పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాలస్తీనా అనుకూల.. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(IDF) భీకర దాడులు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను లక్ష్య్ంగా చేసుకుని బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని హెజ్‌బొల్లా ప్రకటించుకున్నప్పటికీ.. ఆయన కుమార్తె జైనబ్ మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ నజ్రల్లా ఎవరు?. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది పరిశీలిస్తే..
పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్‌ఓలోని కొందరు 1982 జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షైన్ బెట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి హెజ్‌బొల్లాగా ఏర్పాటయ్యారు. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు.
1992లో అప్పటి హెజ్‌బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను తన మార్గదర్శి స్థానం నుంచి నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే. అతడి నాయకత్వంలో హెజ్‌బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు.
పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్‌బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ సంస్థ సాయం చేసింది.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్‌బొల్లా చేసిన భీకర పోరాటం తర్వాత నస్రల్లా పేరను అరబ్ దేశాల్లో మార్మోగింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో అతడు కీలక ప్రాత పోషించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు.
నస్రల్లా కేవలం హెజ్‌బొల్లా చీఫ్‌గా మాత్రమే గుర్తింపు లేదు. బీరుట్ శివారులోని బుర్జ్ హమ్ముద్ ప్రాంతంలో 1960లో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకడైన నస్రల్లా.. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పటి హెజ్‌బొల్లా సారథి అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడడంతో ఆయన జీవితమే మలుపు తిరిగింది.
నస్రల్లా భార్య ఫాతిమా యాసిన్. నలుగురు పిల్లలు. 1997లో ఇజ్రాయెల్ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీని కోల్పోయాడాయన. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో నస్రల్లా కూతురు కుమార్తె జైనబ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నా.. ఆమె మృతిని హెజ్‌బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. హెజ్‌బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జైనబ్ మృతి నిజమైతే గనుక.. ప్రతీకారంగా హెజ్‌బొల్లా దాడులను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది కూడా.
ఇంతకీ నస్రల్లా ఎక్కడ?
నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. తాజా దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా సురక్షితంగానే ఉన్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు. తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, హెజ్‌బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. కానీ, కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం. మరోవైపు, హెజ్‌బొల్లా స్థావరాలపైకి యాంటీషిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment