ప్చ్‌.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే! | Iran Next Supreme Race: Who Is Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే!

Published Mon, Nov 18 2024 1:13 PM | Last Updated on Mon, Nov 18 2024 1:43 PM

Iran Next Supreme Race: Who Is Mojtaba Khamenei

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగున్న వేళ.. మరోవైపు ఇరాన్‌ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి కూడా వెళ్లారని, ఆయన వారసుడు మోజ్తాబా ఖమేనీ తదుపరి సుప్రీంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం తీవ్రతరమైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సంకేతాలిస్తూ.. ఖమేనీ తాజాగా ఓ ఫొటో రిలీజ్‌ చేశారు. లెబనాన్‌ ఉన్న ఇరాన్‌ రాయబారి ముజ్తబా అమనిని కలుసుకున్నట్లు తన ఎక్స్‌ ఖాతాలో ఖమేనీ పోస్ట్‌ చేశారు.  ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన పేజర్‌ దాడుల్లో ముజ్తబా అమని కూడా గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఖమేనీ ఆరా తీసినట్లు సమాచారం.

ఇక.. ఖమేనీ ఆరోగ్యం విషమించిందని, కోమాలోకి వెళ్లారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని.. ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ కథనం వెలువడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెప్టెంబర్‌ 20వ తేదీన 60 మంది ఇరాన్‌ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడన్నది ఆ కథనం సారాంశం. అయితే..

ఆ తీర్మానాన్ని.. ఓటింగ్‌ను చాలామంది వ్యతిరేకించారని కూడా అదే కథనం పేర్కొంది. ఈ కథనం ఆధారంగా రకరకాల కథనాలు వండి వార్చాయి మిగతా మీడియా సంస్థలు. కానీ, ఖమేనీ తాజా పోస్టుతో మోజ్తాబాకు ఇరాన్‌ సుప్రీం పగ్గాలు ఇప్పట్లో పగ్గాలు అప్పజెప్పకపోవచ్చనే స్పష్టత వచ్చింది. ఇదే కాదు.. మెజ్తాబాకు ఆటంకాలు కూడా ఉన్నాయి. 

అయతొల్లా అలీకి ఆరుగరు సంతానం. మోజ్తాబా.. రెండో కొడుకు. 1969లో మషాబాద్‌లో పుట్టాడు. తన తండ్రి బాటలో నడుస్తూ.. మత పెద్దగా మారాడు. అలాగే 2005, 2009 ఇరాన్‌ ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్‌కు మద్దతు ఇచ్చి.. అతని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఇరాన్‌ రిచ్చెస్ట్‌ మ్యాన్‌గానూ మోజ్తాబాకు పేరుంది.

ఇరాన్‌ జీడీపీ 388 బిలియన్‌ డాలర్లు కాగా, ఖమేనీ కుటుంబం ఆస్తుల విలువ 200 బిలియన్‌ డాలర్లుగా ఉందని.. ఇందులో 90 బిలియన్‌ డాలర్లు మోజ్తాబా పేరిటే ఉందని అమెరికా నివేదికలు వెల్లడించాయి. అయితే.. 

ఇరాన్‌ రాజకీయాల్లో జోక్యం ద్వారా అలీపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. 2009లో అహ్మదీనెజాద్‌ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక..  చెలరేగిన నిరసనల అణచివేత మోజ్తాబా ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ ఖజానా సొమ్మును దుర్వినియోగం చేశాడంటూ మోజ్తాబాపై అహ్మదీనెజాద్‌ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఇరాన్‌ అసెంబ్లీ నిపుణులు మెజ్తాబాకు ఇరాన్‌ సుప్రీం బాధ్యతలు వెళ్లనివ్వకుండా అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అయతొల్లా వారసుడిగా సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నప్పటికీ.. సుప్రీం కుర్చీ మాత్రం మెజ్తాబాకు చాలా దూరంగానే ఉందన్నది పలువురి వాదన.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement