శత వసంతాల ‘అక్టోబర్‌’ | ussr devided and socialism in russia | Sakshi
Sakshi News home page

శత వసంతాల ‘అక్టోబర్‌’

Published Sat, Nov 5 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

శత వసంతాల ‘అక్టోబర్‌’

శత వసంతాల ‘అక్టోబర్‌’

విశ్లేషణ
ప్రపంచంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం జరిగే జాతీయ విముక్తి ఉద్యమాలకు సోవియట్‌ యూనియన్‌ ఆప్తమిత్రునిగా నిలిచింది. నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమ నానికి, స్వతంత్ర శక్తిగా నిలబడేందుకు నాటి సోవియట్‌ సహకారం అనితరసాధ్యం.

ఈ నవంబరు 7వ తేదీ ఒకప్పటి సోవియట్‌ రష్యా శత జయంతి. ఆనాటి సోషలిస్టు విప్లవం మార్క్సిజంలోని వాస్తవికతను రేఖామాత్రంగా ప్రపంచానికి దర్శనీయం చేసేందుకు నాందీ ప్రస్తావన జరిగిన రోజు. ఆ తొలి అడుగు మానవుడు మున్నెన్నడూ ఎరుగని దిశలు పడిన రోజు ఇది. విముక్తి పొందిన నూతన సోషలిస్టు రష్యా నాటి ప్రపంచ శ్రమజీవులందరి కలల పంట. విప్లవనేత లెనిన్‌ వాగ్దానం చేసినట్లు – వివిధ జాతుల కారా గారంగా ఉండిన రష్యాలో అన్ని జాతులకూ విముక్తి కల్పించి, అవి స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న యునైటెడ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ (యూఎస్‌ఎస్‌ఆర్‌)గా అవతరించింది.

రెండో ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్‌ మార్గదర్శకత్వంలో చైనా, వియత్నాం, క్యూబా విముక్తితో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. అయితే నాటి యూఎస్‌ఎస్‌ఆర్‌ నేటి ప్రపంచ చిత్రపటంలో కాన రాదు. తూర్పు యూరప్‌ రాజ్యాలలో సైతం సోషలిజం కనుమరుగ య్యింది. నాడు మావో నేతృత్వాన సాధించిన విముక్తి మార్గాన నేటి చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండినా పయనం సాగు తున్నదా? లేదా? అక్కడ నేడు కమ్యూనిస్టు పార్టీ పేరు కొనసాగుతు న్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి మార్గం పునర్నిర్మితమౌతు న్నదా? అన్నది ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలలో చర్చనీయాంశం.

ప్రపంచ శ్రమజీవుల ప్రాణస్పదంగా ఉండిన సోషలిస్టు శిబిరం ఇలా ఎందుకు పతనమయింది? అందుకు గల కారణాలేమిటి? ఈ పతనం ఆయా దేశాల ఆచరణాత్మక తప్పిదాల ఫలితమా? నేటి భౌతిక వాస్తవిక పరిస్థితి కారణమా? ఈ పతనం వెనుక కమ్యూనిస్టు వ్యతిరేక సామ్రాజ్యవాద గుత్తాధిపతుల కుట్రల ఫలితమా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తడం సహజం.  అసలు కమ్యూనిజమే మానవ నైజానికి విరుద్ధం, ‘సోషలిజం’ మార్క్స్‌ అనే ఒక స్వాప్నికుని స్వప్నం, పెట్టుబడిదారీ విధానమే శాశ్వతమైనది అని ప్రచారం చేసే మేధా వులకూ కొదవ లేకుండా పోయింది. కానీ ఆ యూఎస్‌ఎస్‌ఆర్‌ ఎంతటి మహత్తర మానవత్వ కర్తవ్యాలనూ అంతర్జాతీయంగానూ తన దేశంలోనూ ఆచరించి ప్రపంచానికి చూపిందో చూద్దాం.

తొలి సంస్కరణగా దున్నుకునే వారికే భూమినిచ్చే అతి మౌలిక మైన సంస్కరణ చేపట్టి రైతులను, గ్రామీణ పేదలను సోవియట్‌ ఆదుకున్నది. ప్రతి రంగంలోనూ రాజకీయంగా శ్రామికవర్గ పాత్ర పెంచింది. మహిళలకు ఆత్మగౌరవాన్ని, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థాయి అందించింది. విద్య, వైద్యం, గృహవసతి, దుస్తులు సామాన్య ప్రజలకు దాదాపుగా ఉచితంగా లభింపజేశారు. 40 ఏళ్లపాటు యూఎస్‌ఎస్‌ఆర్‌లో నిత్యావసరాల ధరల పెరుగుదల లేదు. సోష లిస్టు శిబిరంలోని దేశాలకు, నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమనానికి నాటి సోవియట్‌ సహకారం అనితరసాధ్యం. మనదేశాన్నే తీసుకుందాం. పాశ్చాత్య దేశాలు ‘డాలర్ల’తో వ్యాపార లావాదేవీలు సాగిస్తుండగా మనకు సులభమైన రీతిలో రూపాయ లలో వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగించింది. మనదేశ ఆర్థిక ప్రగతికి ‘ఉక్కు’ కర్మాగారం నిర్మించమని మనం కోరితే ఇంగ్లండ్‌ వంటి దేశాలు ‘మీకు ఒక్క ఫ్యాక్టరీ దేనికి? సైనిక ఫ్యాక్టరీ పెట్టుకోమని హేళన’ చేశాయి. భిలాయ్‌లో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమకు నాంది పలికే సహకారం అందించింది సోవియట్‌ యూనియన్‌.

నాటి యూఎస్‌ఎస్‌ఆర్‌ సోషలిస్టు శిబిరం నేడు లేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి వ్యతిరేక వాతావరణం గమని స్తున్నాం. సృష్టిలో మారనిది అంటూ ఏదైనా ఉంటే అది మార్పు అన్నారు మార్క్స్‌. అందువలన భౌతిక వాస్తవిక పరిస్థితిలో వస్తున్న మార్పులేమిటి? వాటి ప్రభావం శ్రామిక వర్గంపైన వాటి రాజకీయ పార్టీలపైన ప్రభావం ఏమిటి? నిర్దుష్టంగా ఆ మార్పుల కనుగుణంగా ఏ చర్యలు చేపట్టాలి? అన్నవి పరిశీలనార్హం.

ఇక మనదేశంలో మాత్రం చాతుర్వర్ణ వ్యవస్థ అనే నిచ్చెనమెట్ల వంటి కుల అణచివేత హిందూమత సిద్ధాంతాలలో ముఖ్యమైనదిగా ఉంది. దేశంలో వచ్చిన ఆర్థిక, రాజకీయ, మార్పుల ఫలితంగా శూద్ర కులాలే ఆధిపత్య కులాలుగా, అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తు న్నాయి. వర్ణవివక్ష, అంటరానితనం, అత్యంత వెనుకబడిన కులాలపై అణచివేత, స్త్రీలను హీనంగా చూడటం, వీరిపై అన్నిరకాల దోపిడీ, దౌర్జన్యం, అత్యాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ దశలో లెనిన్‌వలే సృజనాత్మకంగా మౌలికమైన శ్రమ దోపిడీని వ్యతిరేకించ డంతోపాటు కమ్యూనిస్టులు, ఆ సామాజిక శక్తులతో మమేకమై, ద్విముఖ పోరాటాన్ని నిర్వహించాలి. ‘కొటేషన్లదేముందయ్యా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌.. వంటి నేతల రచనల నుంచి ఎన్నైనా ఇవ్వ వచ్చు. కావలసింది ప్రత్యేక పరిస్థితులకు వానిని అన్వయించడం’ అని సుందరయ్య అనేవారు.

మనకాలంలో మనిషిని మనిషి దోచుకునే రూపం మారింది కానీ మానవ సమాజ దోపిడీ మాత్రం మరో రూపంలో మరింత నాజూకు గానైనా, అధికంగా సాగుతున్నది. నగ్నంగానే కలవారు, లేనివారు అనే భేదం మున్నెన్నడూ లేనంతగా స్పష్టంగా కానవస్తున్నది. గతంలో వలెనే, నేడు కూడా వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామికులూ, పీడితులు, అణచివేతకు గురవుతున్న వారు అందరూ కలసి పోరాడక తప్పదు. నేడు దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చూస్తున్నాము. మావోయిస్టుల సాయుధ పోరాటం గానీ, కమ్యూనిస్టుపార్టీల పార్ల మెంటరీ, పార్లమెంటరీయేతర పోరాటాలు కానీ ఆ ద్విముఖ పోరా టంలో భాగమే.

వివిధ కారణాలతో ఈ పోరాటంలో ముందు వెను కలు ఉండవచ్చు. కానీ చరిత్ర నిర్మాతలైన ప్రజలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుని నూతన సోషలిస్టు వ్యవస్థకు దారి తీస్తారు. అమెరికాలో రెండేళ్ల క్రితం వచ్చిన వాల్‌ స్ట్రీట్‌పై దాడి ఉద్యమ ప్రథమ నినాదం ఏమిటి? మేము (సామాన్య ప్రజానీకం, కష్టజీవులూ అణిచివేతకు గురవుతున్న వాళ్లం) 99 శాతం, మీరు దోపిడీదారులు, ప్రగతి నిరో ధకులు కలిపి 1 శాతం! అదీ వాస్తవం!
నవంబర్‌ 7 సోవియట్‌ యూనియన్‌ శతజయంతి సందర్భంగా, ఆ చారిత్రక పరిణామ దిశా దశల ఆధారంగా ఈ మహత్తర గుణాత్మక మార్పులో మనమూ భాగస్వాములు అవగలమని ఆశిద్దాం!
(నవంబర్‌ 7న సోవియట్‌ రష్యా విప్లవ దినోత్సవ శత జయంతి)

ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు ‘ 98480 69720

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement