ప్రమాదకర యుద్ధక్రీడ | Sakshi Editorial On Israel and Lebanon War | Sakshi
Sakshi News home page

ప్రమాదకర యుద్ధక్రీడ

Published Tue, Oct 1 2024 12:39 AM | Last Updated on Tue, Oct 1 2024 12:39 AM

Sakshi Editorial On Israel and Lebanon War

ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్‌ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్‌లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్‌ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్‌ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. 

లెబనాన్‌లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్‌ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్‌లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. 

ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్‌పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్‌ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. 

చిత్రమేమిటంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్‌ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. 

అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్‌ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్‌లోనూ వెయ్యిమంది మరణించారు. 

అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్‌ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.

అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్‌ లెబనాన్‌ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్‌ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్‌లో సైతం ఆయన మరణానికి సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. 

సిరియన్‌ నియంత బషర్‌ అల్‌–అసద్‌తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్‌ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్‌పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. 

నిజానికి, ఇజ్రాయెల్‌తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్‌ ఆదేశాలతో లెబనీస్‌ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్‌ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం.  

ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్‌ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. 

ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్‌ సుప్రీమ్‌ లీడర్‌ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్‌ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్‌ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. 

ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్‌ రాజధాని టెహరాన్‌లో హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనీయే, ఇప్పుడు బీరుట్‌లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్‌ కౌక్‌... ఇలా పలువురిని ఇజ్రాయెల్‌ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్‌ దూకుడు వల్ల ఇరాన్‌లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది.  

అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. 

నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్‌ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement