Ayatollah Ali Khamenei
-
‘ఇది సరిపోదు.. నెతన్యాహును ఉరితీయాలి’ : ఖమేనీ
టెహ్రాన్ : ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేస్తే సరిపోదని ఉరితీయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) సూచించారు. అలీ ఖమేనీ వ్యాఖ్యలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పశ్చిమా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
ప్చ్.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగున్న వేళ.. మరోవైపు ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి కూడా వెళ్లారని, ఆయన వారసుడు మోజ్తాబా ఖమేనీ తదుపరి సుప్రీంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం తీవ్రతరమైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది.తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సంకేతాలిస్తూ.. ఖమేనీ తాజాగా ఓ ఫొటో రిలీజ్ చేశారు. లెబనాన్ ఉన్న ఇరాన్ రాయబారి ముజ్తబా అమనిని కలుసుకున్నట్లు తన ఎక్స్ ఖాతాలో ఖమేనీ పోస్ట్ చేశారు. ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ దాడుల్లో ముజ్తబా అమని కూడా గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఖమేనీ ఆరా తీసినట్లు సమాచారం.ఇక.. ఖమేనీ ఆరోగ్యం విషమించిందని, కోమాలోకి వెళ్లారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని.. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెలువడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 20వ తేదీన 60 మంది ఇరాన్ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఆ తీర్మానాన్ని.. ఓటింగ్‌ను చాలామంది వ్యతిరేకించారని కూడా అదే కథనం పేర్కొంది. ఈ కథనం ఆధారంగా రకరకాల కథనాలు వండి వార్చాయి మిగతా మీడియా సంస్థలు. కానీ, ఖమేనీ తాజా పోస్టుతో మోజ్తాబాకు ఇరాన్ సుప్రీం పగ్గాలు ఇప్పట్లో పగ్గాలు అప్పజెప్పకపోవచ్చనే స్పష్టత వచ్చింది. ఇదే కాదు.. మెజ్తాబాకు ఆటంకాలు కూడా ఉన్నాయి. అయతొల్లా అలీకి ఆరుగరు సంతానం. మోజ్తాబా.. రెండో కొడుకు. 1969లో మషాబాద్లో పుట్టాడు. తన తండ్రి బాటలో నడుస్తూ.. మత పెద్దగా మారాడు. అలాగే 2005, 2009 ఇరాన్ ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్‌కు మద్దతు ఇచ్చి.. అతని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఇరాన్ రిచ్చెస్ట్ మ్యాన్‌గానూ మోజ్తాబాకు పేరుంది.ఇరాన్ జీడీపీ 388 బిలియన్ డాలర్లు కాగా, ఖమేనీ కుటుంబం ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో 90 బిలియన్ డాలర్లు మోజ్తాబా పేరిటే ఉందని అమెరికా నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఇరాన్ రాజకీయాల్లో జోక్యం ద్వారా అలీపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. 2009లో అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. చెలరేగిన నిరసనల అణచివేత మోజ్తాబా ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ ఖజానా సొమ్మును దుర్వినియోగం చేశాడంటూ మోజ్తాబాపై అహ్మదీనెజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఇరాన్ అసెంబ్లీ నిపుణులు మెజ్తాబాకు ఇరాన్ సుప్రీం బాధ్యతలు వెళ్లనివ్వకుండా అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అయతొల్లా వారసుడిగా సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నప్పటికీ.. సుప్రీం కుర్చీ మాత్రం మెజ్తాబాకు చాలా దూరంగానే ఉందన్నది పలువురి వాదన. -
దిమ్మతిరిగేలా బదులిస్తాం
దుబాయ్/టెహ్రాన్: గత నెలాఖరులో ఇజ్రాయెల్ తమ మిలటరీ లక్ష్యాలపై చేపట్టిన దాడులపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమెనీ తీవ్రంగా స్పందించారు. దిమ్మతిరిగేలా బదులిచ్చి తీరతామంటూ అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. ‘‘మాకు, హెజ్బొల్లా, హమాస్ వంటి మా మిత్ర గ్రూపులకు హాని తలపెడుతున్నందుకు తగు మూల్యం చెల్లించుకోకతప్పదు. మాపై, మా మిత్ర దేశాలపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయి. శత్రువులను పూర్తిగా అణగదొక్కేలా మా ప్రతిస్పందన ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ గ్రహించాలి. అనవసరంగా మా జోలికి రావొద్దు. ఇబ్బందుల్లో పడొద్దు’’అని శనివారం టెహ్రాన్ వర్సిటీ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఖమేనీ పేర్కొన్నారు. ఇరాన్ అధికారిక టీవీ చానల్ ఈ మేరకు తెలిపింది. ‘మా నరాల్లో ప్రవహిస్తున్న రక్తం మా నాయకుడికి బహుమానం’అంటూ ఖమేనీకి మద్దతుగా విద్యార్థులు భారీగా నినాదాలు చేశారు. హమాస్, హెజ్బొల్లా అగ్ర నాయకులు హతమైన నేపథ్యంలో ఇరాన్ అక్టోబర్ ఒకటో తేదీన ఇజ్రాయెల్‌పై పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్ గత శనివారం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల్లో ఎవరు ఎవరిపై దాడికి దిగినా పశి్చమాసియా అగి్నగుండం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారడానికి కారణమైన ఘటనకు ఆదివారం 45 ఏళ్లు నిండనుండటం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. 1979 నవంబర్ 4న ఇరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇస్లామిస్టు విద్యార్థులు దిగ్బంధించారు. సిబ్బందిని కార్యాలయంలోని బంధించారు. ఈ సంక్షోభం ఏకంగా 444 రోజులు కొనసాగింది. నాటినుంచే ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారిపోయాయి. ఇజ్రాయెల్‌కు మరింత సాయం ఇజ్రాయెల్‌కు అమెరికా మరింత సాయం ప్రకటించింది. అగి్నమాపక ఎయిర్ ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఫైటర్ విమానాలు, లాంగ్ రేంజ్ బి–52 బాంబర్లను పశి్చమాసియాకు తరలించనున్నట్లు శనివారం పేర్కొంది. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ వ్యవస్థలను, భారీగా సైనిక, ఆయుధ సామగ్రిని సమకూర్చడం తెలిసిందే. -
ఇజ్రాయెల్ హై అలర్ట్
టెల్ అవీవ్: ఇరాన్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఎప్పుడు, ఎలా దాడి చేయనుందో కచ్చితంగా తెలియనప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం అత్యున్నత స్థాయి అప్రమత్తత ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పైకి విరుచుకుపడటం తెలిసిందే. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా ఇరాన్‌పై రెండు సార్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇజ్రాయెల్‌పైకి దాడి చేసే శక్తి, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే సామర్ధ్యం ఈ దాడులతో దెబ్బతిన్నట్లు రూఢీ అయ్యింది. ‘ఇజ్రాయెల్ చేసిన దాడులను అతిగా చూపలేం, అలాగని తక్కువని చెప్పలేం’అని సాక్షాత్తూ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీయే స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయినప్పటికీ, ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. -
ఇజ్రాయెల్‌పై ట్వీట్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్స్ ఖాతా సస్పెండ్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం. ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.ఇక ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ట్వీట్ చేసిన ఖాతాను ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది.‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది. -
ఖమేనీ ఆరోగ్యం విషమం?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు. -
హమాస్ ఉనికి ఎప్పటికీ సజీవమే: ఇరాన్ సుప్రీం నేత
టెహ్రాన్: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేత యాహ్యా సిన్వర్ మృతి చెందినప్పటికీ హమాస్ ఉనికి విషయంలో ఎటువంటి సమస్య లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఆయన యాహ్యా సిన్వర్ మృతి చెందిన అనంతరం తొలిసారి స్పందించారు. సిన్వర్ మృతి బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ ఆయన మృతితో హమాస్ ఉనికి కోల్పోపోయినట్లు కాదని అన్నారు.The loss of Yahya #alSinwar is painful for the Resistance Front. But this front didn’t halt its progress in wake of the martyrdoms of eminent figures like Sheikh Ahmed Yassin, Fathi Shaqaqi, Rantisi, & Ismail Haniyeh. Similarly, it won’t falter with Sinwar’s martyrdom either.— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024 ‘‘సిన్వర్ మృతి హమాస్‌కు నష్టం. ఆయన మృతి చాలా బాధాకరం. కానీ హమాస్ ప్రముఖ నేతల బలిదానంతో ముందుకు సాగడం మానలేదు. హమాస్ సజీవంగా ఉంది.. సజీవంగానే ఉంటుంది. హమాస్ నేత మరణానికి సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన ఒక ‘వీరోచిత ముజాహిద్’. దోపిడీ చేసే క్రూరమైన శత్రువుతో పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. నిజాయితీగల పాలస్తీనా ముజాహిదీన్, యోధుల పక్షాన నిలబడటం కొనసాగిస్తాం’’ అని అన్నారు.Hamas is alive and will stay alive. Yahya #Sinwar— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024 ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడికి ఆదేశించిన హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ శుక్రవారం మృతి చెందారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అక్టోబర్ 17 చేసిన దాడిలో ఆయన మృతి చెందారని ప్రకటించింది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన హమాస్ నేతల్లో ముఖ్యమైన నేత సిన్వర్ ఒకరు. ఇజ్రాయెల్ యాహ్యా సిన్వార్ చివరి క్షణాలను చూపించే డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. మరోవైపు.. తమ నాయకుడు యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. గాజాలో దురాక్రమణ ముగిసే వరకు అక్టోబర్ 7న తాము బంధీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయబోమని ప్రతిజ్ఞ చేసింది.చదవండి: హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి.. -
మా శత్రువులను ఓడిస్తాం: ఇరాన్ సుప్రీం లీడర్
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మిసైల్స్ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. శుక్రవారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7 హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను సరైన చర్యగా అభివర్ణించారు. ‘మేము మా శత్రువులను ఓడిస్తాం. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు, లెబనాన్ ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తాం. మా శత్రువులను కచ్చితంగా ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. లెబనాన్, పాలస్తీనియన్లపై ఆక్రమణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తాము తెలుపుతున్న నిరసనను అడ్డుకునే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికి లేదు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు ప్రజా సేవ వంటివి. హమాస్ , హెజ్బొల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎటువంటి విజయం సాధించదు. హమాస్, హెజ్బొల్లాతో మేము ఉన్నాం.Grand Ayatollah #Khamenei leads Friday Prayers in Tehran, with the presence of the Iranian nation, maybe with different opinions but a united hand against the enemy.This is the point that some Western politicians and #Israel, could not understand and miscalculate. pic.twitter.com/w1C0VNKzAa— Pooya (@PooyaMirzaei86) October 4, 2024సయ్యద్ హసన్ నస్రల్లా ఇప్పుడు మనతో లేరు. కానీ ఆయన స్ఫూర్తి. ఆయన ఏర్పాటు చేసిన మార్గం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన ఇజ్రాయెల్ శత్రువులకు వ్యతిరేకంగా ఎత్తిన జెండా. ఆయన బలిదానం మనపై మరింత బాధ్యత పెంచుతోంది. మన విశ్వాసాన్ని బలపరుస్తూనే శత్రువులకు వ్యతిరేకంగా నిలబడాలి. అదేవిధంగా హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై గతేడాది అక్టోబర్ 7న చేసిన మెరుపు దాడులు సరైన చర్యనే’’ అని అన్నారు.చదవండి: అటు డోమ్..ఇటు ఫతాహ్! -
ఇరాన్ హై అలర్ట్.. సురక్షిత ప్రాంతానికి సుప్రీమ్ లీడర్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో హెజ్బొల్లాకు భారీ నష్టం సంభవిస్తోంది. దక్షిణ బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో మిలటరీ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. అయితే నస్రల్లా మరణ వార్తలపై హెజ్బొల్లా కానీ, లెబనాన్ కానీ ఇంకా స్పందించలేదు.ఇదిలా ఉండగా దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. ఇరాన్ అప్రమత్తమైంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని దేశంలోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనకు భద్రతా ఏర్పాట్లను కూడా పెంచినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నస్రల్లాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత.. తదుపరి చర్యపై లెబనాన్, హెజ్బొల్లా, ఇతర ప్రాంతీయ గ్రూపులతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు
టెహ్రాన్/న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్..తదితర ఏప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు’అంటూ ఖమేనీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్‌లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్‌కు హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేనీ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
Iran: ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష యుద్ధమే!
టెహ్రాన్/బీరుట్: ఒకవైపు గాజాలో మారణకాండ సాగిస్తూ, మరోవైపు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియేను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ దుశ్చర్య పట్ల ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు. హనియే హత్యకు ఇక ప్రతీకారం తీర్చుకోక తప్పదని భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయాలని ఆయన తమ సైన్యానికి తాజాగా స్పష్టమైన ఆదేశాలిచి్చనట్లు ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. భారీ మూల్యం తప్పదు: నెతన్యాహూ ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు. ఇస్మాయిల్ హనియేకు ఖమేనీ నివాళులు ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు విడిచిన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేకు, ఆయన అంగరక్షకుడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఘనంగా నివాళుర్పించారు. గురువారం టెహ్రాన్ యూనివర్సిటీలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో హనియే, సెక్యూరిటీ గార్డు శవపేటికల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
Iran Presidential Election 2024: ఖమేనీ కనుసన్నల్లో... ఇరాన్లో ఎన్నికలకు వేళాయె
అగ్ర రాజ్యాల ఆంక్షలు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి. హక్కుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు. కరడుగట్టిన మతవాద పాలనపై యువతలోనే గాక సర్వత్రా తీవ్రతరమవుతున్న అసంతృప్తి. ఇన్ని గడ్డు సమస్యల నడుమ ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌ను ఏకఛత్రంగా పాలిస్తున్న సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అభీష్టానుసారం ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో ఖమేనీ వీర విధేయుడే పీఠమెక్కడం లాంఛనమే కానుంది. జనాల్లో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉన్న మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తదితరుల అభ్యరి్థత్వాన్ని తిరస్కరించడం ద్వారా జనాకర్షక నేతలెవరూ పోటీలో ఉండకుండా సలక జాగ్రత్తలూ తీసుకున్నారు. దాంతో ఎప్పట్లాగే ఈసారి కూడా ఇరానీలు అధ్యక్ష ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని ఊహించే ఆరుగురిలో డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ రూపంలో ఒక సంస్కరణలవాదిని ఎంపిక చేశారు. ఆయన్ను చూసి జనాలు ఎంతో కొంత పోలింగ్ బూత్‌లకు వస్తారని ఆశిస్తున్నారు. అంతిమంగా విజేత మాత్రం మిగతా ఐదుగురు కరడుగట్టిన మతవాదుల్లోంచే ఒకరు కానున్నారు. అది ఎవరన్నది జూన్ 28న జరిగే పోలింగ్‌లో తేలనుంది. ప్రభుత్వంపై విమర్శలే ప్రచారా్రస్తాలు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్లో ఏడాది ముందుగానే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాని పదవిని రద్దు చేస్తూ, అధ్యక్ష పదవి స్థాయిని పెంచుతూ 1998లో రాజ్యంగ సంస్కరణలు చేసిన అనంతరం దేశంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులంతా ఈసారి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతుండటం విశేషం. దేశ ఆర్థిక దుస్థితికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని వారంతా బాహాటంగా తప్పుబడుతున్నారు. ఇదంతా ప్రజలను పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు ఖమేనీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని చెబుతున్నారు. ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛ గా, పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవని అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇరాన్ మేధావులు కూడా అంటుంటారు. ఎన్నికల ఫలితాలను ఖమేనీ పూర్తిగా నిర్దేశించడమే గాక తనకు అనుకూలంగా మార్చేస్తారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఎన్నిక ఇలా... ఇరాన్ అధ్యక్షున్ని ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిన ఎన్నుకుంటారు. పదవీకాలం నాలుగేళ్లు. పూర్తి అధికారాలు సుప్రీం లీడర్ ఖమేనీవే అయినా అధ్యక్షునికి కూడా పలు కీలక దేశీయ విధాన నిర్ణయాలతో పాటు కొంతమేరకు విదేశాంగ విధానంపై కూడా చెప్పుకోదగ్గ అధికారాలుంటాయి. 12 మంది మత పెద్దలు తదితరులతో కూడిన గవరి్నంగ్ కౌన్సిల్ ఖమేనీ నిర్దేశాలకు లోబడి అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈసారి 80 దరఖాస్తులను వడపోసి ఆరుగురిని మాత్రం పోటీకి అనుమతించింది. తన ఆధిపత్యానికి సవాలుగా మారతారనుకున్న వారెవరికీ అవకాశం దక్కకుండా ఖమేనీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆ క్రమంలోనే బాగా జనాకర్షణ ఉన్న మాజీ అధ్యక్షుడు నెజాద్తో పాటు మూడుసార్లు పార్లమెంట్ స్పీకర్‌గా చేసిన అలీ లారిజానీ అభ్యర్థిత్వం కూడా తిరస్కరణకు గురైంది. తిరస్కృత జాబితాలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు! జూన్ 28న ఓటింగ్ జరగనుంది. 30కల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల మధ్య తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఆ ఆరుగురుమసూద్ పెజెష్కియాన్ గట్టి సంస్కరణలవాది. దేశ ఆరోగ్య మంత్రిగా చేశారు. విద్యావంతునిగా మంచి పేరే ఉంది. మితిమీరుతున్న మతవాదంపై ప్రజల్లో ప్రబలుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఈయనను అభ్యర్థుల జాబితాలో చేర్చినట్టు చెబుతున్నారు. 2008 నుంచీ పార్లమెంటు సభ్యుడు. అందరికీ ఆయోదమోగ్యమైన కొత్త ముఖం మేలని ఖమేనీ భావిస్తే తప్ప మసూద్‌కు అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.అలీ రజా జకానీ టెహ్రాన్ మేయర్. గతంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. పబ్లిక్ పార్కుల్లో మసీదు నిర్మాణాన్ని మద్దతిచ్చి విమర్శలకు గురయ్యారు. 2021లో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా పెద్దగా ఓట్లు సాధించలేదు. ఈసారి కూడా జకానీ పేరు గట్టి పోటీదారుగా పెద్దగా పరిగణనలో లేదు. కాకపోతే ఖమేనీకి వీర విధేయుడు.జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్ పార్లమెంట్ స్పీకర్. రాజధాని టెహ్రాన్ మేయర్‌గా, సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కుమాండర్గా, దేశ పోలీస్ చీఫ్‌గా చేసిన అనుభవముంది. పైగా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయనతో బంధుత్వమూ ఉందంటారు. దాంతో గలీబాఫ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సైన్యంలోని కీలక అధికారుల మద్దతు అదనపు బలం కానుంది. కాకపోతే ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నాయి. పైగా గతంలో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడారు. సయీద్ జలిలీ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోíÙయేటర్. ఇరాన్–ఇరాక్ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్నా రు. యుద్ధవీరునిగా దేశమంతటా కాస్తో కూస్తో పేరున్న నేతే. ఈయనకూ ఖమేనీ ఆశీర్వాదముందని చెబుతారు. దాంతో జలిలీ అవకాశాలకు గండి కొట్టేందుకు గలీబాఫ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు జనాదరణ విషయంలో మరో అహ్మదీనెజాద్లా ఎదిగే సత్తా ఉండటం కూడా జలిలీ అవకాశాలకు గండి కొట్టవచ్చని పరిశీలకుల అభిప్రాయం. ముస్తాఫా పోర్ మొహమ్మదీ రేసులో ఉన్న ఆరుగురిలో ఏకైక మతాధికారి కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. పైగా 85 ఏళ్ల ఖమేనీ తన వారసుని ఎంపికపై గట్టిగా దృష్టి సారించారు. కుమారుడు కుమారుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అధ్యక్ష పదవిలో మత పెద్ద ఉండటం మేలని ఖమేనీ భావించే పక్షంలో మొహమ్మదీకి చాన్సుంటుందని చెబుతున్నారు. కాకపోతే సుప్రీం లీడర్ పదవి కోసం ముజ్తబాతో పోటీ పడే సత్తా ఉండటం మొహమ్మదీకి ప్రతికూలంగా మారవచ్చు. ఆమిర్ హొసేన్ గజీజాదే హషేమీ ప్రస్తుతం 12 మంది దేశ ఉపాధ్యక్షుల్లో ఒకరు. రిటైరైన సైనికులు, యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమ బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయా వర్గాల్లో మంచి ఆదరణే ఉంది. కాకపోతే ఈయనకు కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్‌కు ఇరాన్ అణుబాంబు హెచ్చరికలు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌కు కీలక హెచ్చరికలు చేసింది. తమ దేశానికి ముప్పు ఉందంటే అణుబాంబలు తయారుచేయడానికైనా తాము వెనకాడబోమని ఇరాన్ పేర్కొంది.‘మేము అణుబాంబులు తయారు చేసేందుకు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇజ్రాయెల్ వంటి దేశంతో.. మా దేశ ఉనికి ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా మిలిటరీ సిద్ధాంతాలను మార్చుకుంటాం. మా అణు కేంద్రాలపై ఇజ్రయెల్ దాడికి పాల్పడితే.. మా అణు సిద్ధాంతలను కూడా మార్చుకుంటాం’ అని ఇరాన్ సుప్రీ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ తెలిపారు.ఏప్రిల్‌లో సిరియా రాజధాని నగరంలో ఇరాన్ ఎంబసీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులకు తెగపడినట్లు అంతర్జాతీయా మీడియా కథనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరు ఇరాన్- ఇజ్రయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇక.. ఇరాన్‌కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా ఎజెండాలో లేదని గతంలో ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని సాధించిందని తెలుస్తోంది. కాగా, 90శాతం వరకు స్వచ్ఛతను సాధిస్తే అణు బాంబులను తయారు చేయడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులపై ఇరాన్ స్పందించింది. దాడులలో తమ ప్రమేయం లేదని.. ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేని నేరుగా ప్రకటన చేయడం గమనార్హం. ‘‘జియోనిస్ట్ పాలన (ఇజ్రాయెల్) మద్దతుదారులు, దోపిడీ పాలనలోని కొందరు వ్యక్తులు గత రెండు లేదా మూడు రోజులుగా ఈ చర్య వెనుక ఇస్లామిక్ ఇరాన్ ఉందని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. అవి తప్పు’’ అని మంగళవారం మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారాయన. అయితే హమాస్ దాడులతో సంబంధం లేదని ఆయన ప్రకటించినప్పటికీ.. పాలస్తీనాకు ఇరాన్ మద్దతు కొనసాగుతుందని ఆయన తెలిపారు. శనివారం నుంచి హమాస్ బలగాలు ఇజ్రాయెల్ సరిహద్దుగుండా విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్ స్పందించడం ఇదే తొలిసారి. అయితే.. పాలస్తీనా పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, వాళ్ల పోరాట పటిమ అమోఘమని ఖమేని వెల్లడించారు. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన తప్పిదాల వల్లే ఈ ఘోర పరిస్థితి అని ఖమేని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇది ముమ్మాటికీ ఇజ్రాయెల్ రక్షణ, నిఘా వ్యవస్థ లోపం వల్ల జరిగిన తప్పిదమేనని అన్నారు. మరోవైపు ఇది రాజకీయపరమైన ఆరోపణ అని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారమే ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఇరాన్లో వేలాది నిరసనకారులకు క్షమాభిక్ష
దుబాయ్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన 22 వేల మందికి ఇరాన్ క్షమాభిక్ష ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ యువతి పోలీస్ కస్టడీలో మృతి చెందినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం, అణచివేత చర్యల్లో భాగంగా పోలీసుల కాల్పుల్లో వందల మంది చనిపోవడం తెలిసిందే. వేలాది మందిని ౖజñయ్పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే 22 వేల మందికి సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు ఇరాన్ న్యాయశాఖ అధిపతి జి.ఎం.ఎజెహి సోమవారం తెలిపారు. వీరితోపాటు వివిధ ఆరోపణలను ఎదుర్కొంటున్న మొత్తం 82 వేల మందికి సుప్రీం నేత క్షమాభిక్ష ప్రకటించారన్నారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ నెల సందర్భంగా సుప్రీం నేత ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. తాజా చర్యతో ప్రభుత్వ విధానాలపట్ల దేశ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం తీవ్రతను పాలకులు గుర్తించినట్లయింది. -
కుట్ర కోణం?.. ఇరాన్ హిజాబ్ ఆందోళనలపై సంచలన ఆరోపణలు
టెహ్రాన్: హిజాబ్ వేసుకోలేదని మహ్సా అమినీ(22)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అనుమానాస్పద రీతిలో ఆ యువతి మృతి చెందడం.. ఇరాన్లో కార్చిచ్చును రాజేసింది. యావత్ ప్రపంచం తల తిప్పి చూసేలా.. అక్కడి మహిళా లోకం హిజాబ్ వ్యతిరేక నిరసనలు చేపట్టింది. భద్రతా సిబ్బంది ఉక్కుపాదంతో వంద మందిని బలిగొన్న.. తగ్గేదేలే అంటూ ప్రభుత్వ వ్యతిరేక గొంతుకను వినిపిస్తోంది అక్కడి వనితాలోకం. ఇదిలా ఉంటే.. హిజాబ్ ఆందోళలనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని తొలిసారి పెదవి విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా అయతుల్లా స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 83 ఏళ్ల ఇరాన్ సుప్రీం స్పందిస్తూ.. సంచలన ఆరోపణలకు దిగారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల వెనుక కుట్ర కోణం ఉందన్న ఆయన.. వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్‌లు ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ఈ అల్లర్లకు, అభద్రతా భావానికి కారణం ఏంటో తెలిసింది. ప్రణాళికాబద్దంగా ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే అవి అసాధారణ రీతిలో ఉంటున్నాయి. ఇందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణం. విదేశాల్లో ఉన్న కొంతమంది ఇరానియన్ల సహాయంతో, పెయిడ్ ఏజెంట్లతో ఈ రచ్చకు కారణం అయ్యాయి ఆ రెండు దేశాలు. పోలీసులు నేరస్థులకు ఎదురొడ్డి పోరాడాలి. పోలీసులపై ఎవరు దాడి చేసినా.. వాళ్ల వల్ల నేరస్థులు, దుండగులు, దొంగల నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని గుర్తించాలి. ఈ హింసాత్మక ఆందోళనలను ఖండిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. అలాగే.. అమినీ మృతి ఘటనపై స్పందిస్తూ.. చాలా బాధాకర ఘటన. యువతి మరణం గుండెను బద్దలు చేసింది. అయితే.. ఇది సాధారణ విషయం కాకున్నా.. కొందరు వ్యక్తులు ఎలాంటి ఆధారాలు, విచారణ లేకుండా.. ఆందోళన పేర్లతో ఇరాన్ వీధుల్ని రణరంగంగా మార్చేశారు. ఖురాన్‌ను తగులబెట్టారు. బలవంతంగా కొందరి హిజాబ్‌లను తొలగించారు. మసీదులకు, కార్లకు నిప్పు పెట్టారు. కాబట్టి, హిజాబ్ వ్యతిరేక కుట్రను గుర్తించి.. నిరసనకారులు ఆందోళన విరమించాలని సోమవారం విద్యార్థులు పాల్గొన్న ఓ కార్యక్రమం నుంచి ఆయన పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. నిరసనలు మూడవ వారం సైతం ఉధృతంగా కొనసాగుతుండగా.. ఇరాన్ శత్రువులు కుట్రలో విఫలమయ్యారు అంటూ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒక ప్రకటన విడుదల చేశారు. -
దుమారం రేపుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ‘ట్వీట్’!
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంలీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయన ట్విటర్ ఖాతాను నిషేధించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అది ఖమేనీ అసలు ఖాతా కాదని ట్విటర్ యాజమాన్యం ప్రకటించింది. సదరు అకౌంట్‌పై నిషేధం విధించినట్లు తెలిపింది. ఇంతకీ విషయమేమిటంటే.. ట్రంప్ అగ్రరాజ్య పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఇక గతేడాది.. ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానిని అమెరికా దళాలు ఇరాక్‌లో హతమార్చిన నేపథ్యంలో వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇరు దేశాలు పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. దీంతో అమెరికాపై ఆగ్రహంతో ఊగిపోయిన ఇరాన్ ప్రభుత్వం... ట్రంప్ తలపై అప్పట్లో సుమారు రూ. 575 కోట్ల రివార్డును కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే చివరినాళ్లలో కూడా ట్రంప్ యంత్రాంగం, మధ్య ప్రాచ్య దేశంలో పెద్ద ఎత్తున బాంబర్లు, యుద్ధవాహక నౌకలు మోహరించింది. ఈ క్రమంలో ఇరాన్ యుద్ధాన్ని కోరుకోదని, అయితే తమ ప్రజలను కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకుంటుందంటూ ఇటీవలే ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. కొత్త సంవత్సరంలో అమెరికన్లకు శోకంలో ముంచవద్దంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌నకు హెచ్చరికలు జారీచేసింది.(చదవండి: మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్) ఇక జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ పేరిట శుక్రవారం ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. ‘‘తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇరాన్ జనరల్‌ను బలితీసుకున్న అమెరికా దాడులకు బదులుగా.. అందుకు ఆదేశాలిచ్చిన వ్యక్తిపై ప్రతీకారం తప్పదు’’ అంటూ ట్రంప్‌ను పోలిన వ్యక్తి గోల్ఫ్ ఆడుతుండగా.. ఆయనపై నుంచి క్షిపణులు ప్రయాణిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేశారు. పర్షియన్ భాషలో ఉన్న ఈ ట్వీట్ ఖమేనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు స్థానిక మీడియాలోనూ దర్శనమిచ్చింది. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగగా, దానిని తొలగించారు. ఇక ఇప్పుడు సదరు ఖాతా నకిలీదని, తమ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ అకౌంట్‌పై నిషేధం విధించినట్లు ట్విటర్ ప్రకటించింది. -
అమెరికాను దెబ్బకొట్టి తీరతాం: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమాని హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పునరుద్ఘాటించారు. ఖాసీంను హతమార్చినందుకు అమెరికాను దెబ్బకొట్టి తీరతామని స్పష్టం చేశారు. ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్- కధిమితో మంగళవారం జరిగిన భేటీలో ఖమేనీ ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఇరాక్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అగ్రరాజ్యం.. జనవరి 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకోవడంతో పరస్పరం ప్రతీకార దాడులకు దిగాయి. (ట్రంప్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్) ఈ క్రమంలోనే ఇరాన్లో ఉక్రెయిన్ విమానం కూలిపోగా 176 మంది మృత్యువాత పడ్డారు. తొలుత ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇరాన్.. ఆ తర్వాత మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమను క్షమించాల్సిందిగా బాధితుల కుటుంబాలను అభ్యర్థించింది. అదే విధంగా సులేమానిని హతమార్చిన అమెరికా, అందుకు సహకరించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సులేమాని గురించి అమెరికాకు సమాచారమిచ్చిన తమ పౌరుడిని ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఇరాన్ న్యాయ శాఖ గత నెలలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా... అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ డ్రాగన్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకుంటూ భారీ ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం. అదే విధంగా ఇరాక్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించే దిశగా ప్రధానితో ఖమేనీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.(అమెరికాకు ఇరాన్ వార్నింగ్) -
భారత్‌పై మండిపడ్డ ఇరాన్.. తీవ్ర వ్యాఖ్యలు!
టెహ్రాన్: భారత రాజధాని ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలపై ఊచకోత జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు... ‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను భారత ప్రభుత్వం అడ్డుకోవాలి. ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను ఆపాలి. ఇస్లాం ప్రపంచం నుంచి వేరుగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ఆపేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలి’’అని ఖమేనీ ట్వీట్ చేశారు. ఇందుకు ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి భౌతికకాయం ముందు పిల్లాడు ఏడుస్తున్న ఫొటోను జతచేసి... ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల్లో ట్విటర్లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.(ఇరాన్ బలంగా తయారవ్వాలి: ఖమేనీ) ఈ క్రమంలో... ఇరాన్ అధినాయకుడిగా దేశ భద్రత, విదేశాంగ విధానాలపై నిర్ణయం తీసుకునే ఖమేనీ.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత ముస్లింల గురించి బాధపడుతున్న ఆయన.. సొంత దేశం ఇరాన్లో ముస్లింలపై జరిగిన ఊచకోతను గుర్తుచేసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ కూడా ఢిల్లీ అల్లర్లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ కొన్ని శతాబ్దాలుగా ఇరాన్ భారత్‌తో స్నేహం కొనసాగిస్తోంది. భారతీయులందరూ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. విచక్షణారహిత అల్లర్లు చెలరేగకుండా చూసుకోవాలి. శాంతియుత చర్చలు, చట్టం ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉంటుంది. భారత ముస్లింలకు వ్యతిరేకంగా చెలరేగిన హింసను ఇరాన్ ఖండిస్తోంది’’ అని జావేద్ ట్వీట్ చేశారు.(విమానాన్ని మేమే కూల్చేశాం: ఇరాన్) అదే విధంగా ఇండోనేషియా సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ అల్లర్లపై స్పందించాల్సిందిగా తమ దేశంలో భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత్‌లో సుహృద్భావ వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... సున్నిత అంశాలపై బాధ్యతా రహితంగా మాట్లాడవద్దని అంతర్జాతీయ నాయకులు, సంస్థలకు సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ.... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 53 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక సుదీర్ఘకాలంగా ఇరాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్... అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనూ సంయమనం పాటించిన విషయం విదితమే. ఇరాన్ జనరల్ సులేమానిని అమెరికా హతమార్చిన తర్వాత ఇరాన్ మంత్రి జావేద్ జరీఫ్ భారత్‌లో పర్యటించి పలు అంశాలపై చర్చలు జరిపారు. The hearts of Muslims all over the world are grieving over the massacre of Muslims in India. The govt of India should confront extremist Hindus & their parties & stop the massacre of Muslims in order to prevent India’s isolation from the world of Islam.#IndianMuslimslnDanger — Khamenei.ir (@khamenei_ir) March 5, 2020 -
ఇరాన్ బలంగా తయారవ్వాలి: ఖమేనీ
టెహ్రాన్: యుద్ధాన్ని నిరోధించడానికి, శత్రువుల బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇరాన్ ఇంకా బలంగా తయారు కావాలని ఆ దేశ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దశాబ్దాలుగా అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్ బలమైన వైమానిక దళాన్ని తయారు చేసుకోగలిగిందన్నారు. శనివారం వైమానిక దళం కమాండర్స్, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ భయం, శత్రు భయం లేకుండా మనం పటిష్టంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. -
ఆ క్యాంప్‌ల కహానీ
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాక్‌లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులకు దిగామంటూ ఇరాన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అగ్రరాజ్యం ముఖం మీద చెంపదెబ్బకొట్టినట్టుగా రెండు స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలేవి? ఎందుకు వాటికంత ప్రాధాన్యత ? అల్ అసద్ స్థావరం పశ్చిమ బాగ్దాద్‌కు 100 మైళ్ల దూరంలో ఎడారి మధ్యలో 1980 సంవత్సరంలో ఇరాక్ మిలటరీ ఈ వైమానిక స్థావరాన్ని నిర్మించింది. ఇరాకీయుల విముక్తి కోసం 2003లో వచ్చిన అమెరికా సైన్యానికి అదే అతి పెద్ద సైనిక స్థావరంగా మారింది. ఈ స్థావరంలో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి. చిన్న టౌన్ మాదిరిగా అమెరికా ఈ స్థావరాన్ని తీర్చిదిద్దింది. 2009–10లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాక తిరిగి ఇరాక్ స్వాధీనంలోకి వచ్చింది. అరబ్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడానికి 2014లో అమెరికా బలగాలు తిరిగి ఇరాక్‌కి వచ్చాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడంలో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. గత రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇద్దరూ ఆకస్మికంగా ఈ స్థావరాన్ని సందర్శించారు. ఇర్బిల్ స్థావరం కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇర్బిల్ స్థావరం ఉంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు అమెరికా ఈ స్థావరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుంది. 2018 క్రిస్మస్ సెలవుల్లో ట్రంప్ అనూహ్యంగా ఇరాక్‌కు వచ్చి ఈ స్థావరాన్ని సందర్శించారు. డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ స్థావరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకొని నిర్వహించిన ఆపరేషన్‌లో గత ఏడాది అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది హతమయ్యాడు. అమెరికా బలగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ నుంచే వీక్షించారు. 2015లో ఐసిస్ తీవ్రవాదులు పలుమార్లు ఈ స్థావరాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 13 దేశాలకు చెందిన సంకీర్ణ బలగాలు, ఇతర సిబ్బంది ఇక్కడ ఉన్నారు. ఇరాక్‌లో మొత్తం అమెరికా బలగాలు: 6,000 అల్ అసద్ స్థావరంలో అగ్రరాజ్యం సైనికులు: 1,500 ఇర్బిల్ స్థావరంలో బలగాలు: 3,000 జనరల్ సులేమానీ హత్య తర్వాత ఇరాక్ పార్లమెంటు అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవాలంటూ తీర్మానించింది. కానీ అల్ అసద్ స్థావరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడానికి అమెరికా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని, వాటిని తిరిగి చెల్లించే వరకు ఇరాక్ నుంచి కదిలే ప్రసక్తే లేదని ట్రంప్ అంటున్నారు. -
'ఈ దాడులు అమెరికాకు చెంపపెట్టు'
టెహ్రాన్ : ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై మంగళవారం రాత్రి జరిపిన క్షిపణి దాడులపై ఇరాన్ సుప్రీం కమాండర్, అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్‌లోని పవిత్రమైన ఖోమ్ నగరంలో ఏర్పాటు చేసిన ఖాసీం సులేమానీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖమేనీ మాట్లాడుతూ.. తాము గత రాత్రి ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ దాడులతో తమలో కూడా తిరుగుబాటు ఇంకా బతికే ఉందని నిరూపించామని వెల్లడించారు. ఈ క్షిపణి దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటిది అవుతుందని తెలిపారు. తాము చేసే ప్రతీకార దాడులు, సైనిక చర్యలు తమకు జరిగిన నష్టాన్ని పూరించలేవని తెలిపారు. నిన్న రాత్రి అమెరికా స్ధావరాలపై జరిగిన దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇలాంటివి చూడడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఖమేనీ హెచ్చరించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఉనికికి ముగింపు పలకడమే తమ కర్తవ్యమని ఖమేనీ పేర్కొన్నారు. చదవండి: 80 మంది చచ్చారు.. మళ్లీ దాడికి తెగబడితే.. రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే ‘భారత్ ముందుకొస్తే స్వాగతిస్తాం’! -
కమాండర్ హత్య: వీడియో పోస్టు చేసిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్ ఖాసీం సొలెమాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖాసీం హత్యతో ఇరాకీలు సంబరాలు చేసుకుంటున్నారని, జాతీయ పతాకంతో ఇరాకీ వీధుల్లో కోలాహలం నెలకొందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘స్వేచ్ఛ కోసం ఇరాకీలు వీధుల్లో నృత్యాలు చేస్తున్నారు. జనరల్ సోలెమాన్ లేకపోవడమే అందుకు కారణం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీద ఇరాకీలు జాతీయ జెండాతో, ఇతర బ్యానర్లతో పరిగెత్తుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందారు. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సోలెమన్‌ను చంపినట్టు అమెరికా ప్రకటించగా.. అమెరికా అవివేక చర్యకు తీవ్ర ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ హెచ్చరించింది. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. చదవండి: అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్ ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్
టెహ్రాన్ : బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు రాకెట్ దాడి జరపడాన్ని ఇరాన్ అవివేకపు చర్యగా అభివర్ణించింది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్‌ను చంపాడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ దాడి భయంకరమైనదని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ అన్నారు. అమెరికా చర్యను అంతర్జాతీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు. ఈ వంచన చర్యతో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇరాన్లో అమెరికా ప్రయోజనాలను చూస్తున్న స్విస్ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపారు. అలాగే మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. సోలెమాన్ హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదని అమెరికాను హెచ్చరించారు. కాగా, శుక్రవారం బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా జరిపిన రాకెట్ దాడిలో ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని పెంటగాన్ వెల్లడించింది. చదవండి : ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
మహిళల సైకిల్ ముందు ఫత్వా బలాదూర్
టెహరాన్: ఇరాన్లో మహిళలు సైకిలు తొక్కవద్దని, అలాచేస్తే వారి శీలం దెబ్బతింటోందని దేశమతాధిపతి అయతొల్లా అలీ ఖమేనీ ఫత్వా జారీ చేయడం పల్ల మహిళలు మండిపడుతున్నారు. సైకిల్ తొక్కడం తమకు జన్మతో వచ్చిన హక్కని వాదిస్తున్నారు. కాలుష్యం వదిలే కార్లను వదిలేసి సైకిళ్లను ఆశ్రయించే దిశగా ప్రపంచం పయనిస్తుంటే తమను సైకిళ్లను తొక్కవద్దంటూ ఫత్వా జారీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫత్వాకు నిరసనగా ఇరాన్ మహిళలు ఓ ఉద్యమంలా సైకిళ్లను తొక్కుతూ వాటి తాలూకు వీడియోలను ‘ఇరానియన్విమెన్ లవ్సైక్లింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తోటి దేశ మహిళల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి మహిళలతోపాటు మగవాళ్ల నుంచి కూడా వారికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. మహిళలు సైకిల్ తొక్కడం వారికి నప్పదని, అది వారి శీలాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజాన్ని కూడా అవినీతి మయం చేస్తుందని హెచ్చరిస్తూ ఖమేని ఇటీవల ఫత్వా జారీ చేశారు. ‘మైస్టీల్తీ ఫ్రీడమ్’ పేరుతో సైకిల్ తొక్కుతున్న ఇరానీ మహిళలు ఫొటోలను, వీడియోలను, కామెంట్లను ఎప్పటికప్పుడు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లోని షిరియాజ్ వీధుల్లో సైకిల్ తొక్కుతూ దిగిన వీడియోను ఓ పాతికేళ్ల అమ్మాయి బుధవారం పోస్ట్ చేయగా ఈ రెండు రోజుల్లోనే 21వేల సార్లు వీక్షించారు. ‘ఖమేనీ ఫత్వా గురించి తెలియగానే నేను, మా అమ్మ రెండు సైకిళ్లను అద్దెకు తీసుకున్నాం. టెహరాన్ వీధుల్లో వాటిని తొక్కాం. ఇది మా హక్కు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం’ అని పాతికేళ్ల కూతురు మరో వీడియోను పోస్ట్ చేశారు. ఆమెతోపాటు ఆమె తల్లి కూడా ఆ వీడియోలో సైకిల్ తొక్కడం కనిపించింది. ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 1.10 లక్షల సార్లు వీక్షించారు. ఖమేని ఫత్వాను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకుంటారా? లేదా? చర్చ కూడా జరుగుతోంది. ఫత్వా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలనే చట్టం ఇరాన్లో లేదుగానీ, మర్యాదపూర్వక దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన కింద అప్పడప్పుడు ఫత్వా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మర్యాదపూర్వక దుస్తుల నిబంధనకు కూడా సరైన వివరణ లేదా భాష్యం లేనందున అరెస్ట్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అందే ఫిర్యాదులు, దర్యాప్తు చేసే అధికారులనుబట్టి నిర్ణయం ఉంటుంది.