత్ భూషణ్ తదితరులు ఆవిష్కరించారు.
సోషల్‌మీడియా ద్వారానే అధిక హింస: ప్రశాంత్ భూషణ్
దేశంలో వాక్ స్వాతంత్య్రంపై ఎక్కువ దాడి జరుగుతోందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలను విమర్శిస్తే జైళ్లలో వేస్తున్నారని అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడేవారిని సోషల్ మీడియా వేదికగా హింసించడం పెరిగిందని తెలిపారు. భౌతికంగా కంటే సోషల్ మీడియాలోనే ఇప్పుడు అతిపెద్ద హింస జరుగుతోందని చెప్పారు. సోషల్ మీడియాలో విద్వేష పూరిత పోస్టులు పెట్టేవారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ జరిగితేనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి డబ్బుతో అధికారం సంపాదించటం.. అధికారంలోకి వచ్చాక మళ్లీ డబ్బు సంపాదన అన్నట్టుగా మారిందని అన్నారు. చర్చ జరగకుండానే కొత్త చట్టాలు రూపొందిస్తున్నారని, కొన్నిసార్లు ఒకే రోజులో పదుల సంఖ్యలో నూతన చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలకు స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment