యుద్ధ భయం! | West Asian Conflicts Towards World War | Sakshi
Sakshi News home page

యుద్ధ భయం!

Published Thu, Oct 3 2024 4:01 AM | Last Updated on Thu, Oct 3 2024 7:34 AM

West Asian Conflicts Towards World War

ప్రపంచయుద్ధం దిశగా పశ్చిమాసియా ఘర్షణలు!

ఇజ్రాయెల్, ఇరాన్‌ రగడపై సర్వత్రా ఆందోళనలు

లెబనాన్, యెమన్, గాజాల్లో ఇప్పటికే కుంపట్లు 

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ కురిపించిన క్షిపణుల వర్షం రక్షణ నిపుణులతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభ సూచికేనంటూ వెల్లువెత్తుతున్న విశ్లేషణలతో ఇంటర్నెట్‌ హోరెత్తిపోతోంది. రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఇదే ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది. ఆన్‌లైన్‌లో లక్షలాది పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండేళ్లు దాటినా ఆగే సూచనలు కన్పించడం లేదు. ఇటు గాజాపై ఇజ్రాయెల్‌ తెరతీసిన దాడులకు ఏడాది నిండనుంది. అవీ ఇప్పట్లో ఆగే సూచనల్లేవు. 

ఇరాక్, యెమన్, సిరియాల్లోని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే పాలస్తీనాకు దన్నుగా ఇజ్రాయెల్‌పై అడపాదడపా దాడులకు దిగుతూనే ఉన్నాయి. తద్వారా ఆయా దేశాలను కూడా ఇజ్రాయెల్‌తో యుద్ధం దిశగా లాగుతున్నాయి. వీటికి తోడు లెబనాన్‌ను వైమానిక దాడులతో వణికించి హెజ్‌»ొల్లా అగ్రనేతలను వరుసబెట్టి మట్టుపెట్టిన ఇజ్రాయెల్‌ తాజా భూతల దాడులకు కూడా దిగింది. ఆ వెంటనే ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి చందంగా మారింది. తమపై క్షిపణి దాడులకు మర్చిపోలేని రీతిలో బదులిస్తామని ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరించింది. 

ఆ ప్రతీకార దాడులు బహుశా కనీవినీ ఎరగనంత తీవ్రంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్‌ అణు కేంద్రాలను నేలమట్టం చేయడానికి దీన్ని అందివచ్చిన అవకాశంగా ఇజ్రాయెల్‌ భావిస్తోంది. అదే జరిగితే ఇరాన్, పశ్చిమాసియాలోని దాని మిత్ర దేశాలు మరింత తీవ్రంగా ప్రతిస్పందించే ఆస్కారముంది. మొత్తమ్మీద పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారిపోయింది. 

‘‘అక్కడి పరిస్థితి మందుపాతరను తలపిస్తోంది. ఇప్పుడు తేలాల్సింది దానిపై ముందుగా ఎవరు కాలేస్తారన్నదే!’’ అని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంటున్నారు. తారస్థాయికి చేరుతున్న ఈ ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఆశ్చర్యం లేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 

రంగం సిద్ధం...? 
తమపై ప్రతిదాడులకు దిగితే మరింతగా విరుచుకుపడతామన్న ఇరాన్‌ హెచ్చరికలను ఇజ్రాయెల్‌ ఖాతరు చేసే అవకాశాలు లేనట్టే. క్షిపణి దాడులకు భారీ స్థాయి ప్రతీకారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకు మిత్రదేశం అమెరికాతో పాటు నాటో కూటమి కూడా దన్నుగా నిలవడం ఖాయమే. మంగళవారం నాటి ఇరాన్‌ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో అమెరికా సాయపడింది కూడా. 

మధ్యదరా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్‌ క్షిపణులను గాల్లోనే అడ్డుకుని పేల్చేశాయి. అంతేగాక పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న తమ సైనికులకు తోడుగా మరికొన్ని వేలమందిని పంపుతామని అమెరికా ప్రకటించింది. యుద్ధ విమానాల మోహరింపునూ పెంచనుంది. ఇరాన్‌పై దాడిలో కూడా ఇజ్రాయెల్‌కు అమెరికా, నాటో దన్నుగా నిలిస్తే దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. 

ఎరుపెక్కిస్తున్న ఎర్రసముద్రం 
యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వైనం ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే నౌకలను చెరబడుతూ, లూటీ చేస్తూ హౌతీలు కలకలం రేపుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ వర్తకం, ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా భారీగా ప్రభావితమవుతున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అంతేగాక దేశాల నడుమ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలను ఈ పరిణామం మరింతగా ఎగదోస్తోంది.

అవున్నిజమే 
మనమిప్పుడు కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధపు ముంగిట్లో నిలిచాం. ప్రపంచంలో ఏ మూల చూసినా ఎటు చూసినా యుద్ధమో, యుద్ధ భయాలో, యుద్ధపు హెచ్చరికలో కన్పిస్తున్నాయి. అమెరికాను పాలిస్తున్న అసమర్థులు (అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్‌లను ఉద్దేశించి) ఏమీ చేయలేకపోతున్నారు – అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

అగ్ర రాజ్యాలు చెరోవైపు! 
అపార చమురు నిల్వలకు ఆలవాలమైన పశ్చిమాసియాపై పట్టు కోసం అమెరికా, రష్యా ప్రయత్నాలు ఇప్పటివి కావు. అగ్ర రాజ్యాలు రెండూ ప్రాంతీయ శక్తులనే పాచికలుగా మార్చుకుని ఎత్తులూ పై ఎత్తులు వేస్తూ వస్తున్నాయి. సౌదీకి అమెరికా దన్నుంటే ఇరాన్, సిరియా తదితరాలకు రష్యా ప్రాపకముంది. వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పశ్చిమాసియా వరకు రష్యాకు చైనా, ఉత్తర కొరియా కూడా మద్దతుగానే ఉంటున్నాయి. 

నాటో ముసుగులో తన ముంగిట్లో తిష్ట వేయాలన్న అమెరికా ప్రయత్నాలకు చెక్‌ పెట్టడానికే ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు దిగింది. ఆ పోరుకు అంతం ఇప్పట్లో కనిపించడం లేదు. పశ్చిమాసియా రగడ ముదిరితే తమ మిత్ర దేశాలకు మద్దతుగా అటు అమెరికా, ఇటు రష్యా కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.

పర్యవసానాలుఊహించలేం
ఈ అణ్వస్త్ర యుగంలో మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే దాని పర్యవసానాలు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి. కనుక యుద్ధజ్వాలలను ఆ స్థాయికి రగిల్చే దుస్సాహసానికి ఏ దేశమూ ఒడిగట్టకపోవచ్చు. 

ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తినా ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు భారత్‌తో సహా పలు దేశాలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాయి కూడా. కనుక ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చన్న అభిప్రాయాలకూ కొదవ లేదు. కాకపోతే పశ్చిమాసియా పరిణామాలు ఎటు దారి తీస్తాయో చెప్పలేని పరిస్థితి!

పశ్చిమాసియాలో ఎవరెటువైపు...!
పశ్చిమాసియాపై నానాటికీ యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడి చినికి చినికి గాలివానగా రూపుదాలుస్తోంది. అటు లెబనాన్‌కు పాకడంతో పాటు తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య భారీ ఘర్షణలకు దారి తీస్తోంది. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారితే అది రెండు దేశాలకే పరిమితం కాబోదు. మిగతా దేశాలన్నీ చెరో వైపు మోహరించడం ఖాయం. 

ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఏవి ఎవరి వైపన్నది ఆసక్తికరం. దీనికి సంబంధించి గత ఏప్రిల్లోనే ట్రయిలర్‌ కనిపించింది. ఇజ్రాయెల్‌పై ఉన్నట్టుండి దాడికి దిగిన ఇరాన్‌కు లెబనాన్‌తో పాటు యెమన్‌ హౌతీలు పూర్తి దన్నుగా నిలిచారు. ఇజ్రాయెల్‌కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ వంటి పాశ్చాత్య మిత్రులతో పాటు జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి పొరుగు దేశాలు మద్దతిచ్చాయి.

ఇజ్రాయెల్‌ వైపు
సౌదీ అరేబియా 
యూఏఈ 
(అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు నాటో దన్ను)

ఇరాన్‌ వైపు
సిరియా 
యెమన్‌ (హౌతీలు) 
పాలస్తీనా (హమాస్‌) 
హెజ్‌బొల్లా (లెబనాన్‌) 

తటస్థ దేశాలు 
ఖతర్‌ (ఇజ్రాయెల్‌ వైపు మొగ్గు) 
జోర్డాన్‌ (ఇజ్రాయెల్‌ వైపు మొగ్గు) 
ఈజిప్ట్‌ (ఇరాన్‌ వైపు మొగ్గు) 
తుర్కియే (ఇరాన్‌ వైపు మొగ్గు)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement