
ఆంధ్రప్రదేశ్‌లో వందల ఉగాది పురస్కారాల హడావిడిలో రచయితలు ఉండగా, తెలంగాణలో కంచ గచ్చిబౌలి స్థలాలకు సంబంధించి తమ పర్యావరణ స్పృహను సోషల్ మీడియా పోస్టులతో వెల్లడించే పనిలో సాహితీకారులు ఉండగా దేశాన కొన్ని ఆసక్తికరమైన సాహితీ ఘటనలు చోటు చేసుకున్నాయి. తన మానాన తానుంటూ తన రాతేదో తాను రాసుకుంటూ వచ్చిన హిందీ కవి వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం వాటిలో ఒకటి. ఆయన సీదాసాదా మనిషి. రచనల శీర్షికలు కూడా బహు సరళంగా ఉంటాయి. ‘పనివాడి అంగీ’... ‘గోడలో ఒక కిటికీ ఉండేది’... వినోద్ కుమార్ శుక్లా మొదట రచ్చ గెలిచారు.
ప్రతిష్ఠాత్మకమైన ‘పెన్ నబకోవ్ అవార్డ్’ను 2023 సంవత్సరానికి గెలుచుకున్నారు. ఆ అవార్డు పొందిన ఏకైక భారతీయ కవి ఆయనే. కాబట్టి విలువైన ఆయన సాహిత్యానికి సర్వోత్కృష్ట జ్ఞానపీఠం దక్కడం అందరూ హర్షించారు. శుక్లా గారితో పోటీ పడినవారిలో ఒక తెలుగు పేరు ఉంది. జ్ఞానపీఠం షార్ట్‌లిస్టులో తెలుగు పేరు ఉండటం ఘనతే. రావూరి భరద్వాజ తర్వాత తాము జ్ఞానపీఠ పురస్కారానికి యోగ్యులమని భావిస్తున్నవారు ఉన్నారు. అయితే అలా యోగ్యులమని అనుకునేవారిలో కొందరి పేర్లు హడలిచచ్చేలా ఉన్నాయనే గిట్టనివారూ ఉన్నారు.
భారతదేశంలో స్థానికంగా గాని, జాతీయస్థాయిలో గాని షార్ట్‌లిస్టులలో పేరు చేరేవారు కొందరైతే చేర్పించుకునేవారు కొందరు. ‘సాహిత్య అకాడెమీ అవార్డు’ షార్ట్‌లిస్టుల్లో చేర్చబడ్డాయేమో అనిపించేలా కొన్ని పేర్లు చూసి ఆకలిదప్పులు మాని మంచం పట్టే సాహిత్యాభిమానులు ఉన్నారు. ప్రతిఏటా ఈ షార్ట్‌లిస్ట్ వీరి పాలిట ప్రాణాంతకంగా మారడం ఆందోళనకరం.
అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇలా చేర్పించుకోవడం సాధ్యం కాదు. అందుకే కన్నడ నేలన ఇప్పుడు సంబరాలు సాగుతున్నాయి. కారణం ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్ 2025’ షార్ట్‌లిస్ట్‌లో మొదటిసారి కన్నడ పుస్తకానికి చోటు దక్కింది. సీనియర్ కన్నడ రచయిత్రి బాను ముష్టాక్ రాసిన కథాసంపుటి ‘హార్ట్ ల్యాంప్’ ఈ షార్ట్‌లిస్టులో ఉంది.
యాక్టివిస్ట్‌గా ఉంటూ దళిత, మైనార్టీ మహిళా జీవితాలను ఎక్కువగా రాసే బాను ముష్టాక్ పుస్తకంతో పాటు కేవలం 6 పుస్తకాలతో ఉన్న షార్ట్‌లిస్ట్ నుంచి మే 20న విజేతను ప్రకటిస్తారు. 50 లక్షల రూపాయల బహుమతి ఉంటుంది. అదొక్కటే కాదు ఆ నవల ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువవుతుంది. బాను ముష్టాక్ గెలిస్తే కన్నడ భాష ఘనతకు మరో నిదర్శనమవుతుంది. ఇలాగే 2022లో ‘రేత్ కీ సమాధి’ నవల ఇంగ్లిష్ అనువాదం ‘టూంబ్ ఆఫ్ శాండ్’కు గీతాంజలిశ్రీ బుకర్‌ప్రెజ్ గెలుచుకున్నారు. అప్పుడుగాని ఇప్పుడుగాని తెలుగు నవల, కథ ఈ దారుల్లోకి రాకపోవడం మన వరకూ ఘనతే.
