వరస సంక్షోభాలతో నిరంతరం నెత్తురోడే పశ్చిమాసియా అందరూ చూస్తుండగానే పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకున్నట్టు కనబడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, మరో ప్రధాన నగరం జెరూసలేంలపై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం, ఆ వెంటనే హెజ్బొల్లా మిలిటెంట్లు టెల్‌అవీవ్‌లోని మొసాద్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులతో దాడిచేయటం...ఇజ్రాయెల్‌కు దన్నుగా తాము సైతం రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించటం పరిస్థితులు వికటిస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి.
ఇరాన్–ఇజ్రాయెల్ నేరుగా తలపడటం ఇక లాంఛనం. ఒకపక్క తన కవ్వింపు చర్యలే ఇరాన్‌ను ప్రతీకారదాడికి పురిగొల్పాయని బట్టబయలైనా ఇరాన్ దాడిని వ్యతిరేకించలేదన్న కారణంతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ను ‘అవాంఛిత వ్యక్తి’గా ప్రకటించి, తమ దేశంలో అడుగుపెట్టనీయబోమని నిషేధం విధించటం ఇజ్రాయెల్ తెంపరితనానికి నిదర్శనం.
శరపరంపరగా వచ్చిపడుతున్న క్షిపణులను పూర్తిగా నిరోధించటం ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే రక్షణ ఛత్రం ఐరన్ డోమ్ వల్ల కూడా కాలేదంటే ఇరాన్ దాడి తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రాణనష్టం పెద్దగా లేకపోయినా భారీ భవనాలు నేలమట్టం కావటం, పౌరులు కకావికలై పరుగులు తీయటం, ప్రభుత్వాదేశాలతో పది లక్షలమంది ప్రజలు బంకర్లలో తలదాచుకోవటం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి.
గాజాలో తన లక్ష్యం పూర్తిచేయగలిగానని భావిస్తున్న ఇజ్రాయెల్... రెండురోజుల క్రితం లెబనాన్‌పై పంజా విసరడం ప్రారంభించింది. హెజ్బొల్లా నేత నస్రల్లాను హతమార్చింది. ఆ సమయానికి ఆయనతో పాటున్న తమ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషాన్ సైతం ప్రాణాలు కోల్పోవటం ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అది తాజా దాడికి దిగింది.
నిజానికి ఇరాన్‌ను ఏనాడూ ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉండనీయలేదు. అది అణ్వాయుధ దేశంగా మారవచ్చునన్న భీతితో గూఢచర్యం సాగిస్తూ పేరెన్నికగన్న శాస్త్రవేత్తలను... ప్రభుత్వంలో, సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని హతమార్చటం ఇజ్రాయెల్ ఒక విధానంగా పెట్టుకుంది.
మొన్న ఏప్రిల్‌లో సిరియాలోని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ సాగించిన దాడిలో ఇరాన్‌కు చెందిన సైనిక నిపుణుడు, దౌత్యవేత్త మరణించారు. జూలైలో హెజ్బొల్లా నాయకుడు ఇస్మాయెల్ హనియేను ఇరాన్‌లో ఉండగా ఇజ్రాయెల్ హతమార్చింది. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ డ్రోన్‌లతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినా వాటివల్ల ఏనాడూ ఇజ్రాయెల్ పెద్దగా నష్టపోలేదు.
ఇరాన్ దాడి అనంతరం అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ముడి చమురు ధర భగ్గున మండిన తీరు సమీప భవిష్యత్తులో ముంచుకురాబోతున్న ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇజ్రా యెల్ దాదాపు ఏడాదికాలంగా అన్ని రకాల వినతులనూ బేఖాతరు చేసి గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో సాగిస్తున్న నరమేధం తొలుత పశ్చిమాసియానూ, ఆ తర్వాత ప్రపంచాన్నీ యుద్ధం అంచుల్లోకి నెడుతున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
నిరుడు అక్టోబర్ మొదటివారంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 1,200 మంది పౌరులను హతమార్చి, మరో 695 మందిని అపహరించుకుపోవటం ద్వారా హమాస్ దుస్సాహసానికి పాల్పడింది. ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన దేశాలు సైతం అనంతర ఇజ్రాయెల్ దాడులను అంగీకరించలేదు.
ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా కూడా గాజా నరమేధం విరమించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరిన మాట వాస్తవం. అలాగని అది ఏనాడూ ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా ఆపలేదు. ఫలితంగా ఇంతవరకూ దాదాపు 45,000 మంది గాజా పౌరులు మరణించారని అంటున్నారు.
ఒకసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం, ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండవు. దాని తోవ అది వెదుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో అయిదున్నర కోట్ల మంది సాధారణ పౌరులు, మరో రెండున్నరకోట్లమంది సైనికులు మరణించారు.
కోట్లాదిమంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియెట్ యూనియన్‌లోనే దాదాపు రెండున్నర కోట్లమంది మరణించారు. మరో 90 లక్షలమంది వరకూ వ్యాధుల బారినపడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహ లాడే అగ్రరాజ్యాలు తమ ౖ¯ð జం వదులుకోలేదు. ఆ వెనువెంటనే తమకు అలవాటైన యుద్ధ క్రీడ ప్రారంభించాయి.
వర్తమాన పరిణామాలు దాని పర్యవసానమే. న్యూయార్క్ టైమ్స్ పరిశోధక పాత్రికేయురాలు అనీ జాకబ్‌సన్ యుద్ధం వల్ల మానవాళికి కలగబోయే హాని గురించి చెప్పిన అంశాలైనా అగ్రరాజ్యాల కళ్లు తెరిపించాలి. అణ్వాయుధ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60 శాతం జనాభాను తుడిచిపెడుతుందని హెచ్చరించారామె.
ఇజ్రాయెల్‌కు అమెరికా అండదండలున్నట్టే ఇరాన్‌కు రష్యా, చైనాల ఆశీస్సులున్నాయి. దానికి హమాస్, హిజ్బొల్లా గ్రూపులు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిటెంటు సంస్థలూ మరింత దగ్గరవుతాయి. ఇజ్రాయెల్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న ఈజిప్టు, జోర్డాన్‌లకూ, ఆ తోవనే వెళ్తున్న సౌదీ అరేబియాకూ సంకటస్థితి ఏర్పడుతుంది.
ఈ వైరిపక్షాలన్నీ కొంత హెచ్చు తగ్గులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల మారణాయుధాలతో సంసిద్ధంగా ఉన్నాయి. అందుకే పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించటం, దుందుడుకు విధానాలకు స్వస్తిపలకడం వంటి చర్యలే పశ్చిమాసియాకూ... మొత్తం ప్రపంచానికీ ప్రశాంతతనిస్తాయని ఇజ్రాయెల్ గుర్తించాలి. అమెరికా వివేకంతో మెలిగి సామరస్య ధోరణులకు తోడ్పాటునందించాలి.
ప్రమాదంలో ప్రపంచం
Published Thu, Oct 3 2024 3:22 AM | Last Updated on Thu, Oct 3 2024 3:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment