
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో హెజ్‌బొల్లాకు భారీ నష్టం సంభవిస్తోంది. దక్షిణ బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో మిలటరీ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. అయితే నస్రల్లా మరణ వార్తలపై హెజ్‌బొల్లా కానీ, లెబనాన్ కానీ ఇంకా స్పందించలేదు.
ఇదిలా ఉండగా దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. ఇరాన్ అప్రమత్తమైంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని దేశంలోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనకు భద్రతా ఏర్పాట్లను కూడా పెంచినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నస్రల్లాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత.. తదుపరి చర్యపై లెబనాన్, హెజ్‌బొల్లా, ఇతర ప్రాంతీయ గ్రూపులతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment