ఇరాక్‌లోని అల్ అసద్ ఎయిర్ బేస్
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాక్‌లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులకు దిగామంటూ ఇరాన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అగ్రరాజ్యం ముఖం మీద చెంపదెబ్బకొట్టినట్టుగా రెండు స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలేవి? ఎందుకు వాటికంత ప్రాధాన్యత ?
అల్ అసద్ స్థావరం
పశ్చిమ బాగ్దాద్‌కు 100 మైళ్ల దూరంలో ఎడారి మధ్యలో 1980 సంవత్సరంలో ఇరాక్ మిలటరీ ఈ వైమానిక స్థావరాన్ని నిర్మించింది. ఇరాకీయుల విముక్తి కోసం 2003లో వచ్చిన అమెరికా సైన్యానికి అదే అతి పెద్ద సైనిక స్థావరంగా మారింది. ఈ స్థావరంలో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి. చిన్న టౌన్ మాదిరిగా అమెరికా ఈ స్థావరాన్ని తీర్చిదిద్దింది. 2009–10లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాక తిరిగి ఇరాక్ స్వాధీనంలోకి వచ్చింది. అరబ్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడానికి 2014లో అమెరికా బలగాలు తిరిగి ఇరాక్‌కి వచ్చాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడంలో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. గత రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇద్దరూ ఆకస్మికంగా ఈ స్థావరాన్ని సందర్శించారు.
ఇర్బిల్ స్థావరం
కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇర్బిల్ స్థావరం ఉంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు అమెరికా ఈ స్థావరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుంది. 2018 క్రిస్మస్ సెలవుల్లో ట్రంప్ అనూహ్యంగా ఇరాక్‌కు వచ్చి ఈ స్థావరాన్ని సందర్శించారు. డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ స్థావరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకొని నిర్వహించిన ఆపరేషన్‌లో గత ఏడాది అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది హతమయ్యాడు. అమెరికా బలగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌ని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ నుంచే వీక్షించారు. 2015లో ఐసిస్ తీవ్రవాదులు పలుమార్లు ఈ స్థావరాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 13 దేశాలకు చెందిన సంకీర్ణ బలగాలు, ఇతర సిబ్బంది ఇక్కడ ఉన్నారు.
ఇరాక్‌లో మొత్తం అమెరికా బలగాలు: 6,000
అల్ అసద్ స్థావరంలో అగ్రరాజ్యం సైనికులు: 1,500
ఇర్బిల్ స్థావరంలో బలగాలు: 3,000
జనరల్ సులేమానీ హత్య తర్వాత ఇరాక్ పార్లమెంటు అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవాలంటూ తీర్మానించింది. కానీ అల్ అసద్ స్థావరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడానికి అమెరికా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని, వాటిని తిరిగి చెల్లించే వరకు ఇరాక్ నుంచి కదిలే ప్రసక్తే లేదని ట్రంప్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment