దురాక్రమణల పర్వం.. ఆ యుద్ధం | second world war details | Sakshi
Sakshi News home page

దురాక్రమణల పర్వం.. ఆ యుద్ధం

Published Fri, Jul 10 2015 9:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

దురాక్రమణల పర్వం.. ఆ యుద్ధం

దురాక్రమణల పర్వం.. ఆ యుద్ధం

‘‘యుద్ధం మానవజాతికి చరమగీతం పాడకముందే.. మానవజాతి యుద్ధానికి చరమగీతం పాడాలి’’ అంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీ. రక్తపాతాన్ని సృష్టించే యుద్ధం వల్ల సాధించేదేమీ ఉండదు. దేశాధినేతల భూదాహం చల్లార్చుకోవడం తప్ప. కోట్లాది కుటుంబాల రక్తాన్ని ఏరులై పారించిన రెండో ప్రపంచ యుద్ధ కాలాన్ని తలచుకుంటే నేటికీ సైనికుల కళ్లు చెమర్చుతాయి. పోరాటం దేనికోసమో తెలియని అయోమయస్థితిలోకి ప్రపంచాన్ని నెడతాయి..!
 
1939 నుంచి 45 వరకూ ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల సమాహారమే రెండో ప్రపంచ యుద్ధం. వీటిలో కొన్ని విడివిడిగానూ, కొన్ని ఉమ్మడిగానూ జరిగాయి. సుమారు ఆరు కోట్లమందిని బలితీసుకున్న ఈ యుద్ధం.. ప్రధానంగా రెండు కారణాల వల్ల పురుడుపోసుకుంది. వాటిలో మొదటిది 1937లో జరిగిన జపాన్-చైనా యుద్ధం కాగా.. 1939 పోలాండ్ దురాక్రమణ రెండోది. ఇవే రానురానూ ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ కలిసి మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాలు అనే రెండు కూటములుగా ఏర్పడి, మహా సంగ్రామంలో పాల్గొనేలా చేసింది.

ఆరంభం..
1937 జూలైలో చైనా ప్రధాన భూభాగంపై జపాన్ పెద్దఎత్తున దాడి చేసింది. షాంఘై, గువాంగ్ ర నగరాలపై బాంబులు కురిపించి.. నాంకింగ్‌లో నరమేధం జరిపి వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది. ఇదేసమయంలో జర్మనీ, ఇటలీ రెచ్చగొట్టే విదేశాంగ విధానాలు అవలంబించాయి. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పాలిత సోవియెట్ యూనియన్‌ను తమ శత్రువుగా భావించి జర్మనీతో శాంతిఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాలుపంచుకుంది. దీని ప్రకారం సోవియెట్ దిశగా జర్మనీ విస్తరణను బ్రిటన్, ఫ్రాన్స్‌లు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తాయి. దీంతో సోవియెట్‌ను నియంత్రణలో ఉంచొచ్చని బ్రిటన్ భావించింది. అయితే 1939లో బ్రిటిష్ వారిని ఆశ్చర్యపరుస్తూ సోవియెట్, జర్మనీలు ఏకమై పోలండ్‌ను ఆక్రమించుకున్నాయి. దీంతో యూరప్‌లో మహా సంగ్రామానికి తెరలేచింది.

జర్మనీపై యుద్ధం..
శాంతి చర్చలకు జర్మనీ నియంత హిట్లర్ దిగిరాకపోవడంతో బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆగ్రహించాయి. వెంటనే యుద్ధ ప్రకటన జారీ చేశాయి. జర్మనీ మాత్రం ఆక్రమణల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. 1940లో డెన్మార్క్, నార్వేలను ఆక్రమించుకుంది. అదే ఏడాది వేసవిలో బెల్జియం, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్‌లతో పాటు ఫ్రాన్స్‌లో కొద్ది భాగాన్ని కూడా అధీనంలోకి తెచ్చుకుంది. ఇదే సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్‌లపై ఇటలీ యుద్ధం ప్రకటించింది. దీంతో బ్రిటన్ మీద తొలిసారిగా దాడులు మొదలయ్యాయి.

కూటముల ఏర్పాటు..
1941లో సోవియెట్ యూనియన్‌పై జర్మనీ దాడి చేయడంతో మిత్రరాజ్యాల కూటమిలో సోవియెట్ చేరింది. మొదట్లో జర్మన్లు విజయం సాధించారు. అయితే క్రమేణా ఆ ఏడాది శీతాకాఠిలం నాటికి జర్మన్ల విజయానికి అడ్డుకట్ట పడింది. మరోవైపు ఆసియాలో జపాన్ ఆక్రమణలు మరింత పెరిగాయి. చైనా భూభాగాలతో పాటు ఇండో-చైనా భాగాన్నీ జపాన్ ఆక్రమించింది. దీంతో అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్‌లు ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. ఇది జపాన్‌కు ఎక్కడలేని కోపం తెప్పించింది. అమెరికాకు చెందిన పెర్ల్‌హార్బర్‌పై దాడి చేశాయి జపాన్ దళాలు. దీంతోపాటు బ్రిటన్ అధీనంలోని ఆగ్నేయాసియా భూభాగాల మీదా జపాన్ మెరుపుదాడి చేసింది. దీంతో అమెరికా యుద్ధరంగంలోకి దిగాల్సి వచ్చింది.

ప్రపంచ యుద్ధంగా..
అమెరికా మిత్రరాజ్యాలతో చేతులు కలపడంతో ఇది ప్రపంచ యుద్ధంగా మారింది. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లతో సహా అమెరికా ఖండానికీ యుద్ధం పాకినట్టయింది. జర్మనీ, జపాన్, ఇటలీ కూటమిగా ఉన్న అక్షరాజ్యాలు తొలుత విజయాలు సాధించినప్పటికీ, 1942 నుంచి వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. పసిఫిక్ మహా సముద్రంలో అమెరికన్ సేనలు జపాన్ నౌకలను ముంచివేశాయి. మరోవైపు జర్మనీ సేనలను మిత్రరాజ్యాల సైనికులు ఆఫ్రికా ఎడారి యుద్ధం నుంచి తరిమికొట్టారు. మరుసటి ఏడాది స్టాలిన్ గ్రాడ్ వద్ద సోవియెట్ సైనికుల చేతిలో జర్మనీ భారీ పరాజయం చవిచూసింది.
 
1944లో యుద్ధం పూర్తిగా మిత్రరాజ్యాల వైపునకు మళ్లింది. సోవియెట్ సేనలు పోలండ్, రుమేనియాలను.. అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్ కూటమి బెల్జియం, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్‌లకు అక్షరాజ్యాల చెర నుంచి విముక్తి కలిగించాయి. తూర్పు నుంచి సోవియెట్ సైనికులు, పశ్చిమం నుంచి మిత్ర రాజ్యాలు ముట్టడించడంతో జర్మనీకి ఊపిరాడలేదు. 1945లో జర్మనీ రాజధాని బెర్లిన్‌ను సోవియెట్ సేనలు వశపరచుకోవడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జపాన్ మాత్రం తన దూకుడు కొనసాగించింది. చివరకు ఆ దేశ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించడంతో జపాన్‌కు ఓటమిని అంగీకరించక తప్పలేదు.
 
మిత్రకూటమిలోకి ఇటలీ..
జర్మనీ బలహీనపడటంతో మిత్రరాజ్య సేనలు ఇటలీ వైపు దృష్టి మల్లించాయి. ఉత్తర దిశగా కదులుతూ సిసిలీని వశపరుచుకుని ఇటలీలో అడుగుపెట్టాయి. దీంతో కొద్దిరోజుల్లోనే ఆ దేశం మిత్రరాజ్యాల చేతికి చిక్కింది. విధిలేని పరిస్థితిలో 1943 సెప్టెంబర్ 8న ఇటలీ మిత్రరాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు అమెరికా సేనలు జపాన్ అధీనంలోని దీవులను వశపరచుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement