బీరుట్: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ హత్య మార్చింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యటన తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. హసన్ నస్రల్లా హత్యానంతరం ఈ ఘటనపై నెతన్యాహు మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు మాట్లాడుతూ.. నస్రల్లాను హతమార్చడం మాతో అతి ముఖ్యమైన విషయం. హిజ్బుల్లాకు చెందిన ఇతర టాప్ కమాండర్లను తాము చంపినా, నస్రల్లాయే మాకు అసలు టార్గెట్. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న ప్రణాళికకు సూత్రధారిగా అతడు వ్యవహరించాడు. అందుకే అతడినే మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. యుద్ధంలో నస్రల్లా హత్య చారిత్రక మలుపు. తన శత్రవులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాలకు కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే, ఇరాన్ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిజ్బులా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీ అల్ దిన్ ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. నస్రల్లాకు హషీమ్ సఫీ అల్ దిన్ బంధువు. అలాగే, హిజ్బుల్లా జిహాద్ కౌన్సిల్‌లోనూ సభ్యుడుగా ఉన్నాడు.
మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను తాకాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా బలమైన కోట అయిన దహియేహ్‌లో దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అలాగే, 90 మందికి పైగా గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Hassan Nasrallah: అరబ్బుల హీరో
Comments
Please login to add a commentAdd a comment