ప్రపంచ దేశాలలో తెలుగు రాష్ట్రాలలో ఒక జిల్లా అంత ఉన్నవారు, హైదరాబాద్ జనాభా అంత సంఖ్యలో భాషను మాట్లాడేవారు, మన దేశంలో పదేళ్ల కాలంలో కేవలం యాక్సిడెంట్లలో మరణించేంతమంది మాత్రమే రాసే, చదివే భాష ఉన్నవారు కూడా అంతర్జాతీయస్థాయి అవార్డుల లాంగ్‌లిస్టులలో, షార్ట్‌లిస్టులలో కనిపిస్తారు. రెండు కోట్ల మంది జనాభా ఉన్న శ్రీలంక నుంచి ఎందరో అంతర్జాతీయ స్థాయి రచయితలు ఉన్నారు. పది కోట్ల తెలుగు జనాభా నుంచి అంతర్జాతీయ అవార్డుల సంగతి అటుంచి పెంగ్విన్ వంటి ప్రసిద్ధ పబ్లిషర్ల వరకూ చేరే రచనలు ఎన్ని... రచయితలు ఎందరు?
‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025’ కోసం 12 దేశాల నుంచి 13 మంది రచయితల పుస్తకాలు లాంగ్‌లిస్ట్ అయ్యాయి. విశేషం ఏమిటంటే వీరంతా మొదటిసారి నామినేట్ అయినవారు. బోణి కొట్టి తమ ఉనికి చాటినవారు. వీరి నుంచి ఆరు మందితో షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించారు. ఆ షార్ట్‌లిస్ట్‌లో కన్నడ నుంచి బాను ముష్టాక్ ఉన్నారు. షార్ట్‌లిస్ట్‌ను ప్రకటిస్తూ బుకర్ ప్రైజ్ కమిటి యు.కె.కు చెందిన ట్రాన్ ్సలేటర్ సోఫీ హ్యూస్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆమె అనువాదం చేసిన రచనలు ఇప్పటికి ఐదుసార్లు లాంగ్‌లిస్ట్‌లో మూడుసార్లు షార్ట్‌లిస్ట్‌లో వచ్చాయి. ఇది రికార్డు. ఇక్కడే తెలుగు వారి ఘనత ఉంది.
తెలుగు పుస్తకాలు గతంలో కాని వర్తమానంలోగాని ఇంగ్లిష్‌లో గట్టిగా అనువాదం చేసేవారి సంఖ్య చేతి వేళ్లకు మించి లేకపోవడమే ఆ ఘనత. విదేశాలకు లక్షలమంది తెలుగువారు పైచదువులకు వెళ్లినా వారిలో సాంకేతిక విద్య, దాని వల్ల వచ్చే సంపద లక్ష్యంగా కనిపిస్తుంది గాని లింగ్విస్టిక్స్ చదవడం, ఇతర భాషలు నేర్చి తెలుగు సాహిత్యాన్ని అనువాదం చేయడం అనేదే లేదు. మిగిలిన భాషల వారు ఈ పని చేస్తున్నారు. ప్రపంచ భాషలు నేర్చి తమ సాహిత్యానికి వాహకులుగా మారుతున్నారు. సోఫీ హ్యూస్‌లాంటి వారు మనలో తయారవ్వాలి లేదా మన కోసం రావాలి.
సిఫార్సులు, పైరవీలు లేకుండా... గ్రూపులూ గుంపులూ కట్టకుండా మంచి సాహిత్యం కోసం కృషిని లగ్నం చేసిన తెలుగు రచయితలు ఉన్నారు. ప్రపంచం దృష్టికి వెళ్లాల్సిన రచనలు వీరివి కొద్దిగా అయినా సరే ఉన్నాయి. స్థానిక రాజకీయాలకు ఎడంగా జరిగి దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో మనమేంటి, మనమెక్కడ అనే ఆలోచనతో సాహితీ పరివారం మేలుకోవాల్సిన తరుణం ఇది.
రచయితలు, అనువాదకులు, పబ్లిషర్లు, యూనివర్సిటీలు... దండు కట్టి దృష్టి పెట్టగలిగితే నేడు కన్నడ సీమలో జరుగుతున్న సంబరాలు తెలుగులో జరక్కపోవు. షార్ట్‌లిస్టులలో చేరాల్సిన వారి గురించి పట్టకపోతే చేర్చబడేవారే మన ప్రతినిధులుగా కాన వస్తారు. ప్రస్తుతానికి లక్ష్యం క్రోసులకొద్ది దూరం. మొదటి అడుగు పడితే గమ్యం ఎంతసేపని?