కమ్యూనిస్టు ఐక్యతే విప్లవ మంత్రం | The mantra of the Revolutionary Communist Unity | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టు ఐక్యతే విప్లవ మంత్రం

Published Mon, Nov 17 2014 12:46 AM | Last Updated on Fri, May 25 2018 2:48 PM

కమ్యూనిస్టు ఐక్యతే విప్లవ మంత్రం - Sakshi

కమ్యూనిస్టు ఐక్యతే విప్లవ మంత్రం

సోవియట్ యూనియన్‌లో సోషలిజం విచ్ఛిన్నం, చైనా పెట్టుబడిదారీ పంథాలో పోతున్నదన్న అవి శ్వాసం, ఏక ధ్రువ ప్రపంచంగా పెట్టుబడిదారీ విధానం విస్తరణ వంటి అంతర్జాతీయ పరిణామాలు కమ్యూనిజంపై చూపుతున్న ప్రభావం తక్కువ కాదు.  జాతీయంగా ప్రపంచీకరణ, ఉదార ఆర్థిక విధా నాల పేరిట పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచే ధోరణి పెరిగింది. ఇవన్నీ కలసిన నేటి పరిస్థితులు కమ్యూనిజం పట్ల వ్యతిరిక్త ప్రభావాన్ని చూపుతున్నాయని విస్మరించలేం. 1964 చీలిక ఆ తర్వాత నక్సలైట్ల చీలికకు అవకాశం ఇచ్చింది. ఇకపై సీపీఎమ్ కమ్యూనిస్టు ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నిట్టనిలువుగా చీలిపోగా 1964 నవంబర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడింది. ప్రధాన జాతీయ కమ్యూని స్టు పార్టీయైన సీపీఐఎమ్ ఈ నవంబర్ మాసంలో పార్టీ ఆవిర్భావ అర్ధ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, తప్పు టడుగులను వేస్తూ, భౌతిక పరిస్థితులకు ఎదురీదుతూ సాగింది దాని ప్రస్థానం. నేడు ఎంతగా బలహీనపడినా అదే దేశంలోని పెద్ద కమ్యూనిస్టు పార్టీ! ‘‘తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా జెండాను దించకుండా నిలబెట్టడమే ప్రధాన కర్తవ్యం, అభినందనీయం’’ అని ఏంగెల్స్ అన్నారు. సరిగ్గా అలాగే కృషి చేస్తున్న సీపీఎమ్ కార్యకర్తలకు పార్టీ 50వ జయంతి అభినందనలు!  

రష్యా మార్గమా? చైనా మార్గమా?

1964లో పార్టీ ఎందుకు చీలిపోవాల్సి వచ్చింది? ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో 1946-51 మధ్య సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పార్టీ చరిత్రలోని సువర్ణాధ్యాయం. ఆ సందర్భంగానే పోరాట నాయ కత్వానికి గతంలో ఎన్నడూ ఎరగని సైద్ధాంతిక, ఆచరణాత్మక సమస్యలు ఎదు రైనాయి. ఉదాహరణకు, నెహ్రూ సేనల ప్రవేశంతో నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైన తదుపరి పరిస్థితులనే చెప్పుకోవచ్చు. నెహ్రూ సేనలు కమ్యూనిస్టు లను, వారి నేతృత్వంలోని రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రధాన శత్రువులుగా ఎంచి దమనకాండ సాగించాయి. ఆ దశలో సాయుధ పోరాటాన్ని కొనసాగిం చాలా? విరమించాలా? అనే తక్షణ ఆచరణాత్మక సమస్యతో పాటూ, భారత విప్లవ పంథా చైనాలో వలే ఉంటుందా? లేక రష్యాలో వలే ఉంటుందా? అనే ముఖ్య సైద్ధాంతిక సమస్య కూడా ముందుకొచ్చింది. పార్టీలో విభేదాలు తలెత్తాయి. ఆ అంతర్గత ఆ సమస్యలకు పరిష్కారం సాధించలేక నాటి పార్టీ నాయకత్వం ప్రపంచ విప్లవ కేంద్రమైన సోనియట్ యూనియన్ పార్టీని సంప్రదించడానికి మాస్కోకు ఒక రహస్య ప్రతినిధి బృందాన్ని పంపింది. స్టాలిన్ తదితర ముఖ్య పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణ పోరాటంపై, ప్రత్యేకించి భారత విప్లవ మార్గంపై నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అలా రూపొందినదే 1951 నాటి ‘ఎత్తుగడల పంథా’. అదే ‘‘కిషన్ డాక్యుమెంటు.’’  దాని ప్రకారం 1) భారత విప్లవ మార్గం శాంతియుతం కాదు. 2) అలా అని అది మక్కీకి మక్కీగా రష్యా మార్గమో, చైనా మార్గమో కాదు. 3) భారత ప్రత్యేక పరిస్థితులను, ప్రత్యేకించి నెహ్రూకు ఉన్న ప్రతిష్ట, దేశానికి కొత్తగా స్వాతంత్య్రం లభించడం వంటి పరిస్థితుల దృష్ట్యా...  పార్లమెంటరీ పోరాటాలు,పార్లమెంటరీయేతర పోరాటాలు  (సాయుధ పోరాటం సహా) రెంటినీ అవకాశాలు, అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటూ సాగేదిగానే పార్టీ విప్లవ పంథా ఉంటుందని దాని సారాంశం. ఆశించినట్టు ‘ఎత్తుగడల పంథా’ పార్టీలో ఐక్యతను సాధించలేకపోయింది.

చీలిక... ఆ పై మరో చీలిక

విభేదాలు కొనసాగి, క్రమేమీ నాయకత్వంలో పరస్పర అవిశ్వాసం నెలకొంది. చివరికది పరస్పరం నిర్మాణపరమైన చర్యలను చేపట్టే స్థితికి దారితీసింది. నేడు సీపీఐగా ఉన్న వారి వాదన స్థూలంగా ఇదీ...‘‘భారతదేశం నేడు నెహ్రూ నేతృ త్వంలోని కొంత వరకు అభివృద్ధికాముకమైన, దేశభక్తియుతమైన జాతీయ పెట్టుబడిదారీ వర్గం చేతుల్లో ఉంది. అది అభివృద్ధి నిరోధక శక్తుల, సామ్రా జ్యవాదుల ఒత్తిళ్ల నుండి  బయటపడి, పురోగమించేందుకు నెహ్రూ ప్రభుత్వానికి సహకరించాలి.’’ అందుకు భిన్నంగా ‘‘కాదు, నెహ్రూ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులతో మిలాఖతైన గుత్తపెట్టుబడిదారీ నాయత్వంలోని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం. కార్మికవర్గ నేతృత్వంలో దాన్ని బలవంతంగా కూలదోయడం మినహా మరో మార్గం లేదు’’ అనేది నేడు సీపీఎమ్‌గా ఉన్నవారి వాదన. దీనికి తోడు అంతర్జాతీయంగా సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాల మధ్య తీవ్ర సైద్ధాంతిక విభేదాలు తలెత్తాయి. భారత-చైనా సరిహద్దు వివాదం ముదిరి  యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంపై వైఖరిలోనూ అభిప్రాయభేదాలు వచ్చాయి. ఫలితంగా పార్టీలోనే రెండు శిబిరాలుగా పని చేస్తున్న వర్గాలు 1964లో చీలిపోయి, సీపీఐ, సీపీఎమ్‌లుగా ఆవిర్భావించాయి. ఆనాటికి బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో సీపీఎమ్ పెద్ద పార్టీ. తొలి రెండు మూడేళ్లలో సీపీఎమ్ వడివడిగా అభివృద్ధి చెందింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానే 1957లో కేరళలో తొలి కమ్యూనిస్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. సీపీఎమ్ ఏర్పడిన తదుపరి అక్కడ వామపక్ష ప్రజా ప్రభుత్వం వస్తూ పోతూ ఉంది. ఇక బెంగాల్‌లో సీపీఎమ్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ఏకధాటిగా దాదాపు మూడున్నర దశాబ్దాలు అధికారంలో ఉంది.

 1967లో బెంగాల్‌లో సీపీఎమ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ‘నక్సల్బరీ’ ప్రాంతంలోని స్థానిక సీపీఎమ్ నేత చారుమజుందార్ నేతృత్వంలో భూమి కోసం పోరాటం ప్రారంభమై, క్రమంగా అది ప్రభుత్వాన్ని సాయుధం గా ఎదుర్కునే స్థితికి చేరింది. శాంతిభద్రతలను పరిరక్షించే కర్తవ్యం’లో భాగంగా సీపీఎమ్ ప్రభుత్వం నక్సల్బరీ ఉద్యమాన్ని సాయుధ బలగాలతో అణచివేయబూనుకుంది. దీంతో ‘‘భారదేశంలో సోషలిజం సాధనా మార్గం శాంతియుతం కాదు’’ అంటూ సీపీఐ నుండి బయటపడ్డ సీపీఎమ్ తమ పార్టీ సభ్యులు, సానుభూతిపరుల నుండే తీవ్ర విమర్శలను ఎదుర్కోవల్సి వచ్చింది. ‘‘విప్లవమార్గమని కబుర్లు చెబుతూ, కేరళ, బెంగాల్ అంటూ, ఎన్నికల చుట్టూ తిరుగుతున్నారు. విప్లవ పార్టీ నిర్మాణానికి పూనుకోవడం లేదు. సీపీఐ వలెనే నయా రివిజనిస్టు పంథాలో నడుస్తున్నారు. మీరు నయా రివిజనిస్టులు’’ అని విమర్శిస్తూ చారుమజుందార్ నక్సలిజం సిద్ధాంతంతో ఒక కొత్త పార్టీ వచ్చింది. దేశవ్యాప్తంగా సీపీఎమ్‌లో వచ్చిన ఈ చీలిక మన రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ఆ నక్సలిజం కూడా రెండు డజన్లకు పైగా గ్రూపులుగా చీలింది. సాయుధపోరాటమే ఏకైక మార్గమని జపం చేస్తూ మావోయిస్టులు మాత్రమే అక్కడక్కడా సాయుధ పోరాటం సాగిస్తున్నారు.
 
కమ్యూనిస్టు ఐక్యత నేటి ఆవశ్యకత

బెంగాల్, కేరళలలోని వామపక్ష ప్రభుత్వాలు తొలి నాళ్లలో ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. ప్రత్యేకించి బెంగాల్ ప్రభుత్వం మొదట్లో భూసంస్కరణలు, కౌలుదార్ల రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ, స్థానిక స్వపరిపాలన, పంచాయితీలకు అధికారాలు, పారదర్శక పాలన, మతసామరస్య పరిరక్షణ వంటి ప్రజానుకూల, పురోగామి చర్యలతో ఆదర్శంగా నిలిచింది. దేశవ్యాప్తంగా కార్యకర్తలను ఉత్తేజితం చేసింది. కానీ సుదీర్ఘ కాలం పార్లమెంటరీ మార్గంలో ఎన్నికల ఎత్తుగడల పేరిట పెట్టుబడిదారీ, భూస్వామ్య పార్టీలతో సీపీఎమ్ పొత్తులు నెరపింది. ఆ పార్టీల్లోని అవలక్షణాలు పార్టీ కార్యకర్తలకూ సోకాయి. తమ పార్టీలో కూడా ‘‘స్వార్థం, పదవీ వ్యామోహం, అహంభావం, ఆడంబరం, ధనార్జనా కాంక్ష’’ కనిపిస్తున్నాయని సీపీఎమ్ బహిరంగంగా ఆత్మవిమర్శ చేసుకుంది కూడా! తొలి తరం నేతలకున్న ప్రతిష్ట, పలుకుబడి తర్వాతి తరం నేతలకు లేకపోవడం సహజమే. కానీ పార్టీలో నేడు కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట నాయకత్వ కేంద్రీకృత నియంతృత్వం చోటు చేసుకుంది. వీటన్నిటికి మించి సోవియట్ యూనియన్‌లో సోషలిజం విచ్ఛిన్నం కావడం, చైనా పెట్టుబడిదారీ పంథాలో పోతున్నదన్న అవిశ్వాసం, ఎదురులేని ఏక ధృవ ప్రపంచంగా పెట్టుబడిదారీ విధానం విస్తరణ వంటి అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తక్కువ కాదు.  జాతీయంగా ప్రపంచీకరణ, ఉదార ఆర్థిక విధానాల పేరిట పెట్టుబడిదారులకు  ఎర్రతివాచీ పరచే ధోరణి పెరిగింది. ఇవన్నీ కలగలిసిన నేటి భౌతిక వాస్తవిక పరిస్థితులు కమ్యూనిజం పట్ల వ్యతిరిక్త ప్రభావాన్ని చూపుతున్న విషయం మరచిపోలేం. ‘‘చీలి ముక్కలు ముక్కలుగా ఉన్న కార్మిక వర్గం విప్లవాన్ని సాధించలేదు’’అని జర్మనీ గురించి మార్క్స్ ఒకప్పుడు చెప్పారు. 1964 పార్టీ చీలికే ఆ తర్వాత నక్సలైట్ల చీలికకు అవకాశం ఇచ్చింది. మరెన్నో చీలకలకు మార్గమైంది. కాబట్టి పార్టీ 50వ జయంతి సందర్భంగా ఇకపై సీపీఎమ్ కమ్యూనిస్టు పార్టీల ఐక్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సమరశీల ఐక్య కార్యాచరణకైనా దిగాలి. మహత్తర ప్రజా ఉద్యమమే ప్రస్తుత అనైక్యతకు మందు. అంబేద్కర్, ఫూలేల వంటి మహనీయుల ఆశయాలను ఇముడ్చుకుని కష్టజీవులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, తదితర అభివృద్ధి కాముకులను కలుపుకుని కమ్యూనిస్టులు పురోగమిస్తారనీ,‘‘1964’’ను పునరావృతం కానీయరని ఆశించవచ్చునా?  
     
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్: 98480 69720)  ఎ.పి.విఠల్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement