అభిప్రాయం
ఇటీవల పరిణామాలను చూస్తే ఎవరికైనా ఐక్య రాజ్యసమితి ఉత్సవ విగ్రహంగా మారుతోందనే అభిప్రాయం కలుగక మానదు. యుద్ధ జ్వాలల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, శాంతి యుత ప్రపంచ స్థాపనకు మానవులలో ఉన్న అకుంఠిత ఆశయాలే ఐక్య రాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ స్థాపనకు దారి తీశాయి.
మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో ‘నానాజాతి సమితి’ని ఏర్పాటు చేసి ప్రపంచ శాంతిని పరిరక్షించే బాధ్యతను దానికి కట్ట బెట్టాయి పెద్ద రాజ్యాలు. ఈ సమితి ఎన్నో రకాల శాంతి మార్గాలను సూచిస్తూ అందులో ముఖ్య మైనదిగా... నిరాయుధీకరణంను సూచించింది. దానిని పెడచెవిన పెట్టిన ప్రపంచ దేశాలు ఆయు ధాలను సమీకరించుకొని ఆధిపత్య పోరు మొదలు పెట్టి, రెండవ ప్రపంచ యుద్ధం ముంగిట మాన వాళి మరోసారి నిలబడేలా చేశాయి.
యుద్ధం ముగిసిన వెంటనే నానాజాతి వైఫల్యం వల్లనే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందని భావించి... దాని స్థానంలో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి ప్రపంచ దేశాలు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే... మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల ముందు ఆయా దేశాలు యుద్ధం రాబోతుందని గ్రహించి శాంతి సభలు నిర్వహించడం, చర్చలు జరపటం జరి పాయి. సంధులు చేసుకున్నాయి. అయినా ప్రపంచ యుద్ధాలు ఆగలేదు.
ఇప్పుడు ఐరాసలో సభ్యులుగా 193 దేశాలు ఉన్నాయి. ఇందులో వీటో అధికారం ఉన్న 5 అగ్ర రాజ్యాలు ఉన్నాయి. 25 రకాలుగా పనిచేసే వివిధ రకాల సంస్థలు,అంతర్జాతీయ న్యాయస్థానం ఐరాస కింద పని చేస్తున్నాయి. అయినా కూడా రగిలిపోతున్న యుద్ధాలను ఆపలేకపోవడం బాధాకరం.
అలా అని ఐరాస సాధించిన విజయాలు లేవని కాదు. రష్యా–ఇరాన్ , ఫ్రాన్స్– సిరియా– లెబనాన్, ఇండోనేషియా సమస్య, ఈజిప్ట్ అంశం, చెకోస్లావేకియా అంశం... ఇలా ఐరాస మధ్య వర్తిత్వంలో శాంతి ఒప్పందాల ద్వారా సమస్య లను పరిష్కరించుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వివిధ రకాల సాయం అందడానికీ ఐరాస ఎంతగానో కృషి చేస్తోంది.
ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఐక్యరాజ్య సమితి అగ్రరాజ్యాల జోలికి రానంతవరకే సంస్థకు గౌరవం దక్కుతోంది. ఆ మేరకే దానికి ఆర్థిక వనరులు అందుతున్నాయి. అంతర్జాతీయ శాంతికి అడ్డంకిగా మారిన అణ్వాయుధాల తయారీ, విని యోగానికి అగ్ర రాజ్యాలు స్వస్తి పలకవలసిందిగా యూఎన్‌ఓ విజ్ఞప్తి చేసినప్పటికీ అవి పెడచెవిన పెడుతున్నాయి.
పైగా ప్రస్తుత తరుణంలో అగ్ర రాజ్యాల షాడో దేశాల మధ్య యుద్ధం మొదలై ఆయుధ గోడౌన్ల తలుపులు తెరుచుకుంటున్నాయి. అగ్ర రాజ్యాల ప్రోద్బలంతోనే ఇవి బరిలో దిగిన ప్పుడు ఇంకా ఐరాస మాట వినే పరిస్థితి లేదనిపించక మానదు.
ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి రాకుండా బహిష్కరిస్తున్నాం అంటున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యమైన అమెరికా, బ్రిటన్లు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. గాజాను పూర్తిగా నేల మట్టం చేసి, లెబనాన్‌ను పావు వంతు ఆక్రమించి, ఇరాన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధం అవు తున్న ఇజ్రాయిల్‌ను అగ్రరాజ్యాలు నిలువరించ లేకపోతున్నాయి.
ఓ పక్క ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే అరబ్ దేశాలను ఏకం చేయడానికి ఇరాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఐరాస ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ విషయంలో కూడా అగ్రరాజ్యాలు గ్రూపులుగా సంఘటిత మవుతూ ఉంటే ఐరాస ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతోంది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఏ ఆశయాలతో అయితే ఐక్యరాజ్య సమితిని స్థాపించారో... వాటిని సాధించలేని స్థితికి ఐరాస చేరు కుందని చెప్పక తప్పదు.
వి.వి. రమణ
వ్యాసకర్త ఉపాధ్యాయులు ‘ 89198 62019
Comments
Please login to add a commentAdd a comment