మహిళల సైకిల్ ముందు ఫత్వా బలాదూర్
టెహరాన్: ఇరాన్‌లో మహిళలు సైకిలు తొక్కవద్దని, అలాచేస్తే వారి శీలం దెబ్బతింటోందని దేశమతాధిపతి అయతొల్లా అలీ ఖమేనీ ఫత్వా జారీ చేయడం పల్ల మహిళలు మండిపడుతున్నారు. సైకిల్ తొక్కడం తమకు జన్మతో వచ్చిన హక్కని వాదిస్తున్నారు. కాలుష్యం వదిలే కార్లను వదిలేసి సైకిళ్లను ఆశ్రయించే దిశగా ప్రపంచం పయనిస్తుంటే తమను సైకిళ్లను తొక్కవద్దంటూ ఫత్వా జారీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఫత్వాకు నిరసనగా ఇరాన్ మహిళలు ఓ ఉద్యమంలా సైకిళ్లను తొక్కుతూ వాటి తాలూకు వీడియోలను ‘ఇరానియన్‌విమెన్ లవ్‌సైక్లింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తోటి దేశ మహిళల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి మహిళలతోపాటు మగవాళ్ల నుంచి కూడా వారికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. మహిళలు సైకిల్ తొక్కడం వారికి నప్పదని, అది వారి శీలాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజాన్ని కూడా అవినీతి మయం చేస్తుందని హెచ్చరిస్తూ ఖమేని ఇటీవల ఫత్వా జారీ చేశారు.
‘మైస్టీల్తీ ఫ్రీడమ్’ పేరుతో సైకిల్ తొక్కుతున్న ఇరానీ మహిళలు ఫొటోలను, వీడియోలను, కామెంట్లను ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లోని షిరియాజ్ వీధుల్లో సైకిల్ తొక్కుతూ దిగిన వీడియోను ఓ పాతికేళ్ల అమ్మాయి బుధవారం పోస్ట్ చేయగా ఈ రెండు రోజుల్లోనే 21వేల సార్లు వీక్షించారు. ‘ఖమేనీ ఫత్వా గురించి తెలియగానే నేను, మా అమ్మ రెండు సైకిళ్లను అద్దెకు తీసుకున్నాం. టెహరాన్ వీధుల్లో వాటిని తొక్కాం. ఇది మా హక్కు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం’ అని పాతికేళ్ల కూతురు మరో వీడియోను పోస్ట్ చేశారు. ఆమెతోపాటు ఆమె తల్లి కూడా ఆ వీడియోలో సైకిల్ తొక్కడం కనిపించింది. ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 1.10 లక్షల సార్లు వీక్షించారు.
ఖమేని ఫత్వాను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకుంటారా? లేదా? చర్చ కూడా జరుగుతోంది. ఫత్వా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలనే చట్టం ఇరాన్‌లో లేదుగానీ, మర్యాదపూర్వక దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన కింద అప్పడప్పుడు ఫత్వా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మర్యాదపూర్వక దుస్తుల నిబంధనకు కూడా సరైన వివరణ లేదా భాష్యం లేనందున అరెస్ట్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అందే ఫిర్యాదులు, దర్యాప్తు చేసే అధికారులనుబట్టి నిర్ణయం ఉంటుంది.