ఇజ్రాయెల్‌కు మూడింది | Ayatollah Ali Khamenei says Iran allies will not back down in war with Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు మూడింది

Published Sat, Oct 5 2024 4:19 AM | Last Updated on Sat, Oct 5 2024 4:19 AM

Ayatollah Ali Khamenei says Iran allies will not back down in war with Israel

ఎంతోకాలం ఉనికిలో ఉండదు

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక

దానిపై దాడులు సరైనవే 

వారి నేరాలకు ఇది కనిష్ట శిక్ష  

హెజ్‌పోల్లా, హమాస్‌పై ఇజ్రాయెల్‌ నెగ్గలేదు 

ముస్లిం దేశాలన్నీ ఒక్కటవాలని పిలుపు 

చారిత్రక మసీదులో చేతిలో తుపాకీతో ప్రసంగం 

నాలుగేళ్ల తర్వాత తొలిసారి జనం ముందుకు

టెహ్రాన్‌: బద్ధ శత్రువైన ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ (85) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంపై ఇటీవల తాము చేసిన క్షిపణి దాడుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూదు పాలకుల నేరాలకు ఇది కనిష్ట శిక్ష అని పేర్కొన్నారు. తమ సైనిక దళాలు అద్భుతమైన కార్యం నిర్వర్తించాయని కొనియాడారు. అవసరమైతే హెజ్‌పోల్లా, హమాస్‌ తదితర గ్రూపులతో కలిసి ఇజ్రాయెల్‌పై మరోసారి దాడులు చేస్తామని తేల్చిచెప్పారు. ‘‘ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, లెబనాన్‌లో జరుగుతున్న పోరాటాలకు మద్దతిస్తున్నాం. శత్రువును ఓడించి తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘అఫ్గానిస్తాన్‌ నుంచి యెమన్‌ దాకా, ఇరాన్‌ నుంచి గాజా, లెబనాన్‌ దాకా ముస్లిం దేశాలన్నీ ఈ ప్రయత్నంలో ఒక్కటి కావాలి.

ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్‌కు మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ ఎక్కువ కాలం ఉనికిలో ఉండబోదని జోస్యం చెప్పారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఇటీవలి క్షిపణి దాడుల తర్వాత తొలిసారిగా ఆయన ప్రజలకు దర్శనమిచ్చారు. శుక్రవారం టెహ్రాన్‌లోని మొసల్లా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ జన సందోహాన్నిఉద్దేశించి చరిత్రాత్మక ప్రసంగం చేశారు. రైఫిల్‌ చేబూని ఆద్యంతం భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఖమేనీ బహిరంగంగా మాట్లాడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హెజ్‌పోల్లా చీఫ్‌ నస్రల్లాను బంకర్‌ బాంబులతో ఇజ్రాయెల్‌ హతమార్చిన వెంటనే ఆయనను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు వార్తలు రావడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇలా జనం మధ్యలోకి రావడమే గాక చరిత్రాత్మక మసీదును వేదికగా చేసుకుని ప్రసంగించడానికి చాలా ప్రాధాన్యత ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరిక సంకేతాలు పంపడంతో పాటు ఆ దేశంపై పోరులో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని పశ్చిమాసియాలోని హమాస్, హెజ్‌బొల్లా, హౌతీల వంటి సాయుధ గ్రూపులకు భరోసా ఇవ్వడం ఖమేనీ ఉద్దేశమని విశ్లేíÙస్తున్నారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదని కూడా ఖమేనీ ప్రసంగం సంకేతాలిచి్చందంటున్నారు. ప్రధానంగా ఫార్సీలోనూ, పాలస్తీనా, లెబనాన్‌ మద్దతుదారు కోసం మధ్యలో అరబిక్‌లోనూ ఆయన 40 నిమిషాలపాటు మాట్లాడారు. ‘‘గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ నేతృత్వంలో పాలస్తీనా ప్రజలు చేసిన దాడిలో న్యాయముంది. పాలస్తీనా పౌరుల చర్య చట్టబద్ధమే. ఇజ్రాయెల్‌పై మా దాడులు కూడా చట్టబద్ధమే’’అని ఉద్ఘాటించారు. 

నస్రల్లా మార్గం స్ఫూర్తిదాయకం 
ఖమేనీ ప్రసంగానికి ముందు టెహ్రాన్‌లో హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌తోపాటు ఇరాన్‌ ఉన్నతాధికారులు, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ జనరల్స్‌ హాజరయ్యారు.

చేతిలో రైఫిల్‌ వెనక...
ఖమేనీ తన ప్రసంగం సందర్భంగా రైఫిల్‌ చేతబట్టడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది రష్యాలో తయారైన డ్రాగనోవ్‌ రైఫిల్‌. ఇజ్రాయెల్‌ విషయంలో వెనుకడుగు వేసే సమస్యే లేదని, తీవ్ర ప్రతిఘటన తప్పదని తన చర్య ద్వారా ఆయన స్పష్టమైన సంకేతాలిచి్చనట్టు భావిస్తున్నారు. శత్రువుపై పోరాడాలని, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రజలకు ఖమేనీ పిలుపునివ్వడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇజ్రాయెల్‌ చేతిలో ఇరాన్‌ వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో డీలా పడ్డట్టు కని్పస్తున్న సైన్యంతో పాటు దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయన ప్రయత్నించారంటున్నారు.

ఆ మసీదే ఎందుకు?
ఖమేనీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు రాజధాని టెహ్రాన్‌లోని చరిత్రాత్మక ఇమామ్‌ ఖొమేనీ మసీదును ఎంచుకున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదుకు ఇరాన్‌లో విశేషమైన ప్రాముఖ్యముంది. దీన్ని గతంలో షా మసీదుగా పిలిచేవారు. 1979 నాటి ఇస్లామిక్‌ విప్లవంలో ఈ మసీదు కీలక పాత్ర పోషించింది. నగరంలో ఇదో ల్యాండ్‌మార్క్‌. ప్రజా పోరాటాలకు, నిరసన గళానికి చిహ్నం. అప్పట్లో ఈ మసీదు కేంద్రంగానే ప్రజలు ఉద్యమించారు. ఇరాన్‌ పాలకుడు షా మొహమ్మద్‌ రెజా పహ్లావీని గద్దె దించారు. అనంతరం అయతొల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ఆవిర్భవించింది. ఇస్లామిక్‌ జాతీయవాద నినాదం కింద పలు రాజకీయ పక్షాలు ఏకమవడానికి ఈ మసీదు వేదికగా ఉపయోగపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement