Second World War
-
భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి
మిలన్: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీకి విశేష సేవలందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు ఆ దేశసైన్యం ఘన నివాళులర్పించింది. ఇందులో భాగంగా ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు స్మారక స్థూపాలను నిర్మించి ఆవిష్కరించింది ఇటలీ మాంటోన్. ఈ కార్యక్రమానికి ఇటలీ భారత అంబాసిడర్ డా. నీనా మల్హోత్రా తోపాటు రక్షణశాఖ ప్రతినిధులు, ఇటలీ దళాల ప్రతినిధులు అక్కడి ప్రజలు పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఇటలీకి వెన్నుదన్నుగా నిలిచిన భారత సైనికులు ఆనాడు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తమ విధులను నిర్వర్తించారు. సుమారు 50 వేల మంది ప్రాతినిధ్యం వహించిన 4,8,10వ డివిజన్ బెటాలియన్లతో కలిసి వీరంతా వీరోచితంగా పోరాడారు. ఆనాటి యుద్ధకాండలో 23,722 మంది భారత సైనికులు అసువులుబాశారు. వీరందరినీ ఇటలీ వ్యాప్తంగా కామన్ వెల్త్ యుద్ధ స్మశానవాటికల్లో సమాధి చేశారు. ఈ సందర్బంగా భారత సైన్యానికి చెందిన వి.సి. నాయక్ యశ్వంత్ గాడ్గేకు సన్ డయల్ స్మారక స్థూపాన్ని నిర్మించి ఇటలీ అత్యున్నత సైనిక పురస్కారం విక్టోరియా క్రాస్ బహూకరించారు. యశ్వంత్ గాడ్గే యుద్ధంలో ఎగువ టైబర్ లోయలో పోరాటం చేస్తూ వీరమరణం చెందారు. కార్యక్రమంలో మొత్తం 20 మందికి విక్టోరియా క్రాస్ పురస్కారాన్ని బహుకరించగా అందులో ఆరుగురు భారతీయ సైనికులే కావడం విశేషం. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
Noor Inayat Khan: స్పై ప్రిన్సెస్
కలం పట్టి కవితలు రాసిన అమ్మాయి రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. పియానోతో సుస్వరాలు వినిపించిన అమ్మాయి ఫిరంగి ధ్వనులు వినిపించే చోట పనిచేసింది. నూర్ ఇనాయత్‌ఖాన్ అనేది నామం కాదు నాజీలను వణికించిన శబ్దం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్–ఇండియా తొలి మహిళా గూఢచారి నూర్ గురించి... నూర్ ఇనాయత్ ఖాన్ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె గురించి ఈ తరానికి తెలియజేయడానికి నాటక రూపంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ఇండియా తరఫున నియామకం అయిన తొలి మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్. ఆమె సాహసిక జీవితంపై రూపొందించిన ‘నూర్’ నాటకాన్ని ఈ నెలలో లండన్‌లోని సౌత్‌వార్క్ ప్లే హౌజ్‌లో ప్రదర్శించబోతున్నారు. ‘ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అని ఆశ్చర్యపోయేంత జీవితం ఆమెది’ అంటారు ‘నూర్’ నాటక రచయిత్రి అజ్మా దార్. నూర్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.... తండ్రి పేరు ఇనాయత్‌ఖాన్. బాంబే ప్రెసిడెన్సీలో జన్మించాడు. పూర్వీకులు టిప్పు సుల్తాన్ వంశస్థులు. ఇనాయత్‌ఖాన్ సూఫీ గురువు. సంగీతకారుడు. ‘ది సూఫీ ఆర్డర్ ఇన్ ది వెస్ట్’ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా సూఫీ భావజాలాన్ని పాశ్చాత్య సమాజానికి పరిచయం చేశాడు. నూర్ తల్లి అమెరికన్. రే బేకర్ అనే ఆమె పేరు పెళ్లి తరువాత అమీనా బేగంగా మారింది. చిన్న వయసులోనే రచయిత్రిగా తన కెరీర్ మొదలుపెట్టింది నూర్. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కవిత్వంతోబాటు, పిల్లల కథల పుస్తకాలను ప్రచురించింది. బుద్దిస్ట్ జాతక కథల స్ఫూర్తితో ‘ట్వంటీ జాతక టేల్స్’ అనే పుస్తకాన్ని రాసింది. పిల్లల పత్రికలకు రెగ్యులర్‌గా రచనలు చేస్తుండేది. ఫ్రెంచ్ రేడియో కోసం రచనలు చేసేది. ‘చైల్డ్ సైకాలజీ’ చదువుకున్న నూర్ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. పియానో అద్భుతంగా వాయించేది. రెండో ప్రపంచ యుద్ధం నాటి కల్లోల కాలం అది. ఎటు చూసినా భయం రాజ్యమేలుతున్న ఆ కాలంలో కుటుంబాన్ని తీసుకొని ఇంగ్లాండ్‌కు వెళ్లాడు ఇనాయత్‌ఖాన్. మొదట పోర్ట్ సిటీ సౌత్ హాంప్టన్లో ఒక తత్వవేత్త దగ్గర ఆశ్రయం పొందారు. తండ్రి చనిపోయే నాటికి నూర్ వయసు పదమూడు సంవత్సరాలు. సున్నిత స్వభావి. కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లేది కాదు. చాలా తక్కువగా మాట్లాడేది. అలాంటి నూర్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. తల్లి తరువాత ఇంటికి తానే పెద్ద. ఒకవిధంగా చెప్పాలంటే చిన్న వయసులోనే తన కుటుంబానికి పెద్ద అండగా నిలబడింది. కుమార్తెలో వచ్చిన మార్పు చూసి తల్లి ఆశ్చర్యపోయేది! నవంబర్, 1940లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ (డబ్ల్యూ ఎఎఎఫ్)లో చేరి వైర్లెస్ ఆపరేటర్‌గా శిక్షణ పొందింది. ఆ తరువాత ‘బాంబర్ ట్రైనింగ్ స్కూల్’లో చేరింది. సీక్రెట్ బ్రిటిష్ వరల్డ్ వార్–2 ఆర్గనైజేషన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో నియామకం అయింది. ప్రత్యేక శిక్షణ తీసుకొని నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో అండర్ కవర్ వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేసింది. ఈ విధులు నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేయడం అంటే చావుకు చాలా సమీపానికి వెళ్లడం. ఒళ్లు జలదరించే ఎన్నో భయానక అనుభవాలు కళ్ల ముందున్నాయి. అయినా భయపడింది లేదు. దురదృష్టకరమైన పరిస్థితులలో నాజీలకు చిక్కి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చిత్రహింసలకు గురై చనిపోయింది. ధైర్యసాహసాలకు ఇచ్చే జార్జ్ క్రాస్ పురస్కారాన్ని నూర్ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది?... ఇలాంటి సందేహాలకు ‘స్పై ప్రిన్సెన్స్–ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’లాంటి రచనలు సవివరంగా సమాధానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో తాజా నాటకం ‘నూర్’ అనేది మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది? -
‘సీలాండ్'.. దేశ జనాభా 27 మంది మాత్రమే!
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సఫోక్ సముద్ర తీరానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వింతదేశం పేరు ‘సీలాండ్’. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవ నిర్మిత ప్రదేశం ఇది. ఒక మానవ నిర్మిత ప్రదేశమే దేశంగా ఏర్పడటం దీని ప్రత్యేకత. ఇది 1967 సెప్టెంబర్ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ ఇక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను నిర్మించుకుంది. యుద్ధం ముగిశాక ఖాళీగా మిగిలిన ఈ కోటకు జాక్ మూరే, అతని కూతురు జేన్ చేరుకున్నారు. వాళ్లిద్దరూ ‘వండర్ఫుల్ రేడియో లండన్’ అనే పైరేట్ రేడియో స్టేషన్ తరఫున ఇక్కడకు వచ్చారు. ఆ పైరేట్ రేడియో స్టేషన్ అధినేత ప్యాడీ రాయ్ బేట్స్ 1967 సెప్టెంబర్ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉన్నాయి. ఈ దేశం తన పౌరులకు పాస్‌పోర్టులూ ఇస్తోంది. ఈ దేశ జనాభా 27 మంది మాత్రమే! చదవండి: World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే! -
ఉక్రెయిన్ ఆర్మీ ఆసక్తికర ప్రకటన!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 30వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరవైపుల నుంచి శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా.. యుద్ధంతో నష్టం ఇరువైపులా భారీగానే నమోదు అవుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ ఆర్మీ చేసిన ప్రకటన ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ యుద్ధాన్ని రష్యా మే 9వ తేదీన ముగించాలని భావిస్తోందని ఉక్రెయిన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తేదీనే ఎందుకనే దానికీ ఒక ప్రత్యేకత ఉంది. నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. కాబట్టి, అదే రోజున ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి.. ప్రకటన చేసుకునే(ఎలాంటిదనేది చెప్పలేదు) అవకాశం ఉందని రష్యా ఆర్మీ అంచనా వేస్తోంది. విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే సెలవుదినం. ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మ్డ్ బలగాల్లోని జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ విభాగపు సమాచారం ప్రకారం ఉక్రెయిన్ ఆర్మీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు.. ది కీవ్ ఇండిపెండెట్ మీడియా హౌజ్ ట్వీట్ చేసింది. ⚡️Ukrainian army: Russia wants to end war by May 9. According to intelligence from the General Staff of the Armed Forces of Ukraine, Russian troops are being told that the war must end by May 9 – widely celebrated in Russia as the day of victory over the Nazi Germany. — The Kyiv Independent (@KyivIndependent) March 24, 2022 ఉక్రెయిన్ పౌరుల కిడ్నాప్! ఇదిలా ఉండగా రష్యాపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలకు దిగింది. ఉక్రెయిన్ నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నాయని, తద్వారా వాళ్లను బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ మేరు 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను (అందులో 84,000 మంది పిల్లలు) కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ ఆంబుడ్స్మన్ ల్యుద్‌మైల డెనిసోవా ఆరోపిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. -
హిట్లర్ వదిలేసినా.. పుతిన్ చేతిలో ఖతమయ్యాడు!
ఉక్రెయిన్ యుద్ధంలో ఒక్కొక్కరి ఒక్కో గాథ. రోజుకో కథ బయటకు వస్తోంది. కదన రంగంలో అడుగుపెట్టడం దగ్గరి నుంచి.. ప్రాణత్యాగాల దాకా ప్రపంచాన్ని కదిలిస్తున్న కథలెన్నో. ఈ తరుణంలో హిట్లర్ సైన్యం చేతుల్లోంచి తప్పించుకున్నా.. ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైన ఓ పెద్దాయన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బోరిస్ రోమన్చెన్కో.. 96 ఏళ్ల ఈ పెద్దాయన శుక్రవారం జరిగిన దాడుల్లో దుర్మరణం పాలయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బుచెన్వాల్ద్ డోరా ఇంటర్నేషనల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు ఈయన. ఖార్కీవ్లో ఆయన ఉంటున్న అపార్టెమెంట్ మీద రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బోరిస్ రోమన్చెన్కో చనిపోయినట్లు Buchenwald concentration camp మెమోరియల్ ఇనిస్టిట్యూట్ తన అధికారిక ట్విటర్ పేజీ వెల్లడించింది. రోమన్చెన్కో.. 1943 రెండో ప్రపంచ చుద్ధం సమయంలో బుచెన్వాల్ద్ కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించబడ్డాడు. అక్కడ నాజీ సైన్యం చేతిలో చిత్రవధ అనుభవించి.. సుమారు 53 వేలమందికి పైగా చంపబడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ అతికొద్ది మందిలో ఈయన ఒకడు. ఆయన అదృష్టం ఎలా ఉందంటే.. అదే ఏడాది డోరా- మిట్టెలాబూ కాన్సెంట్రేషన్ క్యాంప్‌లో, ది బెర్గెన్ బెల్సెన్, పీనెమిండె క్యాంప్‌లోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. Romanchenko మృతిపై రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులెబ ట్విటర్లో స్పందించారు. హిట్లర్ చేతి నుంచి తప్పించుకున్నా.. పుతిన్ చేతిలో హతమయ్యాడంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక Holocaust survivorగా 2012లో బుచెన్వాల్డ్ లిబరేషన్ వేడుకల్లో రోమన్చెన్కో పాల్గొన్నాడు. Borys Romanchenko, 96, survived four Nazi concentration camps: Buchenwald, Peenemünde, Mittelbau-Dora, Bergen-Belsen. He lived his quiet life in Kharkiv until recently. Last Friday a Russian bomb hit his house and killed him. Unspeakable crime. Survived Hitler, murdered by Putin. pic.twitter.com/QYJ4xrNYC9 — Dmytro Kuleba (@DmytroKuleba) March 21, 2022 నాలుగు శరణార్థ క్యాంపుల్లోనూ ప్రాణాలతో బయటపడ్డ రోమన్చెన్కోను యమజాతకుడిగా ఆయన్ని అభివర్ణిస్తుంటారు ఉక్రెయిన్ ప్రజలు. తిరిగి 2018లోనూ ఆయన్ని ఖార్కీవ్‌కు చెందిన ఓ న్యూస్‌పేపర్ ఇంటర్వ్యూ చేసింది కూడా. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నుంచి రోమన్చెన్కో మరణంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: నేడు భారతీయులకు అండగా పోలండ్.. మరి ఆనాడు..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలమంది భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులకు పరుగెడుతున్నారు.. అలా వస్తున్న మనవారికి పోలండ్ సహకరిస్తోంది.. విమానాల ద్వారా భారత్‌కు వెళ్లేందుకు తోడ్పడుతోంది. ఇది ఈనాటి దృశ్యం.... కానీ ఒకప్పుడు దీనికి రివర్స్‌గా జరిగింది తెలుసా? పోలండ్ నుంచి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తే.. ఇక్కడ ఒక ‘గుడ్ మహారాజా’ వాళ్లను ఆదరించారు. ఆ విశేషాలు ఇవి.. – సాక్షి సెంట్రల్‌డెస్క్ అప్పుడేం జరిగిందంటే.. ..దాదాపు 80 ఏళ్ల క్రితం.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ చేతిలో పోలాండ్ అతలాకుతలం అవుతున్న సమయం. యుద్ధ సంక్షుభిత పోలండ్ నుంచి, సోవియట్ అధీనంలోని జైళ్ల నుంచి.. పోలండ్ చిన్నారులను శరణార్థులుగా వదిలివేశారు. 1942లో సోవియట్ సైన్యం.. రెండేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికిపైగా పిల్లలను ఓ నౌకలో ఎక్కించి పంపించేసింది. ఆ షిప్‌ను ఏ నౌకాశ్రయంలో ఆపినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఆశ్రయం ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఆ నౌక ప్రస్తుత గుజరాత్ తీరంలోని నవానగర్‌కు చేరింది. నవానగర్ రాజు ‘జామ్‌సాహెబ్ దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా’ ఎంతో పెద్ద మనసుతో వారిని అక్కున చేర్చుకున్నారు. ది గుడ్ మహారాజా స్క్వేర్ మీరందరూ నా పిల్లలే.. పోలండ్ నుంచి వచ్చిన చిన్నారుల్లో దాదాపు అందరూ అనాథలుగా మిగిలినవారే. దీనిపై చలించిపోయిన నవానగర్ మహారాజు ఆ పిల్లలెవరినీ అనాథలుగా చూడొద్దని, వారంతా నవానగర్ పౌరులని, రాజ్యాధినేతగా తాను వారికి తండ్రిలాంటి వాడినని ప్రకటించారు. ఆ పిల్లల కోసం ప్రత్యేక క్యాంపులు, పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వైద్యం అవసరమైన వారికి చికిత్స చేయించారు. అలా నాలుగేళ్లపాటు వారి ఆలనాపాలనా చూసుకున్నారు. వారు కూడా నవానగర్ మహారాజును ‘బాపూ (తండ్రి)’గా పిలుచుకునేవారు. పోలండ్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత 1946 నుంచి దశలవారీగా వారు తిరిగి తమ స్వదేశానికి చేరుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. మన దేశం నుంచి బ్రిటీష్‌వారు వెళ్లిపోవాలంటూ క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయమది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న ఆ సమయంలో ఐరోపా దేశాల పిల్లలను ఆదుకునేందుకు నవానగర్ మహారాజు చూపిన చొరవ ప్రశంసలు పొందింది. ఇంత ఘనత పొందిన నవానగర్ మహారాజు 1966లో కన్నుమూశారు. పోలండ్‌లో.. మన మంచి మహారాజు నవానగర్ మహారాజు చూపిన ఔదార్యానికి పోలండ్ మర్చిపోలేదు. పోలిష్ రిపబ్లిక్‌గా ఏర్పాౖ టెన తర్వాత ఆ దేశ అత్యున్నత అవార్డు అయిన ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్’తో ఆయన్ను గౌరవించింది. వార్సా నగరంలోని హైస్కూల్‌కు ‘మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ, రంజిత్‌సింగ్‌జీ జడేజా’ పేరు పెట్టింది. అంతేకాదు.. 2013లో వార్సాలోని ఓ జంక్షన్‌కు ‘ది గుడ్ మహారాజా స్క్వేర్’ అని నామకరణం చేసింది. -
మన తొలి ప్రభుత్వం అలా ఏర్పడింది.. ఆయన ప్రధానైతే కథ వేరేలా.. !
ఈ సువిశాల భారతం ఒకే ప్రభుత్వం కింద ఉన్న కాలం చరిత్రలో తక్కువే. క్రీస్తుపూర్వమో, మధ్య యుగాలలోనో కొంతకాలం కొంతమంది మన పాలకులు మొత్తం భారతావనిని పాలించే అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు కూడా కొన్ని భూభాగాలు చక్రవర్తులో, పాదుషాలో వారి అధీనంలో లేవు. అయినా యావద్భారతావనిని వారు ఏలారని అనుకోవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశం కోల్పోయిన ఆ అవకాశం మళ్లీ 1946లోనే వచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికనే కావచ్చు, అప్పుడే భారత దేశానికి భారతీయులతో కూడిన ప్రభుత్వం కొలువైంది. ఇది చరిత్రలో అపురూపం. రాజకీయ ఏకత్వానికి ఆధునిక యుగంలో అదే తొలి అడుగు. కొద్దినెలలే అయినా ఆ తాత్కాలిక సంకీర్ణం అఖండ భారతాన్ని పాలించిందన్న విషయం ప్రత్యేకమైనదే. కానీ రక్తపాతాల మధ్య భారత విభజన పనిని పూర్తి చేసినదీ ఆ ప్రభుత్వమే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తన వలస దేశాలలో యూనియన్ జాక్‌ను అవనతం చేయాలని ఇంగ్లండ్ నిర్ణయించుకుంది. ఎంత ఇష్టం లేకపోయినా అలా వదులుకోవలసిన దేశాలలో భారత్ మొదటిది. దీనికి తొలిమెట్టు పాలనా వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం పక్కకు తొలగి, జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడమే. బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కావలసిందని వైస్రాయ్ లార్డ్ ఆర్చిబాల్డ్ వేవెల్ 1946 జూలై 22న భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూకు, ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు లేఖలు రాశాడు. ఆ ప్రభుత్వంలో 14 శాఖలు ఉంటాయనీ, ఆరు కాంగ్రెస్‌కు, ఐదు లీగ్‌కు, మైనారిటీలకు మూడు వంతున ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా అదే లేఖలో వివరించాడు వేవెల్. ముఖ్యమైన శాఖల విషయంలో కాంగ్రెస్, లీగ్‌ల మధ్య సమతౌల్యం పాటిస్తామనీ చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరూ నిరాకరించారు. భారత కార్యదర్శి సలహా మేరకు వేవెల్ ముస్లింలీగ్‌ను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 1946 ఆగస్ట్ 12న కాంగ్రెస్‌ను ఆహ్వానించాడు. అదే సమయంలో తన ప్రతిపాదనలు ఏమైనప్పటికీ వాటిని జిన్నాతో చర్చించే అధికారం కూడా అప్పగించాడు వేవెల్. నెహ్రూ జిన్నాతో చర్చించారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. మరొక పక్క మత కల్లోలాలు తీవ్రమవుతున్నాయి. నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి తప్పు చేశానేమోనని వేవెల్ శంకించడం మొదలుపెట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో దేశంలో తిరుగుబాటు వస్తుందేమోనని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భయపడ్డాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా వైస్రాయ్ వేవెల్ తీసుకున్నాడు. ఇన్ని పరిణామాల తరువాత 1946 సెప్టెంబర్ 2న కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ ప్రభుత్వంలో చేరేవారిని అంతకు ముందే ఆవిర్భవించిన భారత రాజ్యాంగ పరిషత్ నియమించింది. భారత రాజ్యాంగ పరిషత్‌లో 389 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో 292 మందిని 11 ప్రావిన్సుల శాసనసభల ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. 93 మంది సంస్థానాల ప్రతినిధులు. మరొక నలుగురు ఢిల్లీ, అజ్మీర్–మార్వాడా, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్తాన్ల నుంచి వచ్చిన సభ్యులు. 1946 ఆగస్ట్ నాటికి 11 ప్రావిన్స్‌ల చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. అంటే 292 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ 208 స్థానాలు గెలిచింది. ముస్లింలీగ్ 73 స్థానాలు గెలిచింది. హిందువులు ఆధిక్యం ఉన్నచోట కాంగ్రెస్, ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట లీగ్ ప్రధానంగా గెలిచాయి. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా, ముస్లిం లీగ్ కాంగ్రెస్‌కు సహకరించడానికి నిరాకరించింది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఒక విస్తృత ధ్యేయాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియను సజావుగా సాగించి, అధికార బదలీని వేగవంతం చేయడానికి అది ఏర్పాటైందన్నది నిజం. బ్రిటిష్ ప్రభుత్వం విన్నపం మేరకు కాంగ్రెస్ ఇందులో చేరడానికి అంగీకరించింది. మరోవైపు ముస్లింల కోసం వేరొక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని లీగ్ కొత్త కోర్కెను తెర మీదకు తెచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో మెజారిటీ కాంగ్రెస్‌దే కాబట్టి, కాంగ్రెస్ అంటే హిందువుల సంస్థ అనే లీగ్ నిశ్చితాభిప్రాయం కాబట్టి లీగ్ ఈ గొంతెమ్మ కోర్కె కోరింది. తమతో కలసి పనిచేయడానికి లీగ్ నిరాకరించినందున పార్టీకే చెందిన 12 మందిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ముస్లింలు. తరువాత మనసు మార్చుకున్న ముస్లిం లీగ్ అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కానీ తమ మంత్రులు నెహ్రూకు జవాబుదారీగా ఉండబోరని షరతు పెట్టింది. ముగ్గురు ముస్లిం లీగ్ సభ్యులకు అవకాశం కల్పించడానికి వీలుగా ముగ్గురు కాంగ్రెస్ వారు రాజీనామా చేశారు. వారు శరత్చంద్ర బోస్, సయ్యద్ అలీ జహీర్, షఫత్ అహ్మద్ ఖాన్. తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక విభాగానికి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనుబంధంగా పని చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా (అధ్యక్షుడు వైస్రాయ్), జవహర్లాల్ నెహ్రూ ఎంపికయ్యారు. విదేశ వ్యవహారాలు, కామన్వెల్త్ శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వల్లభ్‌భాయ్ పటేల్ (హోం, సమాచార, ప్రసార శాఖలు), బల్దేవ్ సింగ్ (రక్షణ), డాక్టర్ జాన్ మత్తయ్ (పరిశ్రమలు, రవాణా), సి. రాజాజీ (విద్య, కళలు), సిహెచ్ భాభా (పనులు, గనులు, విద్యుత్), బాబూ రాజేంద్ర ప్రసాద్ (ఆహారం, వ్యవసాయం), అసఫ్ అలీ (రైల్వే), జగ్జీవన్ రావ్ (కార్మిక), ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ ఖాన్ (ఆర్థిక), టిటి చుంద్రిగర్ (వాణిజ్యం), అబ్దుర్ రబ్ నిష్తార్ (కమ్యూనికేషన్లు), గజాన్ఫార్ అలీ ఖాన్ (ఆరోగ్యం), జోగీంద్రనాథ్ మండల్ (న్యాయం. ఈయన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించి, తరువాత భారత్ వచ్చారు). భారత్‌లో తొలిసారి భారతీయులతో ఏర్పడిన సంకీర్ణం ఏర్పాటులో గాంధీజీ పాత్ర ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నెహ్రూ ఎంపిక కావాలన్న తన ఆకాంక్షను 1946 ఏప్రిల్ 20న గాంధీజీ వ్యక్తం చేశారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడే ఎన్నికవుతాడు. నిజానికి ఆ పదవిని తాను కూడా ఆశించానని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ కాకుండా 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు గాను 12 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ఎన్నుకున్నాయి. మిగిలిన మూడు కమిటీలు ఓటు చేయలేదు. ఈ సంగతి స్వయంగా గాంధీజీయే నెహ్రూకు చెప్పారు. రెండో స్థానం నెహ్రూకు ఆమోదయోగ్యం కాదనీ గాంధీయే చెప్పడంతో పటేల్ నెహ్రూకు అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం 1947 ఆగస్ట్ 15 వరకు పనిచేసింది. గాంధీజీ కోరుకున్నట్టు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ నిర్మాణం పూర్తి చేసింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం సర్దార్ పటేల్ కన్నుమూశారు. మరి...ఆయనను ప్రధానిని చేసి ఉంటే? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
3,518 మంది హత్య.. 75 ఏళ్ల తర్వాత విచారణ
-
3,518 మంది హత్యలకు సహకారం.. 75 ఏళ్ల తర్వాత విచారణ
బెర్లిన్: అడాల్ఫ్ హిట్లర్ పేరు చేబితే ఇప్పటికి జర్మనీలో కొందరు వణికిపోతారు. అవును మరి అతడు చేసిన దురాగతాలకు లెక్కే లేదు. జర్మనీ నియంతగా మారిన తర్వాత హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. దేశం మొత్తం జల్లెడ పట్టి.. యూదులను ఊచకోత కోశాడు. ఏకంగా కాన్సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి.. యూదులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. దాదాపు ఏడున్నర లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో రాక్షసంగా మరణించారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నియంత పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే.. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన డెబ్భైఐదు సంవత్సరాల తర్వాత జర్మనీ కోర్టు.. మాజీ నాజీ కాన్సంట్రేషన్ గార్డు ఒకరిని విచారిస్తుంది. జర్మనీ చట్టాల ప్రకారం నిందితుడి పేరు వెల్లడించలేదు. సదరు గార్డు 1942 నుంచి 1945 వరకు సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో క్యాంప్ గార్డ్‌గా పనిచేశాడు. సదరు గార్డు 3,518 మంది హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని, సెషన్ రోజుకు రెండున్నర గంటలకు పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. ప్రాసిక్యూటర్ల ప్రకారం, ప్రస్తుతం 100 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి 75 ఏళ్ల క్రితం నిర్బంధ శిబిరం వద్ద గార్డుగా పని చేశాడు. ఆ సమయంలో అతడు 3,518 హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన క్యాంప్ గార్డుపై 1942 లో మాజీ సోవియట్ యుద్ధ ఖైదీలను కాల్చడం, విషపూరిత వాయువు జైక్లాన్ బీని ఉపయోగించడంతో సహా ఉరితీయడానికి సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో కనీసం 2,00,000 మందిని ఖైదు చేయగా.. 20,000 మందిని హత్య చేశారు. ఈ ఆరోపణల విచారణల నేపథ్యంలో ప్రాసిక్యూటర్ నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాడు, ఆ తర్వాత అతను విచారణకు ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించారు. గత నెలలో జర్మనీ కోర్టు 95 ఏళ్ల నాజీ గార్డుని విచారించినట్లు తెలియజేసింది. అక్టోబర్ 1943 నుంచి ఏప్రిల్ 1945 వరకు స్టాలగ్ 6సీ బాథోర్న్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సదరు వ్యక్తి గార్డుగా పని చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనేక మంది మాజీ సోవియట్ సైనికులు స్టాలగ్ 6సీ బాథోర్న్ శిబిరంలో పెద్ద సంఖ్యలో మరణించినట్లు నివేదిక తెలిపింది. తరువాత దీనిని పోలిష్ దళాలు విముక్తి చేశాయి. ఇక ఈ ఏడాది మార్చిలో, ప్రాసిక్యూటర్లు అమెరికా నుంచి బహిష్కరించబడిన 95 ఏళ్ల మాజీ నాజీ డెత్ క్యాంప్ గార్డ్ ఫ్రెడరిక్ కార్ల్ బెర్గర్‌పై కేసును కొట్టేశారు. బెర్గర్‌ను విచారించడానికి తగిన సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టేస్తేన్నట్లు కోర్టు తెలిపింది. -
పిల్లలాడుకునే బొమ్మనుకుని ‘చావు’తో ఆడుకున్నారు..
వాషింగ్టన్: భార్యాభర్తలు పిల్లలతో కలిసి సరదాగా పిక్నిక్కు వెళ్లారు. అక్కడ నదిలో వారికి ఓ వింత వస్తువు కనిపించింది. చూడ్డానికి పిల్లలాడుకునే బొమ్మలా ఉన్న దాంతో కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఆ వస్తువును వారు నదిలో ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టారు. ఆ తర్వాత వస్తువు గురించి నిజం తెలిసి ఒక్కసారిగా గుండె జారినంత పనయ్యింది. ఎందుకంటే వారు పార్క్‌లో ఆడుకున్న వస్తువు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పేలని బాంబు. చదువుతుంటేనే గుండె జారి పోతుంది కదా.. ఆ వివరాలు.. అమెరికాకు చెందిన డేవిడ్, కరెన్ హబ్బర్ట్ తమ పిల్లలతో కలిసి నాటింగ్హామ్షైర్లోని నెవార్క్‌లోని థోర్స్బీ పార్క్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో డేవిడ్‌కు పక్కనే ఉన్న నదిలో ఓ వింత వస్తువు కనిపించింది. దాన్ని తెచ్చి భార్యకు చూపించాడు. ఈ ఇనుప వస్తువును చూస్తే.. ఏదో పేలుడు పదార్థంలాగా అనిపిస్తుంది అన్నాడు. కానీ డేవిడ్ భార్య అతడి మాటలు కొట్టి పారేసింది. దాన్ని కేవలం పిల్లలు ఆడుకునే వస్తువుగా తేల్చింది. దాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చాడో.. అక్కడే పెట్టమంది. భార్య మాట ప్రకారం డేవిడ్ దాన్ని నదిలో పెట్టేసి వచ్చాడు. ఆ తర్వాత వారు బాంబుకు పది మీటర్ల దూరంలో పిల్లలతో కలిసి చేపలు పట్టారు.. ఆడుకున్నారు.. తిరిగి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కరెన్ థోర్స్బీ పార్క్ ఫేస్బుక్ పేజ్‌లో తాము కనుగొన్న వస్తువు గురించి చూసి ఆశ్చర్యపోయింది. ఆ పోస్ట్ మొత్తం చదివి భయంతో కుప్పకూలింది. పార్క్ వారు తెలిపిన వివరాల ప్రకారం.. డేవిడ్ కనుగొన్న ఆ మెటల్ వస్తువు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబని.. దాని నుంచి దూరంగా ఉండాలని.. పట్టుకోవద్దని సూచించింది. పార్క్‌లో ఎక్కడైనా ఇలాంటి మెటల్ వస్తువులు కనిపిస్తే.. వెంటనే తమ పార్క్ సిబ్బందికి తెలపాలని.. వారు దాన్ని జాగ్రత్తగా డిఫ్యూజ్ చేస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా కరెన్ మాట్లాడుతూ.. ‘‘నిజం తెలిసిన తర్వాత దీని గురించి నా భర్తకు తెలపాలంటే భయపడ్డాను. నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు. నేను షాకయ్యాను’’ అన్నది. ఇక గతంలో ఈ పార్క్ రెండో ప్రపంచ యుద్ధ స్థావరంగా ఉండేదని తర్వాత తెలిసింది. చదవండి: రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు -
ఏకే–47 అంటే ఏమిటీ, ఆ పేరెలా వచ్చింది?
సాక్షి, న్యూఢిల్లీ : ఏకే–47. ఈ పేరు వినగానే ఎవరికైనా అత్యాధునిక తుపాకీ అని అర్థం అవుతుంది. దీన్ని దేశాల మధ్య జరిగే యుద్ధాల్లోనే కాకుండా విప్లవాల్లో, సామాజిక తిరుగుబాట్లలో ఉపయోగించగా, అటు టెర్రరిస్టులు, ఇటు మావోయిస్టులు కూడా ఇప్పుడు వినియోగిస్తున్నారు. ఇది ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం సర్వకాల సర్వ పరిస్థితుల్లో, అంటే అత్యధిక వర్షం కురిసే రెయిన్ ఫారెస్టుల్లో, వడగాలులు వీచే ఎడారుల్లో, అతి శీతల మంచు కొండల్లో ఇది పని చేస్తుంది. అందుకే ప్రస్తుతం భారత్ వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్లు మంచు ప్రాంతంలో పనిచేయక పోతుండడంతో, వాటి స్థానంలో ఏకే–47 రైఫిళ్లును రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఆ దేశంతో బుధవారం ఒప్పందం చేసుకుంది. ఏకే–47 తుపాకీ మోడల్ ఇంతకు ఏకే–47 తుపాకులంటే ఏమిటీ? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏకే అంటే ఆటోమాట్ కలష్నికోవ అని, 47 అంటే 1947 సంత్సరం అని పూర్తి అర్థం. సోవియట్ యూనియన్‌కు చెందిన మిహాయిల్ కలష్నికోవ దీన్ని కనిపెట్టడంతో ఆయన పేరు మీదనే ఇది ప్రఖ్యాతిచెందింది. మొదట్లో సోవియెట్ సైన్యం కోసం వీటిని రహస్యంగా తయారు చేశారు. 1919, నవంబర్ 10వ తేదీన జన్మించిన కలష్నికోవ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియెట్ యుద్ధ ట్యాంక్ మెకానిక్‌గా పని చేశారు. 1941లో సోవియెట్‌పై జర్మనీ దురాక్రమణ జరిపినప్పుడు ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోవియెట్ సైనికుల వద్ద శక్తివంతమైన తుపాకులు లేకపోవడం వల్లనే వారితో పాటు తాను గాయపడాల్సి వచ్చిందని కలష్నికోవ భావించారు. అలాంటి తుపాకుల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ పరంపరలో అనేక మోడళ్ల అనంతరం ఆయన ఏకే–47 తుపాకీ మోడల్‌ను తయారు చేయగలిగారు. 1947లో మొట్టమొదటి సారిగా సోవియెట్ వీటి ఉత్పత్తిని ప్రారంభించింది. 1949లో దీన్ని అసాల్ట్ రైఫిల్‌గా సోవియట్ ఆర్మీ స్వీకరించింది. వార్సా ఒప్పందం ద్వారా ఈ తుపాకులు వివిధ దేశాలకు చేరాయి. వియత్నాం, అఫ్గానిస్థాన్, కొలంబియా, మొజాంబిక్ విప్లవాల్లో ఏకే–47 తుపాకులను ప్రధానంగా ఉపయోగించారు. అందుకే వాటి జెండాల్లో ఏకే–47 తుపాకీ ఓ గుర్తుగా మిగిలిపోయింది. ఏకే–47 తుపాకుల ఉత్పత్తి దాదాపు దశాబ్దంపాటు కొనసాగింది. 1959లో ఏకేఎం పేరిట కొత్త వర్షన్ వచ్చింది. ఏకే–47 తుపాకుల బరువును తగ్గించి, కాస్త చౌక ధరకు ఈ కొత్త వర్షన్‌ను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత కలష్నికోవ ఆ వర్షన్‌ను కూడా మార్చి కార్టిడ్జ్ కలిగిన పీకే మషిన్ గన్ను తయారు చేశారు. ఇలా పలు రకాల వర్షన్లు వచ్చినప్పటికీ ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికీ ఆధునీకరించిన ఏకే–47 తుపాకులను ఉత్పత్తి చేస్తున్నాయి. కలష్నికోవ అప్పటికి అమెరికా సైన్యం ఉపయోగిస్తున్న ఎం–16 తుపాకులకన్నా శక్తివంతంగా ఏకే–47ను తయారు చేయాలన్నా సంకల్పంతోనే ఆయన అందులో పలు వర్షన్లు తీసుకొచ్చారు. ‘అమెరికా సైనికులు తమ ఎం–16 తుపాకులను విసిరిపారేస్తారు. ఏకే–47 తుపాకులను లాక్కుంటారు. వాటి బుల్లెట్ల కోసం చనిపోయిన సైనికుల మత దేహాల నుంచి తీసుకుంటారు’ అని కలష్నికోవ్ వియత్నాం యుద్ధం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ఓ పత్రికా ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. ఆ తర్వాత అమెరికా సైనికులు నిజంగా ఇరాక్ యుద్ధంలో ఏకే–47 తుపాకులు ఉపయోగించినట్లు తాను విన్నానని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏకే–47 తుపాకుల్లో తక్కువలో తక్కువగా 50 అమెరికా డాలర్లకు దొరికే వర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ప్రఖ్యాతి చెందిన తుపాకీ వర్షన్లను సష్టించిన మిహాయిల్ కలష్నికోవ్‌ను స్టాలిన్ ప్రైజ్, ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డులు వరించగా, ‘మా ప్రజల సజనాత్మక మోథోసంపత్తికి అసలైన చిహ్నం’ కలష్నికోవ్‌ను 2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అభివర్ణించారు. కలష్నికోవ్, 2013లో తన 94వ ఏట మరణించారు. తాను ఆత్మరక్షణ కోసం సష్టించిన ఏకే–47, ఎదురు దాడులకే కాకుండా టెర్రరిస్టుల చేతుల్లో సామాన్యుల ప్రాణాలు తీసుకుంటున్న విషయం తెల్సి కలష్నికోవ్ తన చివరి రోజుల్లో ఎంతో వ్యథ చెందారు. ‘భరించలేని బాధతో నా హదయం కొట్టుమిట్టాడుతోంది. నేను కనిపెట్టిన ఆయుధం ప్రజల ప్రాణాలను తీసినట్లయితే అందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని కలష్నికోవ్ తన చివరి రోజుల్లో రష్యన్ ఆర్థడాక్స్ చర్చి ఫాదర్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో అమెరికా వేసిన బాంబుల వల్ల దాదాపు రెండు లక్షల మంది మరణించగా, ప్రపంచవ్యాప్తంగా ఏకే–47 తుపాకుల వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు మరణించారన్నది ఓ అంచనా. -
విశాఖ పురాతన చరిత్రకు సాక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : నగర ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్ లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి. అయితే కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. జాలరి పేట వద్ద మాత్రం బంకర్ శిధిల స్థితిలో కనిపిస్తుంటుంది. తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగ స్వామి టెంపుల్ సమీపాన ఓ బంకర్ బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో సముద్రపు గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకుని అక్కడినుంచి దాడులకు దిగినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడడంతో విశాఖ వాసులు సందర్శిస్తున్నారు. కేవలం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక ప్రాచీన చరిత్ర కలిగిన బంకర్ బయట పడిందన్న విషయం తెలిసి ఉదయాన్నే కొందరు సందర్శకులు అక్కడ చేరుకున్నారు. -
వరల్డ్ వార్ హీరో శత జయంతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణాంతకమైన కరోనా వైరస్ కుమ్మేస్తున్న నేపథ్యంలో లండన్‌లోని నేషనల్ హెల్త్ స్కీమ్ (ఎన్హెచ్ఎస్)కు 29 మిలియన్ పౌండ్లను (దాదాపు 272 కోట్ల రూపాయలు) విరాళంగా సేకరించి ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్న రెండో ప్రపంచ యుద్ధం కెప్టెన్ టామ్ మూర్ గురువారం నాడు వందవ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన శతజయంతిని పురస్కరించుకొని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ ఆయన్ని ‘హానరరీ కల్నల్ (గౌరవ కల్నల్)’ హోదాతో సత్కరించారు. (చదవండి : డబ్ల్యూహెచ్ఓ విఫలం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు) బ్రిటన్ త్రివిద దళాధిపతుల చీఫ్ జనరల్ సర్ మార్క్ కార్ల్టన్ స్మిత్ స్వయంగా కెప్టెన్ మూర్ వద్దకు వెళ్లి హర్రోగేట్ ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్ తరఫున హానరరీ కల్నల్ బ్యాడ్జీని అందజేశారు. కల్నల్ టామ్ యువ సైనికులకే కాకుండా తమలాంటి వృద్ధతరానికి కూడా స్ఫూర్తిదాయకమని జనరల్ సర్ మార్క్ ప్రశంసించారు. టామ్ వందవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని షాంపియన్ జల్లుల మధ్య కేక్‌కు కట్ చేశారు. సైనిక వైమానికి దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆయనకు గౌరవ వందనంగా గాల్లో చెక్కర్లు కొట్టారు. (చదవండి : అమ్మకానికి మూన్‌రాక్.. ధర ఎంతంటే..) టామ్‌కు రాణి ఎలిజబెత్‌తోపాటు ప్రిన్స్ చార్లెస్, కమిల్లాలు అభినందనలు లేఖలు పంపించారు. ఆయన ఒక్క సైన్యానికే కాకుండా మొత్తం దేశానికే ఆదర్శప్రాయుడిగా నిలిచారని ఈ కార్యక్రమానికి హాజరైన రక్షణ మంత్రి బెన్ వ్యాలెస్ ప్రశంసిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నివసిస్తున్న టామ్ మూర్ పది రోజుల క్రితం కరోనా వైరస్‌పై యుద్ధానికి అవసరమైన విరాళాలను ఎన్హెఎస్కు ఇవ్వాల్సిందిగా కోరుతూ తన గార్డెన్లో పలు రౌండ్లు నడిచారు. దీన్ని బీబీసీ ద్వారా లైవ్‌లో చూసిన ప్రపంచ దేశాల్లో దాదాపు 60 దేశాలు విరాళాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి లక్షలాది గ్రీటింగ్ కార్డులు ఆ రోజు నుంచి రావడం మొదలయ్యాయి. వాటిని ఓ పాఠశాలలో భద్రపరచగా హాలు నిండి పోయింది. వాటిని ఫొటో తీసిన టామ్ మనవడు బెంజీ ఇన్‌గ్రామ్ మూర్ తాతకు సమర్పించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘వింబుల్డన్’కు వెయ్యి కోట్ల బీమా సొమ్ము
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న జూన్‌లో జరగాల్సిన వింబుల్డన్ టెన్నీస్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇందుకుగాను భీమా సౌకర్యం కింద ఈ పోటీలను నిర్వహించే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు 114 మిలియన్ పౌండ్ల (దాదాపు 1,079 కోట్ల రూపాయలు) సొమ్ము అందనుంది. వాస్తవానికి ఆ క్లబ్ పోటీలను నిర్వహించినట్లయితే 250 మిలియన్ డాలర్లు (దాదాపు 23,100 కోట్ల రూపాయలు) వచ్చేవి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలను రద్దు చేస్తూ వస్తున్నారు. ప్రతిష్టాకరమైన ఒలింపిక్స్ పోటీలను కూడా రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం వింబుల్డన్ పోటీలను రద్దు చేయడం ఇదే మొదటి సారి. 2003లో సార్స్ వచ్చినప్పుడు వింబుల్డన్ పోటీలకు భీమా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జీవిత భీమా కింద 1.6 మిలియన్ పౌండ్లు ప్రీమియం కింద చెల్లిస్తూ వస్తున్నారు. భీమా తీసుకున్నాక 15 ఏళ్ల తర్వాత మొదటి సారి వింబుల్డన్ పోటీలు వాయిదా పడ్డాయి. -
రెండో ప్రపంచ యుద్ధం నాటి తుపాకులు లభ్యం
తూర్పుగోదావరి ,కాకినాడ క్రైం: కాకినాడ అశోక్‌నగర్‌లో అపార్టుమెంట్లు కట్టేందుకు తీస్తున్న పునాదుల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటివిగా భావిస్తున్న 10 తుపాకులు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో బ్రిటిషు మిలటరీ దళాలు కార్యక్రమాలు నిర్వహించేవని, అప్పట్లో ఈ ప్రాంతానికి మిలటరీ రోడ్డు అనే పేరు కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నానికి చెందిన కేఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టుకు చెందిన వారు అశోక్‌నగర్‌లోని భాష్యం పాఠశాల ఎదురుగా ఉన్న ఎకరం స్థలంలో ఆదివారం అపార్టుమెంట్ల నిర్మాణానికి పునాదులు తవ్వుతున్నారు. ఏడు అడుగుల లోతులోఈ తుపాకులు బయట పడడంతో ప్రాజెక్టు మేనేజర్ స్వరూపరాజు ఈ విషయాన్ని టూటౌన్ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ఎ.నాగమురళి, ఏఆర్ డీఎస్పీ అప్పారావు, ఏఆర్ ఆర్ఐ ఈశ్వరరావు అక్కడకు వెళ్లి తుపాకులను పరిశీలించారు. ఇవి 1939–45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో వాటిన తుపాకులు అయి ఉంటాయని భావిస్తున్నారు. మార్–1303 వెపన్స్‌గా వీటిని గుర్తించారు. ఇవి పూర్తిగా తుప్పు పట్టి ఉన్నాయని, వీఆర్వో శ్రీనివాస్‌తో పంచనామా నిర్వహించామని సీఐ నాగమురళి సోమవారం విలేకర్లకు వివరించారు. 303 వెపన్స్ లభ్యంపై సీఆర్పీసీ 102 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీటిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. -
అతీతులు కారెవరూ!
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలమది. బ్రిటీష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్. రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. చర్చిల్ తన ఇంటి నుంచి రేడియో స్టేషన్ కి వెళ్ళవలసి ఉంది. అయితే ఎప్పుడూ సవ్యంగా నడిచే ఆయన కారు కాస్తా ఆ రోజు మరమ్మతుకు గురైంది. బయలుదేరే సమయానికి అది నడవలేదు. దాంతో ఆయన ఆలస్యం చేయకుండా ఓ అద్దె టాక్సీ మాట్లాడుకున్నారు. అయితే తన టాక్సీలో ప్రధాని చర్చిల్ వస్తున్నారన్న విషయం ఆ వాహన డ్రైవరుకి తెలీదు. కారణం, ఆ డ్రైవర్ అంతకుముందు చర్చిల్ని చూసింది లేదు. కనుక ఆయన చర్చిల్ ని గుర్తుపట్టలేదు. చర్చిల్ కారెక్కి కూర్చున్నారు. కారు బయలుదేరింది. దారి మధ్యలో చర్చిల్ డ్రైవరుతో ‘‘ఇదిగో ఓ పదిహేను నిముషాలు వెయిట్ చేస్తే మళ్ళీ నీ టాక్సీలో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అయితే డ్రైవర్ ఏమన్నాడంటే... ‘‘క్షమించండి...అది కుదరదండి ఈరోజు రేడియోలో చర్చిల్ గారు మాట్లాడబోతున్నారు. ఆ మాటలు నేను వినాలి’’ అన్నాడు. చర్చిల్‌కి ఆ మాట ఆశ్చర్యం వేసింది. తన ప్రసంగాన్ని వినడానికి డ్రైవర్ కూడా ఆసక్తి చూపుతున్నాడుగా....నా మీద ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో ఈ డ్రైవరుకి...అనుకుని మనసులో సంతోషించారు. టాక్సీ రేడియో స్టేషన్ కి చేరుకుంది. రేడియో స్టేషన్ దగ్గర ఓ మూలగా కారు ఆపించి చర్చిల్ కిందకు దిగారు. టాక్సి డ్రైవర్ వాహనాన్ని ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే చర్చిల్ మళ్ళీ డ్రైవర్ని అడిగాడు... ‘‘మరో అయిదు పౌండ్లు అదనంగా ఇస్తాను. కారుని ఆపకూడదు...పదిహేను నిముషాలు నిరీక్షించావంటే ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీ కారులో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అప్పుడు డ్రైవరు ‘‘పరవాలేదు సార్. చర్చిల్ ప్రసంగం ఈరోజు కాకపోతే ఇంకోరోజు వింటాను. మీరు అయిదు పౌండ్లు ఎక్కువగా ఇస్తానంటే పదిహేను నిముషాలేంటి సార్ ముప్పై నిముషాలు ఆగుతాను...’’ అన్నాడు. కాస్సేపటిముందు వరకూ డ్రైవర్ మీదున్న అభిప్రాయం, ఆశ్చర్యం కాస్తా గాలికి కొట్టుకుపోయాయి. నా ప్రసంగానికి ఇచ్చే విలువ కన్నా డబ్బుకు డ్రైవర్ ఇస్తున్న విలువను తలచి బాధపడ్డారు చర్చిల్. అందుకే అంటారేమో డబ్బుకు లోకం దాసోహమని. – యామిజాల జగదీశ్ -
ఆ ఇంటి గోడల్లో ఎంత బంగారమో..!
క్విమర్ : పాడుబడిందని కూలిస్తే లక్షల సంపద ఇచ్చింది ఆ ఇళ్లు. అదేలా అనుకుంటున్నారా.. ఇళ్లు కూలిస్తే గోడల్లో బంగారు నాణేలు బయపడ్డాయి. అవి కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 600 నాణేలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని బ్రిటానీలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫిరంగీలను దాచడానికి లీజుకు తీసుకున్న ఇళ్లు మున్సిపాలిటీ అధికారులు కూల్చారు. కూల్చే క్రమంలో గోడల్లో కొన్ని బంగారు నాణేలను అధికారులు గుర్తించారు. దీంతో ఆ గోడను పూర్తిగా కూల్చగా దాదాపు 600 బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని పురావస్తు శాఖ అధికారులకు అందించారు. అవి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన నాణేలుగా గుర్తించారు. ఆ నాణేలపై బెల్జియన్ రాజు లియోపోల్డ్-2 బొమ్మ ముంద్రించి ఉంది. దీంతో ఆ నాణేలు 1865-1909వ సంవతర్సం నాటివిగా గుర్తించారు. వెలికితీసిన 600 నాణేల విలువ దాదాపు లక్ష యూరోలతో సమానమని అధికారులు తెలిపారు. కాగా ఫ్రెంచ్ చట్టం ప్రకారం నిధి మొత్తాన్ని కనుగొన్నవారికి సగం,ఇంటి యాజమాన్యులకు సగం ఇవ్వాలని ఉంది. దీంతో యాజమానికి 50శాతం రానుంది. కాగా ఇంటియాజమాని మాట్లాడుతూ.. బంగారు నాణేలను చూసి తానేమి ఆశ్చర్యానికి లోనుకాలేదన్నారు. తమ తాతగారు నాణేలు సేకరించేవారని పేర్కొన్నారు. -
ప్రతిధ్వనించే పుస్తకం
అమితవ్ ఘోష్ అమెరికాలో స్థిరపడిన భారతీయ రచయిత. ఆయన రెండో నవల ‘ద షాడో లైన్స్’ ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం చాలా దేశాలు వలస పాలన నుండి విముక్తి పొందిన నేపథ్యంలో కొత్త దేశాలు, కొత్త సరిహద్దులు, పెల్లుబికిన జాతీయవాదం రచయితలకు కథావస్తువులైనాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దానితో పాటు దేశం రెండుగా చీలిపోయింది. చిత్రంగా, స్వాతంత్య్రం కోసం కలిసి పోరాడిన శక్తులు ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క విభజన రేఖ ఇంతటి విలయాన్ని సృష్టించడం, మనుషుల మనసుల్లో గిరిగీసుకున్న దాటరాని వలయం – అదే షాడో లైన్స్ అంటే! ఈ నవలలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ, కథ ముఖ్యంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రథమ పురుషలో కథని వివరించే పేరులేని యువకుడు, అతని నానమ్మ (ఆమెను ‘తామ్మ’ అని పిలుస్తాడు), ఇంకా అతని చిన్నాన్న త్రిదేబ్. చిన్నాన్న త్రిదేబ్ అంటే బాల్యంలో కథకుడికి ఒక రోల్‌మోడల్, ఆదర్శం. అతని హఠాన్మరణం అతనికొక మిస్టరీ. బాల్యం, యవ్వనం మధ్య అతని జ్ఞాపకాలు ఊగిసలాడుతుంటయ్. సరిహద్దు ఆవలికి జరిగిపోయిన తన పుట్టిన ఊరు ఢాకా చూడాలని ఒకప్పుడు తహతహలాడిన బామ్మ తీవ్రమైన వైముఖ్యంతో మాట్లాడుతుంది 1962 ఇండో–పాక్ వార్ ప్రజ్వరిల్లినప్పుడు. ‘మనని వాళ్లు చంపడానికి రాకముందే వాళ్లని తుద ముట్టించాలి’ అని ఆమె హిస్టీరికల్గా మాట్లాడటం బాల్యంలో అతనికొక ఆశ్చర్యం. పెరిగి పెదై్ద తానుగా శోధించి సంఘటనల మూలాల్లోకి వెళ్లి సత్యం తెలుసుకుంటాడు. అదే ఉత్కంఠను మనం చివరిదాకా అనుభవిస్తాం. యువకుడి నాయనమ్మ బంగ్లాదేశ్ ఏర్పడ్డ (తూర్పు పాకిస్తాన్) సమయంలో కలకత్తాకు వలస వస్తుంది. తాను పుట్టి పెరిగిన ఢాకా ఇప్పుడు పరాయి దేశంలో భాగం అనే యధార్థాన్ని స్వీకరించడానికి ఆమె మనసులో ఒక తీవ్రమైన పెనుగులాట. తను పుట్టిన ఊరు చూడడానికి అక్కడ దగ్గరినించి ఆహ్వానం అందినప్పుడు (ఆమె భర్త ఢాకా ఎంబసీలో అధికారి) అదే ద్వైధీ భావనకు లోనవుతుంది. రెండు దేశాల మధ్య విమానం ఎగిరేప్పుడు సరిహద్దు రేఖ కనిపిస్తుందా? మరి లేదంటే ‘విభజన’ మాటకు అర్థమేమిటి? ఎన్నో సందేహాలు. దురదృష్టవశాత్తు అదే సమయంలో కశ్మీర్లో చెలరేగిన అల్లర్ల ప్రభావం ఢాకాలో ప్రతిధ్వనిస్తుంది. తన చిన్నప్పటి ఇంటికి కారులో వెళ్లి వస్తుంటుంది తామ్మ, ఆమెతో పాటు త్రిదేబ్, ఇతరులు. హఠాత్తుగా ఎదురైన అల్లరి మూకలు కారును, వెనుక రిక్షాలో వస్తున్న ఆమె పెదనాన్నను చుట్టుముడతాయి. అప్పుడే యువకుడి చిన్నాన్న త్రిదేబ్ వారి చేతులలో హతమౌతాడు. నానమ్మ మనసు విరిగిపోయింది. ఒక్కసారి హద్దు గీయబడిందంటే అది అనుల్లంఘనీయం అనే కఠిన వాస్తవం ఎరుకలోకి వచ్చింది. - తెన్నేటి శ్యామకృష్ణ -
నాజీల ‘గాలి’ తీసేశారు..
రెండో ప్రపంచ యుద్ధ కాలం.. అటువైపు.. అరివీర భయంకరమైన నాజీ సైన్యం.. ట్యాంకులు, తుపాకులతో గుంపులు గుంపులుగా.. అచ్చంగా.. బాహుబలి చిత్రంలోని కాలకేయుల్లాగా.. మరి ఇటువైపు.. కేవలం 1,100 మంది కళాకారులు.. వీరి వద్ద తుపాకులు లేవు.. ట్యాంకులు అసలే లేవు.. ఉన్నదల్లా.. సైకిల్ పంపులు.. కలర్ బాక్సులు.. సౌండ్ సిస్టమ్‌లు.. ఇదేమి చిత్రం.. ఇదేమి యుద్ధం.. ఇంతకీ గెలుపెవరిది? ఘోస్ట్ ఆర్మీ.. రెండో ప్రపంచ యుద్ధంలో వేల మంది అమెరికా, ఇతర మిత్ర దేశాల సైనికుల ప్రాణాలను కాపాడిన సైన్యం.. జర్మనీ సైనికులకు ‘సినిమా’చూపించిన మాయా సైన్యం.. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడం కళాకారులకే సాధ్యం.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, మిత్ర దేశాలు దాన్నే తమ ఆయుధంగా మలుచుకున్నాయి. జర్మన్ సైనికులను మభ్యపెట్టడానికి ‘ఘోస్ట్ ఆర్మీ’ని సృష్టించాయి. అధికారికంగా దీన్ని 23వ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ ట్రూప్స్గా పిలిచేవారు. ఇందులో పనిచేసేవారి నియామకమంతా రహస్యంగా జరిగింది. న్యూయార్క్, ఫిలడెల్ఫియా ఆర్ట్ స్కూల్స్ నుంచి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో మిమిక్రీ ఆర్టిస్ట్స్, చిత్రకారులు, సౌండ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఇంతకీ వీరేం చేశారు జస్ట్ మాయ చేశారు.. అసలైన ట్యాంకర్లకు బదులుగా గాలితో నింపిన బెలూన్ టైపు ట్యాంకర్లను తయారుచేశారు. నిజమైన ఆయుధాలుగా భ్రమింపజేసేలా వాటికి రంగులు అద్దారు.. ట్యాంకులు, విమానాలు, శతఘ్నులు ఒకటేమిటి.. ఇలా అన్నీ ‘గాలి’ఆయుధాలను తయారుచేశారు. తమ సౌండ్ బాక్సులతో ఉన్నది వేయి మందైనా.. వేల మంది సైన్యం.. వందల సంఖ్యలో ట్యాంకర్లు వస్తున్న ఎఫెక్ట్‌ను సృష్టించారు. జర్మన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇలా మొత్తం 20 ఆపరేషన్లు చేశారు.. వీళ్ల పని ఒక్కటే.. సైనికుల దుస్తులు వేసుకుని.. అలా పరేడ్ చేసుకుని పోవడమే.. ముందే రికార్డు చేసిన.. ట్యాంకుల సౌండ్లు, వేలాది మంది సైనికుల పరేడ్ ఎఫెక్ట్ వంటి వాటిని భారీ స్పీకర్లతో వినిపించడమే.. అయితే.. ఈ నకిలీ ఆయుధాలు, సౌండ్ ఎఫెక్ట్‌ల వల్ల.. వందలాది ట్యాంకులతో వేలాది మంది సైనికులు తమ మీదకు దండెత్తి వస్తున్నారంటూ జర్మన్లు హడలిపోయేవారు.. ఉంటున్న స్థావరాలను విడిచి.. పారిపోయేవారు.. అంతేకాదు.. జర్మన్ గూఢచారులకు తెలిసేలా స్థానిక కాఫీ షాపుల్లో కూర్చుని.. వేల సంఖ్యలో అమెరికన్ల సైన్యం దండెత్తి వచ్చేస్తోందంటూ భయపెట్టించేలా మాట్లాడేవారు. ఇలా వీరు తమ గాలి సైన్యంతో వేలాది మంది అమెరికా, మిత్రదేశాల సైనికుల ప్రాణాలను కాపాడారు.. 1945, మార్చి నెల.. ఘోస్ట్ ఆర్మీకి అసలైన పరీక్ష.. రైన్ నదిని దాటి.. జర్మనీలోకి ప్రవేశించాలని అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు భావించాయి. జర్మన్ సైన్యాల దృష్టిని మళ్లించడానికి వెంటనే ఘోస్ట్ ఆర్మీని రప్పించాయి. దీంతో వారు ఇక తమ టాలెంట్ చూపించారు. 600 గాలి ట్యాంకులను రంగంలోకి దింపారు. వేల మంది సైనికుల పదఘట్టనల సౌండ్ ఎఫెక్ట్‌ను వినిపించారు. అంతే.. జర్మన్ సైన్యం దృష్టి.. ఈ రబ్బర్ సైన్యం మీదకు మళ్లింది.. అటు అమెరికా సైన్యాలు అతి తక్కువ ప్రతిఘటనతో విజయవంతంగా రైన్ నదిని దాటేశాయి. ఇక యుద్ధం ముగిసిన తర్వాత ఇందులో పనిచేసిన వారు తమతమ వృత్తుల్లోకి వెళ్లిపోయారు. వీరిలో పలువురు ఆయా రంగాల్లో పేరుప్రఖ్యాతులు కూడా సంపాదించారు. యుద్ధం ముగిసిన చాన్నాళ్ల వరకూ ఈ ఘోస్ట్ ఆర్మీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచారు. ఆ పత్రాలు బయటకి రాలేదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. నాటి 1100 మంది ఘోస్ట్ ఆర్మీలో ప్రస్తుతం ఓ 50 మంది బతికి ఉన్నారు. 2013లో తీసిన ది ఘోస్ట్ ఆర్మీ డాక్యుమెంటరీలో వీరిని ఇంటర్వ్యూ చేశారు కత్తి కన్నా కలం గొప్పదంటారు.. కానీ వీరంటారు.. కత్తి కన్నా మా ‘కళ’ గొప్పది అని.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఆ తూటాలు రెండవ ప్రపంచ యుద్ధం నాటివి..
జయపురం(ఒడిశా): జయపురంలోని జిల్లా పారిశ్రామిక కేంద్రం కార్యాలయం వెనుక ప్రాంతంలో ఇటీవల ఒక పాయికానా ట్యాంక్‌లో 700కు పైగా లభించిన తుపాకీ తూటాలు 1925 నాటివని అనుమానిస్తున్నారు. ట్యాంక్‌లో లభించిన తూటాలపై ఉన్న వివరాల ప్రకారం అవి జపాన్, ఇంగ్లండ్ దేశాలలో తయారైనవిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ తూటాలు 1935–1945 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో వినియోగించేవారని అభిప్రాయ పడుతున్నారు. దాదాపు నాలుగు అంగుళాల పొడవున ఉన్న ఆ తూటాలు ఆ కాలంలోనే వినియోగించేవారు. జయపురంలో లభించిన తూటాలు వాడనివి. ఆ తూటాలు ఇక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వాడిన తూటాలు నేడు జయపురంలో ఒక పాయికానా ట్యాంక్‌లో బయటపడడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ముక్కలైన యుద్ధనౌక.. జవాన్లను కొరుక్కుతిన్న షార్క్స్
యుద్ధమంటే విజయమో.. వీర మరణమో అన్నమాట గుర్తొస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో అణు ఆయుధ సామగ్రితో, భారీ దళాన్ని తీసుకుని బయల్దేరిన అమెరికా యుద్ధనౌక 'యూఎస్ఎస్ ఇండియానాపొలిస్'. ప్రత్యర్థి యుద్ధనౌక వదిలిన టార్పిడో దెబ్బకు కుదేలై నీట మునిగింది. అత్యంత శక్తిమంతమైన టార్పిడో కావడంతో యుద్ధనౌక భాగాలు ముక్కలయ్యాయి. వందలాది సైనికులు నీట మునిగారు. వారందరినీ బతికుండగానే షార్క్స్ కొరుక్కుని తినేశాయి. 1945 జులై 30న జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో తమకు లభ్యమైనట్లు అమెరికా నేవీ పేర్కొంది. ఇండియానాపొలిస్ మునిగిపోయిన తర్వాత దాని శకలాలు అంతు చిక్కని మిస్టరీగా మారాయి. అయినా పట్టువిడవని అమెరికన్ నేవీ అప్పటి నుంచి ప్రయత్నాలు సాగిస్తూ.. పసిఫిక్ మహా సముద్రంలోని ఓ ప్రదేశంలో మూడున్నర మైళ్ల లోతులో యుద్ధనౌక శకలాలను గుర్తించింది. యుద్ధనౌక మునిగినా అందులో రికార్డింగ్ కోసం ఉంచిన వీడియో కెమెరా మాత్రం పని చేస్తూనే ఉంది. 1,200 మంది సైనికులు సముద్రంలో మునిపోగానే.. అక్కడ ఉండే షార్క్స్ ఒక్కసారిగా వారిపై దాడి చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. బతికుండగానే వారి శరీరాలను షార్క్స్ చీలుస్తున్న దృశ్యాలు తమకు దొరికినట్లు అమెరికన్ నేవీ చెప్పింది. అయితే, పసిఫిక్ మహా సముద్రంలో కచ్చితంగా ఏ ప్రాంతంలో ఇండియానాపొలిస్ లభ్యమయ్యాయన్న విషయాన్ని మాత్రం నేవీ రహస్యంగా ఉంచింది. కాగా, ఈ దుర్ఘటన గురించి ప్రాణాలతో బయటపడిన ఓ నేవీ సైలర్ మాట్లాడుతూ.. అప్పటికే మరణించిన వారి రక్తం నీటిలో కలవడంతో షార్క్స్ కు పిచ్చెక్కినట్లు అయిందని చెప్పారు. పెద్ద షార్క్స్ గుంపు తమపై దాడి చేసిందని తెలిపారు. కళ్ల ముందే తన స్నేహితులను షార్క్స్ చంపేస్తున్నా వారిని కాపాడలేకపోయానని కంటతడి పెట్టుకున్నారు. సైనికులు ప్రాణాలు విడుస్తున్న వీడియో దొరకడం వారి కుటుంబ సభ్యులకు మళ్లీ బాధను కలుగుజేస్తుందని అన్నారు. -
పునాదిలో భారీ బాంబు.. గుండెల్లో దడదడ
లండన్: బ్రిటన్‌లో ఓ భారీ బాంబు బయటపడింది. ఓ ఇంటి నిర్మాణంకోసం తవ్వకాలు జరుపుతుండగా పునాదులు అడుగున రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫిరంగిగుండులాంటి 500 పౌండ్ల బరువున్న బాంబు కనిపించింది. సరిగ్గా వాయవ్య లండన్‌లోని బ్రెంట్ ప్రాంతంలో బ్రాండెస్బరి పార్క్ ప్రాంతంలోని ఈ బాంబు బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారందరికి ఒక్కసారిగా గుండెలు ఆగిపోయినంత పనైంది. ఈ విషయం తెలిసి వెంటనే అక్కడికి పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, సైనికులు వచ్చారు. ఆ ప్రాంతలో రెండు పాఠశాలలు ఖాళీ చేయించారు. పలువురు స్వచ్ఛందంగా తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్లిపోయారు. దాదాపు 200 మీటర్ల దూరం ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసి ఎవరిని ఆ చుట్టుపక్కలకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి మాట్లాడుతూ ముందుగా ఆ ప్రాంత వాసులకు ధన్యవాదాలు తెలిపారు. బాంబును గుర్తించి వెంటనే తమకు సమాచారం ఇచ్చారని, స్వచ్ఛందంగా తమ ఇళ్లను వదిలివెళ్లి బాంబు నిర్వీర్య దళానికి సహాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. అది కచ్చితంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబే నని దానిని చూస్తేనే సామాన్యులకు గుండెల్లో భయం పుడుతోందని, ఎలాంటి విస్ఫోటనం జరగకుండా తగిన విధంగా నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. -
రెండో ప్రపంచ ప్రేమ
ఎడిత్ స్టెయినర్ వయసు 92 ఏళ్లు. ఆమెది హంగేరి. జాన్ మ్యాకీ వయసు 96 ఏళ్లు. అతడిది స్కాట్లాండ్. మొన్న ఈ దంపతులు 71వ వాలెంటైన్స్ డేని జరుపుకున్నారు! వీళ్లదొక అపురూపమైన ప్రేమకథ. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు జర్మనీలోని ఔష్విట్జ్ క్యాంప్‌లో వందలమందిని నిర్బంధించారు. వారిలో ఎడిత్ కూడా ఒకరు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. యుద్ధం అయ్యాక నిర్బంధ శిబిరాల్లో ఉన్నవాళ్లను విడిపించే క్రమంలో ఔష్విట్జ్ శిబిరానికి వెళ్లిన సైనికులలో జాన్ మ్యాకీ కూడా ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 23. ఆ రోజు ఎడిత్, జాన్ ఒకర్నొకరు పరిశీలనగా చూసుకోలేదు. 'బతుకు జీవుడా' అని ఎడిత్ బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. జాన్ మ్యాకీ మిగతా శిబిరాల్లోని వారికి విముక్తి కల్పించే పనిలో పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ ఒక డాన్స్ హాల్లో కలుసుకున్నారు. 'ఆ రోజు థ్యాంక్స్ చెప్పలేకపోయాను' అంది ఎడిత్. 'ఇవాళ గానీ చెబుతారా ఏంటీ?' అని భయం నటించాడు జాన్. అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు అబ్బాయికి నచ్చింది. ప్రేమ మొదలైంది. యుద్ధం ముగియగానే 1946లో పెళ్లయింది. వధువును స్లాట్లాండ్ తీసుకెళ్లాడు వరుడు. అప్పట్నుంచీ ఏటా వాలెంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట డుండీ సిటీలోని కేర్ హోమ్‌లో ఉంటోంది. ఎడిత్, జాన్ మ్యాకీ -
బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ
తెస్సాలోనికి: గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 250 కిలోలున్న ఈ బాంబును గత వారం రోడ్డు పనుల సందర్భంగా గుర్తించారు. తొలుత 20 అంబులెన్స్ లలో 300 మంది వికలాంగులను, రోగులను తరలించారు. బాంబు ఉన్న ప్రదేశానికి 1.9 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా తరలించాల్సి ఉంది. గ్రీస్‌లో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద బాంబును గుర్తించలేదని, అందుకే ప్రజల తరలింపు తప్పట్లేదని ఓ అధికారి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడానికి సుమారు 8 గంటలు పట్టొచ్చని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు. -
బాంబు పేలుతోంది.. ఊరు ఖాళీ చేయండి!
దక్షిణ జర్మనీలోని ఆగ్స్‌బర్గ్ ప్రాంతానికి చెందిన దాదాపు 54 వేల మంది క్రిస్మస్ పండగ కూడా చేసుకోడానికి లేకుండా పొద్దున్నే తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి 1.8 టన్నుల బరువున్న ఓ పెద్ద బాంబును నిర్వీర్యం చేయడానికి అధికారులు సిద్ధం కావడమే అందుకు కారణం. నగరంలో ఉన్న మధ్యయుగం ఆనటి కెథడ్రల్, సిటీ హాల్‌లను కూడా ఖాళీ చేయించేశారు. ఉదయం 8 గంటల నుంచే ఖాళీ చేయించడం మొదలుపెట్టి, 10 గంటల కల్లా మొత్తం ఊరిని నిర్మానుష్యం చేసేశారు. బాంబును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని పోలీసులు అన్నారు. తమ స్నేహితులు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లలేనివారి కోసం దూర ప్రాంతాల్లో స్కూళ్లను తెరిచి ఉంచారు. తమతో పాటు పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లిపోవాలని సూచించారు. ఇందుకోసం ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా పైసా చార్జీ కూడా తీసుకోలేదు. జర్మనీలో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు బయటపడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు 2011 సంవత్సరంలో కోబ్లెంజ్ నగరంలో ఇలాగే ఒక బాంబు కనపడటంతో అప్పుడు 45 వేల మంది ప్రజలను అక్కడి నుంచి తరలించారు. -
శత వసంతాల ‘అక్టోబర్’
విశ్లేషణ ప్రపంచంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం జరిగే జాతీయ విముక్తి ఉద్యమాలకు సోవియట్ యూనియన్ ఆప్తమిత్రునిగా నిలిచింది. నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమ నానికి, స్వతంత్ర శక్తిగా నిలబడేందుకు నాటి సోవియట్ సహకారం అనితరసాధ్యం. ఈ నవంబరు 7వ తేదీ ఒకప్పటి సోవియట్ రష్యా శత జయంతి. ఆనాటి సోషలిస్టు విప్లవం మార్క్సిజంలోని వాస్తవికతను రేఖామాత్రంగా ప్రపంచానికి దర్శనీయం చేసేందుకు నాందీ ప్రస్తావన జరిగిన రోజు. ఆ తొలి అడుగు మానవుడు మున్నెన్నడూ ఎరుగని దిశలు పడిన రోజు ఇది. విముక్తి పొందిన నూతన సోషలిస్టు రష్యా నాటి ప్రపంచ శ్రమజీవులందరి కలల పంట. విప్లవనేత లెనిన్ వాగ్దానం చేసినట్లు – వివిధ జాతుల కారా గారంగా ఉండిన రష్యాలో అన్ని జాతులకూ విముక్తి కల్పించి, అవి స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్)గా అవతరించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్ మార్గదర్శకత్వంలో చైనా, వియత్నాం, క్యూబా విముక్తితో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. అయితే నాటి యూఎస్ఎస్ఆర్ నేటి ప్రపంచ చిత్రపటంలో కాన రాదు. తూర్పు యూరప్ రాజ్యాలలో సైతం సోషలిజం కనుమరుగ య్యింది. నాడు మావో నేతృత్వాన సాధించిన విముక్తి మార్గాన నేటి చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండినా పయనం సాగు తున్నదా? లేదా? అక్కడ నేడు కమ్యూనిస్టు పార్టీ పేరు కొనసాగుతు న్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి మార్గం పునర్నిర్మితమౌతు న్నదా? అన్నది ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలలో చర్చనీయాంశం. ప్రపంచ శ్రమజీవుల ప్రాణస్పదంగా ఉండిన సోషలిస్టు శిబిరం ఇలా ఎందుకు పతనమయింది? అందుకు గల కారణాలేమిటి? ఈ పతనం ఆయా దేశాల ఆచరణాత్మక తప్పిదాల ఫలితమా? నేటి భౌతిక వాస్తవిక పరిస్థితి కారణమా? ఈ పతనం వెనుక కమ్యూనిస్టు వ్యతిరేక సామ్రాజ్యవాద గుత్తాధిపతుల కుట్రల ఫలితమా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తడం సహజం. అసలు కమ్యూనిజమే మానవ నైజానికి విరుద్ధం, ‘సోషలిజం’ మార్క్స్ అనే ఒక స్వాప్నికుని స్వప్నం, పెట్టుబడిదారీ విధానమే శాశ్వతమైనది అని ప్రచారం చేసే మేధా వులకూ కొదవ లేకుండా పోయింది. కానీ ఆ యూఎస్ఎస్ఆర్ ఎంతటి మహత్తర మానవత్వ కర్తవ్యాలనూ అంతర్జాతీయంగానూ తన దేశంలోనూ ఆచరించి ప్రపంచానికి చూపిందో చూద్దాం. తొలి సంస్కరణగా దున్నుకునే వారికే భూమినిచ్చే అతి మౌలిక మైన సంస్కరణ చేపట్టి రైతులను, గ్రామీణ పేదలను సోవియట్ ఆదుకున్నది. ప్రతి రంగంలోనూ రాజకీయంగా శ్రామికవర్గ పాత్ర పెంచింది. మహిళలకు ఆత్మగౌరవాన్ని, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థాయి అందించింది. విద్య, వైద్యం, గృహవసతి, దుస్తులు సామాన్య ప్రజలకు దాదాపుగా ఉచితంగా లభింపజేశారు. 40 ఏళ్లపాటు యూఎస్ఎస్ఆర్లో నిత్యావసరాల ధరల పెరుగుదల లేదు. సోష లిస్టు శిబిరంలోని దేశాలకు, నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమనానికి నాటి సోవియట్ సహకారం అనితరసాధ్యం. మనదేశాన్నే తీసుకుందాం. పాశ్చాత్య దేశాలు ‘డాలర్ల’తో వ్యాపార లావాదేవీలు సాగిస్తుండగా మనకు సులభమైన రీతిలో రూపాయ లలో వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగించింది. మనదేశ ఆర్థిక ప్రగతికి ‘ఉక్కు’ కర్మాగారం నిర్మించమని మనం కోరితే ఇంగ్లండ్ వంటి దేశాలు ‘మీకు ఒక్క ఫ్యాక్టరీ దేనికి? సైనిక ఫ్యాక్టరీ పెట్టుకోమని హేళన’ చేశాయి. భిలాయ్‌లో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమకు నాంది పలికే సహకారం అందించింది సోవియట్ యూనియన్. నాటి యూఎస్ఎస్ఆర్ సోషలిస్టు శిబిరం నేడు లేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి వ్యతిరేక వాతావరణం గమని స్తున్నాం. సృష్టిలో మారనిది అంటూ ఏదైనా ఉంటే అది మార్పు అన్నారు మార్క్స్. అందువలన భౌతిక వాస్తవిక పరిస్థితిలో వస్తున్న మార్పులేమిటి? వాటి ప్రభావం శ్రామిక వర్గంపైన వాటి రాజకీయ పార్టీలపైన ప్రభావం ఏమిటి? నిర్దుష్టంగా ఆ మార్పుల కనుగుణంగా ఏ చర్యలు చేపట్టాలి? అన్నవి పరిశీలనార్హం. ఇక మనదేశంలో మాత్రం చాతుర్వర్ణ వ్యవస్థ అనే నిచ్చెనమెట్ల వంటి కుల అణచివేత హిందూమత సిద్ధాంతాలలో ముఖ్యమైనదిగా ఉంది. దేశంలో వచ్చిన ఆర్థిక, రాజకీయ, మార్పుల ఫలితంగా శూద్ర కులాలే ఆధిపత్య కులాలుగా, అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తు న్నాయి. వర్ణవివక్ష, అంటరానితనం, అత్యంత వెనుకబడిన కులాలపై అణచివేత, స్త్రీలను హీనంగా చూడటం, వీరిపై అన్నిరకాల దోపిడీ, దౌర్జన్యం, అత్యాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ దశలో లెనిన్వలే సృజనాత్మకంగా మౌలికమైన శ్రమ దోపిడీని వ్యతిరేకించ డంతోపాటు కమ్యూనిస్టులు, ఆ సామాజిక శక్తులతో మమేకమై, ద్విముఖ పోరాటాన్ని నిర్వహించాలి. ‘కొటేషన్లదేముందయ్యా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్.. వంటి నేతల రచనల నుంచి ఎన్నైనా ఇవ్వ వచ్చు. కావలసింది ప్రత్యేక పరిస్థితులకు వానిని అన్వయించడం’ అని సుందరయ్య అనేవారు. మనకాలంలో మనిషిని మనిషి దోచుకునే రూపం మారింది కానీ మానవ సమాజ దోపిడీ మాత్రం మరో రూపంలో మరింత నాజూకు గానైనా, అధికంగా సాగుతున్నది. నగ్నంగానే కలవారు, లేనివారు అనే భేదం మున్నెన్నడూ లేనంతగా స్పష్టంగా కానవస్తున్నది. గతంలో వలెనే, నేడు కూడా వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామికులూ, పీడితులు, అణచివేతకు గురవుతున్న వారు అందరూ కలసి పోరాడక తప్పదు. నేడు దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చూస్తున్నాము. మావోయిస్టుల సాయుధ పోరాటం గానీ, కమ్యూనిస్టుపార్టీల పార్ల మెంటరీ, పార్లమెంటరీయేతర పోరాటాలు కానీ ఆ ద్విముఖ పోరా టంలో భాగమే. వివిధ కారణాలతో ఈ పోరాటంలో ముందు వెను కలు ఉండవచ్చు. కానీ చరిత్ర నిర్మాతలైన ప్రజలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుని నూతన సోషలిస్టు వ్యవస్థకు దారి తీస్తారు. అమెరికాలో రెండేళ్ల క్రితం వచ్చిన వాల్ స్ట్రీట్‌పై దాడి ఉద్యమ ప్రథమ నినాదం ఏమిటి? మేము (సామాన్య ప్రజానీకం, కష్టజీవులూ అణిచివేతకు గురవుతున్న వాళ్లం) 99 శాతం, మీరు దోపిడీదారులు, ప్రగతి నిరో ధకులు కలిపి 1 శాతం! అదీ వాస్తవం! నవంబర్ 7 సోవియట్ యూనియన్ శతజయంతి సందర్భంగా, ఆ చారిత్రక పరిణామ దిశా దశల ఆధారంగా ఈ మహత్తర గుణాత్మక మార్పులో మనమూ భాగస్వాములు అవగలమని ఆశిద్దాం! (నవంబర్ 7న సోవియట్ రష్యా విప్లవ దినోత్సవ శత జయంతి) ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు ‘ 98480 69720 -
అక్కడ రెండో ప్రపంచయుద్ద బాంబులు దొరికాయి
కొహిమా: నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కొహిమాలో రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు బాంబులు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీఆర్ హిల్ కాలనీలో జరుగుతున్న నిర్మాణపనుల సందర్భంగా బాంబులు కూలీలకు దొరికినట్లు చెప్పారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాంబులను డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. నిర్మాణపనులు పూర్తయ్యేవరకూ అనుమానాస్పదంగా కనిపించే ఏ వస్తువునీ తాకొద్దని కూలీలకు చెప్పినట్లు తెలిపారు. అలాంటి వస్తువులు ఏవైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
72 ఏళ్ల తర్వాత బయటపడింది!
అది ఎప్పుడో 1944వ సంవత్సరం. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం భీకరంగా జరుగుతోంది. ముగ్గురు సిబ్బందితో కూడిన అమెరికా బాంబర్ విమానం ఒకటి శత్రుస్థావరాల మీద దాడికి బయల్దేరింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా అది వెళ్తుండగా శత్రుసైన్యాలు దాన్నిగుర్తించి పేల్చేశాయి. దాంతో ఆ విమానం కాస్తా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ఘటన జరిగి ఇప్పటికి 72 ఏళ్లు గడిచింది. టీబీఎం-1సి అవెంజర్ విమానం ఇన్నేళ్ల తర్వాత సముద్ర అడుగుభాగంలో కనిపించింది. దాంట్లోనే విమాన సిబ్బంది అవశేషాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్ల బట్టి ఆ విమానం కోసం శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు. ఇలా వివిధ సందర్భాల్లో కనిపించకుండా పో యిన అమెరికన్ విమానాలను కనిపెట్టేందుకు 'ప్రాజెక్ట్ రికవర్'ను చేపట్టారు. ఆ ప్రాజెక్టు సాధించిన విజయాల్లో ఇదొకటి. అత్యాధునిక సోనార్ టెక్నాలజీని ఉపయోగించి విమానాలు ఎక్కడున్నాయో వీళ్లు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన సిబ్బంది మృతదేహాలలో మిగిలిన భాగాలను దేశానికి తీసుకొచ్చి, వారికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ప్రాజెక్ట్ రికవర్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎరిక్ టెరిల్ తెలిపారు. -
దర్జాగా కబ్జా
► మిలిటరీ కాలనీ భూములపై అధికార పార్టీ నేతలు కన్ను ► బోర్లు వేసి ప్రహరీ కట్టిన గార్గేయపురం సర్పంచ్ ► అధికారులను ఆశ్రయించిన బాధితుడు కర్నూలు సీక్యాంప్: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. 1948లో కర్నూలు నగర శివారులోని నందనపల్లె పంచాయతీ పరిధిలో దాదాపు 72 మంది సైనిక కుటుంబాలకు ఐదు వందల ఎకరాలకు పైగా కేటాయించారు. వాటిని కొందరు అమ్ముకోగా.. మరి కొందరు వారసత్వంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు - విజయవాడ రహదారి పక్కనే ఉన్న ఈ పొలాలను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే గద్దల్లా వాలుతున్నారు. రాత్రికిరాత్రే ఆక్రమించేస్తున్నారు. 673 సర్వేలో దాదాపు మూడు ఎకరాల పొలంపై కన్నేసిన గార్గేయపురం సర్పంచ్ అక్కడ అక్రమంగా బోర్లు వేయించాడు, రక్షణగా గోడను కూడా నిర్మించాడు. మరో వైపు జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యుడిగా కొనసాగుతున్న ఓ వ్యక్తి కూడా ఇక్కడ పొలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. టీడీపీ సీనీయర్ నేత తమ్ముడు అండతోనే రెచ్చిపోతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితుడు అధికారులను, పోలీసులను ఆశ్రయించగా తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. అయితే అధికార పార్టీనేతలు బాధితులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు 673 సర్వే నంబర్లో మాకు మూడు ఎకరాల పొలం ఉంది. ఆ పొలం లో గార్గేయపురం సర్ప ంచ్ అక్రమంగా బోర్లు వేశాడు. రహదారి పక్కనే ఉండటంతో ఆక్రమించేందుకు యత్నించాడు. అధికారులను ఆశ్రయించగా ప్రస్తుతం పనులు నిలిపేశారు. అయితే అప్పటి నుంచి చంపుతామని బెదిరిస్తున్నారు. అధికారులు రక్షణ కల్పించాలి. - రాజు, మిలిటరీ కాలనీ -
ఆ ఆఖరి వ్యక్తీ కన్ను మూశారు...
టెల్ అవీవ్: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు సృష్టించిన మారణహోమానికి సాక్షి, పోలండ్‌లో నాజీలు ఏర్పాటు చేసిన ట్రెబ్లింకా కాన్సెంట్రేషన్ క్యాంప్‌లో జరిగిన సామూహిక జననహననానికి ప్రత్యక్ష సాక్షి, ఆ క్యాంప్ నుంచి ప్రాణాలతో తప్పించుకుని బతికి బట్టకట్టిన కొంత మందిలో ఆఖరివాడు... సామ్యూల్ విల్లెన్‌బర్గ్ మరణించారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలోని తన ఇంట్లో శుక్రవారం నాడు కన్ను మూశారు. ఆయనకు 93 ఏళ్లు. 1943లో ట్రెబ్లింకా క్యాంపులో జరిగిన తిరుగుబాటుకు విల్లెన్‌బర్గ్ నాయకత్వం వహించారు. ఆయన వెంట క్యాంపు నుంచి దాదాపు 300 మంది తప్పించుకోగా, అందులో నాజీల ఎదురు కాల్పుల్లో రెండువందల మంది మరణించగా, విల్లెన్‌బర్గ్ సహా వంద మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈసందర్భంగా విల్లెన్‌బర్గ్ కాలికి కూడా బుల్లెట్ గాయం అయింది. అప్పటికి విల్లెన్కు 20 ఏళ్ల వయస్సు. 1942లో నాజీ సైనికులు వందలాది మంది ఖైదీలతోపాటు విల్లెన్ను ట్రెబ్లింకా కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించారు. విల్లెన్ యూదు జాతీయుడు అయినప్పటికీ అలా కనిపించకపోవడం, తాను తాపీ మేస్త్రీనంటూ చెప్పడం వల్ల ఆయన బతికిపోయారు. ఆయనతోపాటు తీసుకొచ్చిన వందలాది మందిని ఒంతుల వారిగా గ్యాస్ చేంబర్స్ (విషవాయువు గదులు)లోకి పంపించి అమానుషంగా చంపేశారు. విల్లెన్, మరికొంత మంది యువకులు క్యాంప్ మెయింటెనెన్స్ పనులు అప్పగించారు. జర్మన్ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో 8, 75,000 మందిని చంపినట్లు వాషింఘ్టన్లోని ‘హోలోకాస్ట్ మెమోరియల్ అండ్ మ్యూజియం’ గణాంకాలు తెలియజేస్తున్నాయి. నాజీ సైనికుల నుంచి వార్సాను విముక్తి చేయడం కోసం 1944లో జరిగిన యుద్ధంలో విల్లెన్ పాల్గొన్నారు. 1950లో ఇజ్రాయెల్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాజీల జనన హననానికి సంబంధించిన ఛేదు జ్ఞాపకాలను తన హైస్కూల్ విద్యార్థులతో పంచుకునేందుకు అప్పుడప్పుడు పోలండ్, ట్రెబ్లింకా సందర్శించేవారు. ఆయన తన జ్ఞాపకాలను అక్షరబద్ధం కూడా చేశారు. ఆయన తన జ్ఞాపకాలను తోటి ప్రజలతో పంచుకోవడమే ప్రధాన వృత్తిగా పెట్టుకొని బతికారు. చివరి శ్వాస విడిచేవరకు ఆయనకు ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఆ అడవిలో కార్లకు 70 ఏళ్లు..!
ఈ ఫోటోలోని కార్లను చూస్తే మీకేమనిపిస్తోంది..? ఈవిల్‌డెడ్ సినిమా లొకేషన్లా ఉంది కదా...! కానీ ఈ ప్రాంతం నిజంగా ఉంది. 70 ఏళ్ల నుంచి ఈ కార్లు ఆ ప్రాంతంలో అలానే ఉన్నాయి. మరి ఆ కార్లు ఎవరివో, అక్కడెందుకున్నాయో తెలుసుకుందామా...? అది బెల్జియంలోని చాటిలాన్ అనే మారుమూల గ్రామం. అక్కడ ఓ దట్టమైన అడవి ఉంది. అందులో హాలీవుడ్ హార్రర్ సినిమా లొకేషన్‌కి ఏమాత్రం తీసిపోని ప్రాంతం ఉంది. మామూలుగా అడవి అంటే జంతువులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ అడవిలో జంతువులతో పాటు కార్లు కూడా ఉంటాయి. అలా అని పదో, ఇరవయ్యో కార్లు అనుకుంటే మీరు కారులో కాలేసినట్లే...! అలాంటి కార్లు ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. అందుకే వదిలేశారు..!? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైన్యాలు భారీ సంఖ్యలో బెల్జియం గడ్డపై మోహరించాయి. వీరి సైనిక బలం ఆరు లక్షలు. వీరిలో చాలా మందికి కార్లున్నాయి. యుద్ధం ముగిసిన అనంతరం ఈ సైన్యాలు వెనుదిరిగిపోయే సమయంలో రవాణా సమస్య ఏర్పడింది. కార్లు ఉన్నవారందరూ ఈ అడవి ప్రాంతాన్ని ఎంచుకుని తమ కార్లను ఇక్కడ ఉంచి తర్వాత తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ కారుని తెచ్చుకోవడానికి కావాల్సిన సొమ్ముతో రెండు కార్లని కొనుక్కోవచ్చు. అందుకని ఆ కార్లని అక్కడే వదిలేశారు. ఆ కార్లు అక్కడ అలా ఉండి ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పట్టిపోయాయి. స్థానికులు, కార్ల వ్యాపారులు కొందరు ఆ కార్ల విడిభాగాలను తస్కరించుకుపోయారు. పర్యావరణ సమస్యలు తలెత్తడంతో బెల్జియం ప్రభుత్వం ఈ అడవిని నిషేధిత ప్రదేశంగా ప్రకటించింది. ఈ కథ నిజమేనా..? కొంతమంది చరిత్రకారులు ఈ కథ నిజం కాదని కొత్త వాదనను తెర పైకి తెచ్చారు. ఈ కార్లను పరిశీలిస్తే అవి 70 ఏళ్ల కిందటివి కాదని తెలిసిపోతుందని అంటున్నారు. చరిత్ర నిజమో, చరిత్రకారులు నిజమో తెలియాలంటే ఈ మిస్టరీ వీడక తప్పదు. -
హాలీవుడ్ తెరపై రెండో ప్రపంచ యుద్ధం
ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నోలన్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పీరియాడిక్ సినిమాల హవా నడుస్తోంది. అదే బాటలో రెండు ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు క్రిస్టోఫర్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ డైనమో కథను ఈ సినిమాలో చూపించనున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ వార్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ వార్ డ్రామా, 2017 జూలైలోరిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రాల తరహాలోనే భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన ప్రతీ సినిమాతో అంతర్జాతీయ సినీ వేదికల మీద సత్తా చాటే ఈ స్టార్ డైరెక్టర్ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. -
విమానం ఇంజన్ ఆవాసంగా మారింది
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా భాగస్వామ్యం కావడానికి కారణమైన పెర్ల్‌హార్బర్ దాడి ఘటనలో 74 సంవత్సరాల క్రితం మునిగిపోయిన విమాన శకలం అరుదైన ఫొటో ఇది. నీటిపై ల్యాండ్ అయ్యే కటాలినా పీబీవై-5రకం విమానం ఇంజన్ ప్రస్తుతం ఇలా సముద్రజీవులకు ఆవాసంగా మారింది. -
కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్!
నిజంగా ఇదో చిత్రమైన కాంబినేషనే! కంగనా రనౌత్... బాలీవుడ్లో ఈ పేరు వినగానే విభిన్న తరహా పాత్రలు చేసే నటి గుర్తుకొస్తారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ పేరు వినగానే వైవిధ్యమైన కథాంశంతో కూడిన సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ కొత్త సినిమా మొదలైంది. పేరు - ‘రంగూన్’. గమ్మత్తేమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన క్రిష్ ‘కంచె’ సినిమా లాగే ఈ సినిమా కథ కూడా 1940ల నాటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలోనే నడుస్తుంది. ఈ పీరియడ్ ఫిల్మ్‌లో షాహిద్ కపూర్, సయీఫ్ అలీ ఖాన్లు హీరోలు. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కంగన ఒక నటిగా కనిపించనుండడం విశేషం. నటిగా తనను తీర్చిదిద్దిన వ్యక్తితోనే ప్రేమలో పడే పాత్ర ఆమెది. ఇక సినిమాలో ముఖ్యమైన మూడో పాత్ర - ఒక సైనికుడిది. గతంలో ‘ఓంకార’ సినిమాలో విశాల్ భరద్వాజ్‌తో కలసి పనిచేసిన షాహిద్ కపూర్‌కు అదే దర్శకుడితో ఇది రెండో సినిమా. ఎప్పటికప్పుడు పాత్రల్లో కొత్తదనం కోసం, అభినయంలో ఆత్మ సంతృప్తి కోసం వెతికే కంగనా రనౌత్ మరోసారి దుమ్ము రేపుతారేమో చూడాలి. -
కొత్త ఉషోదయాల కోసం ఎదురుచూపులు
సంపద పంపిణీ అనేది పెద్ద ఆధునిక విప్లవం. ఈ ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలి అనే అంశంతోపాటు, పాత ఉద్యమరీతులు ఏ మేరకు ఉపకరిస్తాయో యోచించాలి. వీటిని పునఃసమీక్షించుకుంటూనే ఆధునిక ప్రజా పోరాట పంథాలను నిర్ణయించుకోవడం అవసరం. రెండో ప్రపంచయుద్ధం తరువాత (1939-1945) చాలా దేశాలలో స్వాతంత్య్రోద్యమాలు బలపడ్డాయి. శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గిన ప్రజలు తమ ఆగ్రహానికి మరింత పదును పెట్టి, స్వేచ్ఛను సాధించు కునే దిశగా కదిలారు. అమెరికా సం యుక్త రాష్ట్రాలలోని నల్లవారితో పాటు; లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రి కా ప్రాంతాల ఉద్యమశక్తులు సైతం అలజడులను తీవ్రం చేశాయి. అయితే ఈ పరిణామాలే పెట్టుబడిదారీ వర్గాలలో ఐక్యతకు కారణమైనాయన్నది మరొక సత్యం. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అవి ఒక పథకం తయారుచేసుకున్నాయి. తనను తాను కొనసాగించుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ అనేక వ్యూహాలను రచించుకుంటూనే ఉంటుంది. ప్రచ్ఛన్నయుద్ధం, సోవియెట్ రష్యా పతనానంతర ఏక ధ్రువ ప్రపంచంలో కూడా ఆ వ్యవస్థ తనదైన ఉనికిని చాటుకోవడానికి అడ్డూ అదుపు లేని రీతిలో వ్యూహ రచన చేస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నేడు కనిపిస్తున్న అనేకానేక సంక్షోభాలు ఆ వ్యూహాల ఫలితమే. ఆఖరికి ఉద్యమాల నుంచి జనించిన ప్రసార సాధనాలు, అణగారిన వర్గాలకు గొంతును ఇచ్చిన అక్షరాలు ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలో ఆయు ధాలుగా మారినాయి. ఈ నేపథ్యంలో వామపక్ష, ప్రగతిశీల శక్తులు వహించవలసిన పాత్ర ఏమిటి? అసలు ఉద్యమం ఎలా ఉండాలి? ఇవే అందరి ముందు ఉన్న కొత్త ప్రశ్నలు. సంపద అంతా ఒకేచోట పోగుపడడమనే పరిణామం కూడా రెండో ప్రపంచ యుద్ధానంతరమే విపరీతంగా కనిపిస్తుంది. కోటీ శ్వరుల సంఖ్య పెరిగింది. కొన్ని దేశాల బడ్జెట్ కన్నా, కొద్దిమంది సంపదే ఎక్కువ. ప్రపంచ సంపద 15 శాతం పెట్టుబడిదారుల దగ్గర కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు నాలెడ్జ్ ఎకానమీ తయారయింది. ఇప్పటి వరకు జరగని ఆవిష్కరణలను అడ్డం పెట్టుకుని, వాటితో కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు సెల్ ఇంజనీరింగ్. మూత్రపిండాలతో పాటు, ఇతర అవయవాల మార్పిడి కూడా దీని ఫలితమే. ఇది వైద్యరంగంలో కొత్త లాభాలకు దారులు వేసింది. పైగా ఆ లాభాలన్నీ భారీగా ఉండడంతో పెట్టుబడిదారీ వర్గం వైద్యరంగం మీద ప్రత్యేక దృష్టిని సారించింది. దీనితో పాటు విశ్వవిద్యాలయాలను కూడా ఆ వర్గం తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇందుకు కారణాలను ఊహించడం కష్టం కాదు. 20వ శతాబ్దం వరకు ఉద్యమాలకు, ఆందోళనలకు విశ్వవిద్యాలయాలే ఆలవాలంగా ఉన్నాయి. విప్లవాలకు బీజాలు వేసినా, ప్రజాస్వామిక భావాలకు ప్రాచుర్యం లభించినా అదంతా విశ్వవిద్యాలయాల తరగతి గదుల దగ్గరే ఆరంభమైంది. ఇది గుర్తించే పెట్టుబడిదారీ వర్గం విశ్వవిద్యాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకునే పని మొదలుపెట్టింది. విద్య, వైద్యం అనే రెండు మహోన్నత రంగాలు పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఇదే. రాజ్యాధికారం మీద మరింత పట్టు సాధిం చడానికి సంక్షేమ కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని ప్రభు త్వం మీద పెట్టుబడిదారీ వ్యవస్థ ఒత్తిడి పెంచే పని కూడా ఆరం భించింది. ఈ మొత్తం పరిణామం ప్రపంచ వ్యాప్తంగా కొత్త రాజకీయ వాతావరణానికి దోహదం చేసింది. దీనినే ప్రైవేటైజేషన్, గ్లోబలై జేషన్, లిబరలైజేషన్ అంటున్నారు. వారి వ్యూహంలో భాగంగా ప్రతి దేశంలోను పెట్టుబడిదారుల వికేంద్రీకరణ ప్రక్రియ కూడా జరిగింది. పెట్టుబడిదారులు ఆయా దేశాలలోని రాజకీయాల మీద ఆధిపత్యం సాధించారు. ఏ దేశంలో అయినా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల రేటు కంటే, పెట్టుబడిదారుల ఎదుగుదల రేటు హెచ్చుగా ఉంటే అసమానతలు పెచ్చరిల్లుతాయి. 21వ శతాబ్దం లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరిగింది. సంపద కూడా అపా రంగా పెరిగింది. వాటితో పాటు దారిద్య్రం కూడా పెరిగిందన్న మాట వాస్తవం. ఈ పరిణామాన్నే ఆర్థికవేత్తలు ’R' is greater than ’G’ అన్నారు. ఆర్ అనేది రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ క్యాపిటల్, జి అనేది రేట్ ఆఫ్ నేషనల్ గ్రోత్. ప్రైవేటు పెట్టుబడి జాతీయ పెట్టుబడిని మించిపోతే వ్యవస్థ సమతౌల్యం దెబ్బతింటుంది. అందుకే, ‘సంపద పంపిణీనీ, ఆదాయాన్నీ క్రమబద్ధీకరించనంత కాలం ప్రపంచంలో దారిద్య్ర నిర్మూలన జరగదు’ అంటాడు ప్రముఖ ఆర్థికవేత్త, ట్వెంటీఫస్ట్ సెంచరీ రచ యిత థామస్ పికెటీ. విజ్ఞానం ఇచ్చిన ఫలితాలను, ఆ రంగంలో జరిగిన పరిశోధనలను పెట్టుబడిదారీ శక్తులు ఉపయోగించు కున్నంతగా శ్రామిక శక్తులు వినియోగించుకోలేక పోయాయి. అందుకే నేటి ఉద్యమాలన్నింటికీ సంపద పంపిణీ అనే అంశమే కేంద్రబిందువు కావాలి. ఈ నేపథ్యంలో మార్పును కోరే వారంతా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి. సంపదను సమంగా పంచడానికీ, లేదా సకల వర్ణాలు దానిని సమంగా అందుకోవడానికీ ఏం చేయాలి? పెట్టుబడి దారీ శక్తులు కాలాన్ని బట్టి తమ స్వరూపాన్ని మార్చుకుంటూ రాజకీయ శక్తిగా, రాజ్యాధికారాన్ని శాసించే శక్తిగా, ఆర్థిక శక్తుల ను నిర్దేశించే వ్యవస్థగా అవతరించి విద్య వైద్యం వంటి కీలక రంగాలను హస్తగతం చేసుకున్నాయి. ఈ వాస్తవాన్ని గమనం లోకి తీసుకుని ఉద్యమంలో ఏ అంశాలను ముందు వరసలో ఉంచాలి; ఏ వర్గాలను కదిలించాలి? అనే విషయాలను నిర్ణ యించడం ముఖ్యం. ఈ ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలి అనే అంశంతో పాటు, పాత ఉద్యమ రీతులు ఏ మేరకు ఉపకరిస్తాయో యోచించాలి. వీటిని పునః సమీక్షించుకుంటూనే ఆధునిక ప్రజా పోరాట పంథాలను నిర్ణయించుకోవడం అవసరం. భూ స్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా దున్నేవానిదే భూమి, సమ సమాజ స్థాపన వంటి నినాదాలు ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చా యి. కానీ కంప్యూటర్ యుగంలో ఉద్యమాల తాత్వికత ఎలా ఉండాలన్నది కూడా చర్చనీయాంశమే. సంపద పంపిణీ అనేది పెద్ద ఆధునిక విప్లవం. అసలు మార్కెట్ శక్తుల నుంచి సంప దను విడదీయడానికి అవసరమైన ఉద్యమాలు ఎలా ఉండాలి? వీటి మీద లోతైన చర్చ అవసరం. ఆధునిక ఉద్యమాల రూప కల్పనే ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశం. - వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు - చుక్కా రామయ్య -
యుద్ధ చరిత్రలో చివరి విలుకాడు
పీఛేముడ్ రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరఫున జాన్ మాల్కమ్ థోర్పే ఫ్లెమింగ్ జాక్ చర్చిల్ అనే అధికారి లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసేవాడు. ఆ కాలానికి మెషిన్గన్లు, రివాల్వర్లు వంటి అధునాతన ఆయుధాలెన్నో అందుబాటులోకి వచ్చినా, ఇతగాడు మాత్రం సంప్రదాయబద్ధమైన స్కాటిష్ ఖడ్గాన్ని, విల్లంబులను ధరించి రణరంగంలో పోరాడేవాడు. ఆధునిక యుద్ధ చరిత్రలో చిట్టచివరి విలుకాడు ఇతడే. ధనుర్విద్యలో ఇతగాడికి అపార నైపుణ్యం ఉండేది. అంతే స్థాయిలో తలతిక్కా ఉండేది. తన ఎదుటికి వచ్చే సైనికులు ఖడ్గాన్ని ధరించకుంటే, అగ్గిరాముడయ్యేవాడు. అప్పటికప్పుడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాడు. శత్రుబలగాలు తుపాకుల మోత మోగిస్తున్నా, విల్లంబులు ధరించి, రణరంగానికేగిన ఈ వెర్రి సేనాని, జర్మనీలోని నాజీ బలగాలకు చిక్కాడు. ఇతగాడి ఇంటిపేరు చర్చిల్ కావడంతో బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్‌కు చుట్టం కావచ్చనే భ్రమలో తొలుత నాజీ నేతలు ఇతగాడిని చంపే ఆలోచనను విరమించుకున్నారు. విన్స్టన్ చర్చిల్తో ఇతగాడికి ఎలాంటి బంధుత్వం లేదని తేలిన మరుక్షణమే హిట్లర్ ఇతగాడిని చంపేయాలంటూ హుకుం జారీ చేశాడు. అయితే, ఆ ఆదేశాన్ని నాజీ కెప్టెన్ హాన్స్ థార్నర్ అమలు చేయకపోవడంతో జాక్ చర్చిల్ బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
ప్రపంచంలోనే తొలి అణుప్రమాదం
ఆ నేడు 1957 అక్టోబర్ 10 అణుశక్తి అందుబాటులోకి వచ్చాక, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికన్ బలగాలు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేశాయి. అణుశక్తి సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో అప్పుడే తొలిసారిగా మానవాళికి అర్థమైంది. అది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసం. నాలుగేళ్ల కిందట అదే జపాన్‌లోని ఫుకుషిమా అణుకేంద్రంలో సంభవించిన ప్రమాదం విధ్వంసానికి దారితీసింది. అయితే, అణుశక్తిని ఆయుధాల తయారీకి ఉపయోగించడం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే బ్రిటన్‌లో అణుప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఇది మొదటి అణుప్రమాదం. ఈ ప్రమాదం 1957లో సరిగా ఇదే రోజు జరిగింది. కంబర్లాండ్లోని అణుకేంద్రంలో ఈ ప్రమాదం ధాటికి మూడు రోజుల పాటు మంటలు ఎగసిపడ్డాయి. దీని ప్రభావానికి వందలాది మంది కేన్సర్ బారిన పడ్డారు. దాంతో ఇది చరిత్ర పుటలలో తొలి అణుప్రమాదంగా నిలిచిపోయింది. -
దురాక్రమణల పర్వం.. ఆ యుద్ధం
‘‘యుద్ధం మానవజాతికి చరమగీతం పాడకముందే.. మానవజాతి యుద్ధానికి చరమగీతం పాడాలి’’ అంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీ. రక్తపాతాన్ని సృష్టించే యుద్ధం వల్ల సాధించేదేమీ ఉండదు. దేశాధినేతల భూదాహం చల్లార్చుకోవడం తప్ప. కోట్లాది కుటుంబాల రక్తాన్ని ఏరులై పారించిన రెండో ప్రపంచ యుద్ధ కాలాన్ని తలచుకుంటే నేటికీ సైనికుల కళ్లు చెమర్చుతాయి. పోరాటం దేనికోసమో తెలియని అయోమయస్థితిలోకి ప్రపంచాన్ని నెడతాయి..! 1939 నుంచి 45 వరకూ ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల సమాహారమే రెండో ప్రపంచ యుద్ధం. వీటిలో కొన్ని విడివిడిగానూ, కొన్ని ఉమ్మడిగానూ జరిగాయి. సుమారు ఆరు కోట్లమందిని బలితీసుకున్న ఈ యుద్ధం.. ప్రధానంగా రెండు కారణాల వల్ల పురుడుపోసుకుంది. వాటిలో మొదటిది 1937లో జరిగిన జపాన్-చైనా యుద్ధం కాగా.. 1939 పోలాండ్ దురాక్రమణ రెండోది. ఇవే రానురానూ ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ కలిసి మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాలు అనే రెండు కూటములుగా ఏర్పడి, మహా సంగ్రామంలో పాల్గొనేలా చేసింది. ఆరంభం.. 1937 జూలైలో చైనా ప్రధాన భూభాగంపై జపాన్ పెద్దఎత్తున దాడి చేసింది. షాంఘై, గువాంగ్ ర నగరాలపై బాంబులు కురిపించి.. నాంకింగ్‌లో నరమేధం జరిపి వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది. ఇదేసమయంలో జర్మనీ, ఇటలీ రెచ్చగొట్టే విదేశాంగ విధానాలు అవలంబించాయి. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పాలిత సోవియెట్ యూనియన్ను తమ శత్రువుగా భావించి జర్మనీతో శాంతిఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాలుపంచుకుంది. దీని ప్రకారం సోవియెట్ దిశగా జర్మనీ విస్తరణను బ్రిటన్, ఫ్రాన్స్‌లు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తాయి. దీంతో సోవియెట్‌ను నియంత్రణలో ఉంచొచ్చని బ్రిటన్ భావించింది. అయితే 1939లో బ్రిటిష్ వారిని ఆశ్చర్యపరుస్తూ సోవియెట్, జర్మనీలు ఏకమై పోలండ్‌ను ఆక్రమించుకున్నాయి. దీంతో యూరప్‌లో మహా సంగ్రామానికి తెరలేచింది. జర్మనీపై యుద్ధం.. శాంతి చర్చలకు జర్మనీ నియంత హిట్లర్ దిగిరాకపోవడంతో బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆగ్రహించాయి. వెంటనే యుద్ధ ప్రకటన జారీ చేశాయి. జర్మనీ మాత్రం ఆక్రమణల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. 1940లో డెన్మార్క్, నార్వేలను ఆక్రమించుకుంది. అదే ఏడాది వేసవిలో బెల్జియం, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్లతో పాటు ఫ్రాన్స్‌లో కొద్ది భాగాన్ని కూడా అధీనంలోకి తెచ్చుకుంది. ఇదే సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్‌లపై ఇటలీ యుద్ధం ప్రకటించింది. దీంతో బ్రిటన్ మీద తొలిసారిగా దాడులు మొదలయ్యాయి. కూటముల ఏర్పాటు.. 1941లో సోవియెట్ యూనియన్‌పై జర్మనీ దాడి చేయడంతో మిత్రరాజ్యాల కూటమిలో సోవియెట్ చేరింది. మొదట్లో జర్మన్లు విజయం సాధించారు. అయితే క్రమేణా ఆ ఏడాది శీతాకాఠిలం నాటికి జర్మన్ల విజయానికి అడ్డుకట్ట పడింది. మరోవైపు ఆసియాలో జపాన్ ఆక్రమణలు మరింత పెరిగాయి. చైనా భూభాగాలతో పాటు ఇండో-చైనా భాగాన్నీ జపాన్ ఆక్రమించింది. దీంతో అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్‌లు ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. ఇది జపాన్‌కు ఎక్కడలేని కోపం తెప్పించింది. అమెరికాకు చెందిన పెర్ల్హార్బర్పై దాడి చేశాయి జపాన్ దళాలు. దీంతోపాటు బ్రిటన్ అధీనంలోని ఆగ్నేయాసియా భూభాగాల మీదా జపాన్ మెరుపుదాడి చేసింది. దీంతో అమెరికా యుద్ధరంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రపంచ యుద్ధంగా.. అమెరికా మిత్రరాజ్యాలతో చేతులు కలపడంతో ఇది ప్రపంచ యుద్ధంగా మారింది. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లతో సహా అమెరికా ఖండానికీ యుద్ధం పాకినట్టయింది. జర్మనీ, జపాన్, ఇటలీ కూటమిగా ఉన్న అక్షరాజ్యాలు తొలుత విజయాలు సాధించినప్పటికీ, 1942 నుంచి వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. పసిఫిక్ మహా సముద్రంలో అమెరికన్ సేనలు జపాన్ నౌకలను ముంచివేశాయి. మరోవైపు జర్మనీ సేనలను మిత్రరాజ్యాల సైనికులు ఆఫ్రికా ఎడారి యుద్ధం నుంచి తరిమికొట్టారు. మరుసటి ఏడాది స్టాలిన్ గ్రాడ్ వద్ద సోవియెట్ సైనికుల చేతిలో జర్మనీ భారీ పరాజయం చవిచూసింది. 1944లో యుద్ధం పూర్తిగా మిత్రరాజ్యాల వైపునకు మళ్లింది. సోవియెట్ సేనలు పోలండ్, రుమేనియాలను.. అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్ కూటమి బెల్జియం, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్లకు అక్షరాజ్యాల చెర నుంచి విముక్తి కలిగించాయి. తూర్పు నుంచి సోవియెట్ సైనికులు, పశ్చిమం నుంచి మిత్ర రాజ్యాలు ముట్టడించడంతో జర్మనీకి ఊపిరాడలేదు. 1945లో జర్మనీ రాజధాని బెర్లిన్ను సోవియెట్ సేనలు వశపరచుకోవడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జపాన్ మాత్రం తన దూకుడు కొనసాగించింది. చివరకు ఆ దేశ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించడంతో జపాన్‌కు ఓటమిని అంగీకరించక తప్పలేదు. మిత్రకూటమిలోకి ఇటలీ.. జర్మనీ బలహీనపడటంతో మిత్రరాజ్య సేనలు ఇటలీ వైపు దృష్టి మల్లించాయి. ఉత్తర దిశగా కదులుతూ సిసిలీని వశపరుచుకుని ఇటలీలో అడుగుపెట్టాయి. దీంతో కొద్దిరోజుల్లోనే ఆ దేశం మిత్రరాజ్యాల చేతికి చిక్కింది. విధిలేని పరిస్థితిలో 1943 సెప్టెంబర్ 8న ఇటలీ మిత్రరాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు అమెరికా సేనలు జపాన్ అధీనంలోని దీవులను వశపరచుకున్నాయి. -
ఈ క్షణంలోనే జీవించాలి
జెన్‌పథం అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ. యుద్ధం తారస్థాయిలో సాగుతోంది. ఆ సమయంలో బ్రిటిష్ నేత విన్స్టన్ చర్చిల్ ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒకరు చర్చిల్ని ‘‘ఈ యుద్ధం వల్ల ఏమవుతుందో అని మీకు భయం కలగడం లేదా?’’ అని అడిగారు.‘‘మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు’’ అని చర్చిల్ ఎదురుప్రశ్న వేశారు.‘‘ఒకవేళ యుద్ధంలో శత్రుదేశాలు గెలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమవుతుందని ఆలోచించారా? దాని గురించి మీకు ఎలాంటి కలవరపాటూ లేదా?’’ అని అడిగారు ఆ వ్యక్తి. అందుకు చర్చిల్ ‘‘నాకెందుకు కలవరపాటు? నాకిప్పుడు చాలా పనులున్నాయి. కనుక రేపు ఏమవుతుందో అని దిగులుపడటానికి నాకేదీ సమయం?’’ అన్నారు. చర్చిల్ చెప్పిన ఈ విషయాన్నే, అంతకు చాలా పూర్వం ఎందరో జెన్ గురువులు తమ తమ జీవితాల్లో (ఈ క్షణంలో జీవించడం ప్రధానం అని) నిరూపించారు. దీనినే కాస్తంత విడమరిచి చూస్తే ఇప్పుడున్న క్షణంలో జీవిస్తే జరిగిపోయిన క్షణాలలో తీసుకున్న నిర్ణయాలు కానీ, పనులకు సంబంధించి కానీ, లేదా జరగబోయే క్షణాలలో మనముందున్న సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడానికిగానీ ఆవగింజంత సమయం కూడా ఉండదు.ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఎవరు ఏం చెప్పినా శాంతంగా వినేవారు. కోపగించుకునేవారు కాదు. తిట్టేవారు కాదు. అసలు ఎవరినీ ఏమీ అనేవారు కాదు. ఆయన వాలకం శిష్యులకు ఆశ్చర్యంగా ఉండేది. ఆయన ఎలా నిశ్చింతగా ఉన్నారో పరీక్షించాలనుకున్నారు. ఆ గురువుగారికి రోజూ మధ్యాహ్నం మూడు గంటలకు టీ తయారు చేసుకుని ఒక కప్పు నిండా పోసుకుని తాపీగా నడుచుకుంటూ వచ్చి వాకిట్లో ఉన్న అరుగుమీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక్కో చుక్క తాగడం అలవాటు. ఆ రోజు కూడా ఆయన అలాగే టీ తయారు చేసుకుని కప్పు నిండా పోసుకుని వంట గదిలోంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ముగ్గురు శిష్యులు తామనుకున్నట్లు ముసుగులు ధరించి ఆయన ముందు దూకి పెద్దగా అరిచారు. అయినా గురువుగారిలో చలనం లేదు. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ కూర్చునే అరుగు మీదకొచ్చి కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగుతూ ఆనందిస్తున్నారు. మారు వేషాలు వేసుకున్న శిష్యులు ముసుగులు తీసేసి గురువు దగ్గరకు వచ్చారు. వారిని చూసి ‘‘ఏమిట్రా’’ అని అడిగారు గురువు. ‘‘గురువుగారూ, ఇందాక మీరు భయపడాలని మీ ముందు అకస్మాత్తుగా దూకి వికారంగా అరిచింది మేమే. కానీ మీరు భయపడలేదేంటీ?’’ అని శిష్యులు అడిగారు. అప్పుడు గురువుగారు ‘‘అలాగా? నేను నా పనిలో ఉండి నా చుట్టూ ఉన్నవేవీ గమనించలేదు. పోనీ ఇప్పుడు టీ తాగేశాను కదా మీ కోసం నేను భయపడి చూపిస్తాను. చూస్తారా నా భయాన్ని...?’’ అని చెప్పేసరికి శిష్యులు నివ్వెరపోయారు. - యామిజాల జగదీశ్ -
ముస్సోలిని ఇక్కడే దాక్కోవాలనుకున్నాడు!
చరిత్ర రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇటాలియన్ నియంత ముస్సోలి నిర్మించిన రహస్య బంకరును తొలిసారిగా ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తుంది ఇటలీ ప్రభుత్వం. ఇటలీలోని ‘విల్ల తొర్లోనియ’ పార్క్ ప్రస్తుతం విందు, వినోదాలు, కాలక్షేపాలకు ప్రసిద్ధి చెంది ఉండొచ్చుగానీ దానికున్న చరిత్ర తక్కువేమీ కాదు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో ముస్సోలిని తన భార్యాపిల్లలతో కలిసి జీవించాడు. వైమానిక, విషయ వాయువుల దాడుల నుంచి తనను, కుటుంబాన్ని రక్షించుకోవడానికి అండర్ గ్రౌండ్ ఛాంబర్‌ను నిర్మించాడు. అత్యంత రహస్యంగా నిర్మించిన ఈ యాంటి-గ్యాస్ ఛాంబర్లో ఎనిమిది గదులు, మెట్లు ఉన్నాయి. గ్యాస్మాస్క్లు, హెల్మెట్లు ఎప్పుడూ బంకర్లో సిద్ధంగా ఉండేవి. పదిహేనుమంది వరకు దీనిలో తలదాచుకోవచ్చు.బంకర్ నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు(ఎస్కేప్ రూట్స్) ఉన్నాయి. ‘‘బాంబులు నా బాల్కనీలో పడినా నేను బెదిరేది లేదు. బంకర్లో దాక్కొనేది లేదు’ అనేవాడట ముస్సోలిని. ‘‘నిజానికి బంకర్లు నిర్మించడానికి, అందులో తలదాచుకోవడానికి ముస్సోలిని వ్యతిరేకం. ఒకరిని చూసి ఒకరు బంకర్లు నిర్మించుకుంటున్న కాలంలో కూడా ఎప్పుడూ ఆ పని చేయలేదు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అనుకున్న అనివార్య పరిస్థితిలో మాత్రమే బంకర్ నిర్మించుకున్నాడు’’ అంటున్నాడు లారా లొంబర్డీ అనే చరిత్రకారుడు. ప్రత్యేక పరిస్థితులలో, ప్రత్యేక శ్రద్ధతో ముస్సోలిని ఈ బంకర్‌ని నిర్మించినప్పటికీ అందులో ఎప్పుడూ ఉండలేదు. పనిలో పురోగతి గురించి మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. గత సంవత్సరం ఈ బంకర్ తాలూకు ఫొటోలను తొలిసారిగా విడుదల చేశారు. 2011 వరకు గానీ దీన్ని కనుగొనలేదు. ‘‘చిన్న చిన్న మరమ్మతులు మినహా బంకర్ ఇప్పటికీ చెక్క చెదరకుండా ఉంది. కితాబు ఇవ్వాల్సిన రహస్య ప్రదేశం ఇది’’ అంటున్నాడు క్లారో సెరఫిని అనే ఆర్కిటెక్ట్. -
ఆ గుడికి వెళ్తే గొడవెందుకు?
జపాన్ ప్రధానమంత్రి షింజో అబే యాసుకుని మందిరానికి వెళ్లడం మళ్లీ వివాదానికి దారి తీసింది. ఆ గుడికి ఎందుకు వెళ్లారంటూ చైనా, కొరియా వంటి దేశాలు జపాన్ పై నిప్పులు కురిపించాయి. 'అది మా వీరుల గుడి. అక్కడికి వెళ్తే గొడవెందుకు' అంటూ జపానీయులు కౌంటర్ ఇస్తున్నారు. యాసుకుని మందిరం అంటే ఏమిటి? టోక్యో నగరంలో ఉన్న యాసుకుని మందిరంలో జపాన్ కోసం పోరాడి అమరులైన వారి అవశేషాలున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం లో చనిపోయిన వారి స్మృతిలో ఈ మందిరాన్ని నిర్మించారు. యాసుకుని అంటే దేవుళ్లు లేదా మహాత్ములుండే చోటు అని అర్ధం. ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు స్కూలు టూర్లలో ఈ మందిరాన్ని దర్శిస్తూంటారు. ఈ మందిరం ఎందుకు వివాదాస్పదం? రెండో ప్రపంచ యుద్ధంలో 24 లక్షల మంది జపాన్ సైనికులు చనిపోయారు. వీరిలో వెయ్యి మందిని అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ నరహంతకులుగా పరిగణిస్తుంది. వీరు కొరియా, చైనా వంటి దేశాల్లో కిరాతకాలకు పాల్పడ్డారన్నది వీరిపై ఆరోపణ. అందుకే జపాన్ నేతలు ఎవరైనా ఈ మందిరానికి వెళ్తే కొరియా, చైనా, తదితర ఆగ్నేయాసియా దేశాలు భగ్గుమంటాయి. తమ దేశాల్లో కిరాతకాలకు పాల్పడ్డ నరహంతకులకు జపాన్ నివాళులు అర్పించడం ఏమిటని ఆ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది జపాన్ యుద్ధ కాంక్షకు నిదర్శనం అని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. జపాన్ వాదనేమిటి? యుద్ధంలో పరాజితులైన వారిని నేరస్తులుగా పరిగణించడం తప్పన్నది జపాన్ వాదన. విజేతలు చేసిన అకృత్యాల మాటేమిటని జపాన్ ప్రశ్నిస్తోంది. జపాన్ పై అణుబాంబులు వేసిన వారు ఎందుకు యుద్ధ నేరస్తులు కారన్నది జపాన్ వాదన. మా దేశం కోసం చనిపోయిన వారికి నివాళి అర్పించడంపై వివాదమెందుకు అటోంది జపాన్. షింజో అబే రాజకీయం జపాన్ ప్రధాని షింజో అబే తొలినుంచీ యాసుకుని మందిరం విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ప్రతి ఏటా ఆయన ఈ మందిరానికి వెళ్లడం లేదా పుష్పగుచ్ఛాలను పంపడం వంటివి చేస్తూన్నారు. దీనిపట్ల అమెరికా సైతం అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. షింజో అబే తండ్రి నోబుసుకే కిషి కూడా ఇలాంటి యుద్ధ ఖైదీయే. ఆయన తరువాత జపాన్ ప్రధాని కూడా అయ్యారు. షింజోకి ఈ ఆలయ దర్శనం రాజకీయంగా కూడా లాభాన్నిస్తుంది. మొత్తం మీద ఆలయ దర్శనం వివాదాస్పదం అవుతోంది.