రైసీ మరణంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు
28న ఓటింగ్, 30న ఫలితాల వెల్లడి
రేసులో ఆరుగురు, నెజాద్‌కు మొండిచేయి
అగ్ర రాజ్యాల ఆంక్షలు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి. హక్కుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు. కరడుగట్టిన మతవాద పాలనపై యువతలోనే గాక సర్వత్రా తీవ్రతరమవుతున్న అసంతృప్తి. ఇన్ని గడ్డు సమస్యల నడుమ ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌ను ఏకఛత్రంగా పాలిస్తున్న సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అభీష్టానుసారం ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో ఖమేనీ వీర విధేయుడే పీఠమెక్కడం లాంఛనమే కానుంది.
జనాల్లో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉన్న మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తదితరుల అభ్యరి్థత్వాన్ని తిరస్కరించడం ద్వారా జనాకర్షక నేతలెవరూ పోటీలో ఉండకుండా సలక జాగ్రత్తలూ తీసుకున్నారు. దాంతో ఎప్పట్లాగే ఈసారి కూడా ఇరానీలు అధ్యక్ష ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని ఊహించే ఆరుగురిలో డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ రూపంలో ఒక సంస్కరణలవాదిని ఎంపిక చేశారు. ఆయన్ను చూసి జనాలు ఎంతో కొంత పోలింగ్ బూత్‌లకు వస్తారని ఆశిస్తున్నారు. అంతిమంగా విజేత మాత్రం మిగతా ఐదుగురు కరడుగట్టిన మతవాదుల్లోంచే ఒకరు కానున్నారు. అది ఎవరన్నది జూన్ 28న జరిగే పోలింగ్‌లో తేలనుంది.
ప్రభుత్వంపై విమర్శలే ప్రచారా్రస్తాలు
అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్‌లో ఏడాది ముందుగానే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాని పదవిని రద్దు చేస్తూ, అధ్యక్ష పదవి స్థాయిని పెంచుతూ 1998లో రాజ్యంగ సంస్కరణలు చేసిన అనంతరం దేశంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులంతా ఈసారి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతుండటం విశేషం.
దేశ ఆర్థిక దుస్థితికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని వారంతా బాహాటంగా తప్పుబడుతున్నారు. ఇదంతా ప్రజలను పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు ఖమేనీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని చెబుతున్నారు. ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛ గా, పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవని అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇరాన్ మేధావులు కూడా అంటుంటారు. ఎన్నికల ఫలితాలను ఖమేనీ పూర్తిగా నిర్దేశించడమే గాక తనకు అనుకూలంగా మార్చేస్తారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం.
ఎన్నిక ఇలా...
ఇరాన్ అధ్యక్షున్ని ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిన ఎన్నుకుంటారు. పదవీకాలం నాలుగేళ్లు. పూర్తి అధికారాలు సుప్రీం లీడర్ ఖమేనీవే అయినా అధ్యక్షునికి కూడా పలు కీలక దేశీయ విధాన నిర్ణయాలతో పాటు కొంతమేరకు విదేశాంగ విధానంపై కూడా చెప్పుకోదగ్గ అధికారాలుంటాయి. 12 మంది మత పెద్దలు తదితరులతో కూడిన గవరి్నంగ్ కౌన్సిల్ ఖమేనీ నిర్దేశాలకు లోబడి అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
ఈసారి 80 దరఖాస్తులను వడపోసి ఆరుగురిని మాత్రం పోటీకి అనుమతించింది. తన ఆధిపత్యానికి సవాలుగా మారతారనుకున్న వారెవరికీ అవకాశం దక్కకుండా ఖమేనీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆ క్రమంలోనే బాగా జనాకర్షణ ఉన్న మాజీ అధ్యక్షుడు నెజాద్‌తో పాటు మూడుసార్లు పార్లమెంట్ స్పీకర్‌గా చేసిన అలీ లారిజానీ అభ్యర్థిత్వం కూడా తిరస్కరణకు గురైంది. తిరస్కృత జాబితాలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు! జూన్ 28న ఓటింగ్ జరగనుంది.
30కల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల మధ్య తిరిగి ఎన్నిక జరుగుతుంది.
ఆ ఆరుగురు
మసూద్ పెజెష్కియాన్
గట్టి సంస్కరణలవాది. దేశ ఆరోగ్య మంత్రిగా చేశారు. విద్యావంతునిగా మంచి పేరే ఉంది. మితిమీరుతున్న మతవాదంపై ప్రజల్లో ప్రబలుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఈయనను అభ్యర్థుల జాబితాలో చేర్చినట్టు చెబుతున్నారు. 2008 నుంచీ పార్లమెంటు సభ్యుడు. అందరికీ ఆయోదమోగ్యమైన కొత్త ముఖం మేలని ఖమేనీ భావిస్తే తప్ప మసూద్‌కు అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.
అలీ రజా జకానీ
టెహ్రాన్ మేయర్. గతంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. పబ్లిక్ పార్కుల్లో మసీదు నిర్మాణాన్ని మద్దతిచ్చి విమర్శలకు గురయ్యారు. 2021లో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా పెద్దగా ఓట్లు సాధించలేదు. ఈసారి కూడా జకానీ పేరు గట్టి పోటీదారుగా పెద్దగా పరిగణనలో లేదు. కాకపోతే ఖమేనీకి వీర విధేయుడు.
జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్
పార్లమెంట్ స్పీకర్. రాజధాని టెహ్రాన్ మేయర్‌గా, సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కుమాండర్‌గా, దేశ పోలీస్ చీఫ్‌గా చేసిన అనుభవముంది. పైగా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయనతో బంధుత్వమూ ఉందంటారు. దాంతో గలీబాఫ్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సైన్యంలోని కీలక అధికారుల మద్దతు అదనపు బలం కానుంది. కాకపోతే ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నాయి. పైగా గతంలో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడారు.
సయీద్ జలిలీ
మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోíÙయేటర్. ఇరాన్–ఇరాక్ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్నా రు. యుద్ధవీరునిగా దేశమంతటా కాస్తో కూస్తో పేరున్న నేతే. ఈయనకూ ఖమేనీ ఆశీర్వాదముందని చెబుతారు. దాంతో జలిలీ అవకాశాలకు గండి కొట్టేందుకు గలీబాఫ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు జనాదరణ విషయంలో మరో అహ్మదీనెజాద్‌లా ఎదిగే సత్తా ఉండటం కూడా జలిలీ అవకాశాలకు గండి కొట్టవచ్చని పరిశీలకుల అభిప్రాయం.
ముస్తాఫా పోర్ మొహమ్మదీ
రేసులో ఉన్న ఆరుగురిలో ఏకైక మతాధికారి కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. పైగా 85 ఏళ్ల ఖమేనీ తన వారసుని ఎంపికపై గట్టిగా దృష్టి సారించారు. కుమారుడు కుమారుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అధ్యక్ష పదవిలో మత పెద్ద ఉండటం మేలని ఖమేనీ భావించే పక్షంలో మొహమ్మదీకి చాన్సుంటుందని చెబుతున్నారు. కాకపోతే సుప్రీం లీడర్ పదవి కోసం ముజ్తబాతో పోటీ పడే సత్తా ఉండటం మొహమ్మదీకి ప్రతికూలంగా మారవచ్చు.
ఆమిర్ హొసేన్ గజీజాదే హషేమీ
ప్రస్తుతం 12 మంది దేశ ఉపాధ్యక్షుల్లో ఒకరు. రిటైరైన సైనికులు, యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమ బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయా వర్గాల్లో మంచి ఆదరణే ఉంది. కాకపోతే ఈయనకు కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment