
లెబనాన్‌లో పూర్తయిన అంత్యక్రియలు
బీరూట్: లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’దివంగత అధినేత హసన్ నస్రల్లాకు వేలాది మంది అభిమానులు తుది వీడ్కోలు పలికారు. గత ఏడాది సెపె్టంబర్‌లో బీరూట్ శివారు ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో మరణించిన నస్రల్లా అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అభిమాన నేతకు నివాళులర్పించడానికి వేలాది మంది తరలివచ్చారు. నస్రల్లా పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం లెబనాన్ రాజధాని బీరూట్‌లోని కెమిల్లీచామౌన్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఉంచారు.
ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. స్టేడియంలో నస్రల్లా మృతదేహంతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు హషీం సఫీద్దీన్ మృతదేహాన్ని కూడా జనం దర్శించుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో సఫీద్దీన్ మరణించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరువురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హెజ్బొల్లా అగ్రనేత నయీమ్ ఖాషీం టీవీలో ప్రసంగించారు. నస్రల్లా చూపిన మార్గంలో నడుస్తామని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. అంత్యక్రియల సందర్భంగా బీరూట్ నగరంలో అడుగడుగునా నస్రల్లా చిత్రపటాలు ఏర్పాటు చేశారు. నగరంలో విషాద వాతావరణం కనిపించింది. విదేశాల నుంచి సైతం అభిమానులు హాజరయ్యారు.