
పదిహేడేళ్ల క్రితం ముంబై మహానగరంలో 10 మంది ఉగ్రవాదులు 78 గంటలపాటు విచక్షణా రహితంగా దాడులకు తెగబడి 166 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర ఉదంతంలో కీలక కుట్ర దారైన తహవ్వుర్ రాణా ఎట్టకేలకు మన దేశంలో అడుగుపెట్టాడు. రానున్న 18 రోజుల్లో మన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో అతగాడు ఆ ఘోర ఉదంతానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తాడన్నది చూడాలి. ఆ ఉగ్రవాదులు బాంబులూ, ఇతర మారణాయుధాలతో పాకి స్తాన్‌లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకుని ఆ నగరంలో అనేకచోట్ల తుపాకు లతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు.
ఆ దాడుల్లో సాధారణ పౌరులూ, కర్కరే వంటి పోలీస్ ఉన్నతాధి కారులూ ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదిమంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హత మార్చగా, ఉగ్రవాది కసబ్ పట్టుబడ్డాడు. విచారణానంతరం 2012లో అతన్ని ఉరితీశారు. రాణా వెల్లడించేఅంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధ్రువీకరించుకోవటానికీ, మరో ఉగ్రవాది, ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న డేవిడ్ హెడ్లీపై మరిన్ని వివరాలు రాబట్టడానికీ తోడ్పడుతాయి.
రాణా అప్పగింత అతి పెద్ద దౌత్యవిజయమని మన ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు అమెరికా కూడా ఉగ్రదాడుల్లో హతమైనవారికీ, ఇతర బాధితులకూ న్యాయం చేకూర్చటంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది. కావచ్చు. అయితే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై చెబుతున్నట్టు ‘అతగాడి దగ్గర చెప్పడానికేం లేదు గనుకనే...’ అప్పగించారా? రాణా పాత్ర కూడా తక్కువేం కాదు. దాడులకు పక్షం రోజుల ముందు భార్యతో కలిసి ముంబైలో చాలా ప్రాంతాలు వెళ్లి చూశాడు.
అతను ఎంపిక చేసిన ప్రాంతాలను హెడ్లీ భార్యాసమేతంగా వచ్చి తనిఖీ కూడా చేశాడు. ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. రాణా ముంబైతోపాటు ఢిల్లీ, కొచ్చి వంటి నగరాలకు కూడా పోయాడు. 1971 నాటి యుద్ధవీరులకై నిర్మించిన ముంబైలోని జల వాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో భార్యతో కలిసి బస చేశాడు. ఆ కాంప్లెక్స్ పేల్చివేతకు అవకాశం ఉందా లేదా చూసుకుని, అసాధ్యమని నిర్ణయించుకున్నాక భారత్ నుంచి వెళ్లిపోయాడని అంటారు.
పిళ్లై వాదన పూర్తిగా కొట్టిపారేయదగింది కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో రాణాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. ప్రస్తుతం రాణా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెబుతున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకంటే అతగాడు అమెరికా మాదకద్రవ్య నియంత్రణ విభాగం (డీఈఏ) ఏజెంట్‌గా పని చేశాడు. అదే సమయంలో ఐఎస్‌ఐకీ, లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ)కీ కూడా ఏజెంట్‌గా ఉన్నాడు. ఇవన్నీ అమెరికా నిఘా సంస్థలకూ తెలుసు.
అంతేకాదు... ముంబై మారణకాండ పథక రచన మొదలుకొని అన్ని విషయాలపైనా అమెరికా దగ్గర ముందస్తు సమాచారం వుంది. ఆ సంగతలా వుంచి భారత్‌లో సేకరించిన సమస్త సమాచారాన్నీ, ముంబైకి సంబంధించిన జీపీఎస్ లోకేషన్‌లనూ హెడ్లీకి రాణా అందించాడు. దాని ఆధారంగానే కొలాబా తీరప్రాంతంలోని బధ్వర్ పార్క్ దగ్గర ఉగ్రవాదులు బోట్లు దిగారు. రాణా ఇచ్చిన సమాచారాన్ని హెడ్లీ పాకిస్తాన్ పోయి అక్కడ ఐఎస్‌ఐ తరఫున తనతో సంప్రదిస్తున్న మేజర్ ఇక్బాల్ అనే వ్యక్తికి అందజేశాడని ఇప్పటికే మన నిఘా సంస్థలకు రూఢి అయింది. ఉగ్రవాదులకు ఐఎస్‌ఐ ఇచ్చిన శిక్షణేమిటో హెడ్లీకి తెలుసు. వీటిపై అమెరికా భద్రతా సంస్థలకు క్షణ్ణంగా తెలిసినా మన దేశాన్ని ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదన్న సంశయాలున్నాయి. ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఏవో సాకులు చెబుతోందన్నది వాస్తవం.

సందేహం లేదు... రాణా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైనవాడు. అతను ఎల్‌ఈటీలో చేరడమే కాక, ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల సమయంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటి కప్పుడు ఫోన్‌లో లఖ్వీ ఆదేశాలివ్వటం వెనక హెడ్లీ ప్రమేయం వుంది. తమకు ఏజెంటుగా పని చేసినవాడిని అప్పగించరాదని అమెరికా భావించటం మూర్ఖత్వం. అదే పని భారత్ చేస్తే అంగీకరించగలదా? హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం బయటపడుతుందని అది సంకోచిస్తున్నట్టు కనబడుతోంది.
రాణా అప్పగింత ప్రక్రియ తమ హయాంలోనే మొదలైందని గర్వంగా చెబుతున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హెడ్లీ విషయంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి. వికీలీక్స్ పత్రాలు ఈ సంగతిని చాన్నాళ్ల క్రితమే వెల్లడించాయి. హెడ్లీ అప్పగింతకు పట్టుబట్టవద్దని అప్పటి మన జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్‌ను నాటి అమెరికా రాయబారి తిమోతీ రోమెర్ కోరినట్టు అందులో ఉంది. అలా అడిగినట్టు కనబడకపోతే తమకు ఇబ్బందులొస్తాయని నారాయణన్ బదులిచ్చినట్టు కూడా ఆ పత్రాల్లో ఉంది.
హెడ్లీ ఎలాంటివాడో అతని కేసులో 2009లో తీర్పునిచ్చిన అమెరికా న్యాయమూర్తే చెప్పారు. ‘హెడ్లీ ఉగ్రవాది. అతని నుంచి ప్రజలను రక్షించటం నా విధి. మరణశిక్షకు అన్నివిధాలా అర్హుడు. కానీ ప్రభుత్వ వినతి మేరకు 35 ఏళ్ల శిక్షతో సరిపెడుతున్నాను’ అన్నారాయన. ఎటూ పాకిస్తాన్ తన రక్షణలో సేద తీరుతున్న లఖ్వీ, సయీద్‌లను అప్పగించదు. ఆ దేశంతో మనకు నేరస్థుల అప్పగింత ఒప్పందం కూడా లేదు. కానీ అమెరికాతో ఆ మాదిరి ఒప్పందం ఉంది గనుక హెడ్లీ కోసం మన దేశం గట్టిగా పట్టుబట్టాలి. అది సాధిస్తేనే నిజమైన విజయం దక్కినట్టవుతుంది.